
ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత తెలంగాణ హైకోర్టు ఉభయ పక్షాలు తమ తమ వాదనలను అక్టోబర్ 10వ తేదీ నాటికి రాతపూర్వకంగా సమర్పించాలని ఆదేశించింది.
గ్రూప్-1 పరీక్షలు విషయంలో సింగిల్ జడ్జి ధర్మాసనం ఇచ్చిన తీర్పును సస్పెండ్ చేస్తూ తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. సింగిల్ జడ్జ్ ధర్మాసనం గ్రూప్-1 పరీక్ష రాసిన వారికి ప్రభుత్వం జారీ చేసిన ర్యాంకు కార్డులు, మెరిట్ లిస్టును పక్కన పెడుతూ జవాబు పత్రాలను పునర్మూల్యాంకనం చేయాలని ఆదేశించింది. తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తాజా ఉత్తర్వులతో గ్రూప్- 1 అభ్యర్థులలో ఆశలు మళ్లీ చిగురించాయి.
ప్రధాన న్యాయమూర్తి అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహయుద్దీన్లతో కూడిన ధర్మాసనం సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ దాఖలు చేసిన అప్పీల్‌ను విచారణకు చేపట్టింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షల విధానాన్ని, ఫలితాలను సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన అభ్యర్థుల తరఫున వాదించిన న్యాయవాదులు ఈ విషయంలో యధాతధ స్థితిని పాటించాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు.
అయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలలో ఉత్తీర్ణులైన వారికిస్తున్న నియామకాలు, హైకోర్టు ఇవ్వబోయే తుది తీర్పుకు లోబడి ఉంటాయని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. ఈ పరీక్షల్లో పాల్గొన్న అభ్యర్థుల తరఫున సీనియర్ కౌన్సిల్ రచనా రెడ్డి వాదించగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరఫున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, సీనియర్ కౌన్సిల్ ప్రకాష్ రెడ్డి వాదనలు వినిపించారు.
ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత, హైకోర్టు ధర్మాసనం ఈ కేసుపై తదుపరి విచారణను అక్టోబర్ 15వ తేదీకి వాయిదా వేసింది. అక్టోబర్ 10వ తేదీలోగా న్యాయవాదులు తమతమ రాతపూర్వక వాదనలు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది.
ఒక పోస్టుకు మూడు కోట్ల?
ఇదిలా ఉండగా ఉద్యోగాల కోసం కష్టపడి చదివి, పోటీ పరీక్షలకు హాజరైయ్యే విద్యార్థుల జీవితాలతో రాజకీయ నాయకులు తమ స్వప్రయోజనాల కోసం చెలగాటమాడకూడదని విద్యార్థుల తల్లిదండ్రులు అభ్యర్థిస్తున్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ 2025 మార్చిలో విడుదల చేసిన గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలను సవాల్ చేస్తూ సెప్టెంబర్ 16న దాఖలైన పిటిషన్ల నేపథ్యంలో తల్లిదండ్రులు పై విధంగా స్పందించారు.
ఒక్కో పోస్టు మూడు కోట్ల రూపాయల అమ్ముకున్నారన్న ఆరోపణలు- పోటీ పరీక్షల కోసం అహోరాత్రులు కష్టపడి చదివిన తమ పిల్లలను అవమానించడమేనని విద్యార్థుల తల్లిదండ్రులు అభ్యంతర వ్యక్తం చేశారు. ఎక్కువమంది తాము రోజువారీ కష్టపడితే తప్ప కుటుంబవసరాలు తీర్చుకోలేని దుస్థితిలో ఉన్నారని, అటువంటప్పుడు మూడు కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చి కడతారని ఆరోపణలు చేస్తున్న వారిని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నించారు. నిరుద్యోగుల భవిష్యత్తును ఫణంగా పెట్టి రాజకీయ నాయకులు ఆరోపణలు- ప్రత్యారోపణలు చేసుకోవడం తగదని ఆవేదన చెందారు.
ఒకవేళ న్యాయస్థానం ఆదేశించినట్లు పరీక్ష పత్రాలు పునర్ మూల్యాంకనం చేసిన తర్వాత కూడా పరీక్షలు రద్దు కావన్న హామీ ఏమిటని తల్లిదండ్రులు నిలదీశారు.
సెప్టెంబర్ 16వ తేదీ ఇచ్చిన ఆదేశాలలో జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ అనుకొన్న సమయానికి పరీక్ష పత్రాలు పునర్ మూల్యాంకనం చేయలేకపోతే, ఎనిమిది నెలల్లో గ్రూప్-1 పరీక్షలను మళ్లీ నిర్వహించాలని ఆదేశించారు.
జస్టిస్ రాజేశ్వరరావు బెంచ్ ఇచ్చిన ఆదేశాలను సెప్టెంబర్ 24న డివిజన్ బెంచ్ రద్దు చేసింది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.