
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్(మార్క్సిస్ట్-లెనినిస్ట్), సీపీఎన్- యూఎంఎల్ కూటమి ప్రభుత్వం 26 సామాజిక మాధ్యమాలపై నిషేధం విధిస్తూ 2025 సెప్టెంబర్ 4న నేపాల్‌లో ఆదేశాలను జారీ చేసింది. ఈ ఆదేశాలు 12- 25 ఏళ్ల మధ్య నేపాల్ జెన్- జీ యువకుల నిరసనకు కారణమైంది. ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, సెప్టెంబర్ 8న వేలాదిమంది యువత శాంతియుత నిరసనకు దిగారు. నిరసనకారులపై మిలిటరీ, పోలీసులు కాల్పులు జరపారి. ఈ ఘటలో 19 మంది మరణించారు, 191 మంది గాయపడ్డారు. రెండు రోజులలో 72 మంది మరణించగా, మొత్తం 2,113 మంది గాయపడ్డారు. ఈ కాల్పుల మరణాలు నేపాల్ రాజధాని ఖాట్మండును మంటల్లోకి తోసేశాయి.
పార్లమెంటును, సుప్రీంకోర్టును, ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ ఇంటిని, అనేకమంది మంత్రుల ఇండ్లకు నిరసనకారులు నిప్పుపెట్టారు. ఆర్థికమంత్రిని తన్నుతూ కింద పడేసి తరిమారు. మాజీ ప్రధానమంత్రి భార్య విదేశాంగ మంత్రిని తీవ్రంగా కొట్టారు. ఇంట్లో వేసి కాల్చారు. ఆ హింసకు ప్రాణాలు వదిలింది. అధికార దర్పంతో దౌర్జన్యంతో నియంతృత్వానికి చిహ్నంగా ఉన్న ప్రతి కార్యాలయాన్ని కాల్చారు. గత 20 ఏళ్లుగా ప్రజలంటే లెక్క లేకుండా పాలించిన పాలకుల గుండెల్లో యువకులు భయాన్ని సృష్టించారు.
“జెన్ జీ” యువత అగ్రహానికి మూల కారణాలేమిటి?
“జెన్ జీ” వేలాదిమంది నేపాల్ యువకుల హింసాత్మక నిరసనల వెనుక పాలక పార్టీల అంతులేని అవినీతి ప్రధానంగా ఉంది. సుదీర్ఘ రాజకీయ అస్థిరత. అనైతిక రాజకీయ పొత్తులతో పదేళ్లలో తొమ్మిది ప్రభుత్వాలు మారాయి. నేపాల్ సమాజం తీవ్ర అసమానతలతో వర్గాలుగా చీలింది. ఫలితంగా ప్రతి ఏటా వేలాది మంది నేపాల్ యువకులు పొట్ట చేత పట్టుకుని ఇతర దేశాలకు వలస పోతున్నారు. ఇవన్నీ జెన్ జీ అంతులేని అగ్రహానికి కారణాలు.
రాచరికంను కూల్చిన నేపాల్‌లో ఏ ప్రభుత్వం పూర్తిగా ఐదేళ్లు కొనసాగలేదు. ఈ ప్రభుత్వాలన్నీ ప్రజల ఆకాంక్షలను పాతరేశాయి. ఎన్ని సామాజిక విప్లవాలు సంభవించినా ప్రజల జీవితాలలో మార్పు రాలేదు. పైగా సంపన్నులకు పేదలకు మధ్య అంతులేని అగాధం ఏర్పడింది. గ్రామాలకు, పట్టణాలకు చదువుకున్న వారికి చదువులేని వారికి మధ్య అసమానతలలోతు పెరుగుతూ పోయింది.
ఈ అసమానతలన్నీ ఒకే కాలంలో పుట్టిన వేలాదిమంది నేపాలి యువకుల వ్యక్తిగత సమిష్టి జీవితాల్లో దీర్ఘకాలంగా తీవ్రమైన సంఘర్షణకు కారణమైంది. అది అగ్నిపర్వతంలా ఒక అదును కోసం చూస్తున్న సందర్భంలో ప్రధానమంత్రి కేపి శర్మ ఓలీ సోషల్ మీడియా మీద నిషేధం విధించారు. అంతులేని అసమానతలను ఎదుర్కొంటున్న జెన్ జీ ఆటంబాంబుకు ఈ చర్య అగ్ని కణంలా అంటుకొని బద్దలైంది.
నేపాల్ మొత్తం నిరుద్యోగం 2022- 23లో 12.5%. 25- 44 వయస్సు వాళ్లలో 11.5% నుంచి 22.7%కు నిరుద్యోగం పెరిగింది. 45- 64 మధ్య వయసుగల వాళ్లలో 7.5% నిరుద్యోగం ఉంది. ఈ అసమానతలు నేపాల్ సమాజాన్ని అనేక కోణాలలో చీల్చి వేశాయి. 17.2% కుటుంబాలు తీవ్రమైన దారిద్రంలో నిరుద్యోగంలో మునిగిపోయాయి.
