ప్రధాని అధికార స్వరానికి ఆలంబనగా ఉంటూ వచ్చిన వ్యక్తికి ఇప్పుడు అధికారాలు తగ్గించబడినట్టుగా చెబుతున్నారు. ఇంతకు ఎవరతను? ఎందుకిలా జరిగింది?
న్యూఢిల్లీ: ప్రధాని మోదీకి సంబంధించిన ఢిల్లీ విశ్వవిద్యాలయ, గుజరాత్ విశ్వవిద్యాలయ డిగ్రీలు అసలైనవా కాదానే దానిపై ఒక పెద్ద రాజకీయ వివాదం చెలరేగింది. అప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ)కింద, ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ)మోదీ డిగ్రీలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర సమాచార కమిషన్‌కు(సీఐసీ) లేఖ రాశారు.
రాజకీయ పార్టీల ఆరోపణలు– ప్రత్యారోపణలు, పత్రికా సమావేశాలతో ఇదొక జాతీయ చర్చకు దారితీసింది.
న్యూఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయంలో నియమించబడి, ప్రత్యేక విధుల కోసం అధికారిగా(ఓఎస్డీ) మోదీ కనుసన్నల్లో పనిచేస్తున్న హిరెన్ జోషి– ఈ విషయంపై వాట్సాప్ ద్వారా అప్పటి గుజరాత్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఎంఎన్ పటేల్‌ను సంప్రదించారు.
మోదీ డిగ్రీలకు సంబంధించిన సమాచారాన్ని పంచుకోవాలని విశ్వవిద్యాలయాలను కేంద్ర సమాచార కమిషన్ ఆదేశించిన రోజున– మార్క్షీట్లను పంచుకోవడానికి పటేల్ నిరాకరిస్తూనే; ఆరు నెలల క్రితం మోదీ విద్యార్హతల వివరాలను ప్రధానమంత్రి కార్యాలయంలోని హిరెన్ జోషికి వాట్సాప్ ద్వారా పంపినట్లు విలేకరులకు తెలియజేశారు. “పీఎంఓ లేదా సీఐసీ నన్ను ఆదేశిస్తే, నేను మీడియాకు కాపీలను ఇవ్వగలను” అని ఆయన అన్నారు.
ఇలాంటి సంక్షోభాల నియంత్రణలోనే మోదీకి కుడిభుజంగా ఉంటారనే పేరు జోషికి ఉంది.
2014లో ప్రధానమంత్రి పీఠాన్ని మోదీ అధిష్టించక ముందు కూడా తనకు జోషి నీడలా వెన్నంటే ఉంటూ, ఇతరులు చేయలేని లేదా చేయని పనులను చేసేవారు. మోదీ పదవీకాలంలో దాదాపు దశాబ్దకాలం పాటు, జోషి ఏం చేసేవారో ఎవరికీ తెలియదు. కనీసం ఎవరూ తనను చూసి కూడా ఉండలేదు. ప్రధానమంత్రి వెబ్సైట్లో, తన ఇతర సిబ్బందితో పాటు జాయింట్ సెక్రటరీగా తను పేర్కొనబడ్డారు. కొందరు తనను మోదీ మీడియా సలహాదారని పిలిచారు. మరికొందరు తనను మోడీకి సాంకేతిక విషయాలలో సహాయకుడన్నారు.
భారతదేశంలో జరిగిన 2023 జీ-20 సమావేశాల సందర్భంగా విడుదలైన ఒక ఫోటోలోఉన్నప్పుడే ప్రపంచం తనను మొదటిసారి చూసింది.
ఈ కథనం కోసం, ది వైర్ డజనుకుపైగా సంపాదకులను, విలేకరులను సంప్రదించింది. వీరిలో కొందరు గతంలో జోషి గురించి బహిరంగంగా మాట్లాడారు. అయితే, వారందరూ తనతో తమ సంభాషణలను గుర్తుచేసుకోవడానికి తటపటాయించారు. జోషిని కొన్నిసార్లు కలిసిన ఒక జర్నలిస్ట్– మోదీకి “ద్వారపాలకుని” గా తనను అభివర్ణించారు. సూటిగా కానీ మృదువుగా మాట్లాడే జోషి– ప్రధాని ప్రతిష్ట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవారని, పత్రికలు ఏమి రాస్తున్నాయో నిశితంగా గమనించేవారని జర్నలిస్టు చెప్పారు.
2017లో జోషి గురించి బహిరంగంగా ప్రస్తావించిన మొదటి వ్యక్తులలో జర్నలిస్ట్, గతంలో బీజేపీతో సంబంధమున్న రాజకీయ నేత అరుణ్ శౌరి ఒకరు. “మోదీకి ప్రధానమంత్రి కార్యాలయంలో హిరెన్ జోషి అనే వ్యక్తి నేతృత్వంలో ఒక పూర్తి బృందం ఉంది. వారి ఏకైక పని సోషల్ మీడియాను పర్యవేక్షించడం, ప్రధానమంత్రికి తగిన సమాచారం అందిస్తూ ఉండటం” అని తను చెప్పారు.
పతనం
జోషి ఉద్వాసన గురించి డిసెంబర్ ప్రారంభం నుంచి సోషల్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ గుసగుసలు త్వరగానే పూర్తిస్థాయి ఊహాగానాలుగా మారాయి, అక్రమ బెట్టింగ్-యాప్ నెట్వర్క్ మహాదేవ్ యాప్‌తో తనకు సంబంధం ఉందని ఆరోపిస్తూ(https://www.youtube.com/watch?v=dF0vn5j9T38), ధృవీకరించబడని వైరల్ వాదనల కొత్త పరంపర ఒకటి వచ్చి చేరింది.
