ఓటు వేయాలనే ఆత్రుతతో ఉన్న పేద ప్రజలు, ఎన్నికల వ్యవస్థ తమను ఎందుకు అడ్డుకుంటోందో అర్థం చేసుకోలేకపోవడం పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో ఇప్పటివరకు కనిపించిన అత్యంత కలచివేసే దృశ్యాలలో ఒకటి.
శనివారం మాల్దాలోని మైనారిటీ ప్రాబల్యం ఉన్న మానిక్చక్ ప్రాంతంలో మమతా బెనర్జీ ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తూ, “మీలో ఎంతమంది పేర్లు ఓటర్ల జాబితాలో లేవు?” అని ఒక సాధారణ ప్రశ్న అడగ్గా, పెద్ద సంఖ్యలో చేతులు పైకి లేవడంతో ముఖ్యమంత్రి ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు.
ఎన్నికలకు కేవలం కొన్ని వారాల ముందు పశ్చిమ బెంగాల్‌లోని ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ ప్రక్రియలో దాదాపు 24 నుంచి 25 లక్షల మంది ప్రజలు అనిశ్చితిలోకి నెట్టబడిన తీవ్ర సంక్షోభాన్ని, ఏ నినాదం కంటే కూడా ఆ ఒక్క క్షణమే స్పష్టంగా ప్రతిబింబించింది.
కేవలం ఓట్ల తొలగింపు సంఖ్య మాత్రమే కాక, ప్రభావితమైన వ్యక్తుల నేపథ్యం కూడా ఆందోళనను మరింత పెంచింది.
ఓటరు జాబితా నుంచి తొలగించబడిన లేదా పరిశీలనలో ఉంచబడిన వారిలో పేద దినసరి కూలీలు, గృహిణులు, రైతులు మాత్రమే కాకుండా – ఒక కార్గిల్ యుద్ధ వీరుడు, విశిష్ట సేవలు అందించిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారి, కలకత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి, పలువురు రిటైర్డ్ బ్యూరోక్రాట్లు కూడా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. వీరిలో మెజారిటీ ప్రజలు ముస్లింలే.
చాలా మందికి, ఈ షాక్ కేవలం పరిపాలనాపరమైనది మాత్రమే కాదు.
ఇది వారి అస్తిత్వానికి సంబంధించిన ప్రశ్న.
ఏళ్ల తరబడి ఓటు వేస్తున్న ఒక పౌరుడిని, ఆకస్మాత్తుగా తాము ఈ దేశానికి చెందినవారమని మళ్ళీ నిరూపించుకోవాలని అడగడమే దీనికి కారణం.
మాజీ సైనికులు, అధికారులకూ తప్పని తిప్పలు

మార్చి 28న, విశ్రాంత అధికారి అయిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ ఎండీ షమీమ్ అక్తర్ ఓటరు జాబితా నుంచి తన పేరు తొలగించినట్లు గుర్తించారు.
కోల్‌కతాలోని ఎంటల్లీ అసెంబ్లీ నియోజకవర్గ నివాసితుడయిన అక్తర్, గత కొన్ని దశాబ్దాలుగా ఓటు వేస్తున్నారు, ఎన్యుమరేషన్ ప్రక్రియలో 2002 ఓటర్ల జాబితాతో తన వివరాలను కూడా అనుసంధానించుకున్నారు.
ఎటువంటి విచారణకు పిలవకుండానే, తుది జాబితాలో తన పేరు పరిశీలనలో ఉన్నట్టు ఆయన కనుగొన్నారు.
బూత్ లెవల్ ఆఫీసర్‌కి ఎన్ని ఫోన్ కాల్స్ చేసినా ఆయనకు ఎలాంటి సాయం అందలేదు.