విద్య భయంకరమైన అసమానతలను పెంచింది. పాఠశాల విద్య చదువుకున్న వాళ్లలో 18.1%, డిగ్రీ చదువుకున్న వాళ్ళలో 6.3% నిరుద్యోగులు. భూ భౌగోళిక ప్రాంతాల మధ్య అసమానతలు కూడా తీవ్రంగా పెరిగాయి. కాట్మండు వ్యాలీలో 7.6% ఉంటే, అనేక గ్రామీణ ప్రాంతాల్లో 20% నిరుద్యోగం అలుముకుంది.
మరికొన్ని లెక్కలు నిరుద్యోగం 25% చేరిందని పేర్కొంటున్నాయి. శ్రమ తీవ్రమైన ప్రజాసమూహాలలో, అట్టడుగు పేదలు, గ్రామీణులు, అతి తక్కువ చదువుకున్నవాళ్లే. వీరెవ్వరికీ శ్రామిక మార్కెట్లో తగినంత పని దొరకడం లేదు. అత్యంత వెనుకబడ్డ వర్గాల తీవ్రమైన అసమానతలు బతుకు తెరువు కోసం విదేశాలకు వెళ్లాల్సి వచ్చింది. దీంతో ప్రతి నలుగురి మగవాళ్లలో ఒక్కరు నేపాల్ కుటుంబాల్లో లేకుండా విదేశాలకు వెళ్లారు. అత్యంత ప్రధాన భాగం నేపాల్ జనం విదేశాల్లో బతుకుతుంది. 1995- 96లో 13.6% ఉన్న కుటుంబాల్లో ఆడవాళ్ళ సంఖ్య 2022- 23లో 37.1%కు ఎగబాకింది. అంటే ఈ కుటుంబాల్లో మగవాళ్ళు విదేశాల్లో శ్రమిస్తే తప్ప బతకని పరిస్థితికి నేపాల్ చేరుకుంది. ఈ అసమానతలన్నీ యువత నెత్తిపై భరించలేని భారాన్ని మోపాయి.
యువ శ్రామికుల దేశంగా నేపాల్..
గ్రామీణ నేపాల్‌లో 20% యువకులు ఇళ్లలో కనపడరు. అదే కాట్మండు లోయలో 8.7%గా ఉంది. 15- 29 ఏండ్ల మధ్య యువకుల్లో 56% వారి ఇండ్లలో లేరు. అంటే వీరంతా ఊరు దాటితే తప్ప బతకలేని దుస్థితి నేపాల్‌లో నెలకొంది. పై వయస్సు యువకుల్లో ఘోరమైన అసమానతలు నిరుద్యోగం తాండవిస్తోంది. ఇలా విదేశాల్లో పనికి వెళ్లి కష్టపడి శ్రమిస్తున్న వాళ్లు పంపుతున్న డబ్బుల చెల్లింపులే నేపాల్‌లో మూడో వంతు ప్రజలకు జీవనాధారంగా మారింది.
నేపాల్‌కు పంపుతున్న విదేశీ డబ్బు చెల్లింపులు 1995- 96లో 23.4% ఉండగా 2022-23లో 76.8%కు ఎగబాకాయి. విదేశీ చెల్లింపులు ఆ దేశ మొత్తం ఆదాయంలో 33%. అంటే ఇతర దేశాల్లో పనిచేస్తే తప్ప బతకని పరాధీనస్థితి. నేపాల్‌కు పంపబడుతున్న డబ్బు చెల్లింపులన్నీ విదేశాలలో రెక్కలు ముక్కలు చేసుకుని రక్తాన్ని చెమటగా మార్చిన నేపాల్ యువ బిడ్డలవే. అది కూడా ముఖ్యంగా నూనుగు మీసాల యువకులవి.
దేశంలోని ఈ అసమానతల, ప్రజల జీవన ప్రమాణం మీద గత 20 ఏళ్లుగా నేపాల్‌ను పరిపాలిస్తున్న ఏ పాలక పెద్దలు పట్టించుకోలేదు. పైగా ప్రజల సొమ్ముతో పాలక పెద్దల కుటుంబాలన్నీ విలాసాల్లో మునిగిపోయాయి.
2022- 23లో పంపబడ్డ 50 శాతం డబ్బంతా విదేశాలదే. భారత్ నుంచి 20%, మిగతాది ఆంతరంగిక వలసల నుంచి వస్తున్నది. 1995- 96లో 44.7% నేపాల్ దేశం లోపలి నుంచి వస్తున్నది కాగా, 33% భారత్ నుంచి పంపిస్తున్న చెల్లింపులు.
