2023లో నమోదయిన నేరాల నివేదికను నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో విడుదల చేసింది. ప్రతి సంవత్సరంలానే జరుగుతున్న నేరాల ఆధారంగా సమాజం పట్ల అవగాహన కన్నా; కేసు నమోదు చేస్తున్న పోలీసులకు ఏ చట్టాలు ఇష్టమో ఏవి లేవో, అసలు ఏ నేరాలు పోలీసు స్టేషన్లో నమోదవ్వడం లేదో ఈ నివేదిక తెలియజేస్తుంది.
ఉదాహరణకు, గృహహింసకు సంబంధించి ఐపీసీ 498ఏ, గృహ హింసా నిరోధక చట్టాలు ఉన్నాయి. గృహ హింస ఒక సామాజిక సమస్యని, దానికి ఐపీసీలోని ఒక సెక్షన్ సరిపోదని ప్రజా పోరాటాలను నిర్వహించారు. దీని పర్యావసానంగా గృహహింస నిరోధక చట్టం వచ్చింది. ఈ చట్టం మీద దేశంలోని అన్ని ఎన్జీఓలు, ఆయా రాష్ట్రాలలోని ప్రతి జిల్లాలో ఉండే సఖి సెంటర్లు అవగాహన కార్యక్రమాలను అదే పనిగా నిర్వహిస్తున్నాయి. అంతేకాకుండా మహిళా శిశు సంక్షేమ శాఖ వారు కూడా ప్రచారం చేస్తూనే ఉంటారు.
ప్రతీ సంవత్సరంలో 498ఏ కేసులు ఎక్కువ, గృహ హింస నిరోధక చట్టం కింద తక్కువ కేసులు నమోదవుతున్నాయి. 2022 నుంచి మాత్రం ఈ చట్టాన్ని తెలంగాణ పోలీసులు పూర్తిగా అటకెక్కించేశారు. 2023లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఈ చట్టం కింద ఒక్క కేసు కూడా నమోదవ్వలేదు. కానీ 498ఏ క్రింద రెండు రాష్ట్రాలలోను 10వేలకుపైగా కేసులు నమోదయ్యాయి.
అలాగే వరకట్న మరణాలకు సంబంధించిన కేసులు(ఐపీసీ 304B) ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 95 నమోదయితే, తెలంగాణలో 145 నమోదయ్యాయి. అయితే, వరకట్న నిషేధ చట్టం కింద ఆంధ్రప్రదేశ్‌లో 353, తెలంగాణలో కేవలం 4 కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో నమోదయిన 353లో 344 కేసులు పశ్చిమగోదావరి జిల్లాలోనే నమోదయ్యాయి. అన్నమయ్య జిల్లాలో 8, కాకినాడలో 1 నమోదయ్యాయి. తెలంగాణలోని వరంగల్ కమిషనరేట్ పరిధిలో 4 కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలోని ములుగు జిల్లాలో తప్ప, రెండు రాష్ట్రాలలోని అన్ని జిల్లాలలో వరకట్న మరణాల కేసులు నమోదయ్యాయి. అంటే తెలుగు రాష్ట్రాలలో వరకట్న సమస్య సమిసిపోలేదు, ఇంకా బలంగానే ఉంది. అలాంటప్పుడు, వరకట్న నిషేధ చట్టం క్రింద కేసులు ఎందుకు నమోదవ్వడం లేదన్నది ప్రశ్న.
అలాగే వరకట్న నిషేధ చట్టం కింద 344 కేసులను పశ్చిమ గోదావరి పోలీసులు ఎలా నమోదు చేశారో కూడా తెలుసుకోవాలి. అక్కడి పోలీసులకు ఈ చట్టం అవసరం ఎవరైనా బాగా వివరించి చెప్పారా? అక్కడ ఉన్నతాధికారి ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారా? ఇంకేమైనా జరిగిందా?
మొత్తం మీద ఈ రెండు ఉదాహరణలతో సామాజిక సమస్యలను రూపుమాపడానికి రూపొందిన చట్టాల క్రింద కేసులు నమోదవ్వడం లేదని తెలుస్తుంది.
బాధితులు, అపరాధులు ఇద్దరు దళితులేనా?
ఇదే విషయం మనం ఎస్సీ/ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం విషయంలో కూడా గమనించవచ్చు.
