2026-27 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ, బ్యాంకుల పనితీరుపై ఒక సమీక్ష నిర్వహిస్తామని ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.
అంతేకాకుండా, రాబోయే సంవత్సరాల్లో ప్రభుత్వరంగ సంస్థ(సీపీఎస్ఈ)ల్లో మరిన్ని పెట్టుబడుల ఉపసంహరణలుంటాయని తెలిపారు.
ఉపసంహరణకే ప్రాధాన్యత ఉంటుందని, ఐడీబీఐ బ్యాంకులో వాటాల విక్రయం(ప్రైవేటీకరణ) త్వరలోనే పూర్తవుతుందని భావిస్తున్నట్లు కూడా ఆర్ధికమంత్రి పేర్కొన్నారు.
ప్రభుత్వ రంగ బ్యాంకులలో ప్రభుత్వ వాటా 26%కి పరిమితం చేసి, మిగతా వాటాలు అమ్మినా- ప్రభుత్వ నియంత్రణ ఉండేలా చర్యలు తీసుకుంటే సరిపోతుందని ఆర్ధిక సర్వేలో పేర్కొన్నారు.
ప్రభుత్వ రంగ బ్యాంకులలో 49% విదేశీ పెట్టుబడులు అనుమతించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు ఆర్ధిక శాఖ కార్యదర్శి ప్రకటించారు.
ఈ చర్యలన్నీ ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణ వైపు పడుతున్న అడుగులుగా బ్యాంకింగ్ సంఘాలు భావిస్తున్నాయి.
దేశ ప్రయోజనాలను పట్టించుకోకుండా ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరించే చర్యలకు ఉపక్రమించడం ఏ మాత్రం సమర్ధనీయం కాదు.
దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రభుత్వ రంగ బ్యాంకులు జీవనాడి
1969కి ముందు అనేక సందర్భాలలో పార్లమెంటులో, బ్యాంకులను జాతీయం చేయాలన్న డిమాండును వామపక్ష పార్లమెంట్ సభ్యులు లేవనెత్తుతూ వచ్చారు.
దేశంలో ఆదాయాల పంపిణీ ఏ తీరుగా ఉందో అధ్యయనం చేసిన పీసీ మహాలనోబిస్ కమిటీ- 1960 నాటికి దేశంలోని 10% మంది సంపదలో 40% వాటా పొందుతున్నారని తేల్చింది.
దేశంలో గుత్తసంస్థల తీరును అధ్యయనం చేసిన మోనోపలీస్ ఎంక్వైరీ కమిషన్- 1964 నాటికి దేశంలోని పరిశ్రమలలో 85% కొద్దిపాటి గుత్తసంస్థల చేతుల్లో ఉన్నాయని తెలిపింది.
1947-1951 మధ్య 205 ప్రైవేటు బ్యాంకులు బోర్డులు తిప్పేశాయి. 1951లో 567 ప్రైవేటు బ్యాంకులు ఉంటే 1969 నాటికి అవి కాస్తా 91 అయ్యాయి. ప్రైవేటు బ్యాంకులెంత దివాలా తీశాయో దీనిని బట్టి స్పష్టమవుతుంది.
1969లో బ్యాంకుల జాతీయీకరణపై పార్లమెంట్లో జరిగిన చర్చలో ఆనాడు యువ పార్లమెంట్ సభ్యునిగా ఉన్న అటల్ బిహారీ వాజపేయి పాల్గొని, బ్యాంకుల జాతీయీకరణను వ్యతిరేకిస్తూ 4 అంశాలు పేర్కొన్నారు.
కాంగ్రెస్- వామపక్ష పార్టీల వలనే పురోగతి
బ్యాంకుల జాతీయీకరణ ఒక వికృతమైన చర్య అని, అవసరం లేనిదనీ అకారణమైనదనీ, అనుచితమని వాజపేయి అభివర్ణించారు.
ఇది ప్రభుత్వ రంగ సంస్థల పట్ల బీజేపీకి ఉన్న వైఖరికి నిలువెత్తు తార్కాణం.
