సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు, అకాడమీ- దాని అనుబంధ సంస్థలపై పూర్తి నియంత్రణను కట్టబెట్టేలా ఉన్న ఒక అవగాహన ఒప్పందం ఈ వివాదానికి ప్రధాన కారణం.
సాహిత్య అకాడమీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జరిగిన అవార్డుల ప్రకటన నాటకీయ రద్దు వెనుక, గత దశాబ్ద కాలంగా స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థకు మిగిలి ఉన్న కొద్దిపాటి స్వేచ్ఛను కూడా నరేంద్ర మోదీ ప్రభుత్వం హస్తగతం చేసుకోవడమే అసలు రహస్యం.
ఈ ఆకస్మిక, నాటకీయ పరిణామాన్ని అర్థం చేసుకోవడానికి ఒకసారి గతంలోకి వెళ్దాం.
అకాడమీ ప్రతీ సంవత్సరం 24 భాషలలో తన ప్రతిష్టాత్మక అవార్డులను ప్రకటిస్తుంది. అన్ని భాషల జ్యూరీల(న్యాయ నిర్ణేతలు)తగిన చర్చల తర్వాత అవార్డు గ్రహీతల పేర్లు ఖరారవుతాయి. ఈ జాబితాలను అకాడమీ కార్యనిర్వాహక బోర్డు ఆమోదిస్తుంది.
ఈక్రమంలోనే ఈసారి విజేతల పేర్లను ప్రకటించడానికి డిసెంబర్ 18న విలేకరుల సమావేశాన్ని అకాడమీ ఏర్పాటు చేసింది.
వేడుకకు హాజరయ్యేందుకు ప్రజలు అకాడమీకి చేరుకున్నారు. వారు సమోసాలు, టీ సేవిస్తుండగా, ‘అవార్డుల పునర్వ్యవస్థీకరణ’ గురించి సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నుంచి హడావిడిగా ఒక సర్క్యులర్ విడుదలయ్యింది. లలిత కళా అకాడమీ, సంగీత నాటక అకాడమీ, సాహిత్య అకాడమీతోపాటు నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ‘అధిపతుల’ను ఉద్దేశ్యించి ఆ సర్క్యులర్ జారీ చేయబడింది. గతంలో మంత్రిత్వ శాఖతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాన్ని గుర్తు చేస్తూ, “అవార్డుల పునర్వ్యవస్థీకరణ మంత్రిత్వ శాఖ సంప్రదింపులతోనే జరగాలి” అని పేర్కొన్నది.
పునర్వ్యవస్థీకరణకు “మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపే వరకు, ముందస్తు అనుమతి లేకుండా అవార్డుల ప్రకటనకు సంబంధించి ఎటువంటి ప్రక్రియను చేపట్టకూడదు” అని అందులో స్పష్టం చేశారు. దీంతో ప్రస్తుత ప్రకటన రద్దయింది.
ఈ హఠాత్పరిణామంతో అకాడమీ, జ్యూరీ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
సర్క్యులర్‌లోని అసంబద్ధత గురించి చర్చించే ముందు, ఒక ప్రత్యేక జ్యూరీ ప్రతీ భాషకు విజేతలను ఎంపిక చేస్తుంది. దానికి ఒక కన్వీనర్ అధ్యక్షత వహిస్తారు. అక్టోబరులో కే శ్రీనివాసరావు పదవీవిరమణ చేసిన తర్వాత అకాడమీ కార్యదర్శిగా సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నియమించిన పల్లవి ప్రశాంత్ హోల్కర్ ఈ జ్యూరీలను ఏర్పాటు చేశారు.
హోల్కర్ 2011 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీసెస్ అధికారి. ఆమె నియామకం సంస్థపై మంత్రిత్వ శాఖ తన నియంత్రణను విస్తరించడానికి తీసుకున్న చర్యగా అకాడమీ అధికారులు భావిస్తున్నారు. ఈ సర్క్యులర్ అందరి కంటే ఎక్కువగా హోల్కర్‌ను ఇరకాటంలో పడేసింది. ఎందుకంటే అకాడమీ ఆమె పేరు మీదనే వేడుకకు సంబంధించిన ప్రెస్ రిలీజ్ జారీ చేసింది. ఆమె విజేతలను ప్రకటించాల్సి ఉంది.
ఈ సర్క్యులర్ పలురకాలుగా లోపభూయిష్టంగా ఉందని అకాడమీ అధికారులు అంటున్నారు.