ఈ బెట్టింగ్ యాప్ చట్టవిరుద్ధమైన ఆన్లైన్ జూదానికి ఒక ప్రముఖ వేదికగా ఉంది.
మన దేశంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ)లు నిర్వహిస్తున్న మనీలాండరింగ్(అక్రమ ధనాన్ని క్రమబద్ధంగా చూపడం) దర్యాప్తులో ఇది ఒక ప్రధాన ఆరోపణ. కొంతమంది రాజకీయ నాయకులు, మరికొంతమంది జర్నలిస్టులు, ఒక మహిళతో పీఎంఓ సాన్నిహిత్యాన్ని ప్రశ్నిస్తూ– తన రాజకీయ మద్దతును లేవనెత్తుతున్నారు.
ఈ పరిణామాలన్నింటి మధ్య, కాంగ్రెస్ పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి పవన్ ఖేరా కూడా ఒక విలేకరుల సమావేశంలో జోషిపై ఆందోళన వ్యక్తం చేశారు. జోషి పీఎంఓలో అత్యంత శక్తివంతమైన వ్యక్తి అని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో పారదర్శకతను డిమాండ్ చేస్తూ ఆయన, “హిరేన్ జోషి పీఎంఓలో కూర్చుని ఎలాంటి వ్యాపారం చేస్తున్నారో తెలుసుకునే హక్కు దేశానికి ఉంది. అది ఏ బెట్టింగ్ యాప్? తనకు ఏ విదేశీ భాగస్వాములు ఉన్నారు? ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇవ్వకపోతే, ఈ ఆరోపణలు ఇలాగే కొనసాగడం సహజం” అని అన్నారు.
ఖేరా ఆరోపణలను నివేదించిన కొన్ని మాధ్యమాలలో ఒకటైన “ది ప్రింట్”, దాని వెబ్సైట్ నుంచి అదృశ్యమయ్యే ముందు, ఆ కథనాన్ని క్లుప్తంగా ప్రచురించింది. మోదీ హయాంలో మీడియా అనుభవించిన ఒత్తిడిని ఇది ఎత్తి చూపుతుంది. ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచికలో భారతదేశం ఇప్పుడు 180 దేశాలలో 151వ స్థానంలో ఉంది. మోదీ యుగంలో సమాచారంపై అధికారం ఒక కేంద్రీకృత యంత్రాంగము చేతిలోకి వెళ్ళిపోయింది. ఇక్కడే సందేశాలను రూపొందించడం, సరిజూడటం, ఖచ్చితత్వంతో విడుదల చేయడం జరుగుతాయి. ఈ వ్యవస్థ కేంద్ర స్థానంలో విచక్షణతో కూడిన శక్తివంతమైన ప్రధాని మీడియా సహాయకుడిగా జోషి ఉన్నారు.
అయితే విమర్శకులు, రాజకీయ ప్రత్యర్థులు మాత్రం మరింత ప్రతికూల చిత్రాన్ని చిత్రించారు. అందులో జోషి బీజేపీ ప్రచార యంత్రాంగానికి గుండెకాయగా నిలుస్తారు. చాలా మంది జర్నలిస్టులు, టెలివిజన్‌లో రాత్రిపూట జరిగే చర్చలకు తను తెరచాటు దర్శకత్వం వహిస్తారని; ఏ విద్వేషాలను రెచ్చగొట్టాలో, ఏ సత్యాలను పూడ్చిపెట్టాలో ఎంచుకుంటారని ఆరోపిస్తున్నారు. వార్తలు వెలువడే ముందు జాతీయ వార్తల ఎజెండాను కూడా తను నిర్ణయిస్తారు.
మోదీ విమర్శకులపై తను నివేదికలు తయారు చేస్తారని, సామాజిక మాధ్యమాల్లో వారి పోస్టులను, వారి ఆలోచనా ధోరణులను, వారి వ్యక్తిగత జీవిత కోణాలను కూడా శోధిస్తారని చాలా మంది జర్నలిస్టులు విడిగా చెబుతున్నారు. ప్రజల ఆలోచనా ధోరణులను ప్రభావితం చేయడానికి, అసమ్మతిని అణచివేయడానికి, ఇబ్బంది కలిగించే వాస్తవాలు వెల్లడికాకుండా చేయడానికి, ఆగ్రహావేశాల మూక దాడులతో విరుచుకుపడే బీజేపీ ఐటీ సెల్ డిజిటల్ ‘ట్రోల్ ఆర్మీ’ జోషి ఆదేశాల ప్రకారం నడుచుకుంటుందనేది బహిరంగ రహస్యమే.
నవంబర్‌లో లా కమిషన్ నుంచి హితేష్ జైన్ ఆకస్మిక రాజీనామాతో తన గురించి చర్చ మొదలైంది. ఈ పరిణామాన్ని అధికారికంగా ధృవీకరించినప్పటికీ, దానికి కారణాలను మాత్రం వెల్లడించలేదు.
జర్నలిస్టులు సిరిల్ సామ్, పరంజోయ్ గుహా ఠాకుర్తా రాసిన “ది రియల్ ఫేస్ ఆఫ్ ఫేస్బుక్(ఫేస్బుక్ అసలు రూపం)” అనే పుస్తకంలో– 2009 నుంచి జోషి, జైన్ ఇద్దరూ సన్నిహితులుగా ఉన్నారని పేర్కొన్నారు. జైన్ బ్లూక్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్‌తో సంబంధం కలిగి ఉన్నారు. ఆ ఫౌండేషన్ “ది ట్రూ పిక్చర్(వాస్తవ చిత్రం)” అనే తప్పుడు సమాచార వెబ్‌సైట్‌తో ముడిపడి ఉంది. మోదీ రచించిన పుస్తకాలను ప్రచురించింది.