అయితే ఆనాడు కాంగ్రెస్, వామపక్ష పార్టీలు బ్యాంకుల జాతీయీకరణకు పట్టు పట్టడం వల్ల బ్యాంకుల జాతీయీకరణ సాకారం అయ్యింది.
బ్యాంకుల జాతీయీకరణ 1969, 1980లో జరిగిన నాటి నుంచి బ్యాంకింగ్ రంగం గణనీయంగా పురోగతి సాధించింది.
1969లో మన దేశంలో మొత్తం ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్ల మొత్తం రూ 5000 కోట్లు కాగా, 2025 నాటికి అవి 223లక్షల కోట్లకు పెరిగాయి.
గ్రామీణ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో సైతం పెద్ద ఎత్తున బ్యాంక్ శాఖలు ప్రారంభించిన ఘనత ప్రభుత్వ రంగ బ్యాంకులదే.
1969లో మొత్తం బ్యాంక్ శాఖల సంఖ్య 8000 కాగా, 2024నాటికి ఆ సంఖ్య 1,65,000కు పెరిగింది.
ప్రభుత్వ రంగ బ్యాంకుల కీలక పాత్ర
ఆర్ధిక వ్యవస్థలో కీలక రంగాలైన వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, చిన్న- మధ్య తరహా పరిశ్రమలు, విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాల కల్పన వంటి రంగాలు విశేష ప్రయోజనం పొందడంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు కీలకపాత్ర పోషించాయి.
1991 నుంచి ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకుల ఒత్తిడికి తలొగ్గిన ప్రభుత్వాలు నయా ఉదారవాద విధానాలను అమలు చేయడం ప్రారంభించాయి. గుత్త పెట్టుబడుల నిరోధ చట్టం(ఎంఆర్టీపీ యాక్టు)ను రద్దుచేశారు.
క్రమేపీ బ్యాంకింగ్ రంగంలో విదేశీపెట్టుబడుల శాతాన్ని 74%కి పెంచారు. అనేక ప్రభుత్వ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటాలను దాదాపు 40%పైగా అమ్మివేశారు.
దీంతో బ్యాంకుల ప్రైవేటీకరణకు మార్గం సుగమం అయ్యింది.
ఆర్థిక సంక్షోభంలో ప్రభుత్వ ఉద్దీపన
2008లో వచ్చిన ప్రపంచ ఆర్థిక సంక్షోభంలో అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలోనూ వందల సంఖ్యలో ప్రైవేటు బ్యాంకులు దివాలా తీశాయి. 180 ఏండ్ల చరిత్ర కలిగిన లెహమాన్ బ్రదర్స్, జేపీ మోర్గాన్ ఛేజ్, గోల్డ్ మ్యాన్ శాక్స్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, మోర్గాన్ స్టాన్లీ, మెరిన్ లించ్, లాయిడ్స్, బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్ వంటి అంతర్జాతీయ బ్యాంకింగ్ దిగ్గజాలు సైతం కేవలం మొండి బకాయిల కారణంగా కుప్పకూలాయి.
ఇవన్నీ ప్రభుత్వ ఉద్దీపన ప్యాకేజీ ద్వారా, ప్రజల సొమ్మును వాటిలో పెట్టుబడులు పెట్టడం ద్వారా మాత్రమే నిలదొక్కుకున్నాయి.
2008 ఆర్థిక సంక్షోభం నుంచి మన దేశం నిలదొక్కుకొని గట్టెక్కడానికి ప్రభుత్వరంగ బ్యాంకులే ముఖ్య కారణమని ప్రపంచ దేశాలు కొనియాడాయి.
మరి మన దేశంలో ప్రైవేటీకరణ తర్వాత మన బ్యాంకులు దివాలా తీస్తే వాటికి జవాబుదారు ఎవరు? ప్రజల సొమ్ముకు ఎవరు బాధ్యత వహిస్తారు?
ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ దేశాభివృద్ధిని వెనుక బాట పట్టించడమే గాక- ప్రజల కష్టార్జితాన్ని, విలువైన పొదుపును ప్రైవేటు వారికి, కార్పొరేట్లకు అప్పగించడం అవుతుంది.
