భారతీయ జనతా పార్టీ తన ఫార్ములాను దేశవ్యాప్తంగా విస్తరింపజేస్తూ ఉన్నది. దక్షిణాదిన తెలంగాణ ప్రధాన స్థానం.
ఇక్కడ మాత్రం ఈ రోజు వరకు ఆ పార్టీ భావవైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్నది. తెలంగాణ ఉనికి, అస్తిత్వాలపై కమలనాథులకు సరైన అవగాహన లేదు.
అనే విషయం పదేపదే రుజువు చేసుకుంటున్నారు.
దేశంలోనే మిగితా రాష్ట్రాలు వేరు, తెలంగాణ వేరు.
ఇంకాస్త ఒక అడుగు ముందుకు వేసి చెప్పాలంటే, తెలుగు నేల వేరు. ఉత్తరాదిలో వాడిన పడికట్టు పదజాలం ఇక్కడ పని చేయదు.
తెలంగాణ ప్రజల భావోద్వేగాలను సమగ్రంగా బీజేపీ ఇప్పటికీ అర్థం చేసుకోవడం లేదు.
బహుశా ఆ ప్రయత్నమూ చేస్తున్నట్టుగా లేదు. స్థానిక నాయకత్వ అవగాహన లోపానికి ఇదో నిదర్శనం.
తెలంగాణ సమాజంలో కులమత ప్రభావాల అంశాలు బలీయంగా ఉన్నప్పటికీ వాస్తవిక దృక్కోణం మరింత ప్రభలంగా ఇక్కడ ఉంటుంది. దానికంటే సర్వమానవ సమానత్వ తాత్విక చింతన ఇక్కడ ఉంటుంది.
భూస్వామ్య, కులాధిపత్య, అగ్రకుల అహంకారపూరిత నీచ సంస్కృతి ప్రభలంగా తెలంగాణలో లేదు. 1980 నుంచి ఆర్ఎస్ఎస్(రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్) భావజాలం ఒకవైపు ఉన్నది.
కమ్యూనిస్టు ఆలోచనా స్రవంతి మరోవైపు బలీయంగా ఉన్నది. ఈ ఉభయధారలు తెలంగాణపై బలమైన ముద్ర వేశాయి.
ఆనాటి తెలంగాణ సమాజాన్ని కమ్యూనిస్టులు చైతన్యం చేశారు. ఇదే సందర్భంలో 1980వ దశకంలో సమాంతరంగా జాతీయత, సామాజిక అంశాలపై ఆర్ఎస్ఎస్ పనిచేసింది.
తెలంగాణను అర్థం చేసుకోవడంలో విఫలం
1952-53 “ఇడ్లీ సాంబర్ గో బ్యాక్” ఉద్యమ సందర్భంలో నేటి బీజేపీ ఆలోచనా స్రవంతుల ఉనికి అప్పుడు లేదు. ఆచరణా లేదు.
కులాధారిత సమాజంలో అగ్రకులాల పార్టీగా బీజేపీపైన బలమైన ముద్ర ఉండేది. ఇప్పుడు దానిని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నది.
అసంఖ్యాకమైన దళిత, బహుజన తెలంగాణ సమాజాన్ని అర్థం చేసుకోవడంలో ఈ పార్టీ ఇప్పటికీ విఫలమవుతూనే ఉన్నది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏర్పడగానే “తల్లి సచ్చింది, పిల్ల బతికింది” అని మోదీ అన్నారు.
ఈ మాట తెలంగాణ ప్రజల హృదయాలను ఎంతగానో గాయపరిచింది. తెలంగాణ జీవితం వీరికి అర్థం కావడం లేదని ప్రజలు సరిపెట్టుకున్నారు.
అల్లూరి సీతారామ రాజు ఉద్యమానికి, తెలంగాణ స్వరాష్ట్ర పోరాటానికి అమిత్ షా ముడి పెంటారు. పొంతన లేని చారిత్రక అంశాన్ని జోడించాలనుకున్నప్పటికీ, ఈ ప్రజలు మరోసారి అర్థం చేసుకున్నారు.
ఇప్పటి బీజేపీ నూతన రథసారథి నితిన్ నబీన్ వరకు ఈ ప్రాంతపు జీవన సారం అసలు అర్థం కావడం లేదు. ఇది తీవ్ర విషాధకారమైన విషయం.
స్థానిక బీజేపీ నాయకులకు ఈ ప్రాంతంపై సోయి ఉంటే పై వారికి అర్థం చేయిస్తారు.
అంతేకాదు, తెలంగాణ స్వభావాన్ని అర్థం చేసుకోవడంలోనే వీరికి అవగాహన లోపం ఉన్నది.

వైతాళికుల గురించి మాట్లాడట్లేదు
నాటి హైదరాబాద్ సంస్థానంలో భాగ్యరెడ్డి వర్మ సామాజిక రుగ్మతలపై వీరోచిత పోరాటం చేశారు.
