
గడిచిన దశాబ్ద కాలంలో న్యూఢిల్లీ- ఖాట్మాండుల మధ్య భారత్- చైనా సరిహద్దులో ఉన్న లిపులేఖ్ పాస్ వివాదానికి తెరలేపింది.
న్యూఢిల్లీ: సరిహద్దులోని మూడు పాయింట్ల ద్వారా వాణిజ్యాన్ని పునరుద్ధరించాలని భారత్- చైనా నిర్ణయించాయి. ఇరు దేశాలు సరిహద్దు వాణిజ్యాన్ని అంగీకరించిన ఒక రోజు తర్వాత, నేపాల్ స్పందిస్తూ అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ఈ మూడు పాయింట్లు తమ దేశ “అంతర్ భాగమ”ని పేర్కొన్నది. నేపాల్ అభ్యంతరాన్ని భారత్ గట్టిగా కొట్టిపారేస్తూ, “ఈ అభ్యంతరాలు న్యాయబద్దంగా లేవు. పైగా అవి చారిత్రక వాస్తవాలు- సాక్ష్యాల ఆధారమైనవి కావు” అని స్పష్టం చేసింది.
ఆగస్టు 19న చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యి, జాతీయ భద్రతా సలహాదారులు అజీత్దోవల్, విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ చర్చలు జరిపారు. ఈ సమావేశంలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలను ఉభయ దేశాలు విడుదల చేశాయి.
ఆ నిర్ణయాలలో ఒకటైన, మూడు పాయింట్ల ద్వారా సరిహద్దు వాణిజ్యాన్ని పునఃప్రారంభించాలన్నదాన్ని ఆసియా దిగ్గజాలు అంగీకరించాయి. ఆ మూడు పాయింట్ల పేర్లు: లిపులేఖ్, షిక్పిలా పాస్, నథు లా పాస్.
ఈ నిర్ణయాన్ని ప్రకటించిన ఒక రోజు తర్వాత, నేపాల్ విదేశాంగ శాఖ స్పందించి, ఒక ప్రకటనను విడుదల చేసింది. అందులో మహాకాళి నదికి తూర్పున ఉన్న ఈ మూడు పాస్‌లు తమ దేశంలో అంతర్భాగమని, ఇందుకు సంబంధించిన అధికార మ్యాప్‌లు, రాజ్యాంగంలో కూడా పొందుపర్చడమైందని తెలియజేసింది. అంతేకాకుండా, ఈ మార్గాన రోడ్డు నిర్మాణం, విస్తరణ, సరిహద్దు వాణిజ్యం వంటి ఎలాంటి కార్యకలాపాలను చేపట్టరాదని భారత్‌ను తరుచుగా కోరడం జరుగుతుందని ఆ ప్రకటనలో చెప్పుకొచ్చింది. ఇదే విషయాన్ని చైనాకు కూడా చెప్పినట్లు నేపాల్ పేర్కొంటున్నది.
భారత్- నేపాల్‌ల మధ్య సరిహద్దు సమస్యను చారిత్రక ఒప్పందాలు, అంగీకారాలు, మ్యాప్‌లు, సాక్ష్యాల ఆధారంగా దౌత్యపరమైన చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు నేపాల్ చిత్తశుద్దితో ఉందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది.
ఇంకా ప్రకటనలో, రెండు పొరుగు దేశాల మధ్య స్నేహాపూర్వక సంబంధాల కొనసాగింపు ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది.
వచ్చేనెలలో నేపాల్ ప్రధాన మంత్రి కృష్ణ ప్రసాద్ ఓలి భారత్ పర్యాటనకు రానున్నారు. ఇరుదేశాలు ఈ పర్యటనకు సిద్ధమవుతోన్న తరుణంలో, నేపాల్ అభ్యంతరాలను వ్యక్తం చేయడం వల్ల ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలలో మార్పులు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
న్యూఢిల్లీ స్పందన..
ఖాట్మాండు వ్యాఖ్యాలపై భాతర విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందించారు.
