తమది ప్రజా ప్రభుత్వమని చెప్పారు కాంగ్రెస్ నాయకులు. ఆరు గ్యారంటీలతో పాటు భావ ప్రకటన ఏడవ గ్యారంటీ అన్నారు.
కొన్నేళ్లుగా నివసిస్తున్న లక్షలాది రూపాయాలు వెచ్చించి కొనుగోలు చేసిన నివాసాలను కూలుస్తామని హామీ ఇవ్వలేదు.
ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు, బోనస్ ఏడవ గ్యారంటీ సంగతలా ఉంచుదాం.
చిరు ఉద్యోగులు, ఒక మోస్తరు జీతంతో బతుకీడుస్తున్న జీవుల గూడును చెదరకొడతారా? నెల తిరక్కుండానే వచ్చే బ్యాంకు నోటీసులు ఒక వైపున్నాయి.
తాజాగా ఇళ్లు కూలుస్తామనే సర్కారీ ఉత్తర్వులు మరోవైపు ఉన్నాయి. ఈ మధ్య తరగతి జీవులకు మనశ్శాంతి లేకుండా ఇవి చేస్తున్నాయి.
అంతేకాదు రేపటి రోజును తలుచుకుంటే పుట్టెడు దుఃఖం- బండెడు బాధ. ఇవి మూసీ పరివాహక ప్రాంత నివాసుల వేదన.
ప్రజోపయోగం కాని పనులకు నిమిత్తం సేకరించే ఏ భూసేకరణైన వేదన కలిగించేదే.
మానవులకు కూడు, గూడు తొలి ప్రాధాన్యత. అవసరాలు, అత్యవసరాలు మరొక ప్రాధాన్యత. వినోదాలు, విలాసాలు మరొక ప్రాధాన్యత.
తమ ఓటర్లు ఏ తరగతికి చెందిన వారో పాలకులు గుర్తిస్తే ఆయా ప్రాధాన్యతలను బట్టి విధాన నిర్ణయాలను తీసుకుంటారు.
తెలంగాణ రాష్ట్రంలో ఈ అంశంపైనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. దీనికి ప్రధాన కేంద్రం మూసీ అభీవృద్ధి ప్రణాళిక, దాని ఆచరణే.
మార్పులు చేర్పులు..
రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వెన్వెంటనే ఆయన తీసుకున్న నిర్ణయం మూసీ రివర్ ఫ్రంట్.
గత ప్రభుత్వమూ ఈ ప్రాజెక్టు గురించి చర్చించింది. ప్రణాళికలను సిద్ధం చేసింది.
గత ప్రభుత్వపు ఆచరణలో నివాసాల కూల్చివేత లేదని మొన్నీ మధ్య బీఆర్ఎస్ నాయకులు, ప్రభుత్వ వర్గాలు చెప్పాయి.
ప్రస్తుత ప్రభుత్వం మూసీ సుందరీకరణ బడ్జెట్ లక్ష కోట్లని చెప్పింది. అనంతరం, ఆ నెంబర్ కాస్తా మార్చింది. ఆ తర్వాత అందులో మరిన్ని మార్పులు చేసింది.
హైడ్రా పేరుతో తొలుత హడావిడి చేసినా ఆ తర్వాత తన ఆలోచనను మార్చుకున్నది. ఆచరణా మారింది.
ఆ సందర్భంలోనే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు ప్రజల నుంచి వ్యక్తం అయ్యాయి.
సర్పంచ్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల ఫలితాల తీరు చూసి తమకు అనుకూలంగా జనాభిప్రాయం ఉందని భ్రమిస్తే ఎవరు చేయగలిగిందేమి లేదు.
సహజంగా ఏదేమి ప్రజోపయోగ భవిష్యత్తు ప్రణాళిక- సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్ ప్రాజెక్టులు, రద్దీని దృష్టిలో ఉంచుకోని రోడ్ల విస్తరణవంటి తదితర అంశాలు మినహాయింపు కింద చూడవచ్చు.
గతంలో చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు- హైదరాబాదుతోపాటు పలు జిల్లా కేంద్రాలలో నివాస గృహాలను కూల్చి రోడ్ల విస్తరణ చేపట్టారు-టూరిజం కోసం కాదు సుమా!
దృష్టిలో పెట్టుకోవాలి..