2023లో ఆంధ్రప్రదేశ్‌లో దళితుల మీద జరిగిన నేరాలు 1966, దీంట్లో ఎస్సీ/ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం క్రింద నమోదైన కేసులు 56. తెలంగాణాలో దళితుల మీద జరిగిన నేరాలు మొత్తం 1652; అయితే ఎస్సీ/ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం క్రింద పెట్టిన కేసులు 57.
రెండు రాష్ట్రాలలోను 3% కన్నా తక్కువే నమోదయ్యాయి. అంటే 97% కేసులన్నింటిలో బాధితులు, అపరాధులు ఇద్దరు దళితులనే అర్థం చేసుకోవాలా? నంద్యాలలో దళితుల మీద జరిగిన నేరాలు 103, బాపట్లలో 154కాగా, ఇక్కడ చట్టం ఆధారంగా నమోదు చేసిన కేసులు సున్నా. మొత్తం తెలుగు రాష్ట్రాలలో అత్యధికంగా ఎస్సీ/ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం క్రింద నమోదయినవి సైబరాబాద్ కమిషనరేట్‌లో అది కూడా 17. అన్నిటికన్నా ఎక్కువ 233 నేరాలు నమోదయిన రాచకొండ కమిషనరేట్‌లో చట్టం క్రింద నమోదయినవి 9.
షెడ్యూల్ తెగల విషయంలో కూడా ఇదే విషయాన్నీ గమనించవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో ఆదివాసీల మీద జరిగిన నేరాలు 347, తెలంగాణలో 557కాగా, ఎస్సీ/ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం క్రింద నమోదయినవి ఆంధ్రప్రదేశ్‌లో 13, తెలంగాణలో 18. అంటే మొత్తం నేరాలలో 4% కన్నా తక్కువ ప్రత్యేక చట్టం క్రింద నమోదవుతున్నాయి.
ఈ గణాంకాలను పరిశీలిస్తే, ఒక సామాజిక సమస్య మీద పూర్తిస్థాయిలో రక్షణ కల్పించే ప్రత్యేక చట్టాల కన్నా, ఐపీసీ ప్రకారమే ఎక్కువ నమోదవుతున్నాయని అర్థమవుతోంది. ఈ ప్రత్యేక చట్టాల ద్వారా తెలుగు రాష్ట్రాలను అర్థం చేసుకోవాలంటే ఇక్కడ భర్తలందరు మంచి వాళ్ళు; వరకట్న పిశాచి అక్కడక్కడ మర్రిచెట్ల మీద ఉంది. కుల వివక్ష అంతరించిపోయే దశలో ఉంది. ఇది సమాజం పురోగతిలోనే ఉందనే భ్రమని కలగచేస్తూ, ఒక సామాజిక సమస్యను ఒక మామూలు నేర స్థాయికి దిగజారుస్తుంది. ఈ విషయంలో పోలీసు వారికి ప్రత్యేక సర్క్యూలర్లు విడుదల చేయాల్సిన అవసరముంది.
చార్జిషీటు దాఖలుకాని లాకప్‌డెత్‌లు..
ఎన్సీఆర్బీ నివేదికను చూస్తే మరొక విషయం అర్థమవుతుంది. అదేంటంటే, 2023 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు కస్టడీలో ఒకరు చనిపోయారు. ఈ విషయం మీద ఒక కేసు రిజిస్టర్ అయ్యింది. ఏ పోలీసు మీద కేసు రిజిస్టర్ కాలేదు, ఎటువంటి విచారణ చేపట్టలేదు. తెలంగాణలో ఒకరు చనిపోయారు, విచారణకు ఆదేశించారు. ఎవరి మీద చార్జిషీటు దాఖలవ్వలేదు, ఏ పోలీసు అరెస్టు అవ్వలేదు.
లాకప్‌డెత్ విషయంలో గుజరాత్, మహారాష్ట్ర చాల ముందున్నాయి. లాకప్‌డెత్‌ల కారణంగా చెరో 13 మంది ఈ రెండు రాష్ట్రాల్లో చనిపోయారు. దీనికి సంబంధించిన కేసులలో ఏ పోలీసు అరెస్టు కాలేదు.
ఈ విషయంలో హర్యానా రాష్ట్రాన్ని మెచ్చుకోవాలి. అక్కడ ఒకరు చనిపోతే, ఎంక్వైరీ జరిగింది, ముగ్గురు పోలీసుల మీద చార్జిషీట్ దాఖలు చేశారు. ముగ్గురు పోలీసులను అరెస్టు చేశారు. దేశం మొత్తం మీద లాకప్‌డెత్ తరువాత పోలీసులు అరెస్టయ్యిందంటే హర్యానాలో మాత్రమే.