“ఒకప్పుడు నేను డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్ కలిగి ఉన్న వ్యక్తిని, కానీ ఇప్పుడు నా పౌరసత్వమే ప్రశ్నార్థకమైంది. నేను ఆన్లైన్ ప్రక్రియ ద్వారా ట్రిబ్యునల్‌కు దరఖాస్తు చేసుకున్నాను. నా పేరు క్లియర్ అవ్వొచ్చు, కానీ వేలాది మంది ఇతరుల పరిస్థితి ఏమిటి? మేము బెంగాలీలమైనందుకు, మా మాతృభాష కోసం మా జాతీయతను ఎందుకు నిరూపించుకోవాలి?” అని అక్తర్ ఆవేదన వ్యక్తం చేశారు.

యుద్ధంలో గాయాలపాలైన కార్గిల్ యోధుడు మహ్మద్ డ్యుయల్(దులాల్) అలీకి, ఈ పరిస్థితి కేవలం ఒక సమస్య మాత్రమే కాదు, ఇది అతని కూలిపోతున్న ఆత్మగౌరవానికి సంబంధించినది.
“నేను భారత సైన్యంలో పనిచేసిన మాజీ ఉద్యోగిని. ఏ దేశం కోసం అయితే నేను రక్తం చిందించానో, అదే దేశం నేడు నా పౌరసత్వాన్ని ప్రశ్నిస్తూ, నా ఓటు హక్కును లాగేసుకోవడం తీవ్ర ఆవేదన కలిగిస్తోంది” అని అలీ అన్నారు.
మొదట విచారణకు పిలిచి, ఆర్మీ రికార్డులను సమర్పించినప్పటికీ ఆయన పేరును పరిశీలన జాబితాలో పెట్టారు.
“నేను నా పాస్‌పోర్ట్, సర్వీస్ రికార్డులతో సహా నాకు, నా కుటుంబానికి అవసరమైన అన్ని పత్రాలను సమర్పించాను. అయినప్పటికీ, మా పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. ఈ రోజు నేను ఈ దేశ పౌరుడినని, ఓటరునని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది నాకు కేవలం చట్టపరమైన పోరాటం మాత్రమే కాదు. ఇది నా గౌరవం, ఆత్మగౌరవం కోసం చేస్తున్న పోరాటం” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అంతుపట్టని ట్రిబ్యునల్ పనితీరు..
అయినప్పటికీ, ఈ ఫిర్యాదులను పరిష్కరించాల్సిన యంత్రాంగం ఇంకా గందరగోళంలోనే ఉంది.
ఎన్నికలకు మూడు వారాల కంటే తక్కువ సమయం ఉన్నప్పటికీ, అప్పీళ్లను విచారించాల్సిన ట్రిబ్యునల్ ఇంకా పని ప్రారంభించలేదు.
కోల్‌కతా శివార్లలోని బిష్ణుపూర్‌లో ఉన్న “డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్” వద్దకు ప్రజలు రోజురోజుకూ పత్రాల కట్టలతో వస్తున్నారు. కానీ అక్కడ పని ఇంకా ప్రారంభం కాలేదని వారికి చెబుతున్నారు.
“ప్రతిరోజూ ఉదయం దూర ప్రాంతాల నుంచి ప్రజలు బ్యాగుల నిండా పత్రాలతో వస్తున్నారు. వారందరినీ ఎవరైనా పిలిపించారా అని అడిగితే, తమ సమస్యలు ఇక్కడే పరిష్కారమవుతాయని విన్నామని చెబుతుంటారు. ట్రిబ్యునల్ పని ఇంకా ప్రారంభం కాలేదని వారికి అర్థమయ్యేలా చెప్పడం సాధ్యంకావటం లేదు. వారికి కూడా సరైన సమాచారం లేదు” అని అక్కడ పనిచేసే ఒక సెక్యూరిటీ గార్డు శనివారం ‘ది వైర్’తో చెప్పారు.
ఈ అనిశ్చితి కేవలం ఎక్కడికి వెళ్లాలనే దానిపైనే కాదు, అప్పీలు చేసుకునే సమయం ఎప్పటి నుంచి లెక్కించబడుతుందనే దానిపై కూడా ఉంది.