ఇంకా మోదీని ప్రోత్సహించడానికి అంకితమైన 24 గంటల కేబుల్ టీవీ ఛానల్ “నమో టెలివిజన్” కోసం ప్రచార వీడియోలను నిర్మించింది. దీనికి సంబంధించి ఇంటర్వ్యూ కోరుతూ ది వైర్ పంపిన ఇమెయిల్‌కు జైన్ స్పందించలేదు.
డిసెంబర్ 2న మాజీ ఐఏఎస్ అధికారి నవనీత్ సెహగల్ దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియోలను నిర్వహించే స్వయంప్రతిపత్తి కలిగిన ప్రభుత్వ ప్రసార సంస్థ “ప్రసార భారతి” బోర్డు చైర్పర్సన్ పదవికి ఆకస్మికంగా రాజీనామా చేయడంతో మరో పగులు బయటపడింది. జోషికి బాగా ఇష్టమైన జర్నలిస్ట్ సుధీర్ చౌదరి భారీ ప్యాకేజీతో డీడీ న్యూస్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా నియమించబడేలా సెహగల్ చూసుకున్నారని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఒక జర్నలిస్ట్ ధృవీకరించారు.
ఈ పుకారు త్వరలోనే సోషల్ మీడియా నుంచి పార్లమెంట్ వరకు చేరింది. అక్కడ కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఈ విషయంలో పీఎంఓ నుంచి సమాధానాల కోసం ప్రభుత్వాన్ని ఒత్తిడి చేశారు.
ఆన్లైన్లో, ఈ కథనాలు మరింత గందరగోళంగా మారాయి. కొన్ని కథనాలు తనను రహస్యంగా పదవి నుంచి తొలగించారని చెప్పగా; మరికొన్ని తనను తిరిగి తన పదవిలో నియమించారని పేర్కొన్నాయి.
ఉత్తరప్రదేశ్‌లో ప్రజా సంబంధాల సంక్షోభాలను పరిష్కరించడంలో చాలా కాలంగా పేరుగాంచిన నవనీత్ సెహగల్, పీఎంఓలో పెద్ద పాత్రకు అందుబాటులో ఉండటానికే స్వచ్ఛందంగా రాజీనామా చేసి ఉండవచ్చనే కొత్త సిద్ధాంతం వెలుగులోకి వచ్చిందని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఒక కాంగ్రెస్ రాజకీయ నేత ఆరోపించారు. తన ఆకస్మిక రాజీనామాను నివేదిస్తూ, ది ప్రింట్ సెహగల్‌ను యూపీ ప్రభుత్వానికి, ముఖ్యంగా తన పదునైన మీడియా నిర్వాహణ నైపుణ్యాలకు ప్రసిద్ధి చెందిన, “ట్రబుల్షూటర్(సమస్యల పరిష్కర్త)”గా అభివర్ణించింది.
ఇంటర్వ్యూ కోరుతూ ది వైర్ పంపిన వాట్సాప్ సందేశానికి సెహగల్ స్పందించలేదు.
వివిధ వార్తా సంస్థలకు చెందిన జర్నలిస్టులు జోషి విషయంలో ఒక అప్రకటిత అవగాహన ఉందని చెబుతున్నారు. తన మాట వినడానికి నిరాకరించిన వారు తమ ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటారు. తను చెప్పినట్టుగా చేసేవారికి మాత్రం తన ఆదరణ పొందడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.
జోషికి విశ్వాసపాత్రులైన ఒక వార్తాసంస్థ యాంకర్‌కు, సీనియర్ అధికారైన తన భర్తకు జాతీయ రాజధాని ప్రాంతంలో ఒక ప్రతిష్టాత్మకమైన పోస్టింగ్ ఇవ్వడం ద్వారా ఆమెకు తగిన బహుమతే ఇవ్వబడిందని ఒక జర్నలిస్ట్ అనధికారికంగా మాట్లాడుతూ ఆరోపించారు.
” “నా కుమారుడి దేశ బహిష్కరణ’‘ అనే వ్యాసంలో, మోదీకి బహిరంగంగా మద్దతు ఇచ్చే తవ్లీన్ సింగ్, “జర్నలిస్ట్ ఆతిష్ తసీర్– ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా కార్డును రద్దు చేసినప్పుడు, మొదట్లో కేంద్ర ప్రభుత్వ చర్య ఒక అపార్థమని భావించి, హోంమంత్రిత్వ శాఖను సంప్రదించడానికి ప్రయత్నించాను” అని పేర్కొన్నారు.
“అయితే, మంత్రిత్వ శాఖను లేదా ప్రధానమంత్రి కార్యాలయంలోని హిరెన్ జోషిని సంప్రదించడానికి చేసిన ప్రయత్నాలు పదేపదే వృధా అయ్యాయి” అని కూడా తెలియజేశారు.
“అప్పుడే ఆతీష్పై చాలా ఉన్నత స్థాయిలో ఉన్న ఎవరో ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నారని నేను గ్రహించాను. టైమ్ మ్యాగజైన్ కవర్‌పై, నరేంద్ర మోదీ వక్రీకరించబడిన స్కెచ్, ‘డివైడర్ ఇన్ చీఫ్’ అనే పదాలతో, ఆ వ్యాసం ప్రచురితమైనప్పటి నుంచి ఈ భయం నా మనసులో తొలిచేస్తూనే ఉంది” అని ఆమె 2019లో రాశారు.