ఏ ప్రభుత్వమైనా తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో తమ భవిష్యత్తు కార్యాచరణను వ్యక్తీకరిస్తుంది. అట్లా చెప్పాలి కూడా.
అందులో కొన్ని అమలు చేయకపోయినా ప్రజలు అర్థం చేసుకుంటారు. చెప్పనివి అమలు చేసినా బహిరంగంగా ప్రశంసించకపోయినా ఓటు ద్వారా తమ అభిమానాన్ని, అభిప్రాయాన్ని వ్యక్తీకరిస్తారు.
ప్రభుత్వ కార్యాచరణ దీనికి విరుద్ధమైతే తమ తీర్పును మరో రకంగా వ్యక్తం చేస్తారు.
ఈ రెండు సందర్భాలు గత ప్రభుత్వం చవిచూసింది. గత ప్రభుత్వం చేసిన కొన్ని లోపాలే ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పునాదులు.
ఈ ప్రభుత్వ హయాంలో ఏక వ్యక్తి కేంద్రంగా పాలన సాగడం లేదనే భావన ప్రజల్లో ఉన్నది.
ఎన్నికల ముందు తాను హామీలను అమలు చేస్తునట్టుగా కొన్ని విషయాల్లో ఈ సీఎం వ్యవహారశైలి కనిపిస్తున్నది.
మరికొన్ని విషయాలలో అందుకు విరుద్ధంగా ఉన్నది. ఇదే తెలంగాణ మేధోవర్గాన్ని, మధ్య తరగతిని తీవ్ర వేదనకు గురిచేస్తున్నది.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సాధారణ వ్యక్తులు కూడా పట్టుదల ఉంటే ఉన్నత శిఖరాలను అధిరోహించొచ్చనే ఆలోచనకు సింబాలిక్‌గా ఆయన కనిపిస్తున్నారు.
పదవిలోకి వచ్చిన తర్వాత ఎవరి బాగుకోసం ఏ విధానాలు అనే చర్చ జన బాహుళ్యంలో జరగడానికి కారణమవుతోంది.

ప్రజాగ్రహం తప్పదు..
ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు రెండవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత తన ఆలోచనలను, ఆచారణను మరింత వేగిరం చేశారు.
ఆనాటికి రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తున్నది. తెలంగాణలో ఆకలి చావులు, వలస చావులు, వడదెబ్బ మృతులు, కరెంటు ప్రమాదాలు, రైతుల ఆత్మహత్యలతో దుఃఖపూరితమై ఉన్నది ఆ కాలం. ఈ బాధలన్నింటికీ పర్యవసానమే స్వతంత్ర రాష్ట్ర తెలంగాణ ప్రస్థానం.
ఈ ప్రాంతం గురించి నాటి పాలకులకు బాధ్యతరాహిత్యం కరెంటు ఛార్జీల పెంపుదల ఒక ఉదాహరణ. వెరసి తెలంగాణ కన్నీటి కడలి అయ్యింది.
ఆ సమయంలోనే చంద్రబాబు నాయుడు అంతర్జాతీయ క్రీడోత్సవాలను హైద్రాబాదులో నిర్వహించారు. దీనిపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షేత్ర స్థాయి ప్రజా సమస్యలను పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రజలు గద్దె దించారు- ఇది గతం.
ఇచ్చిన హామీల అమలు..
మన తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన సమస్యలు నిరుద్యోగం, రైతులకు గిట్టుబాటు ధర, వ్యవసాయం- దీని అనుబంధ రంగాల అభివృద్ధి, దీంతో పాటు ప్రజా సంక్షేమం కీలకాంశాలు. దానికి మించి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను ప్రజలకు హామీగా ఇచ్చింది. ఇందులో ఎన్ని అమలు చేశారో వారికే తెలియాలి.
జనాభిప్రాయానికి వారి మనోభావాలకు భిన్నంగా వెళ్తే, వారి ప్రేమాభిమానాలకు ఎంతటి నాయకులైన దూరం కాకతప్పదు. మూసీ సుందరీకరణ, నైట్ బజారుల వ్యాపారం ప్రధానమా లేక మధ్య తరగతి ఉద్యోగ జీవుల నివాసాలను నిలబెట్టడము ప్రధానామా!- వీటిలో దేని ద్వారా ప్రజల ప్రేమాభిమానాలకు పాత్రులు కావాలో పెద్దలే నిర్ణయించుకోవాలి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