“ట్రిబ్యునల్ ఇంకా పని ప్రారంభించలేదు. అప్పీళ్లు దాఖలు చేయడానికి ఉన్న పదిహేను రోజుల గడువు, ట్రిబ్యునల్ కార్యకలాపాలు ప్రారంభమైన రోజు నుంచి లెక్కించబడుతుందా లేదా ఓటర్ల జాబితా ప్రచురించబడిన తేదీ నుంచి లెక్కించబడుతుందా అనేది మాకు ఇంకా తెలియదు” అని ఇమ్రోజ్ రెజా అన్నారు.
ఈయన ఐటీ నిపుణుడు, ప్రభావిత పౌరులకు మద్దతునిచ్చేందుకు కొత్తగా ఏర్పాటైన ‘ఆల్ బెంగాల్ సిటిజన్‌షిప్ అండ్ ఓటింగ్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ’లో సభ్యుడు.
“ఓటర్లు తమ దరఖాస్తులను, పత్రాలను సకాలంలో సమర్పించినట్టు ఆధారాలు ఉండటం కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేయమని మేము సలహా ఇస్తున్నాము, దీనిని అధికారులు తర్వాత తిరస్కరించలేరు” అని ఆయన పేర్కొన్నారు.
డిజిటల్ అగాధం: ఆన్లైన్ దరఖాస్తుల్లో సవాళ్లు..
అయితే, ఆ సలహా మరొక కఠినమైన వాస్తవాన్ని వెలుగులోకి తెస్తోంది. ప్రభావితమైన వారిలో చాలా మందికి ఆన్లైన్లో దరఖాస్తు చేయడం ఒక సవాలుగా మారింది.
లక్షలాది మంది పేద, గ్రామీణ ఓటర్లు తమ ఓటు హక్కును కాపాడుకోవడానికి సాంకేతికతే సురక్షితమైన మార్గమని చెబుతున్నా కానీ, రాష్ట్రంలో డిజిటల్ సౌకర్యాలు అందరికీ సమానంగా అందుబాటులో లేవు.
పశ్చిమ బెంగాల్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో కేవలం 19% గృహాలకు మాత్రమే ఇంటర్నెట్ సదుపాయం ఉంది.
గ్రామీణ ప్రాంతాల్లో స్మార్ట్‌ఫోన్ వినియోగం కేవలం 18% మాత్రమే అని అంచనా, ఇది పట్టణ ప్రాంతాలతో పోలిస్తే చాలా తక్కువ.
గ్రామీణ మహిళల్లో ఇంటర్నెట్ వినియోగం మరీ తక్కువగా ఉంది.
ఒక సర్వే ప్రకారం ఇది కేవలం 25.5% మాత్రమే. దీనర్థం ఏమిటంటే, ఆన్లైన్ విధానం అనేది తటస్థ పరిపాలనాపరమైన పరిష్కారం కాదు.
ఇది పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సిన భారాన్ని, ఆ భారాన్ని మోయలేని స్థితిలో ఉన్న వారిపైకి నెట్టేస్తుంది.
ఓటర్ల జాబితా నుంచి పేర్లు గైర్హాజరైన ఒక రైతు, పనిమనిషి, మేస్త్రీ లేదా వృద్ధ వితంతువు- ఇప్పుడు స్మార్ట్‌ఫోన్, సరైన ఇంటర్నెట్ కనెక్షన్ లేదా ఆన్లైన్ దరఖాస్తులపై ఎటువంటి ముందస్తు అనుభవం లేకుండానే ఫారమ్‌లను నింపడం, పత్రాలను అప్లోడ్ చేయడం, ఓటీపీలను పొందడం, డిజిటల్ సాక్ష్యాలను భద్రపరుచుకోవడం వంటివి చేయాల్సి ఉంటుంది.
సామాన్యుల అవస్థలు..

కోల్‌కతా శివార్లలోని న్యూ టౌన్లో పనిమనిషిగా పనిచేస్తున్న యాభై ఆరేళ్ల ఫిరోజా బీబీ మండల్, 1989 నుండి ప్రతి ఎన్నికలలోనూ ఓటు వేస్తూనే ఉన్నారు.
