
దేశీయ రాజకీయాల్లో ప్రధాని మోడీ ప్రతిపక్ష పార్టీలను, ఎంపీలను ఎలా చూస్తున్నారో గమనిస్తే దేశంలో ప్రజాతంత్ర వాతావరణం పతనానికి సంబంధించిన మూలాలు అర్థమవుతాయి.
ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ప్రపంచ దేశాలకు మన దేశపు వాదన వినిపించటానికి ప్రతిపక్ష ఎంపీల సహకారాన్ని కోరి మోడీ దేశీయ వ్యవహారాల్లో కూడా ప్రతిపక్ష పార్టీలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యతను గుర్తించి వ్యవహరించి వారికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వటానికి సిద్ధపడాలి.
విదేశీ వ్యవహారాల విషయం వచ్చే సరికి ప్రతిపక్ష పార్టీలను కలుపుకుని దేశమంతా ఒకే అవగాహనతో ఉన్నదని చూపించుకునే ప్రయత్నం చేస్తూనే, దేశీయ రాజకీయాల విషయానికి వచ్చే సరికి వారిని శత్రువులుగా చూసే విధానం సరికాదు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఆశించిన స్థాయిలో గెలుపు గుర్రాలను సొంతం చేసుకోలేని నేపథ్యంలో చివరికి ఆరెస్సెస్ అధినేత మోహన్ భాగవత్ ప్రతిపక్షాల పట్ల మర్యాదగా వ్యవహరించాలని, వాళ్లేమీ శత్రువులు కాదని మోడిని మందలించాల్సి వచ్చింది.
ఈ విషయం మీద మోడీ 2024 లోక్‌సభ ఎన్నికల నుంచి ఏమైనా గుణపాఠాలు నేర్చుకున్నారా? మౌలిక వ్యవహారశైలి, దృక్ఫథం మారినట్లు కనిపించటం లేదు. లక్ష్య శుద్ధి లేకుండా కేవలం కుట్రపూరిత పద్ధతుల్లో ప్రతిపక్షాన్ని గుప్పిట్లో పెట్టుకోగలనని మోడీ ఇప్పటికీ అనుకుంటున్నారు. స్వల్ప విజయాలు సాధించినా ఆపరేషన్ సిందూర్‌లో అనేక స్థాయిల్లో అనేక లోపాలు జరిగాయన్నది నేడు కాదనలేని సత్యం. జాగ్రత్తగా వ్యవహరించి ఉంటే ఈ లోపాలు, పొరపాట్లు, తప్పులు జరక్కుండా చూసుకునే అవకాశం ఉండేది. ఈ విషయాన్ని నేటికీ ప్రభుత్వం అంగీకరించటం లేదు. కానీ, బాధ్యతాయుతమైన సీనియర్ సైనికాధికారులు దీనికి సంబంధించిన సూచనలు ఇప్పటికే ఇచ్చి ఉన్నారు.
ఓ సీనియర్ సైనికాధికారి ‘రాజకీయ నాయకత్వం పగ్గాలు వెనక్కు లాగటం వల్లనే’ భారత వాయుసేన యుద్ధ విమానాలను కోల్పోవల్సి వచ్చిందని చెప్పినప్పుడు ఆయన కేవలం సత్యాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని మాట్లాడారు. దీనికి బదులు మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న మౌనం కేవలం మోడీ ప్రతిష్టను కాపాడుకోవడానికి పడుతున్న తిప్పలేనన్నది కూడా అంతే స్పష్టం.
ఆపరేషన్ సిందూర్ తర్వాత మోడీ వెనకంజలో ఉన్నారు. ఆపరేషన్ సిందూర్ అద్భుత విజయమని సొంత సంఘరివారాన్నే నమ్మించలేకపోతున్నారు. అందువల్లనే తన అహాన్ని దిగమింగుకుని తొలిసారి ప్రతిపక్షాల తలుపు తట్టారు. పహల్గాం ఉగ్రదాడిలో పాకిస్తాన్ పాత్రను ఏ దేశమూ బహిరంగంగా ఖండించకపోవటంతో, మన గోడు ప్రపంచానికి వెల్లడించేందుకు కలిసి రావాలని అభ్యర్థించారు.
రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ సిందూర్ గురించి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రశ్నలు వేస్తుంది. లోతైన అర్థవంతమైన చర్చ కోసం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరపాలని డిమాండ్ చేస్తుంది. మిగిలిన ప్రతిపక్షాలు కూడా ఇటువంటి డిమాండ్లు చేశాయి. దాంతో ఎన్డీయే నరనరాన జీర్ణించుకుపోయిన విరక్తికరమైన ప్రతిపక్షాలను మభ్య పెట్టే కుట్రకోణాలు బయటికి వచ్చాయి.
పార్లమెంటు వర్షాకాల సమావేశాలే ఉపరాష్ట్రపతి ధన్కడ్ రాజీనామాతో మొదలయ్యాయి. అర్థవంతంగా జరిగే పార్లమెంట్ చర్చల ద్వారా ఆపరేషన్ సిందూర్, ట్రంప్ సంధియత్నాలు వంటి దేశహితానికి సంబంధించిన కీలకమైన అంశాల గురించి తెలుసుకోవడానికి ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో ఇటువంటి పరిణామంతో మొత్తం పార్లమెంట్ సమావేశాలను గందరగోళానికి గురి చేసి, దేశం దృష్టిని మళ్లించవచ్చన్నది బీజేపీ వ్యూహం. ఇక్కడ విషయం ఏమిటంటే భారత్- పాకిస్తాన్ల మధ్య సాగుతున్న యుద్ధం హద్దులు మీరి అణ్వస్త్ర ప్రయోగానికి దారితీయకుండా ఉండేందుకు వాణిజ్యం బూచిని చూపించిన తానే, రెండు దేశాలను సంధికి ఒప్పించానని ప్రపంచంలో అత్యధిక సైనిక శక్తి కలిగిన దేశ నాయకుడు ఇప్పటికి 25 సార్లు పునరుద్ఘాటించారు.