విపరీత చంచల స్వభావం కారణంగా, ప్రాపకం– శిక్షింపబడటాల మధ్య జోషి ఊగిసలాడుతూ; భారతీయ జర్నలిస్టులు, ఏ రిపోర్ట్ మెచ్చుకోబడుతుందో ఏ రిపోర్ట్ శిక్షించబడుతుందో, బాగానే నేర్చుకున్నారని విమర్శకులు పేర్కొన్నారు. బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రమణియన్ స్వామి ఒక ట్వీట్లో దీనినే ఇలా ప్రతిధ్వనింపజేశారు, “పీఎంఓలోని తన సహాయకుడు హిరేన్ జోషి ద్వారా మోదీ భారత మీడియా గొంతు నొక్కడం వల్ల మీడియా దాదాపు పావ్లోవ్ కుక్కలాగా మారింది”.
మనస్తత్వ శాస్త్రవేత్త ఇవాన్ పావ్లోవ్ ప్రయోగాలలో కుక్కలు, చేతనస్థితి ఆలోచనకు లోనుకాకుండా, ఉద్దీపనలకు యాంత్రికంగా స్పందించేలా అదుపులో పెట్టబడ్డాయి.
2017 ప్రారంభంలో హిందూస్తాన్ టైమ్స్ ఎడిటర్ శిశిర్ గుప్తా– జోషికి పంపిన ఇమెయిల్‌ను సమాచార హక్కు చట్టం ద్వారా బహిర్గతం చేసి– బహిరంగంగా ప్రచురించబడింది.
“కేంద్రానికి వ్యతిరేకంగా కేజ్రీవాల్” అనే శీర్షిక ఉన్న తన ఇమెయిల్‌లో హిందూస్తాన్ టైమ్స్ జర్నలిస్ట్, అప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రి తీసుకున్న తొమ్మిది నిర్దిష్ట నిర్ణయాలను జాబితా చేసి; వాటిని “కేజ్రీవాల్ ఉల్లంఘనలకు ఉదాహరణలు” అని పేర్కొన్నారు. బీజేపీ అధ్యక్షుడు లేదా పీఎంఓ నుంచి ప్రతిస్పందన కోరకుండా, సమాచారాన్ని మాత్రమే అందించే విధంగా ఈ ఈమెయిల్‌ను రూపొందించారని ఫ్రంట్‌లైన్ మ్యాగజైన్ నివేదించింది.
తదనంతరం– 2022లో జోషి జోక్యం గురించి బహిరంగంగానే కేజ్రీవాల్ మాట్లాడారు. జోషి మీడియా సంస్థలకు నిందాపూర్వక సందేశాలు పంపి, తమ ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రచారం ఇవ్వవద్దని, వార్తా ఛానళ్ల యజమానులు– ఎడిటర్లను బెదిరించారని తను ఆరోపించారు.
ఉత్థానం
జోషి ఎప్పుడూ మోదీకి సన్నిహితంగా ఉన్నప్పటికీ, పీఎంఓలో స్థానం కోసం తను పోరాడవలసి వచ్చింది.
2014లో మోదీ గుజరాత్ నుంచి ఢిల్లీకి మారినప్పుడు, తన మీడియా సలహాదారుడిని నియమించుకునే సూచనలు ఏవీ చూపించలేదు. “దానికి బదులు, గాంధీనగర్‌లో మోదీతో కలిసి పనిచేసిన, నిరాడంబరుడు, వివేకవంతుడైన 70 ఏళ్ల మాజీ సమాచార అధికారి జగదీష్ ఠక్కర్‌ను– తన ప్రజా సంబంధాల అధికారిగా పనిచేయడానికి ఢిల్లీకి పిలిపించారు” అని జర్నలిస్ట్ కూమీ కపూర్ పేర్కొన్నారు.
ఇంకా మాట్లాడుతూ, “గుజరాత్లో మోదీ ఒక మీడియా నమూనాపై పనిచేశారు. దాని మార్గదర్శక సూత్రం, ‘మీరు మాకు ఫోన్ చేయవద్దు, మేమే మీకు ఫోన్ చేస్తాము’. ముఖ్యమంత్రి కోరుకున్న విధంగా సమాచారం మీడియాకు అందించబడేది. కానీ అనధికారిక సంక్షిప్త సమావేశాలు, ప్రత్యేక సమాచారం కోసం అభ్యర్థనలు, ఆఖరికి ముఖ్యమంత్రి కార్యాలయాన్ని, సచివాలయాన్ని కానీ సందర్శించడానికి అనుమతి కోరడం కూడా నిరుత్సాహపరచబడేవి”అని ఆమె చెప్పారు.
పత్రికా ప్రకటనలను ఠక్కర్ చూసుకుంటుండగా, మోడీ ట్విట్టర్ ఖాతాను జోషి నిర్వహించేవారు. ఠక్కర్, జోషిల మధ్య తీవ్రమైన పోటీ ఉండేదని, పైగా ఇద్దరి మధ్య ఒక నిశ్శబ్ద యుద్ధం కూడా నడిచేదని జర్నలిస్ట్ ధీరేంద్ర కే ఝా పేర్కొన్నారు. ప్రధానమంత్రి ప్రతిష్టను పెంచడంలో వీరిద్దరూ ప్రధాన పాత్ర పోషించారు. వారిలో ఠక్కర్ సాంప్రదాయ మీడియా ద్వారా, జోషి ఇంటర్నెట్ ద్వారా ఈ పని చేశారు.
“మోదీ ఆధ్వర్యంలోని పీఎంఓ ఈ పత్రికా ప్రకటనలు, వాటి ఆధారంగా సంక్షిప్త ఎస్ఎంఎస్ సందేశాలను నిరంతరం విడుదల చేస్తూ ఉంటుంది. అవి చాలా వేగంగా వస్తుండటంతో, సమన్వయ లోపాలు తరచుగా జరిగేవి. ఈ లోపాలకు థక్కర్, జోషీలు ఒకరినొకరు నిందించుకునే వారని సమాచారం” అని ఝా పేర్కొన్నారు.