ఒక పౌరురాలికి ఉండాల్సిన పాన్ కార్డ్, ఆధార్ నంబర్, బ్యాంక్ పాస్‌బుక్, ఓటర్ ఐడివంటి అన్ని అధికారిక పత్రాలు ఆమె దగ్గర ఉన్నాయి.
గతేడాది నవంబర్‌లో జరిగిన గణన ప్రక్రియలో, ఆమె తన వివరాలను నమోదు చేయడమే కాకుండా రికార్డుల్లో తన తండ్రి పేరును కూడా గుర్తించగలిగింది.
అయినప్పటికీ, తన EPIC కార్డులో ఆమె పేరు “ఫిరోజా బీబీ మండల్” బదులుగా “ఫిరోజా బీబీ మండల్, మోక్తార్ అలీ మండల్ భార్య”గా నమోదవడం ఆమెకు భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితిని తీసుకువచ్చింది.
శనివారం నాడు భారత ఎన్నికల సంఘం విడుదల చేసిన పదవ “తొలగించబడిన” ఓటర్ల జాబితాలో ఆమె పేరు కనిపించింది, కానీ ఆమె కుటుంబంలోని మిగిలిన వారందరి పేర్లు మాత్రం ఖరారయ్యాయి.
“ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నా హక్కులన్నీ కోల్పోతానా? దీనిపై నేను ఎలా అప్పీల్ చేయాలి?” అని ఆమె ప్రశ్నించారు. ఫిరోజాకు చదవడం, రాయడం కూడా సరిగ్గా రాదు, ఆమె ఒక సాధారణ ఫోన్‌ని ఉపయోగిస్తారు, తన ఫోన్లోని కాంటాక్ట్‌లను వెతకడానికి కూడా ఆమె ఇబ్బంది పడుతుంటారు. తనలాంటి చాలా మందికి, ఇప్పుడు ఓటు హక్కు అనేది స్థానిక ఏజెంట్లు, రాజకీయ మధ్యవర్తులు లేదా బంధువులపై ఆధారపడి ఉంది. వారు ఆమెకు సహాయం చేయగలరో లేదో కూడా తెలియని పరిస్థితి.
భౌతిక(ఆఫ్‌లైన్) ప్రక్రియ కూడా ఏమంత సులభం కాదు. హౌరా, హుగ్లీ, ఉత్తర 24 పరగణాలు లేదా దక్షిణ 24 పరగణాల వంటి జిల్లాల ప్రజలకు బిష్ణుపూర్‌లోని ట్రిబ్యునల్‌కు చేరుకోవడం అంత తేలికైన పని కాదు.
రాష్ట్రంలోని రెండు ప్రధాన రైల్వే స్టేషన్లయిన హౌరా లేదా సీల్దా నుంచి ట్రిబ్యునల్‌కు చేరుకోవాలంటే అనేక బస్సులు మారాలి, గంటకు పైగా ప్రయాణం చేయాలి.
నగరానికి ఆవల ఉన్న గ్రామాల నుంచి వచ్చే వారికి ఇంకా ఎక్కువ సమయం పడుతుంది. అక్కడ అనువైన బస్సు స్టాప్ కూడా లేదు, దీనివల్ల హైవేపై దిగిన తర్వాత ప్రజలు చాలా దూరం నడవాల్సి వస్తోంది.
పేదవారికి, దూరం అనేది కేవలం కిలోమీటర్లలోనే ఉండదు. అది కోల్పోయిన కూలి, అప్పు తెచ్చిన ప్రయాణ ఖర్చులు, మానేసిన భోజనాలతో కొలవబడుతుంది.