గత మూడేళ్ళుగా ప్రభుత్వ రంగ బ్యాంకులు లక్షల కోట్ల నిర్వహణ లాభాలు ఆర్జిస్తున్నాయి.
గత 15 ఏళ్లలో ప్రభుత్వ రంగ బ్యాంకులు ఆర్జించిన మొత్తం నిర్వహణ లాభాలు 25లక్షల కోట్లు పైబడి ఉంది.
బడా పెట్టుబడిదారులు, కార్పొరేట్లు బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు భారీగా ఎగ్గొట్టడం వల్ల మాత్రమే, ప్రభుత్వ రంగ బ్యాంకులకు నష్టాలు వస్తున్నాయి.
గత పదేళ్లలో ప్రభుత్వ బ్యాంకుల 16.35లక్షల కోట్ల రూపాయల పారు బకాయిలను మాఫీ చేశారు. ప్రభుత్వ బ్యాంకుల పారు బకాయిల్లో 74% హెయిర్ కట్ చేస్తున్నారు. ‘హెయిర్ కట్’ పేరుతో భారీ బకాయిలు పడిన సంస్థలను అతితక్కువ మొత్తం చెల్లించి బడా గుత్తసంస్థలు చేజిక్కించుకోగలుగుతున్నాయి.
బ్యాంకింగ్ రంగంలో ఎక్కువమందికి ఉపాధి కల్పన
రైల్వేల తర్వాత ఎక్కువమందికి ఉపాధి కల్పించేది ప్రభుత్వ బ్యాంకింగ్ రంగం.
దేశంలో పెద్దఎత్తున వ్యవసాయరంగానికి రుణాలిచ్చి వెన్నుదన్నుగా నిలుస్తున్నది ప్రభుత్వ బ్యాంకులే.
చదువుకున్న, వెనుకబడిన, షెడ్యూల్డ్ కులాల వ్యక్తులకు రిజర్వేషన్ల ద్వారా ఉపాధి, ఆర్థికసాయం కల్పిస్తున్నది ప్రభుత్వ బ్యాంకింగ్ రంగమే.
ఫైనాన్షియల్ ఇంక్లూసన్ పేరుతో 50 కోట్లపై చిలుకు ‘జన్‌ధన్’ ఖాతాలను తెరిచింది ప్రభుత్వ బ్యాంకులే. కేంద్ర ప్రభుత్వం నిర్వహించమన్న సామాజిక పథకాలను కేవలం ప్రభుత్వ రంగమే నిర్వహిస్తోంది.
ప్రధాన మంత్రి పేరు మీద ఉన్న జీవన జ్యోతి బీమా యోజన, జనశ్రీ బీమా యోజన పథకాలలో ఎల్ఐసీ, ప్రభుత్వ రంగ సాధారణ బీమా సంస్థల భాగస్వామ్యం 96% ఉంటే, ప్రయివేటు బీమా సంస్థల భాగస్వామ్యం కేవలం 4% మాత్రమే.
జన్ ధన్ యోజన పథకంలో ప్రభుత్వరంగ బ్యాంకుల వాటా 97% ఉంటే, ప్రైవేటు బ్యాంకుల వాటా కేవలం 3%. 2020 ఏప్రిల్ నుంచి ఇప్పటిదాకా అమలు జరిగిన బ్యాంక్ మిలితాల కారణంగా 28 ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య నేడు 12కు చేరుకుంది.
భవిష్యత్‌లో ఇది 4 లేక 5కు పరిమితం చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం.
ఇప్పటికే బ్యాంక్ మిలితాలు మూలంగా వందలాది శాఖలు తగ్గించబడ్డాయి. దీని ప్రభావం భవిష్యత్ నియామకాలపై పడింది.
ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గినప్పటికీ, ప్రభుత్వ రంగ బ్యాంక్ ఉద్యోగులు పెద్ద ఎత్తున కస్టమర్లకు సేవలు అందిస్తున్నారు.
ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇంకా విశేష సేవలు అందించాలంటే, ఎక్కువ శాఖలు గ్రామీణ ప్రాంతాల్లో తెరవాలి, ఉద్యోగుల సంఖ్య పెరగాలి.
ప్రస్తుతం అమలు జరుగుతున్న ప్రైవేటీకరణ విధానాల వలన ఇది సాధ్యమయ్యే పరిస్థితి లేదు.
ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఉద్దేశ్యపూర్వకంగా అప్పులు ఎగ్గొడుతున్న వారి నుంచి ముక్కు పిండి బాకీలు వసూలు చేసేలా కఠిన చట్టాలు రూపొందించాలని, ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ విడనాడాలని, ఉద్యోగులకు 5 రోజుల పనిదినం అమలు చేయాలని ఇప్పటికే జనవరి 27న యుఎఫ్‌బీయూ నేతృత్వంలో బ్యాంక్ ఉద్యోగులు దేశవ్యాప్త సమ్మె నిర్వహించారు.
మళ్లీ కేంద్ర కార్మిక సంఘాలతో కలిసి ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెకు బ్యాంక్ ఉద్యోగులు కదనరంగం తొక్కారు.
బీమా రంగంలో తిరోగమన సంస్కరణలు
గత దశాబ్ద కాలంగా ప్రభుత్వ రంగ ఎల్ఐసీ, సాధారణ బీమా రంగ కంపెనీలను దెబ్బ తీయాలని అనేక ప్రయత్నాలు జరిగాయి. 2014లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బీమా రంగంలో విదేశీ పెట్టుబడుల శాతాన్ని 100% దాకా పెంచడం జరిగింది.
2022లో ఎల్ఐసీలో ఐపీఓ పేరుతో 3.5% వాటాలు అమ్మి, రూ 21 వేల కోట్లు ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుంది. జీఐసీరే, న్యూ ఇండియా సాధారణ బీమా కంపెనీలలో వాటాలు ఉపసహరించారు.
గత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో తిరోగమన బీమా చట్ట సవరణ బిల్లు(సబ్ కీ బీమా, సబ్కీ రక్షా బిల్లు- 2025)ను ప్రవేశ పెట్టి ఏకపక్షంగా కేంద్ర ప్రభుత్వం ఆమోదించుకుంది.
దీని వల్ల బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి పరిమితి 74% నుంచి 100% పెరిగింది. ఐఆర్‌డీఏకు కొన్ని అదనపు అధికారాలు కట్టబెట్టారు.
బీమా పరిశ్రమలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల అవసరం ఏమాత్రం లేదు. కానీ బీజేపీ ఆధ్వర్యంలోని వరుస ప్రభుత్వాలు, 1999లో 26%, 2015లో 49%, 2021లో 74% విదేశీ పెట్టుబడులకు అనుమతినిచ్చారు. దీనివల్ల విదేశీ పెట్టబడుదారులకు మన దేశీయ పొదుపు మీద పూర్తి నియంత్రణకు వీలు కలుగుతుంది
2024 మార్చి 31 నాటికి బీమా పరిశ్రమలో విదేశీ ఈక్విటీ రూ 31365.56 కోట్లతో కేవలం 32.67% మాత్రమే ఉన్నది. అంటే 74% గరిష్ట పరిమితి అనుమతించినప్పటికీ, దానిలో సగం కంటే తక్కువగా ఉన్నది. ఈ నేపథ్యంలో ఎఫ్‌డీఐను 100 శాతానికి పెంచవలసిన అవసరం ఏమాత్రం లేదు.
దేశీయ పొదుపు దేశ ఆర్థిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. సంక్షేమ రాజ్యంగా భారతదేశ రాజ్యాంగపరమైన బాధ్యతలను నెరవేర్చడానికి దేశీయ పొదుపుపై ప్రభుత్వం పూర్తి నియంత్రణను కలిగి ఉండాలి. విదేశీ పెట్టుబడులు అధిక లాభార్జన కోసమే మార్కెట్లలోకి వస్తాయన్నది నిర్వివాదం.