అయితే 2018లో ఠక్కర్ మరణించినప్పుడు, సౌత్ బ్లాక్‌లో మోదీకి కీలక వ్యక్తిగా జోషి మారారు.
మోదీ రెండవ పదవీకాలంలో, జోషి ప్రభావం సమాచార సాంకేతికత, సోషల్ మీడియాలను దాటి మరింతగా విస్తరించింది. తనకు నీరవ్ షా, యశ్ రాజీవ్ గాంధీ అనే ఇద్దరు యువనిపుణులు సహాయకులుగా పని చేశారు. సోషల్ మీడియాలో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది అనుసరించే రాజకీయ నాయకులలో ఒకరిగా మోదీని మార్చింది జోషీయే.
జోషి ఒక ఆర్ఎస్ఎస్ కుటుంబం నుంచి వచ్చారని చాలా కథనాలు చెబుతున్నాయి. ఆయనను పూణేకు చెందిన ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్‌గా, గ్వాలియర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ నుంచి డాక్టరేట్ పొందిన వ్యక్తిగా పేర్కొన్నాయి. రాజకీయాలు తనను ఆకర్షించే ముందు, రాజస్థాన్‌లోని భిల్వారాలో మాణిక్య లాల్ వర్మ టెక్స్టైల్& ఇంజనీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా 18 సంవత్సరాలకు పైగా జోషి బోధించారు.
2008లో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి మోదీ, కంప్యూటర్ ఇంజనీర్ల కోసం జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైనప్పుడు, జోషీ జీవితం అకస్మాత్తుగా మారిపోయింది.
జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్, “2014: ది ఎలక్షన్ దట్ చేంజ్డ్ ఇండియా (ఇండియాను మార్చివేసిన ఎన్నికలు)” లో వివరించినట్టుగా, ఒక సాంకేతిక లోపం ఆ కార్యక్రమాన్ని దాదాపు నిలిపివేసింది – జోషి ముందుకు వచ్చి దాన్ని అక్కడికక్కడే సరిచేసే వరకు.
ప్రశాంతచిత్తంతో తను ప్రదర్శించిన సామర్థ్యం మోదీని ఆకట్టుకుంది. అది చాలు – జోషిని తన “ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ” గా మోదీ ఎంపిక చేసుకోవడానికి. ఆ క్షణం నుంచి జోషి, మోదీ డిజిటల్ ఉనికికి సంరక్షకుడిగా మారి, తన సోషల్ మీడియా, సాంకేతిక వ్యూహాలను రూపొందించారు. మోదీ డిజిటల్ ఉనికిని తను రూపుదిద్దడమే కాకుండా, మోదీ గుజరాత్ వారసురాలు ఆనందిబెన్ పటేల్ వెబ్‌సైట్‌ను కూడా జాగ్రత్తగా చూసుకున్నారు.
జోషి ప్రతిరోజూ ఉదయం మోదీని కలిసి, భారతదేశంలోని సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చల సారాంశాన్ని తనకు నివేదించేవారని అనేక వార్తలు తెలియజేస్తున్నాయి. తను కేవలం తాజా సమాచారాన్నే కాకుండా, దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ కార్యకర్తలు– సాధారణ ప్రజల అభిప్రాయాలను కూడా తీసుకువచ్చేవారు. అనేక విశ్లేషణాత్మక సాధనాలను ఉపయోగించి, ప్రధానమంత్రి దినచర్యను తను రూపొందించేవారు. మోదీ ఎన్నికల ప్రచారానికి వెళ్లినా, ఏదైనా అంతర్జాతీయ పర్యటనకు వెళ్లినా, జోషి దాదాపు ఎప్పుడూ తన పక్కనే ఉండేవారు.
సర్దేశాయ్ తన పుస్తకంలో రాసిన దాని ప్రకారం, మోదీ ప్రజలు ట్విట్టర్లో ఏమి మాట్లాడుకుంటున్నారో ఎంతగా గమనిస్తుండేవారంటే– సర్దేశాయ్ భార్య, అప్పటి సహోద్యోగి అయిన సాగరిక ఘోష్– మోదీ భార్య గురించి ట్వీట్ చేసినప్పుడు, మోదీ ఫోన్లో సర్దేశాయ్తో “అరే, నువ్వు– నీ భార్య ఈ మధ్య ట్విట్టర్లో చాలా చురుకుగా ఉంటున్నారే!” అని అన్నారట. ఘోష్ చేసిన ఆ ట్వీట్ల కారణంగా సీఎన్ఎన్-ఐబీఎన్ ఛానెల్ యాజమాన్యం నుంచి ఆమెకు మందలింపు ఎదురైంది. ట్విట్టర్లో మోదీని విమర్శించవద్దని ఆమెను కోరారు.
ది వైర్‌తో మాట్లాడుతూ, జర్నలిస్ట్ పరంజోయ్ గుహ ఠాకుర్తా జోషి గురించి క్లుప్తంగా ఇలా అన్నారు, “నేను హిరెన్ జోషిని ఎప్పుడూ కలవలేదు. కానీ ఇటీవలి కాలం వరకు తను భారతదేశంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తులలో ఒకరని నమ్మడానికి నాకు కారణాలు ఉన్నాయి. బీజేపీ ఐటీ సెల్ ఈ మొత్తం వ్యవస్థకు వాస్తవానికి అమిత్ మాలవ్య నాయకత్వం వహించడం లేదు. దీని వెనుక ఉన్న సూత్రధారి హిరెన్ జోషి. ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే న్యూస్ ఛానెళ్ల యాంకర్లను తను సంప్రదిస్తారని నాకు తెలుసు. ఆ ఛానెళ్లను జర్నలిస్ట్ రవీష్ కుమార్ ‘గోదీ మీడియా’ అని పిలుస్తారు.”
