
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత- జౌళి శాఖ మంత్రి సంజీవరెడ్డి సవితకు అత్యున్నత పౌరపురస్కారం బంగారు స్కోచ్ వరించింది. పోటీ పరీక్షల్లో బీసీ నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ అందజేసినందుకుగానూ సోషల్ జస్టిస్ సెక్యూరిటీ విభాగంలో ఈ అవార్డును అందజేశారు. అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం న్యూఢిల్లీలోని ఓక్ హాల్లో జరిగింది.
స్కోచ్ గ్రూప్ చైర్మన్ సమీర్ కొచ్చార్, ప్రొఫెసర్ మహేందర్ దేవ్ చేతుల మీదుగా మంత్రి సంజీవరెడ్డి సవిత అవార్డు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి సత్యనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. అవార్డు వరించడంతో సవిత సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఈ అవార్డు రావడంపట్ల ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమశాఖ ఉద్యోగులు కూడా ఆనందంవ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ, వెనుకబడిన తరగతులకు గౌరవ ప్రదమైన జీవనంతో పాటు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. బీసీ యువతకు ప్రభుత్వ నిర్వహణలో భాగస్వామ్యం కల్పిస్తూ, అధిక ఉద్యోగాల కల్పనకు పెద్దపీట వేస్తున్నామన్నారు. బడుగు, బలహీన వర్గాలకు సంక్షేమ ఫలాల అందించే దిశగా కార్యచరణ ఉందని చెప్పుకొచ్చారు.
బీసీ యువతకు సేవ..
ఆంధ్రప్రదేశ్ బీసీ నిరుద్యోగ యువతకు వివిధ పోటీ పరీక్షల కోసం బీసీ సంక్షేమ శాఖ ఉచిత శిక్షణ అందజేస్తోంది.
ఇందులో భాగంగా “బీసీ స్టడీ సర్కిళ్ల ఆధ్వర్యంలో మెగా డీస్సీకి ఆన్లైన్, ఆఫ్‌లైన్ ద్వారా బీసీ అభ్యర్థులకు ఉచితశిక్షణను అందజేశాము. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా నిర్వహించిన శిక్షణా కేంద్రాల్లో 1,674 మందికి, ఆన్లైన్ ద్వారా మరో 4,774 మందికి ఇలా మొత్తం 6,470 మందికి ఉచిత శిక్షణ ఇచ్చాము. ఇటీవల నిర్వహించిన మెగా డీఎస్సీలో శిక్షణ పొందిన వారిలో 246 మంది బీసీ అభ్యర్థులు టీచర్లుగా ఎంపికయ్యారు. విజయవాడలోని బీసీ స్టడీ సర్కిల్ ద్వారా 83 మందికి సివిల్ సర్వీసెస్ ఉచిత కోచింగ్ అందజేయగా, వారిలో గ్రూప్ 2 మెయిన్స్ కు 12 మంది, ఆర్ఆర్బీ లెవల్- 1కు పది మంది ఎంపికయ్యారు. అంతేకాకుండా ఎఫ్ఆర్ఓ ప్రిలిమ్స్‌కు ఇద్దరు, మెయిన్స్‌కు ఒకరు అర్హత సాధించారు” అని సవిత చెప్పారు.
తాము అందించిన సేవల వల్ల చాలామంది నిరుద్యోగ యువత ఉద్యోగాలకు అర్హత సాధించారని మంత్రి సవిత తెలియజేశారు.
బీసీ నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షల్లో ఉచిత శిక్షణ అందజేసినందుకుగాను ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు బీసీ సంక్షేమ శాఖకు స్కోచ్ గ్రూప్ ప్రకటించింది. అవార్డు రావడంతో మంత్రి సవిత ఆనందం వ్యక్తంచేశారు. అవార్డు స్ఫూర్తితో మరింత ఉత్సాహంగా పనిచేస్తామన్నారు.
బీసీ యువతకు మంత్రి హామీలు..
“రాబోయే కాలంలో బీసీ యువతకు అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందివ్వనున్నాము. అమరావతిలో అయిదెకరాల్లో బీసీ స్టడీ సర్కిల్ నిర్మిస్తాము. విశాఖ, రాజమండ్రి, తిరుపతి, అనంతపురంలో మెగా బీసీ స్టడీ సర్కిళ్లను నిర్మించే ఆలోచన ఉంది” అని సవిత పేర్కొన్నారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.