తమ అధిక లాభాపేక్షతో సంపన్నులైన పాలసీదారులను ఆకర్షించే విధంగా విధానాలు అనుసరించే బీమా కంపెనీల వల్ల, అంతిమంగా బడుగు వర్గాల మధ్య తరగతి ప్రజలు పూర్తిగా విస్మరించబడతారు.
ఎల్ఐసీ పాలసీలు కలిగి ఉన్న సావరిన్ గ్యారెంటీని సైతం తీసివేయలని అమెరికా వాణిజ్య శాఖ కార్యదర్శి మాట్లాడడం చూస్తే, ప్రభుత్వ బీమా రంగాన్ని కబళించడానికి ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయో అర్ధం చేసుకోవచ్చు.
ఎల్ఐసీలో సేవల మెరుగుదలకు, సంస్థను ముక్కలు చేయాలన్న ఐఐఎం, కోజికోడ్ సూచనలు భారీ ప్రకంపనలు సృష్టించాయి. ఇప్పటికీ ఈ అసంబద్ధ సూచనలను పూర్వ ఎల్ఐసీ ఉన్నతాధికారులు నిశితంగా తిప్పికొట్టారు.
సుదీర్ఘ కాలంగా బీమా ఉద్యోగులు చేసిన పోరాటాల కారణంగా బీమా కంపెనీలకు కాంపోజిట్ లైసెన్సులు జారీ చేయడం, బీమా కంపెనీల ఏర్పాటుకు నిర్ధారిత మూలధనాన్ని(క్యాపిటల్ )ను తగ్గించడం, ఏజెంట్లకు ఒకటి కంటే ఎక్కువ బీమా కంపెనీల పాలసీలు అమ్మడానికి అనుమతించడం వంటి ముఖ్య అంశాలు ఈ చట్టంలో పొందుపరచలేదు.
ఈ ప్రతిపాదనలు ఆసాంతం త్రిప్పి కొట్టకపోతే ప్రభుత్వ బీమా రంగ భవిష్యత్తు అగమ్యగోచరమయ్యే ప్రమాదం ఉంది
దశాబ్దాలుగా అద్భుతమైన పనితీరు
1956లో కేవలం రూ 5 కోట్ల మూలధనంతో ప్రారంభమయిన ఎల్ఐసీ, నేడు రూ 57 లక్షల కోట్ల ఆస్తులను సమకూర్చుకుంది.
ప్రపంచంలోనే పేరొంందిన యాపిల్, జనరల్ ఎలక్ర్టిక్ సంస్థల కన్నా ఐక్యరాజ్యసమితిలోని 75% దేశాల ఆర్థిక వ్యవస్థల కన్నా ఎల్ఐసీ పెద్దది.
మొత్తం 40 కోట్ల(వ్యక్తిగత, గ్రూప్)పాలసీదారులతో ఎల్ఐసీ ప్రపంచంలోనే మూడో స్థానంలో నిలుస్తుంది.
దేశీయ బీమా రంగంలో ప్రైవేటు బీమా కంపెనీల ప్రవేశం జరిగి 25 ఏళ్ళు అయినా, ఎల్ఐసీ నేటికీ ప్రీమియమ్ ఆదాయంలో మార్కెట్ వాటా, పాలసీలలో 67% మార్కెట్ వాటాతో ఇప్పటికీ మార్కెట్ లీడర్‌గా ముందుకు సాగుతోంది.
క్లెయిమ్ సెటిల్మెంట్, నిర్వహణ సామర్థ్యాలు, ఉత్పాదకత పరంగా ప్రపంచంలోని మరే ఇతర కంపెనీ కూడా ఎల్ఐసీలాంటి రికార్డును పొందలేదు.
ప్రపంచంలో 99% పైబడి క్లైములను పరిష్కరిస్తూ, నేటికీ ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో ఎల్ఐసి ఉంది.
విస్త్రృతమైన ప్రభుత్వ రంగ సేవలు
గత ఆర్ధిక సంవత్సరంలో 2 కోట్ల మెట్యూరిటీ క్లైములను, 8 లక్షల డెత్ క్లైములను పరిష్కరించి దాదాపు రూ 2 లక్షల కోట్లను పాలసీదారులకు క్లైముల రూపంలో చెల్లించింది.
