చాలా కాలం తర్వాత ప్రధాని మోడీ మళ్లీ స్వదేశీ జపాన్ని మొదలు పెట్టారు. ఇందులో భాగంగా పండుగ వేళ్లలో దేశియ వస్తువులనే కొనాలని ప్రజలకు పిలుపునిచ్చారు. “స్వదేశీ వస్తువుల కొనుగోలు వల్ల ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు చేయూతనివ్వడం ద్వారా ఆర్ధిక వ్యవస్థ బలపడి, దేశం స్వయంసమృద్ధిని సాధించే అవకాశాలున్నాయ”ని మోడీ పేర్కొన్నారు.
భారతీయ దిగుమతులపై అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ భారిగా సుంకాలు విధిస్తున్నారు. భారతదేశానికి వ్యతిరేకంగా ట్రంప్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీనికి స్పందనగా ఏమీ చేయకుండా మోడీ చేతులెత్తేశారు.
ఒర నుంచి బయటకు తీసిన దేశభక్తి అస్త్రం..
ఈ నేపథ్యంలో మళ్లీ స్వదేశీ, స్థానిక వస్తువుల ప్రాముఖ్యతపై ప్రజలకు మోడీ పాఠాలు నేర్పుతున్నట్లు కనబడుతుంది.
2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ స్వదేశీ, స్థానిక వస్తువులు అంటేనే చీదరించుకునే వారు. మాట్లాడితే చాలు చీటికి మాటికి గ్లోబల్ ఎకానమీ, ప్రపంచంలోనే భారత్ మూడవ ఆర్ధిక శక్తిగా అడుగులు వేస్తుందని ప్రజలను ప్రలోభపెడుతూ వచ్చారు. ఇప్పుడు వాటి గురించి మాట్లాడకుండా స్వదేశీ, స్థానిక వస్తువుల గురించి చెప్పడం చూస్తే హాస్యాస్పదంగా ఉంది.
భారతీయ కుటీర, చిన్న, మధ్య, భారీతరహా పారిశ్రామిక రంగాల పరిస్థితిని సమీక్షిస్తే- ఆశ్చర్యకరమైన వాస్తవాలు వెలుగు చూస్తాయి. 2014 నుంచి ఇప్పటి వరకు దేశంలో దాదాపు లక్షల సంఖ్యలో పరిశ్రమలు, కంపెనీలు మూతపడ్డాయి.
దేశానికి ఎనలేని సేవలందించి, లాభాలతో పనిచేస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను నష్టాల పేరుతో పెట్టుబడులను ఉపసంహరింపజేసి- చివరకు వాటిని ప్రైవేటుపరం చేసిన వైనాన్ని ఎవరు కూడా మర్చిపోరు.
బీజేపీ అధికరంలోకి వచ్చిన వెంటనే 2014 సెప్టెంబరు 25న “మేకిన్ ఇండియా” పేరుతో ఒక కొత్త పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, తయారీ రంగంలో ఏటా 14శాతం వృద్ధి రేటును 2022 నాటికి పెంచడం. అంతేకాకుండా జీడీపీలో తయారీ రంగం వాటాను 25 శాతానికి పెంచి, ఈ రంగంలో 10 కోట్ల ఉద్యోగావకాశాలను కల్పించడం.
అధికారిక వివరాలలో ఆసక్తికరమైన విషయాలు..
గడిచిన రెండేళ్ళలో వేల సంఖ్యలో స్టార్టప్‌లు, కంపెనీలు మూతబడ్డాయి. అందులో 2022- 23లో 84,801 కంపెనీలు; 2023- 24 నాటికి 28వేల స్టార్టప్‌లు, వీటితోపాటు 22,044 కంపెనీలు మూతపడ్డాయి.
ఇవే కాకుండా మరో 1.38 లక్షల కంపెనీల యజమానులు తమ కంపెనీలను మూసివేసుకోవడానికి నమోదు చేసుకున్నారు. గడచిన దశాబ్దకాలంలో దేశం నుంచి సుమారు మూడు వేల విదేశీ కంపెనీలు తమ కార్యకలాపాలను ఎత్తివేశాయి.
ఇదిలాఉండగా “2024- 25లో ఏప్రిల్ నుంచి, ఈ ఏడాది జనవరి 26 వరకు దేశంలో 17,654 కంపెనీలు షడ్డౌన్ చేసుకున్నట్టు”గా పార్లమెంటులో కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి హర్ష మల్హోత్రా లిఖిత పూర్వక సమాధానంలో తెలియజేశారు.
ప్రధాని కోరుతున్నట్లుగా స్వదేశీ వస్తువులను, స్థానిక వస్తులనే కొనుగోలు చేయాలంటే అవి చౌకగా ప్రజలకు అందుబాటులో ఉండాలి. కానీ పరిస్థితి అలా లేదు. లఘు, చిన్న తరహా పరిశ్రమలకు చేయూతనిచ్చి ప్రోత్సహించడానికి బదులుగా వాటిని పూర్తిగా నిర్వీర్యం చేయడమే ఇందుకు ప్రధాన కారణం.
దేశం మీద ఒక్కసారిగా ఎక్కడలేని ప్రేమపొంగి పండుగ వేళల్లో స్వదేశీ, స్థానిక వస్తువుల గురించి మోడీ మాట్లాడటం; పైగా వాటినే కొనాలని ప్రజలకు నిర్దేశించడం. పూర్తిగా మహాత్మా గాంధీ ఆలోచనలకు, భావజాలానికి వ్యతిరేకైన మోడీ నేడు గాంధీ తత్త్వాన్ని, భావజాలాన్ని అలవర్చుకోవాలని బోధించడం రెండు నాలుకల ధోరణికి నిదర్శనంగా నిలుస్తోంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