రెండు దశాబ్దాలకు పైగా అనుభవమున్న ఒక సీనియర్ ఎడిటర్, టీవీ వార్తలపై జోషి ముద్రను ప్రతిబింబిస్తూ– “కరోనావైరస్ వ్యాప్తి సమయంలో, తబ్లిఘీ జమాత్ చుట్టూ అల్లబడిన తీవ్ర సంచలన వార్తలు, ‘కరోనా జిహాద్’లాంటి పదబంధాలు, ఇతర రెచ్చగొట్టే లేబుళ్ళు ప్రధాన వార్తా సమయాల్లో పదేపదే వినిపించాయి, కనిపించాయి. అవి నా దృష్టిలో పైనుంచి నెట్టబడిన కథనాలు” అని అన్నారు.
“హిందీ– ఇంగ్లీష్ టీవీ ఛానెళ్ల నుంచి చాలా మంది ఎడిటర్లు, ముస్లిం సమాజంపై మరింత దృష్టి పెట్టాలని కోరబడుతూ, వారాలపాటు పీఎంఓ నుంచి వాట్సాప్ సందేశాలను అందుకున్నారనేది బహిరంగ రహస్యం”అని కూడా అన్నారు. ప్రధాన స్రవంతి టీవీ వార్తలపై వారాల తరబడి రుద్దబడిన పుకార్ల పరంపర, తబ్లిఘీ జమాత్ ఎపిసోడ్‌ను సంచలనాత్మకమైన, మతతత్వ కథనంగా మార్చింది. తరచుగా పెరుగుతున్న కోవిడ్ కేసులకు ముస్లింలు సమిష్టిగా బాధ్యులని చూపబడింది. ఈ ప్రచారం, దీర్ఘకాలిక సామాజిక పరిణామాలను కలిగి ఉండి, తరువాత కోర్టులు, పరిశోధకులు, వార్తా సంస్థలచే విమర్శించబడింది.
కొన్ని నెలల తర్వాత బీహార్ ఎన్నికల సమయంలో కూడా, నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత రాజకీయ వాతావరణం వేడెక్కిన సందర్భంలో, అదే ధోరణి మళ్లీ కనిపించిందని ఆ సంపాదకుడు ఆరోపించారు. “ఎన్నికల లబ్ధి పొందడం కోసం, రాజ్‌పుత్ భాగస్వామి రియా చక్రవర్తిపై తీవ్రమైన వేధింపుల ప్రచారాన్ని జోషి నడిపించారు”అని ఆ సంపాదకుడు ఆరోపించారు. రెండు నెలల పాటు బుల్లి తెరపై సాగిన ఈ సంచలన ప్రసారాల వెల్లువ, ఒక మానసిక ఆరోగ్య సమస్యను జాతీయ ప్రదర్శనగా మార్చింది. ఇది నియంత్రణా సంస్థలు, న్యాయవ్యవస్థ మీడియాను మందలించడానికి దారితీసింది.
ఠాకూర్తా తన పుస్తకంలో ఇంకా పేర్కొన్నదేమిటంటే, జోషి కేవలం బీజేపీ ఐటీ సెల్‌ను పర్యవేక్షించడమే కాకుండా– బడా సాంకేతిక కంపెనీల ప్లాట్‌ఫామ్‌లపై కూడా గణనీయమైన ప్రభావాన్ని చూపారు.
2020లో బీజేపీ పట్ల పక్షపాతం చూపుతున్నారనే ఆరోపణల మధ్య ఫేస్బుక్ పబ్లిక్ పాలసీ అధిపతి అంఖీ దాస్ రాజీనామా చేసిన తర్వాత; ఆ కంపెనీ భారతదేశ, దక్షిణాసియా కార్యకలాపాలకు శివనాథ్ థుక్రాల్ అధిపతిగా నియమితులయ్యారు. మోదీ, పీఎంఓ, బీజేపీ– కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ కోసం డిజిటల్ సాధనాలను అభివృద్ధి చేసిన ఓపలినా టెక్నాలజీస్‌తో గతంలో తనకున్న అనుబంధం కారణంగా, ఈ నియామకం మీడియా వర్గాలలో ఆశ్చర్యం కలిగించింది. మెటా పబ్లిక్ పాలసీ ఉపాధ్యక్షుడిగా థుక్రాల్ పనిచేసి ఉన్నప్పటికీ, గతంలో తను జోషితో సన్నిహితంగా పనిచేశారని నివేదికలు వచ్చాయి. ఇది రాజకీయ, కార్పొరేట్ రంగాల ప్రాబల్య వ్యవస్థకు మరో కొత్త కోణాన్ని జోడించింది.
థుక్రాల్ పాత్ర, సీనియర్ ప్రభుత్వ అధికారులతో తనకున్న సంబంధం, అలాగే నిర్దిష్ట సమాచార వ్యాప్తిని ప్రోత్సహించడంలో కేంద్ర ప్రభుత్వ ప్రమేయం ఉందానే విషయాలపై అడగడానికి ది వైర్ మెటాను సంప్రదించింది. “ఇవి చాలా పాత విషయాలుగా కనిపిస్తున్నాయి. వీటిపై మేము గతంలో చాలాసార్లు బహిరంగంగా స్పష్టత ఇచ్చాము” అని మెటా ప్రతినిధి బదులిస్తూ, విలేకరిని ఒక పాత ప్రకటన వైపు మళ్లించారు.
గత సంబంధాలు, రాజకీయ సాన్నిహిత్యం, సాంకేతిక కంపెనీల ప్రాబల్యంతో కూడిన ఈ బుడగ 2025లో జరిగిన పలు రాజీనామాలతో పగిలిపోయింది. హితేష్ జైన్, నవనీత్ సెహగల్ల రాజీనామాలకు ముందే థుక్రాల్ మెటా నుంచి వైదొలిగారు.
