
కాలపు మదిగదులలో
ఊపిరి పోసుకున్న
వేదనలు, రోదనలు
ఒకదానికొకటి తోడై, నీడై
పురా అనుభూతుల సెగలతో
మోదానందపు మేఘాలుగా మారినయ్!
ఫలితంగా..
వెల్లువెత్తిన వేదనా ఉరుముల నడుమ
అపరిమిత ఆకాంక్షల మెరుపులతో
ఊపిరి సలుపని
భారపు పీడనల తోడ్పాటుతో
కావలసినంత సేపు బిగబట్టుకొని
ఒక్కసారిగా మంత్రసాని తనంతో
స్వయంగా కాన్పు చేసుకున్నయ్!
పురుటి పచ్చిదనంతో
ఎరుకల ఎల్లిపాయ మిరం
తెగ నమిలి
చిరు జల్లుల వంటకాన్ని
మరింత విస్తారం చేసినయ్!
స్వీకర్తగా ఒడలు విరుచుకున్న ప్రేమాత భూతల్లి
తన మట్టి వాసనకు తనే మురిసిపోయి
విత్తన చిన్నారులకు
కొత్తగా బొడబొడకాయలు పోసే
అమ్మమ్మతనం నెత్తికెత్తుకున్నది!
మాయ వాసనను,
పరవశంలోని పరవశాన్ని
పసిగట్టిన ప్రకృతి
పొలాల పండుగను
వేడుకగా జరుపుతున్నది!
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.