ఈయనతో పాటు అరిగె రామస్వామి, టీవీ నారాయణ, సదా లక్ష్మమ్మ, జట్టి ఈశ్వరీబాయి, పట్టా రామవ్వ ఎందరో మరెందరో ఈ ప్రాంతపు కులపీడనపై తిరుగుబాటు చేశారు.
వీళ్ల గురించి ఏనాడు ఈ పార్టీ మాట్లాడలేదు. ఆ నాయకత్వానికి తెలియదు.
అంతేకాదు, తెలంగాణ మెజారిటీ ప్రజలను వెట్టిచాకిరితో హింసించిన అగ్రవర్ణాల ఊసే ఎత్తడం లేదు.
కేవలం హిందూ జాతీయవాదమని చెప్పడం వల్ల ప్రయోజనం లేదనే విషయాన్ని ఇటు స్థానిక నాయకత్వం, అటు జాతీయ నాయకత్వం గుర్తిస్తున్నట్టు లేదు. ఆ ప్రయత్నం చేస్తున్న సూచనలు కూడా లేవు.
2014 తర్వాత తెలంగాణలో మధ్య తరగతి పెరిగింది. సోషల్ మీడియా ప్రభంజనం పల్లెలను కూడా తాకింది.
ఈ రెండు అంశాలను ఆధారం చేసుకోని తాము ఓట్లు సంపాదిస్తామనే ఆలోచన బీజేపీలో ఉన్నట్టు అనిపిస్తున్నది. ఈ ఆలోచన క్షేత్రస్థాయి అంశాలకు చాలా దూరమైనది.
తనదైన ముద్ర వేయలేకపోతున్న రేవంత్
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ఒక కొత్త ప్రాజెక్టు కూడా ప్రారంభం కాలేదు. పాతవి కొనసాగడమూ లేదు.
ఒకటీ రెండు వార్షిక బడ్జెట్లను ప్రవేశపెట్టి, తాము ఇదని చెప్పుకునే ప్రయత్నం చేశారు. ద్రవ్యలోటు తక్కువగా ఉందని, రెవన్యూ వ్యయాన్ని తగ్గిస్తున్నామని లెక్కాల్లో చూపించారు.
కానీ, ఆచరణలో తమదైన ముద్రను నిర్మాణ రూపంలో ఈ ప్రభుత్వం నేటికి చూపించలేకపోతున్నది.
మూసీ రివర్ ఫ్రంట్ గురించి పదేపదే మాట్లాడినా అదీ అడుగు ముందుకు పడలేదు.
వేల కోట్ల బడ్జెట్ కేటాయించలేదు, అసలు ఖర్చే పెట్టలేదు. ఏమీ లేని దగ్గర ఆర్ఆర్ ట్యాక్స్(రేవంత్, రాహుల్) ట్యాక్స్ అంటూ నితిన్ నబీన్ పాలమూరు జిల్లాలో చేసిన వ్యాఖ్యలను ప్రజలు అసలు పట్టించుకోలేదు.
ఏదేని ఒక చర్య జరిగితే దానికి ప్రతిచర్యగా, ప్రతి స్పందన ఉంటుంది. ఇవేమీ లేకుండానే నితిన్ నబీన్ వ్యాఖ్యలు చేశారని చాలా మంది భావిస్తున్నారు.
తెర ముందు- వెనక రాజకీయాలు
రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత సునాయాసంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలుస్తున్నారు. ఆ మీటింగ్ ఫొటోలు మీడియాలో వస్తున్నాయి. ఆర్ఎస్ఎస్ నుంచి కాంగ్రెస్ వరకున్న తన రాజకీయ ప్రస్థానం గురించి ముఖ్యమంత్రి రేవంత్ చెప్పుకున్నారు. ఈ నేపథ్యంలో నితిన్ నబీన్ రేవంత్‌పై చేసిన వ్యాఖ్యల్లో పస ఉంటుందని ఎవరైనా ఎట్లా అనుకోగలరు.
గత ప్రభుత్వ హయాంలో బీజేపీ, బీఆర్ఎస్ దోస్తానా ఉన్నదని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దానిపై ఇంకా ప్రజలపై స్పష్టత లేదు. అనంతరం, కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న నాయకులు. ఈ రెండు సందర్భాలను తీసుకున్నప్పుడు తమదైన కోణాన్ని ఆవిష్కరించలేకపోతున్నదని స్పష్టమవుతున్నది.
ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను గుర్తించిన పార్టీల్లో బీజేపీ ఒకటి. ఒక ఓటు రెండు రాష్ట్రాలని అధికారికంగా ప్రకటించిన పార్టీ ఇదే. ఆ మేరకు తెలంగాణ ప్రజల మనసుల్లో సానుకూల ముద్ర వేసుకున్నది. అవగాహన లోపంతోనూ, కేవలం అధికారం కోసమనే కోణంలో చూస్తున్న కారణంతోనూ తెలంగాణ ప్రజల మనోభావాలను ఈ పార్టీ గుర్తించలేకపోతున్నది. బీజేపీ తాజా అధినేత వ్యాఖ్యలు ఇందుకు మినహాయింపు కాదనే భావన తెలంగాణ ప్రజల్లో ఉన్నది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