మోడీకి ఇష్టం ఉన్నా లేకున్నా ఈ విషయాన్ని పార్లమెంట్లో చర్చించక తప్పదు. కేవలం మోడీ కీర్తి ప్రతిష్టలు కాపాడే ప్రయత్నంలో యావత్ దేశాన్ని చీకట్లోకి నెట్టకూడదు.
ఇక్కడున్న కీలకమైన సమస్య ఇదే. జాతీయ ప్రయోజనాల రీత్యా ఆపరేషన్ సిందూర్, దాని నేపథ్యంలో తలెత్తిన సమస్యలన్నింటినీ పార్లమెంట్ వేదికగా చర్చించాలి. కానీ ప్రభుత్వం మాత్రం కేవలం మోడీ ప్రతిష్టను కాపాడే ప్రయత్నంలో అవసరం లేని, అర్థం లేని గందరగోళాలు సృష్టిస్తోంది. తిమ్మినిబమ్మిని చేస్తోంది.
అంటే మోడీ ప్రతిష్టను కాపాడేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు, జాతీయ ప్రయోజనాలు పరస్పరం విరుద్ధమైనవని తేలిపోయింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో కూడా దేశ ప్రయోజనాలు, ప్రభుత్వ ప్రయోజనాలు వేర్వేరన్న విషయం స్పష్టంగానే ఉంది. పాకిస్తాన్‌ను సైతం వదలకుండా ఉగ్రవాదాన్ని తుదముట్టించే బాహుబలి మోడీ అంటూ ఆయన చుట్టూ మోడీ ప్రభుత్వం, సంఘపరివారం ఓ ప్రతిష్టా చక్రాన్ని నిర్మించి పెట్టాయి. కానీ, కాల్పుల విరమణ ప్రకటించగానే అన్ని బహిరంగ ప్రదేశాల్లో వేళాడుతున్న మోడీ చిత్రపటాలు, హోర్డింగ్‌లు తొలగించి కాల్పుల విరమణ ప్రకటించిన విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రి ఫోటోలు పెట్టారు. ఇది అనూహ్యంగా చేయాల్సి వచ్చిన కసరత్తు.
ప్రతిపక్షం ఇచ్చిన సహకారంతో మోడీ మసకబారిన తన సొంత ప్రతిష్టను కాంతివంతం చేసుకునేందుకు ఎలా ప్రయత్నించారో దేశం గమనిసిస్తూనే ఉంది. ఎంపీలతో కూడిన దౌత్య బృందాలు ఇంకా దేశానికి తిరిగి రాకముందే, విదేశాంగ మంత్రి జైశంకర్ 1970లో ఇందిరా గాంధీ కూడా సాధించలేని విజయాన్ని అంతర్జాతీయ వేదికలపై మోడీ ప్రభుత్వం సాధించిందని జబ్బలు చరుచుకుపోవడం మొదలు పెట్టారు.
కాదేదీ ప్రతిష్టను పెంచుకునే ప్రయత్నాలకనర్హం..
శశిథరూర్ కానీ మనిష్ తివారీ కానీ దేశ ప్రయోజనాల రీత్యా ఆపరేషన్ సిందూర్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించే ముందు మోడీకున్న ఈ స్వోత్కర్ష గురించి, బీరాలు పలికే నైజం గురించి కాస్తయినా అర్థం చేసుకోవాల్సింది. దేశ ప్రయోజనాలు జాతీయ రాజకీయాల్లో మోడీ ప్రయోజనాలుగా మారుతున్న వైనాన్ని అర్థం చేసుకోలేకపోయారా వీరు? అంతర్జాతీయ వేదికల మీద భారత్- పాకిస్తాన్ల మధ్య తేడా లేదనుకునేలా వ్యవహరించటం ఉత్తర భారతదేశంలో మోడీ ఆశించే రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించే వ్యూహం కాదా? గతంలో చేసినట్లు ఈ పార్లమెంట్ సమావేశాలను కూడా తమ కుతంత్రాలతో దారి మళ్లించేందుకు జరుగుతోన్న ప్రయత్నాలు సఫలమయితే ఇటువంటివి ముందు ముందు మరెన్నో తెరమీదకు వచ్చే అవకాశాలున్నాయి.
దేశీయ రాజకీయాల్లో పాలకపక్షం, ప్రత్యేకించి మోడీ ప్రతిపక్షాల పట్ల ఎలా వ్యవహరిస్తుందో మోహన్ భాగవత్ కంటే బాగా అర్థం చేసుకున్న వాళ్లు బహశా లేరేమో. ప్రజాస్వామ్యం జారుడు మెట్లపై చేరిందని చెప్పటానికి ఇంతకన్నా ఉదాహరణ లేదు. ఈ పరిస్థితిని చక్కబెట్ట లేకపోతే దేశంలో మరేదీ చక్కబడదు.
అనువాదం: కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.