కాలానుగుణంగా ఈ వలసల స్వభావం భారత్‌ను దాటి, మరింత మంచి భవిష్యత్తు కొరకు ఇతర దేశాలకు చేరింది. ఒక అతిపెద్ద భూభాగమైన యువ నేపాల్ అనేక దేశాలకు కదిలిపోయింది. కానీ సుదీర్ఘకాలం ఈ భయంకరమైన వలసల క్రమాన్ని నివారించడంలో గత రెండు దశాబ్దాల రాజకీయ వ్యవస్థ ఘోరంగా విఫలమైంది.
నేడు నేపాల్ యువ వలసల శాతం ఎలా ఉందంటే, ఖతార్ 10%, సౌదీ అరేబియా 9%, మలేషియా 8.6%, యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ 7.1%గా నమోదైంది. పై దేశాలలో వీరంతా కఠిన శ్రమ చేసే శ్రామికులే. విదేశాల్లో శ్రమిస్తే తప్ప బతకలేరు. నేపాల్లోనేమో కూలి దొరకదు.
నేపాల్‌కు పంపుతున్న విదేశీ వ్యక్తిగత డబ్బు చెల్లింపులు 1% నుంచి నేపాల్ జీడీపీలో 1990 నుంచి 2024 వరకు 33%కు ఎగబాకాయి. ఆ దేశ శ్రామికులు విదేశాల్లో శ్రమించగా పంపబడ్డ, విదేశీ చెల్లింపుల డబ్బుతో బతుకుతున్న, ప్రపంచంలోనే అతిపెద్ద నాలుగో దేశంగా నేపాల్ మారింది.
నవ యువతరంలో నెలకొన్న ఈ భయంకరమైన ఆర్థిక అసమానతల నేపాల్ నిజ జీవితాల గణాంకాల భౌతిక నిర్దిష్ట దుస్థితే, అదును చూసుకొని విధ్వంసకర హింసకు పాల్పడేలా పురిగొల్పి రోడ్లపైకి తరిమింది.
అంతేకాకుండా, తీవ్ర ఆర్థిక అసమానతలతో బతుకులు విధ్వంసమై, తమ కళ్ళముందే సమాధవుతున్న ప్రజలు ఒకవైపు. నేపాల్ శ్రామికుల రక్తం చిందించిన సొమ్ముతో విదేశాలలో, స్వదేశంలో సుఖాలను అనుభవిస్తున్న బడా రాజకీయ పెద్దలు, వారి పిల్లలు మరోవైపు. విభిన్న సంఘర్షణాత్మక వైరుధ్యాల మధ్య యువతలో నిద్రాణమైన అగ్నిపర్వతం అత్యంత హింసాత్మకంగా బద్దలైంది. దేశ పార్లమెంటు, సుప్రీంకోర్టు, ఐదు నక్షత్రాల హిల్టన్ హోటల్, ప్రధానమంత్రి, మంత్రుల ఇండ్లు అగ్ని కీలల్లో ఆహుతి అయ్యాయి.
నేపాల్ పీఎం కేపీ ఓలీ కుటుంబం ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని సైనిక దేవుళ్ళారా బతికించండని పారిపోయారు. నిరసనకారులు వీరి ఇంటిని కాల్చివేశారు. మరో మాజీ ప్రధానమంత్రి కనాల్ను, నేటి విదేశాంగ మంత్రి భార్యను చితక బాదారు. ఇంటితో పాటు ఆయన భార్యకు నిప్పు పెట్టగా ఆ హింస భరించలేక మరణించింది. ఆ దేశ ఆర్థికమంత్రిని యువత తరిమితరిమి కిందపడేసి కొట్టింది. ఆదేశ యువత ఆకాంక్షలకు భిన్నంగా తీర్పునిచ్చిన నేపాల్ సుప్రీంకోర్టును అగ్నికీలల్లో కాల్చివేశారు. అంతా సద్దుమణిగిన తర్వాత కొత్త ప్రధానిని ఎన్నుకున్నారు.
ఇలాంటి సారూప్యతలే బంగ్లాదేశ్ విద్యార్థుల ఆందోళనల్లో, శ్రీలంక యువత ఆందోళనలో కనిపిస్తాయి.
రాజ్య వ్యవస్థల్లో పేరుకుపోయిన, నియంతృత్వం, దౌర్జన్యం, సుదీర్ఘ ఉక్కు పాదాల అణిచివేతపై ఆగ్రహం ఏ విధంగా కట్టలు తెంచుకుందో ఈ పరిణామాలు ప్రపంచానికి వివరంగా చెపుతాయి. కాబట్టి ప్రజల చేత ఎన్నుకోబడిన పాలకులు తమ కోసం కాకుండా ప్రజల కోసం పనిచేయాలి. వ్యవస్థలను, సంస్థలను ధ్వంసం చేయకుండా ప్రజాపాలనను అందించాలి. ఇలా చేయకపోతే, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్‌లాంటి పరిణామాలనే ఎదుర్కోవాల్సి ఉంటుంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.