కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతోందనగానే తమకు వచ్చే నిధులు, రాయితీలు, వెసులుబాట్ల కోసం అన్ని రాష్ట్రాలు ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు, వెసులుబాట్లు రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేసే సాధనంగా ఉండే పరిస్థితులయితే కనిపించడం లేదు.
నానాటికి పెరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వాల అప్పులను గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది.
తమ రోజువారి అవసరాలను తీర్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులపై ఆధారపడాల్సి రావటమే తాజా ధోరణిగా ఉన్నది.
2024-25 సంవత్సరానికి తమిళనాడు ప్రభుత్వానికి వచ్చిన ఆదాయంలో 35 శాతం అప్పులే.
అదేవిధంగా మహారాష్ట్రకు వచ్చిన ఆదాయంలో 26% అప్పులు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ మోతాదులో అప్పులు ఉండటమనేనది, పదేళ్ల క్రితం ఊహించుకోవడానికి కూడా అసాధ్యం.
కోవిడ్ తర్వాత మారిన పరిస్థితి
కోవిడ్ సమయంలో ఆర్థిక వ్యవస్థ విపరీతంగా దెబ్బ తినటంతో రాష్ట్ర ప్రభుత్వాల అప్పులు 2020-21 నుంచి క్రమంగా పెరుగుతూ వచ్చాయి.
కోవిడ్ వైపరీత్యం రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాలకు పెట్టిన గండిని పూడ్చటానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు అరకొరగానే మిగిలిపోయాయి.
అప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వాల అప్పులు తగ్గుముఖం పట్టే స్థితిలో లేవు.
పైగా రాష్ట్ర ప్రభుత్వాలు నానాటికి రాష్ట్ర అభివృద్ధి రుణాల పేరుతో అప్పులు చేస్తూనే ఉన్నాయి.
నేరుగా రాష్ట్ర ప్రభుత్వాలే కాకుండా, లాభదాయకంగా నడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు స్పెషల్ పర్పస్ వెహికల్లాంటి అనేక మార్గాలలో సేకరించే అప్పులు చివరకు రాష్ట్రాల రోజువారి అవసరాలు తీర్చుకోవడానికి ఖర్చయిపోతున్నాయి.
ఆర్థిక సంఘం సిఫార్సులను నిర్వీర్యం చేస్తున్న కేంద్రం
15వ ఆర్థిక సంఘం కేంద్రానికి వచ్చే ఆదాయాలలో 41 శాతం రాష్ట్రాలకు పంచాలని నిర్ణయించిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వాలు రుణ భారాన్ని తప్పించుకోలేకపోతున్నాయి.
కానీ కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే పన్నులలో గణనీయమైన భాగం సెస్సులు, సర్ చార్జీల రూపంలోకి మారడంతో రాష్ట్రాలకు వచ్చే నికర ఆదాయం తగ్గిపోతూ వచ్చింది.
ఈ సెస్సులు సబ్ చార్జీలు కూడా రాష్ట్రాలకు పంపిణీ చేయాలని ఆర్థిక సంఘం సిఫార్సు చేయకపోవటమే దీనికి ప్రధాన కారణం.
పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలలో పరోక్ష పన్నులు గణనీయంగా ఉంటాయి. అటువంటి రాష్ట్రాలకు కేంద్రం అనుసరిస్తున్న ఈ వైఖరి మరింత నష్టదాయకంగా మారింది.
జీఎస్టీతో పెను మార్పులు
2017లో జీఎస్టీ అమలు మొదలైన తర్వాత మొత్తం ఆదాయం కేంద్రానికి చేరి ఆ తర్వాతనే కేంద్రం చేతుల మీదుగా రాష్ట్రాలకు తిరిగి వస్తుంది.
ఈ మొత్తం కసరత్తులో పన్నులు వసూలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కృషికి తగ్గ ప్రతిఫలం లేదు.
దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు జరిపే సంక్షేమ పథకాల కోసం కూడా అప్పులపై ఆధారపడాల్సి వస్తోంది.
ఆర్థిక వ్యవస్థను లేదా ఆర్థిక అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడానికి కావలసిన మౌలిక వనరుల కొరతను అన్ని రాష్ట్రాలు ఎదుర్కొంటున్నాయి.
ప్రభుత్వాలు పెట్టే పెట్టుబడులు కుదించుకుపోవడంతో ప్రైవేటు పెట్టుబడులు కూడా వెనుకంజ వేస్తున్నాయి. ఈ కాలంలో కేంద్రం నుంచి వచ్చిన నిధులల్లో కొద్దిపాటి పెరుగుదల మాత్రమే ఉన్నది.
కేంద్ర వైఖరితో కుదించుకుపోతున్న రాష్ట్రాల స్వయంప్రతిపత్తి
కుదించుకుపోతున్న రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక స్వయంప్రతిపత్తిని ఈ పరిణామాలన్నీ ముందుకు తెస్తున్నాయి. భారత సమాఖ్య వ్యవస్థ ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాలను అధిగమించేందుకు అప్పులే ప్రధాన సాధనం- మార్గమైతే ఆర్థిక సంతులత మరింత ప్రమాదానికి లోనవుతుంది. అందువల్ల దేశానికి ఇపుడు కావాల్సింది కేంద్రం అధిక నిధులను రాష్ట్రాలకు బదిలీ చేయడం. అది కూడా సమాంతరంగా బదిలీ చేయడం.
ఏ రాష్ట్రం నుంచి ఎంత మోతాదులో పన్నులు వసూలవుతున్నాయి, ఏ రాష్ట్రం తన ఆర్థిక వనరులను ఎంత సమర్థవంతంగా ప్రయోజనకరంగా ఖర్చు పెడుతున్నదనే ప్రమాణాల ఆధారంగా నిధుల బదిలీ జరిగే విధానానికి దేశం మళ్ళాలి. సెస్సులు, సర్ చార్జీలలో కూడా రాష్ట్రాలకు వాటా ఉండాలి.
గత ఐదేళ్లలో పంజాబ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల ఆదాయవ్యయాలు పరిశీలిస్తే ఈ ధోరణి స్పష్టంగా కనిపిస్తుంది. పశ్చిమ బెంగాల్ ఆర్థిక వ్యవస్థ మనుగడ కొనసాగాలంటే, కేంద్రం ఇచ్చే నిధులే కీలకం.
గత ఐదేళ్లలో సగటున రాష్ట్రానికి ఉన్న అవసరాలలో పన్నుల వాటా ద్వారా సమకూర్చుకోగలుగుతుంది- 47.7% మాత్రమే. ఈ కాలంలో అన్ని రాష్ట్రాల్లో సగటు రాష్ట్ర అభివృద్ధి రుణాల పేరుతో సేకరిస్తున్న రుణాలు కనీసం 35 శాతం వరకూ ఉంటున్నాయి.
అనువాదం: కొండూరి వీరయ్య
(ది హిందూ సంపాదకీయం సౌజన్యంతో ది వైర్ తెలుగు పాఠకులకు ఈ వ్యాసాన్ని అందిస్తున్నాము.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
