ఆహార ధరలు తగ్గుతున్నప్పటికీ, గ్రామాల్లోని కొన్ని గృహాల్లో నెలవారీ మొత్తం వినియోగ వ్యయంలో ఆహారంపై పెట్టే ఖర్చు కొంత వరకు పెరిగినట్టుగా సర్వే కనుగొంది.
న్యూఢిల్లీ: రాబోయే ఆర్థిక సంవత్సరంలో తమ ఆదాయం పెరుగుతుందని ఆశిస్తున్న గ్రామీణ గృహాల సంఖ్య నవంబర్లో 75.9 శాతం ఉండగా, అది జనవరి నాటికి 71.8 శాతానికి తగ్గినట్టు జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్(నాబార్డ్) నిర్వహించిన ద్వైమాసిక సర్వే వెల్లడించింది.
2025 మార్చి సర్వేలో సుమారు 72.2% మంది ఇలాంటి ఆశనే వ్యక్తపరచగా, ఇప్పుడు నమోదైన గణాంకాలు అంతకంటే తక్కువ కావడం గమనార్హం.
రాబోయే ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో ఆదాయం, ఉపాధి స్థితిగతులు మెరుగుపడతాయని ఆశిస్తున్న గృహాల నిష్పత్తి 46.4%కి తగ్గింది. 2024 సెప్టెంబర్ నుంచి నమోదైన గణాంకాలలో ఇది అతి తక్కువ స్థాయి.
2025 డిసెంబర్ చివరి వారం నుంచి 2026 జనవరి మొదటి వారం వరకు నిర్వహించిన ఈ సర్వే పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
ఆదాయం తగ్గుతుందని భావిస్తున్న గృహాలు జనవరి 2026లో 3.4% ఉన్నాయి. గత ఏడాది ఇదే సమయంలో ఇది 7.4%గా ఉండేది.
మందగించిన గ్రామీణ డిమాండ్
“గ్రామీణ ఆర్థిక స్థితిగతులు- భావోద్వేగాలు” అనే శీర్షికతో నాబార్డ్ నిర్వహించిన ఈ సర్వే ప్రకారం, పెరుగుతున్న వినియోగంలో గృహాల వాటా 73%కి పడిపోయింది.
దీనిని బట్టి గత రెండు నెలలలో గ్రామీణ వినియోగ డిమాండ్ మందగించిందని సర్వే పేర్కొంది.
గత సెప్టెంబర్లో ప్రకటించిన వస్తు సేవల పన్ను(జీఎస్టీ) విస్తరణ, హేతుబద్ధీకరణతో పాటు పండగల సీజన్ ప్రభావం 2025 నవంబర్ సర్వేలో ప్రతిబింబించింది.
అంతకుముందు సంవత్సరంలో 79.2% గృహాలు వినియోగ వ్యయంలో పెరుగుదలను నమోదు చేశాయి. సర్వే మొదలుపెట్టినప్పటి నుంచి ఇది చాలా ఎక్కువని నాబార్డ్ తెలిపింది.
ఆహార వ్యయం- ద్రవ్యోల్బణం
ఆహార ధరలు తగ్గుతున్నప్పటికీ, మొత్తం నెలవారీ వినియోగంలో భాగంగా గ్రామీణ గృహాలలో కొంత భాగం ఆహారంపై పెట్టే ఖర్చు 55% పెరగడం గమనార్హం. రిటైల్ ఆహార ద్రవ్యోల్బణం డిసెంబర్ 2025లో వరుసగా ఏడవ నెలలో కూడా 2.71%గా నమోదైంది.
గ్రామీణ ద్రవ్యోల్బణాన్ని పరిశీలిస్తే, 87.6% గృహాలు 5% కంటే తక్కువ ద్రవ్యోల్బణాన్ని అనుభవించాయి.
అప్పుల వినియోగం
అప్పు వాడకానికి సంబంధించి 55% మంది అధికారిక వనరులపై ఆధారపడుతుండగా, మరికొందరు స్నేహితులు, బంధువుల వంటి అనధికారిక వనరుల నుంచి రుణాలు తీసుకుంటున్నారు. నాలుగవ వంతు గృహాలు తీసుకున్న అప్పుపై 17-18% సగటు వడ్డీ రేటును చెల్లిస్తుండగా, అనధికారికంగా తీసుకుంటున్న కొన్ని అప్పులకు ఎలాంటి వడ్డీ చెల్లించడం లేదని నాబార్డ్ తెలియజేసింది.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
