మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలి జిల్లాలో అదానీ గ్రూప్‌కు కేటాయించిన ‘ధీరౌలి బొగ్గు గని’ (కోల్ బ్లాక్) పర్యావరణ అనుమతులపై జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.
ఈ ప్రాజెక్టు కోసం ఏకంగా 5,70,000 చెట్లను నరికివేయడం, అలాగే ప్రతిపాదిత ఏనుగుల కారిడార్‌పై ఇది చూపే ప్రభావాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై ట్రిబ్యునల్ ఈ నిర్ణయం తీసుకుంది.
న్యూఢిల్లీ: పర్యావరణ కార్యకర్త అజయ్ దూబే ఫిబ్రవరి 26న ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా రెండు పిటిషన్లు దాఖలు చేశారు.
‘ది హిందూ’ కథనం ప్రకారం, ఈ పిటిషన్లను విచారించిన ఎన్జీటీ ప్రధాన ధర్మాసనం కేంద్ర, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.
ఈ ధర్మాసనానికి చైర్పర్సన్ జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ, నిపుణ సభ్యుడు అఫ్రోజ్ అహ్మద్ ఉన్నారు.
అదానీ పవర్ అనుబంధ సంస్థ అయిన ‘మహాన్ ఎనర్జెన్ లిమిటెడ్’కు ఈ బొగ్గు గనిని కేటాయించారు.
ప్రాజెక్టులో భాగంగా 5 లక్షల 70 వేలకు పైగా చెట్లను నరికివేసేందుకు అనుమతి ఇవ్వడాన్ని ఒక పిటిషన్ సవాలు చేయగా; ఈ బొగ్గు గని ప్రాంతం ప్రతిపాదిత ఏనుగుల కారిడార్ గుండా వెళుతోందని, దీనివల్ల వన్యప్రాణుల సంచారానికి, స్థానిక పర్యావరణానికి తీవ్ర ముప్పు వాటిల్లుతుందని మరో పిటిషన్లో దూబే ఆరోపించారు.
ప్రభుత్వ ఆదేశాలపై సవాలు
గతేడాది మే 9న కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ జారీ చేసిన అనుమతులను, అలాగే చెట్ల నరికివేతకు అనుమతిస్తూ మే 22న మధ్యప్రదేశ్ అటవీ శాఖ జారీ చేసిన ఉత్తర్వులను ఆయన తన పిటిషన్లలో సవాలు చేశారు.
ఎన్జీటీ ఆదేశాలు, తదుపరి విచారణ
ఈ పిటిషన్లలోని అంశాలపై ప్రాథమికంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండానే కేంద్ర పర్యావరణ, అటవీ-వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ; జాతీయ వన్యప్రాణుల బోర్డు, మధ్యప్రదేశ్ అటవీ శాఖలకు ఎన్జీటీ నోటీసులు జారీ చేసింది.
అన్ని సాంకేతిక అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని, తదుపరి విచారణకు కనీసం వారం రోజుల ముందు అఫిడవిట్ల రూపంలో తమ స్పందనను సమర్పించాలని ప్రతివాదులను ధర్మాసనం ఆదేశించింది.
చెట్ల నరికివేతకు సంబంధించిన పిటిషన్‌పై తదుపరి విచారణ ఏప్రిల్ 22న, ఏనుగుల కారిడార్‌కు సంబంధించిన పిటిషన్‌పై విచారణ మే 26న జరగనున్నట్లు వార్తాపత్రిక వెల్లడించింది.
పర్యావరణ సున్నితమైన జోన్‌గా ప్రకటించాలి
ప్రతిపాదిత ‘సిద్ధి-సింగ్రౌలి-పాలము’ ఏనుగుల కారిడార్ సరిహద్దులను గుర్తించి, దానిని పర్యావరణపరంగా సున్నితమైన జోన్(ఈఎస్‌జెడ్)గా ప్రకటించాలని పిటిషనర్ దూబే డిమాండ్ చేశారు.