1. మంత్రిత్వ శాఖ అవార్డులను పునర్వ్యవస్థీకరించాలనుకుంటే, జ్యూరీలు ఏర్పాటు చేయడానికి చాలా కాలం ముందే అకాడమీకి తదనుగుణంగా ఆదేశాలు ఇవ్వాల్సింది.
2. జూలైలో MoU సంతకం కావడానికి ఆరు నెలల ముందే అవార్డుల ప్రక్రియ ఈ ఏడాది జనవరిలోనే ప్రారంభమైంది. అవార్డుల పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదన ఏదైనా ఉంటే, అది పాత తేదీ నుంచి వర్తించదు.
3. ప్రకటన రోజే అంత హడావిడిగా సర్క్యులర్ జారీ చేసి, ఒక స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది?
మంత్రిత్వ శాఖ ముందుగా అకాడమీకి తెలియజేయాల్సి ఉంది.
4. అకాడమీలో మంత్రిత్వ శాఖ శాశ్వత ప్రతినిధి అయిన సెక్రటరీ ప్రెస్ కాన్ఫరెన్స్‌ను షెడ్యూల్ చేశారు. సెక్రటరీకి కూడా దీని గురించి తెలియకుండా చీకటిలో ఉంచారా? ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రకటన వెలువడిన 24 గంటల తర్వాత దానిని మంత్రిత్వ శాఖ రద్దు చేసింది. అయితే కాన్ఫరెన్స్ నోటిఫికేషన్‌కు ముందు ఎవరు అనుమతి ఇచ్చారు?
5. సర్క్యులర్ నాలుగు సంస్థలను ఉద్దేశించి జారీ చేసినప్పటికీ, అకాడమీని లక్ష్యం చేసుకోవడంతో పాటుగా అందులో ఒకటైన నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా అసలు వార్షిక అవార్డులే ఇవ్వదని మంత్రిత్వ శాఖ విస్మరించింది. మరి మంత్రిత్వ శాఖ ఇంత ఆకస్మికంగా ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకుంది?
ఈ ఆకస్మిక నిర్ణయం నిర్దిష్ట అవార్డు గ్రహీతపై అభ్యంతరం కాదని, అవార్డు ప్రక్రియ- గ్రహీతల ఎంపికపై పూర్తి నియంత్రణ సాధించాలనే మంత్రిత్వ శాఖ ఉద్దేశ్యమే దీనికి కారణమని అకాడమీ అధికారులు అన్నారు. అకాడమీ స్వయంప్రతిపత్తిని హరించి ఏ క్షణంలోనైనా తమ ఇష్టం వచ్చినట్లు మార్పులు చేయాలని మంత్రిత్వ శాఖ లక్ష్యమని ఈ పరిణామం రుజువు చేస్తున్నది.
గత దశాబ్ద కాలంలో అకాడమీ తన ప్రతిష్టను చాలా కోల్పోయింది.
అకాడమీ తన ఉన్నత సూత్రాలను నిలబెట్టుకోవడంలో విఫలమైందని రచయితలు ఒకవైపు ఆరోపిస్తున్నారు. 2015 నాటి ‘అవార్డ్ వాపసీ’ ఉద్యమ సమయంలో ఇది స్పష్టంగా కనిపించింది. మరోవైపు మోదీ ప్రభుత్వం నిరంతరం దాని స్వేచ్ఛను ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంది.
జూలై నాటి MoU అటువంటి ప్రయత్నాల వరుసలో ఒక భాగం మాత్రమే. 2017లో కూడా ప్రభుత్వం ఇటువంటి సంస్థలను తమ బడ్జెట్లో కనీసం 25- 30% ఆదాయం సంపాదించి క్రమంగా “స్వయం సమృద్ధి” వైపు నెట్టాలని చూసింది. అప్పట్లో ఈ సంస్థల అధికారులు ప్రభుత్వ ఆ ప్రయత్నాన్ని వ్యతిరేకించారు.
నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా లేక సంగీత నాటక అకాడమీలను ఆదాయ వనరులను సేకరించే స్తోమత గల సంస్థలుగా పరిగణించడానికి వీలులేదు. ఆ సంస్థలు ప్రజా సంక్షేమ కోసమే ఏర్పాటు చేయబడ్డాయని అకాడమీ ఎక్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు ఒకరు చెప్పారు.
24 భాషలు, తాత్వికతలను నిర్ధారించడానికిగాను సాహిత్య అకాడమీ దేశవ్యాప్తంగా కార్యక్రమాలను నిర్వహిస్తుంది.