దీని తాలూకు మానవీయ మూల్యం ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తోంది. హౌరాలోని ఉదయ్ నారాయణపూర్‌కు చెందిన దినసరి కూలీ సజల్ దాస్, ట్రిబ్యునల్ తమ ఓటు హక్కును పునరుద్ధరించవచ్చని విని మరో ముగ్గురితో కలిసి వచ్చారు. వారు అంత దూరం ప్రయాణించి వచ్చారు, కానీ ఎటువంటి సమాధానం లేకుండానే వెనుదిరగాల్సి వచ్చింది.
“ముందు అందరి పేర్లు జాబితాలో ఉండేవి, మా దగ్గర అవసరమైన అన్ని పత్రాలు కూడా ఉన్నాయి. కానీ కమిషన్ వాటిని అంగీకరించకుండా మమ్మల్ని ట్రిబ్యునల్‌కు వెళ్ళమని చెబుతోంది. మేము రెక్కాడితే గానీ డొక్కాడని దినసరి కూలీలం. మా గ్రామం నుంచి ఇక్కడికి రావడానికే ఒక్కొక్కరికి 300 రూపాయల ఖర్చవుతోంది. ఇంత చేసినా ఏమీ జరగలేదు. ఈసారి మమ్మల్ని ఓటు వేయనివ్వరనిపిస్తోంది” అని ఆయన అన్నారు.
అసంపూర్తిగా ఉన్న ట్రిబ్యునల్ బయట నిలబడిన చాలా మందిలో ఇదే భయం కనిపిస్తోంది.
ఆమ్తాలాకు చెందిన పేదవాడైన రబిన్ సర్దార్, పత్రాలతో ఉన్న ఒక గుడ్డ సంచిని పట్టుకుని నిరాశగా “ఈసారి మాకు ఓటు హక్కు లభించదా?”అని ప్రశ్నించారు.
ఒక మినహాయింపు
అయితే ఇందులో ఒక ముఖ్యమైన మినహాయింపు ఉంది.
ముర్షిదాబాద్‌లోని ఫరక్కా నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ అభ్యర్థి మెహతాబ్ షేక్ పత్రాలను పరిశీలించిన తర్వాత, ఆదివారం నాడు ఒక ఎస్ఐఆర్ ట్రిబ్యునల్ ఆయన పేరును ఓటర్ల జాబితాలో పునరుద్ధరించాలని ఆదేశించింది.
బెంగాల్లో తొలగించబడిన ఓటర్లలో ట్రిబ్యునల్ ద్వారా క్లియరెన్స్ పొందిన మొదటి వ్యక్తి ఆయనే.
అయితే, షేక్ ఉదంతం ఈ ప్రక్రియలోని అసమానతలను మరింత స్పష్టంగా బయటపెట్టింది.
కాంగ్రెస్ అభ్యర్థిగా, సంపన్న కాంట్రాక్టరుగా ఉన్న ఆయన, ఏప్రిల్ 2న సుప్రీంకోర్టును ఆశ్రయించి, తన కేసును త్వరగా పరిష్కరించాలని ట్రిబ్యునల్‌కు, పూర్తి సహకారం అందించాలని ఎన్నికల సంఘానికి ఆదేశాలు పొందగలిగారు.
కానీ ట్రిబ్యునల్ గేట్ల వద్ద తమ విలువైన కాగితాలను పట్టుకుని నిలబడిన ఇతరులకు అటువంటి సౌలభ్యాలు లేవు.
మిగిలిపోయిన ప్రశ్నలు – ఆందోళనలు..
ఎన్నికల సంఘం వర్గాల సమాచారం ప్రకారం, “విచారణలో ఉన్న” 60.06 లక్షల కేసులలో 58 లక్షల కేసులపై న్యాయాధికారులు ఏదో ఒక నిర్ణయం తీసుకున్నారు, మిగిలిన సుమారు 2 లక్షల కేసులు సోమవారం, ఏప్రిల్ 6 నాటికి పూర్తవుతాయి.
న్యాయాధికారుల స్థాయిలో 42% తిరస్కరణ రేటు ఉందని వారు పేర్కొన్నారు, అంటే కనీసం 25 లక్షల మంది పేర్లు ఓటర్ల జాబితా నుంచి తొలగించబడే అవకాశం ఉంది.