ఢిల్లీలో 15 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న ఒక నాయకుడు మాట్లాడుతూ, “ఆపరేషన్ సిందూర్ తర్వాత పరిస్థితులు పూర్తిగా దిగజారిపోయాయి”అని అన్నారు.
కశ్మీర్‌లోని పహల్గామ్లో 26 మంది మృతికి దారితీసిన ఉగ్రవాదదాడుల తర్వాత, మే 7న భారతదేశం ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించింది. పాకిస్తాన్‌లోని బహుళ లక్ష్యాలపై సమన్వయంతో దాడులు చేసింది. నియంత్రణ రేఖ వెంబడి రెండు దేశాలు దళాలను సమీకరించడంతో ఉద్రిక్తతలు వేగంగా పెరిగాయి.
నాలుగు రోజుల తర్వాత, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో భారతదేశం– పాకిస్తాన్ మధ్య శాంతికి తాను వ్యక్తిగతంగా మధ్యవర్తిత్వం వహించానని పోస్ట్ చేశారు. ఈ ప్రకటన వెంటనే వివాదానికి దారితీసింది. ఆపరేషన్ సిందూర్ గురించిన మీడియా నిర్వహణ – భారతదేశం కరాచీ, లాహోర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ప్రధాన మీడియా సైతం గొంతెత్తి చేసిన ప్రసారాలు- కేంద్ర ప్రభుత్వాన్ని బాగా ఇబ్బంది పెట్టాయి. దీని గురించి ప్రపంచ మీడియాలో జరిగిన ప్రతికూల ప్రచారం, యుద్ధం మధ్యలో తప్పుడు మీడియా కథనాలతో సాయుధ దళాలు కలవరపడి పరధ్యానంలో పడటం దీనికి కారణాలు.
పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఆ రాజకీయ నేత మాట్లాడుతూ, “నరేంద్ర మోదీకి ‘విశ్వగురువు’ అనే ప్రతిష్ట చాలా ఇష్టమైన భావన. మోదీ దౌత్య సామర్థ్యానికి పెద్ద ఎత్తున ప్రచారం కల్పించడం ద్వారా, 2014 నుంచి హిరెన్ దీనిని జాగ్రత్తగా పెంపొందించారు. విదేశాలలో భారీగా నిర్వహించబడిన ప్రవాస భారతీయ కార్యక్రమాలు, భారతదేశాన్ని ప్రపంచ సమస్యల పరిష్కర్తగా చిత్రీకరించడం; యోగా దౌత్యం, కోవిడ్ సమయంలో వ్యాక్సిన్ దౌత్యం, 2023లో జీ20 శిఖరాగ్ర సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించడం- అందులో భాగాలు. ఇది మోదీని కేవలం భారతదేశ ప్రధానిగానే కాకుండా, ప్రపంచ రాజకీయ సరళిని ప్రభావితం చేసే ఒక రాజనీతిజ్ఞుడిగా కూడా ఆవిష్కరించింది”అని అన్నారు.
అయితే, ట్రంప్ స్వయంగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదిర్చానని పదేపదే చెప్పడం ప్రారంభించడంతో, జాగ్రత్తగా నిర్మించుకున్న ఆ ప్రతిష్టకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. భారత ప్రభుత్వం ఎలాంటి విదేశీ మధ్యవర్తిత్వం జరగలేదని గట్టిగా ఖండించినప్పటికీ, ట్రంప్ చేసిన ఆ వాదన ఉనికిలో ఉండటమే భారతదేశ ప్రతిష్టకు సమస్యను సృష్టించింది. భారతదేశం నిజంగా విశ్వగురువే అయితే, జాతీయ సంక్షోభ సమయంలో దానికి బయటి జోక్యం ఎందుకు అవసరమైందని మీడియా– మోదీ విమర్శకులు ప్రశ్నించారు.
ట్రోల్ నెట్‌వర్క్‌లు– అంతర్జాతీయ వ్యాఖ్యానాల ద్వారా తీవ్రరూపం దాల్చిన ఆన్లైన్ వాగ్వాదం, భారతదేశపు వ్యూహాత్మక స్వయంప్రతిపత్తికి భంగం వాటిల్లినట్టు కనిపించేలా చేసింది. ఊహించని ఒక విదేశీ వాదన, గందరగోళపు సమాచార యుద్ధాల తాకిడికి మోదీ విశ్వగురు ప్రతిష్ట బీటలు వారింది.
ఇంకా మాట్లాడుతూ, “దీనికి మోదీ జోషిని నిందించారు. తను సంక్షోభాన్ని నియంత్రించే నిర్వాహకుడు– సంక్షోభాన్ని నియంత్రించలేక పోయారు. మోదీ ఎంతో ప్రాణప్రదంగా చూసుకునే తన ప్రతిష్ట, 2024 ఎన్నికల తర్వాత ఇప్పటికే దెబ్బతింది. మోదీ నియంతృత్వ వైఖరి గురించి ఉన్న అభిప్రాయాన్ని ఎదుర్కోవడంలో హిరెన్ విఫలమయ్యారు. ఇంకా చెప్పాలంటే, విశ్వగురువనే ప్రతిష్ట దెబ్బతినడం వారి మధ్య సంబంధంలో శవపేటికపై చివరి మేకులా మారింది. అప్పటి నుంచి, ప్రధాన మంత్రి కార్యాలయంలో హిరేన్ బాధ్యతలు కత్తిరించబడ్డాయి”అని తెలియజేశారు.