లిపులేఖ్ పాస్‌పై న్యూఢిల్లీ తన వైఖరిని నిరంతరం స్పష్టం చేస్తూ వస్తుందని ఆయన పేర్కొన్నారు. లిపులేఖ్ పాస్ ద్వారా సరిహద్దు వాణిజ్యం 1954లో ప్రారంభమై, కొన్ని దశాబ్దాల పాటు కొనసాగిందని, ఆ తర్వాత కొన్ని కారణాలు, కోవిడ్- 19 వల్ల అంతరాయం ఏర్పడిందని చెప్పారు. దానికి తోడు భారత్- చైనాల మధ్య తూర్పు లద్దాక్‌లో సైనికుల మధ్య ఘర్షణ కారణంగా నాలుగు సంవత్సరాలుగా ఏర్పడిన స్తబ్ధత 2024 అక్టోబరులో ముగిసిందని జైస్వాల్ వివరించారు. సరిహద్దు వాణిజ్యాన్ని తిరిగి పునరుద్ధరించాలని ప్రస్తుతం ఇరు పక్షాలు నిర్ణయించాయని ఆయన తెలియజేశారు.
నేపాల్ అంగీకరించిన సరిహద్దు సమస్యలపై దౌత్యపరంగా, నిర్మాణాత్మకమైన చర్చల ద్వారా పరిష్కారానికి భారత్ సిద్ధంగా ఉందని రణధీర్ జైస్వాల్ చెప్పుకొచ్చారు.
లిపులేఖ్, మ్యాపులు- నిరసనలు..
భారత్ చైనా సరిహద్దులో ఉన్న లిపులేఖ్ పాస్ గత దశాబ్ద కాలంగా ఢిల్లీ- ఖాట్మాండుల మధ్య వివాదాస్పదంగా మారింది.
భారత ప్రధాని నరేంద్ర మోదీ బీజింగ్ పర్యాటనలో, లిపులేఖ్ పాస్ మార్గాన సరిహద్దు వాణిజ్యాన్ని విస్తరించాలని ఇరుదేశాలు అంగీకరించాయి. దీంతో నేపాల్ మొదటిసారిగా 2015లో తీవ్ర అభ్యంతరాన్ని తెలియచేసింది. ఈ భూభాగం తమదేనని వాదిస్తూ వస్తోంది. ఈ విషయంలో తమను ఏమాత్రం సంప్రదించకపోవడంపై నిరసన వ్యక్తం చేసింది.
2019 నవంబర్‌లో జమ్మూ కశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా భారతదేశం విభజించి, కొత్త మ్యాప్‌ను విడుదల చేసింది. ఈ రాజకీయ మ్యాప్‌లో కాలాపానీ, లిపులేఖ్ తమ భూభాగంలో భాగమని భారత దేశం చూపించింది. దీని మీద తన నిరసనను నేపాల్ వ్యక్తం చేసింది.
అంతేకాకుండా, లిపులేఖ్ మీదుగా కైలాస- మానస సరోవరం మధ్యన 2020 మేలో రోడ్డు మార్గాన్ని భారత్ ప్రారంభించింది. అప్పుడు కూడా నేపాల్ తన ఆగ్రహాన్ని తెలియజేస్తూ, ఇది ఏకపక్ష చర్య అని పేర్కొంది. లిపులేఖ్, కాలాపాని ప్రాంతాలు తమ భూబాగంలో భాగమేనని తెలియజేస్తూ, సరిచేసిన మ్యాప్‌ను ఆ సమయంలో ప్రధాన మంత్రిగా ఉన్న ఓలి లింపియదూరి విడుదల చేశారు. ఇలా కొత్త మ్యాప్‌ను నేపాల్ పార్లమెంటు ఆమోదించి ఆ తర్వాత రాజ్యాంగంలో పొందుపర్చింది.
ఈ కొత్త రాజకీయ మ్యాప్ న్యాయబద్ధం కాదని, దీన్ని ఏ మాత్రం అంగీకరించబోమని భారతదేశం ప్రకటించింది.
ఇటీవల కాలంలో చైనా వ్యవహారశైలి వల్ల కూడా ఈ అంశం నేపాల్‌కు జఠిలంగా మారింది. లిపులేఖ్ ద్వారా బారత్‌తో వాణిజ్య ఏర్పాట్లుకు చైనా మద్దతు తెలిపింది. అంతేకాకుండా , ఈ ప్రాంతం భారత భూభాగంలోనే ఉందని పేర్కొంటూ, చైనా 2023లో ఒక మ్యాప్‌ను విడుదల చేసింది. దీనిపై స్పందించిన నేపాల్ తమ సొంత మ్యాప్‌ను ముందు గౌరవించుకోవాలని చైనాకు హితవు పలికింది.
అనువాదం: ఘంటా రాజు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.