“బోడో రచయిత కథా పఠనానికి ఎంట్రీ టికెట్ పెట్టి ఆదాయం సంపాదించాలా?” అని ఒక అకాడమీ అధికారి ప్రశ్నించారు.
ప్రస్తుత MoU చాలా ప్రమాదకరమైనది ఎందుకంటే, ఇది అకాడమీలను పూర్తిగా మంత్రిత్వ శాఖ స్వాధీనం చేసుకోవడానికి దారితీస్తుంది. ప్రతి భాషలో సమర్థుల ఎంపిక, అవార్డుల ప్రదానం నేటికి ఆకర్షణీయం. ప్రైవేట్ అవార్డులతో పోలిస్తే ఇది చాలా ప్రాధాన్యత కలదని రచయితలు భావిస్తారు. దేశంలోని కొంతమంది ప్రముఖులు ఈ అవార్డులను హుందాగా, గౌరవంగా అంగీకరించారు. ఈ స్థితిలో సాహిత్యం, సంగీతం, చిత్రలేఖనంలో ఉన్న అత్యున్నత అవార్డులను శాస్త్రి భవనంలోని ‘బాబులే’ నిర్ణయించాల్సి వస్తే, వాటి పతనం ఖాయం. కేంద్ర మంత్రిత్వ శాఖ మొత్తం అవార్డుల ప్రక్రియను పునర్నిర్మాణం చేయాలనుకుంటే అవార్డుల విలువ కోల్పోతాయని ఒక ఉన్నతాధికారి చెప్పారు.
భారత తొలి ప్రధాని దార్శనికతతో 1950లలో స్థాపించబడిన అకాడమీలు- దేశ సంస్కృతిని నిర్మించడంలోను, గత ప్రతిష్ఠను కాపాడుతూ భవిష్యత్ కోసం బాటలు నిర్మించడంలో కీలక పాత్ర పోషించాయి. 1954లో అకాడమీ ప్రారంభమైన మరుసటి రోజే అకాడమీ కార్యదర్శి కృష్ణ కృపలానికి ప్రధాని నెహ్రూ రాసిన లేఖలో సూర్యకాంత్ త్రిపాఠి నిరాలా గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రముఖ హిందీ రచయిత తన పాటల రచనలను 25, 30, 50 రూపాయలకు అమ్ముకోగా- ప్రచురణ కర్తలు భారీ లాభాలు సంపాదించారని, రచయిత మాత్రం ఆకలితో అలమటిస్తున్నాడని ప్రధాని నెహ్రూ ఆ లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. కాపీ రైట్ చట్టానికి సవరణలు చేయాలని, నేరాలకు సహాయపడరాదని ప్రధాని నెహ్రూ అకాడమీని కోరారు.
ఆ విధంగా నెహ్రూ రచయితలను సమర్థిస్తూ మేధో నాగరికతను చాటుకున్నారు.
1958లో విద్యా శాఖామాత్యులు అబుల్ కలాం ఆజాద్, ఉప రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌తో ప్రధాని నెహ్రూ స్వయంగా మేధో పరమైన చర్చలలో పాల్గొన్నారు. హిందీ కవి మాధవి వర్మ తను రచించిన అశ్వ బుద్ధచరిత, రుగ్వేదం ప్రచురణల కొరకు ఆర్థిక సాయాన్ని కోరారు. గణతంత్ర నిర్మాతలు వర్మ ప్రతిపాదనలపై భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు.
ప్రభుత్వ ప్రచురణలలో మతపరమైన పక్షపాతం ఉండకూడదని ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అభిప్రాయపడ్డారు. అదే సందర్భంలో, ఎడ్విన్ ఆర్నాల్డ్ రచించిన ‘ఆసియా వైభవం’ గ్రంథం బుద్ధచరిత ఆధారంగా రచించబడినదైనా, దానిని మతగ్రంథంగా కాకుండా సాహిత్య కృతిగా మాత్రమే చూడాలని విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్పష్టం చేశారు.
దేశభక్తియుత ప్రభుత్వంగా చెప్పుకుంటూ నెహ్రూను కించపరిచే నేటి ప్రభుత్వమొక అడుగు ముందుకువేసి, బుద్ధచరిత లేదా రుగ్వేదం ప్రాచీన భారత వైభవంగా, కేవలం మతపరమైన పుస్తకాలుగా పరిగణించాలని చెబుతున్నది.
అనువాదం: ఆర్ లక్ష్మయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