2023లో తెలంగాణాలో మూడు ముఖ్యమైన లాకప్‌డెత్‌లు అయ్యాయి.
మొదటిది, మెదక్‌లో ఖదీర్ ఖాన్ మరణాన్ని తెలంగాణ హైకోర్టు సుమోటోగా తీసుకుంది. రెండవది, గచ్చిబౌలి పోలిసుస్టేషన్లో బీహార్ నుంచి వలస వచ్చిన నితీష్ కుమార్ అనే వ్యక్తి మరణించాడు. ఈ విషయంపై వచ్చిన వార్త కథనాలను జోడిస్తూ లాయర్ రాపోలు భాస్కర్, తెలంగాణ హై కోర్టు ప్రధాన న్యాయమూర్తికి పంపగా; ఆ లేఖను ఒక ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంగా మారుస్తూ హైకోర్టు ఉత్తరువులను జారీ చేసింది. మూడవది, హైదరాబాద్‌లోని తుకారాంగేట్ పోలీసు స్టేషన్లో చిరంజీవి అనే వ్యక్తి మరణిస్తే, తెలంగాణ హైకోర్టు ఆ విషయాన్ని సుమోటోగా స్వీకరించింది.
మానవ హక్కుల వేదిక ఈ మూడు సంఘటనలలోను నిజనిర్ధారణ చేసింది. ఈ మూడు సంఘటనలు హైకోర్టు దాకా వెళ్లాయి. కానీ ఎన్సీఆర్బీ నివేదికలో తెలంగాణాలో ఒకటే లాకప్‌డెత్ జరిగినట్టుగా పేర్కొన్నారు. ఇప్పుడు ఎన్సీఆర్బీ నివేదికను నమ్మాలా వద్దానే విషయం పోలీసులే చెప్పాలి.
బయటకురాని ఎస్సీఆర్బీ నివేదికలు..
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో జాతీయస్థాయిలో సమాచారాన్ని సేకరిస్తే, రాష్ట్రీయ స్థాయిలో ఎస్సీఆర్బీ- స్టేట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఉంటుంది. ఎన్సీఆర్బీ నివేదికల బయటకు వస్తాయి కానీ, ఎస్సీఆర్బీ నివేదికలు మాత్రం బయటకు రావు.
కొద్దికాలం క్రితం డిస్ట్రిక్ట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గురించి వార్తా పత్రికలలో వచ్చింది. కానీ, అది ఏమైందో తెలియదు. పోలీసు స్టేషన్లన్నీ కంప్యూటరీకరణయిన నేపథ్యంలో ఏ ప్రాంతంలో ఏఏ నేరాలు జరుగుతున్నాయనే సమాచారం ఎప్పటికప్పుడు తెలియజేసే వ్యవస్థ తయారు చేయడమంత కష్టమేమి కాదు. ఇలా తప్పుడు తడకల సమాచారం సంవత్సరానికి ఒకసారి పంపి, దాన్ని కేంద్రస్థాయిలో ఎక్సెల్ ఫార్మటులో పెట్టి(కనీసం ఫిల్టర్ పెట్టడానికి కూడా వీలు కాని ఒక ఫార్మటు తయారు చేసి పెట్టారు), రెండేళ్ల తర్వాత విడుదల చేయాల్సిన పరిస్థితి ఈ కాలంలో అవసరం లేదు.
సరిగా పని చేస్తే ఈ నేరాల లెక్కలు పురోగతికి బాగా ఉపయోగపడతాయి. దానికి సమాచారం ఖచ్చితంగా ఉండాలి, కేసులు సరిగ్గా నమోదు కావాలి.
ఈ రెండు పనులు జరగనప్పుడు, ఒక భ్రమలో ఉండిపోతాం. వాస్తవానికి దూరంగా ఒక బంగారు లోకంలో ఉన్నట్టు భ్రమ బాగుంటుంది. సాధారణంగా ఇలాంటి మంచి సమాజం కలలు గురించి కవులు రాస్తూ ఉంటారు కాబట్టి, పోలీసులు రాయకుండా ఉంటేనే మంచింది.
(వ్యాస రచయిత మానవ హక్కుల వేదిక(హెచ్ఆర్ఎఫ్) సభ్యులు)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