బీమా ప్రీమియం ద్వారా సేకరించిన పొదుపుకు పూర్తి రక్షణ కల్పించడం, జాతి నిర్మాణానికి , సమాజ మౌలిక వసతుల మెరుగుదలకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వానికి ఈ మొత్తాలను పెట్టుబడులుగా అందించడం, జీవిత బీమా రక్షణ సదుపాయాన్ని భారతదేశ నలుమూలల వ్యాపించడం వంటి బీమా జాతీయీకరణ లక్ష్యాలన్నింటిని ఎల్ఐసీ సంస్థ సమర్థవంతంగా నెరవేర్చింది.
1956కి ముందు, 245 ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలు అమాయక ప్రజల పొదుపును దోపిడి చేస్తున్నాయని, బీమా సొమ్మును దారి మల్లిస్తున్నారని గమనించిన ఆనాటి నెహ్రు ప్రభుత్వం ఈ ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలన్నింటినీ జీవిత బీమా వ్యాపార జాతీయీకరణ ద్వారా విలీనం చేసి, ఎల్ఐసీని ఏర్పాటు చేసిందని మనం గుర్తుంచుకోవాలి.
ఐఅర్డీఏ 2023- 24 వార్షిక నివేదిక పరిశీలిస్తే, కేంద్రీకృత ఫిర్యాదుల పోర్టల్‌కు సంవత్సరంలో రెండు లక్షలకు పైగా ఫిర్యాదులు వచ్చాయి. ఎల్ఐసీని మినహాయిస్తే, ఇతర ప్రైవేటు జీవిత బీమా సంస్థలపై వచ్చిన ఫిర్యాదులలో 50 శాతానికి పైగా తప్పుడు వ్యాపార విధానాలకు, తప్పుడు అమ్మకాలకు సంబంధించినవే.
విదేశీ పెట్టుబడిదారులను తృప్తి పరచడానికి, ప్రభుత్వం ఆలోచిస్తున్న ప్రతిపాదనలు, బీమా పరిశ్రమను 1956కంటే ముందు రోజులకు నెట్టి వేసేందుకు దారి తీస్తాయి. ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీలను విలీనం చేయాలన్న వీకే మల్హోత్రా కమిటీ సిఫార్సులను గత పాతికేళ్లగా అమలు చేయడం లేదు. సరికదా, వాటిని ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నారు.
పాలసీదారులు, సాధారణ పౌరులు ప్రభుత్వ రంగ బీమా పరిశ్రమ ప్రయోజనాలకు విఘాతం కలిగించే ఈ అనాలోచిత ప్రతిపాదనలను పోరాటాల ద్వారా ప్రతిఘటించి ఓడించాల్సిన అవసరం ఉంది.
ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్(ఏఐఐఈఏ) నేతృత్వంలో బీమా ఉద్యోగులు బీమా చట్ట సవరణలకు వ్యతిరేకంగా, లేబర్ కోడ్ల అమలుకు వ్యతిరేకంగా; తరగతి 3, 4 నియామకాలు చేపట్టాలని 2010 ఏప్రిల్ 1 తరువాత ఎల్ఐసీలో చేరిన ఉద్యోగులకు 1995 గ్యారెంటీ పింఛను అమలుచేయాలని;1996 నియామక నోటిఫికేషన్ ప్రకారం ఎల్ఐసీలో చేరిన ఉద్యోగులకు- కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఎంఎస్ 57 అనుసరించి 1995 గ్యారంటీ పింఛను పథకం వర్తింపచేయాలనే డిమాండ్లతో ఫిబ్రవరి 12న కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగే దేశవ్యాప్త సమ్మెలో చైతన్య పూర్వకంగా పాల్గొంటున్నారు.
దేశ ఆర్థిక రంగ పరిరక్షణ కోసం జరిగే పోరాటంలో దేశభక్తి కలిగిన ప్రజలందరూ భాగస్వాములై, సమ్మెకు సంపూర్ణ మద్దతు అందించాల్సిందిగా కోరుతున్నాం.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