మొదటి దశ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేయడానికి ఏప్రిల్ 6 చివరి తేదీ, రెండవ దశ స్థానాలకు ఏప్రిల్ 9 చివరి తేదీ.
ఆయా దశల ఓటర్ల జాబితాలో పేర్ల చేరికకు కూడా ఇవే చివరి తేదీలు.
పశ్చిమ బెంగాల్ ఓటర్ల ముందున్న ప్రశ్న సాధారణమైనదే కానీ అత్యంత కఠినమైనది. ఈ 25 లక్షల మంది అసలు ఎక్కడ, ఎప్పుడు హాజరు కావాలి? ఇంత భారీ సంఖ్యలో ఉన్న అప్పీళ్లను కేవలం కొద్ది రోజుల్లోనే ఎలా విచారిస్తారనే దానిపై స్పష్టత లేదు.
దాదాపు 19 మంది రిటైర్డ్ న్యాయమూర్తులు లక్షలాది మంది ఓటర్ల భవితవ్యాన్ని తేల్చాల్సి ఉండగా, ఆ లెక్కలే ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.
ఇంతటి భారీ ప్రక్రియ న్యాయం చేయగలదా? ఒకవేళ చేయలేకపోతే, వెనుకబడిపోయిన వారి పరిస్థితి ఏమిటి?
ప్రభావిత కుటుంబాలు గుసగుసలాడుకుంటున్న ఒక లోతైన భయం ఇంకా ఉంది, దానిపై అధికారులు మాత్రం స్పందించడం లేదు.
ట్రిబ్యునల్ గనుక అప్పీల్‌ను తిరస్కరిస్తే ఏం జరుగుతుంది? పేర్లు పునరుద్ధరించబడని వారు ఈ ఎన్నికల్లో ఓటు వేసే హక్కును కోల్పోతారా? సమాజంలో అనుమానం, వెలివేతకు గురయ్యేలా వారు ‘సందేహాస్పద ఓటర్లు’ అనే ముద్ర పడిన వర్గంలోకి నెట్టబడతారా? ప్రస్తుతానికి, వీటికి ఎటువంటి స్పష్టమైన సమాధానాలు లేవు.
ఈ కథ కేవలం ఎన్నికల ప్రక్రియకు మాత్రమే పరిమితం కాకుండా, గణతంత్ర దేశం ఎదుర్కొంటున్న నైతిక పరీక్షగా మారుతోంది.
ఓటు హక్కును పౌరసత్వానికి పునాదిగా, ప్రాథమిక హక్కుగా తరచుగా అభివర్ణిస్తారు.
కానీ పేదలకు మాత్రం ఆ హక్కు కేవలం చట్టంపైనే కాకుండా డబ్బు, ప్రయాణ సౌకర్యం, కనెక్టివిటీ, అక్షరాస్యత, అందుబాటులో ఉన్న వనరులపై ఆధారపడి ఉంటోంది.
రాబోయే పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు సంబంధించి అత్యంత కలచివేసే దృశ్యం ఏమిటంటే- సామాన్య ప్రజలు ఓటర్ కార్డులు, రేషన్ కార్డు పత్రాలు, ఇతర ధృవీకరణ పత్రాలతో నిండిన గుడ్డ సంచులతో వచ్చి, ఇంకా ప్రారంభం కాని ట్రిబ్యునల్ కార్యాలయం వెలుపల వేచి ఉండటం.
వారు ఎటువంటి సహాయం కోసం అడగడం లేదు, తమ గుర్తింపును అంగీకరించమని మాత్రమే కోరుతున్నారు.
ఓటింగ్ ప్రక్రియకు మూడు వారాల కంటే తక్కువ సమయం ఉన్నప్పటికీ, ఆ గుర్తింపు సరైన సమయానికి లభిస్తుందో లేదో ప్రభుత్వం వారికి ఇంకా స్పష్టం చేయలేదు.
అనువాదం: దేవి పోలిన
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.