పర్యావరణ (రక్షణ) చట్టం-1986 కింద దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఏనుగుల కారిడార్లను పర్యావరణ సున్నితమైన మండలాలుగా ప్రకటించాలంటూ 2018 నవంబర్ 14న ట్రిబ్యునల్ ఇచ్చిన పాత ఉత్తర్వులను దరఖాస్తుదారుడి తరపు న్యాయవాది గుర్తుచేశారు.
అలాగే, ఏనుగుల రక్షణ కోసం సంబంధిత రాష్ట్రాలతో సమన్వయం చేసుకోవడానికి కేంద్ర పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేస్తూ 2019 మే 16న ఇచ్చిన ఉత్తర్వులను కూడా ప్రస్తావించారు.
2018లో లోక్‌సభలో అడిగిన ప్రశ్నలకు ప్రతిస్పందనగా, మధ్యప్రదేశ్ ప్రభుత్వం రెండు కారిడార్లను (సింగ్రౌలి-సిధి-గురు ఘసిదాస్, సిద్ధి-సింగ్రౌలి-పాలము) ప్రతిపాదించిందని; ఇవి మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల పరిధిలోకి వస్తాయని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.
ఉద్దేశపూర్వకంగానే నోటిఫికేషన్లో జాప్యం?
బొగ్గు గనికి త్వరగా అనుమతులు దక్కించుకునేందుకే ఏనుగుల కారిడార్ నోటిఫికేషన్‌ను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారని అజయ్ దూబే ‘ది హిందూ’తో మాట్లాడుతూ ఆరోపించారు.
ఒకసారి ఈ ప్రాంతాన్ని ఏనుగుల కారిడార్‌గా నోటిఫై చేస్తే, ఆ తర్వాత అక్కడ చెట్ల నరికివేతకు, ఇతర కార్యకలాపాలకు కంపెనీకి అనుమతులు దక్కవని ఆయన స్పష్టం చేశారు.
“పర్యావరణ మంత్రిత్వ శాఖ క్షేత్ర స్థాయి నివేదిక ప్రకారం, గని కేటాయించిన ప్రాంతం దట్టమైన అడవులతో నిండి ఉంది. అక్కడ 0.40 నుంచి 0.60 వరకు పందిరి సాంద్రత(Canopy density), గొప్ప వృక్ష, జంతుజాలం ఉన్నాయి. సాల్, షిషమ్, టేకుతో సహా 50కి పైగా ఉష్ణమండల చెట్లు ఉన్నాయి. ఈ దట్టమైన అటవీ ప్రాంతాన్ని బొగ్గు తవ్వకాల కోసం ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించకూడదన్నదే మా ప్రధాన డిమాండ్. ఇది ప్రకృతి సహజత్వాన్ని నాశనం చేస్తుంది” అని ఆయన అన్నారు.
ప్రాజెక్ట్ వివరాలు, కాంగ్రెస్ ఆరోపణలు
గత ఏడాది సెప్టెంబర్‌లో, ధీరౌలి గనిలో తవ్వకాలు ప్రారంభించడానికి కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు పొందినట్లు అదానీ గ్రూప్ ప్రకటించింది.
ఈ గనిని అదానీ పవర్ అనుబంధ సంస్థ మహాన్ ఎనర్జెన్ లిమిటెడ్ నిర్వహిస్తుంది. సింగ్రౌలి జిల్లాలోని అనేక గ్రామాలు, అటవీ ప్రాంతాల్లో సుమారు 27 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ధీరౌలి కోల్ బ్లాక్ మధ్యప్రదేశ్‌లోనే అతిపెద్దది.
ఈ ప్రాజెక్టు కోసమే సుమారు 5.7 లక్షల చెట్లను నరికివేస్తున్నారు.
అయితే, ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ, పరిహారం చెల్లింపుల్లో పర్యావరణ ఉల్లంఘనలు, అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.
మైనింగ్ కోసం భూములు కోల్పోతున్న ఎనిమిది గ్రామాల ప్రజలకు తగిన పరిహారం చెల్లించడం లేదని, ఫిబ్రవరి 27న జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని నిలదీశారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