ఒక మాజీ జర్నలిస్ట్ అనధికారికంగా మాట్లాడుతూ, “మోదీ పీఎంఓలో ప్రత్యేక విధుల్లో ఉన్న మరో అధికారి ప్రతీక్ దోషి ఆ ఖాళీ స్థానాన్ని దక్కించుకున్నారు. దోషి గతంలో పీఎంఓలోని పరిశోధన, వ్యూహాల విభాగానికి బాధ్యత వహించేవారు. మీడియా పోర్ట్‌ఫోలియోను దోషికి అప్పగించినప్పుడే జోషికి, దోషికి మధ్య విభేదాలు పెరిగాయి”అని అన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అల్లుడే దోషి.
వివరణాత్మక సమాధానం కోరుతూ రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపబడిన ‘ది వైర్’ ప్రశ్నలకు ప్రతీక్ దోషి కానీ ప్రధానమంత్రి కార్యాలయం కానీ స్పందించలేదు.
భారతదేశంలోని ఒక ప్రముఖ రాజకీయ నేతతో పనిచేస్తున్న సీనియర్ రాజకీయ సలహాదారులు ఒక అనధికారిక ఇంటర్వ్యూలో ప్రధానమంత్రి కార్యాలయంలో జరిగిన ఈ గొడవను ధృవీకరించారు.
“చివరిగా నేను విన్నదానిబట్టి నవంబర్ 13 హిరేన్ చివరి పని దినమని అనుకున్నాను. తను తన బాధ్యతలను ఇతరులకు అప్పగించడం ప్రారంభించారు. తనను గుజరాత్‌కు తిరిగి పంపుతున్నారని నేను అనుకుంటున్నాను. తను అంత శక్తివంతమైన వ్యక్తి కాబట్టి, తనను హఠాత్తుగా తొలగించడం సాధ్యం కాదు. తనకు ఎక్కడో ఒక చోట స్థానం కల్పించాలి. తనను రాజ్యసభకో ఇంకో చోటికో మోదీ పంపి ఉండేవారని నేను అనుకుంటున్నాను. ఇదంతా నిశ్శబ్దంగా జరుగుతోంది” అని ఆయన చెప్పుకొచ్చారు.
ఇంకా మాట్లాడుతూ, “కానీ ఎక్కడో ఏదో తేడా జరిగింది. 2025 నవంబర్ మొదటి వారంలో హిరేన్‌ను పదవి నుంచి తొలగిస్తున్నారనే పుకార్లు మొదలయ్యాయి. చివరికి, పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే మోదీపై ఒత్తిడి తెచ్చేందుకు ఎవరో హిరేన్ జోషి గురించిన సమాచారాన్ని బయట పెట్టారు. అనుకున్నంత సులభంగా తనను మోదీ తొలగించలేరని నేను భావిస్తున్నాను. రాజకీయ పుకార్లు ఆగే వరకు హిరేన్‌ను మరికొంత కాలం తన వద్దనే ఉంచుకోవలసి ఉంటుంది. అయితే ఇప్పుడు హిరేన్‌ను కొనసాగించడం కూడా సంక్లిష్టంగా మారింది. తన రహస్యం బయటపడింది. తను ఇప్పుడు ఒక ప్రముఖ వ్యక్తిగా మారారు”అని చెప్పారు.
వివరణాత్మక సమాధానం కోసం రిజిస్టర్డ్ పోస్ట్, వాట్సాప్‌ల ద్వారా “ది వైర్” హిరేన్ జోషిని సంప్రదించింది. తను స్పందిస్తే ఈ కథనం నవీకరించబడుతుంది.
బెట్టింగ్ యాప్ కుంభకోణం ఆరోపణల విషయానికొస్తే, “అవినీతి కారణంగా తనను మోదీ పక్కన పెట్టారనే ఆరోపణ చాలా హాస్యాస్పదమైనది. అలాయితే, తన పీఎంఓలోని ప్రతి ఒక్కరినీ తొలగించాల్సి వస్తుంది. పీఎంఓలో ఎవరైనా ప్రధానిని కలిసే అవకాశం కల్పించడం వంటి అత్యంత సాధారణ పనికి కూడా మంచి మొత్తంలో డబ్బు సంపాదించగలరు. అయితే, పీఎంఓలో పైకి కనిపించని అసూయ జోషిపై ఉండేదని నేను భావిస్తున్నాను. తను మోదీకి చాలా సన్నిహితంగా ఉండేవారు. ఇతర మంత్రిత్వ శాఖలలోని సీనియర్ ప్రభుత్వ అధికారులు కూడా జాయింట్ సెక్రటరీ హోదాలో ఉన్న జోషి ప్రధాని ద్వారా పనులను అంత సులభంగా ఎలా చేయించుకోగలరని జోకులు వేసుకునేవారు. ఒకానొక సమయంలో జోషి పీఎంఓలోని 70– 80 మంది అధికారుల వనరులను ఉపయోగించుకోగలిగేవారు. జోషి చాలా శక్తివంతుడు. తను ఒక బహిరంగ రహస్యం కావడమే తన శక్తికి కారణం”అని 2023 నుంచి హిరేన్ పనిని దగ్గరగా గమనించిన మాజీ జర్నలిస్ట్ చెప్పారు.
ఇంకా మాట్లాడుతూ, “రహస్యంగా వ్యవహరించడమనేది మోదీ నియమిత సీనియర్ అధికారులు అనుసరించే ఒక వ్యూహం. పైన ఒక నిరంకుశ పాలకుడు ఉన్నప్పుడు, మిమ్మల్ని మీరు మరీ ప్రముఖంగా చాటుకోకపోవడమే ఉత్తమం. పీఎంఓలోని ప్రతి ఒక్కరూ చాటుగా వ్యవహరిస్తారు. బయటపడటం ఎవరికీ మంచిది కాదు”అని తెలియజేశారు.
అనువాదం: శివనాగిరెడ్డి కొల్లి
ఈ వ్యాసాన్ని ఆంగ్లంలో చదవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
