1
కదిలే మేఘం,
తిరిగే భూమండలం,
కరిగే మంచు పర్వతం,
వడిగా సాగే నదీ నదం;
ఎగిరే పావురం,
నర్తించే మయూరం,
గాలికి ఊగే పంటపొలం,
ఆగక నడిచే కాల్బలం;
ఉదయించే రవి కిరణం
అస్తమించని శశి నయనం..
ప్రియ నేస్తాలుగా
నా హృదిలో పొదువుకొని
పయనం సాగిస్తున్నా!!
2
ఒక్కో మెట్టు ఎక్కినప్పుడు
తరువాతి మెట్టు ఎంత ఎత్తుందో..
ఇంకెంత ఎ‘దిగితే’
అదికూడా ఎక్కగలనో.. అనుకుంటూ కదులుతూనే ఉన్నా!
3
ఎంతో కాలం గరళాన్ని
అంతర్గత ఆటుపోట్లలో
అదిమిపట్టిన సముద్రపు జడి..
ప్రకృతి ధర్మంగా
ప్రాకృత మర్మంగా
బాధాపూరిత బాధ్యతతో..
ఏటవాలులను సరిచేసే
చైతన్యపు భావధారతో
విరుచుకుపడే కెరటాల
ఆరాటంలో నేనున్నా!
4
కసిరించిన, విసిగించిన
ఏ బాధైనా ముగిసిపోదా!?
ముగిసిన ప్రతి పురాగాథా
మళ్ళీ కొత్త కాంతులతో చిగురించదా!?
ఏ కాలంలోనైనా..
ఏ కథా ముగిసిపోదు!
ఎందుకంటే…
ఇదే మొదలు కాదు;
ఇది చివరిది అసలే కాదు!!
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
