ఇది కేవలం ప్రసంగాల సమాహారం మాత్రమే కాదు; ప్రజాస్వామ్యాన్ని బలపరచే, కొత్త ఆలోచనలకు దారులు తీసే ఒక బృహత్తర ప్రయత్నం.
హైదరాబాద్: దేశంలో చర్చలు, వాదోపవాదాలు క్రమంగా తగ్గిపోతున్నాయి. దీంతో అజ్ఞానం, మూఢత్వం, మూర్ఖత్వం వైరస్‌లా వ్యాపిస్తోంది. దీనికి విరుగుడుగా, ప్రజల్లో ఆలోచనను రేకెత్తించే వాక్సిన్లాంటి చర్చల అవసరం ఎంతైనా ఉంది. దీనికి “మంథన్ సమ్వాద్” ఓ మంచి వేదిక.
స్వేచ్ఛగా ఆలోచనలు పంచుకునే వేదికగా నిలిచే మంథన్ సమ్వాద్, అక్టోబర్ 2న గాంధీజయంతి నాడు హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో నిర్వహించనున్నారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో– రచయితలు, శాస్త్రవేత్తలు, న్యాయవాదులు, కళాకారులు, జర్నలిస్టులు, విద్యార్థులు, సామాన్య పౌరులు పాల్గొననున్నారు. ఇలా అన్ని వర్గాల ప్రజలు ఒకే వేదికపైకి చేరి “ముఖ్యమైన విషయాల” గురించి చర్చించనున్నారు.
ఇది కేవలం ప్రసంగాల సమాహారం మాత్రమే కాదు; ప్రజాస్వామ్యాన్ని బలపరచే, కొత్త ఆలోచనలకు దారులు తీసే ఒక బృహత్తర ప్రయత్నం.
నాటి నుంచి నేటి వరకు..
2005లో మంథన్ ప్రారంభమైనప్పటి నుంచి ఒక విశేష వేదికగా నిలిచింది. ఇప్పటి వరకు 500కుపైగా ప్రసంగాలను నిర్వహించడం; 60,000 మందికిపైగా సభ్యులను కలిగి ఉండడం దీని విశ్వసనీయతకు నిదర్శనం. కీలకంగా మంథన్ ప్రత్యేకత ఏమిటంటే, ఇది ఎప్పుడూ ఎవరి పక్షానా ఉండకపోవడం, తనకంటూ రాజకీయ ఎజెండా లేకపోవడం మంథన్ ప్రత్యేకత.
ఈ కార్యక్రమంలో చర్చించే అంశాలు పౌరుల జీవితానికి నేరుగా సంబంధించినవి; అవేంటంటే ప్రజాస్వామ్యం, ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం, విజ్ఞానం, చరిత్ర, మానవ హక్కులలాంటి అంశాలు ఉంటాయి. 2012లో మొదలైన వార్షిక సమ్వాద్– ఇప్పుడు దేశవ్యాప్తంగా మేధావులు, విద్యార్థులు, సామాన్యులు ఎదురుచూసే ఒక పెద్ద ఆలోచనల వేదికగా మారింది. ప్రతీ ఏడాది గాంధీ జయంతి రోజున జరగడం కూడా దీని విలువను మరింత పెంచుతోంది.
విభిన్న రంగాల గొంతుకలు..
ఈసారి అతిథులుగా రాబోతున్నవారందరూ ఆయా రంగాల్లో ప్రత్యేక గుర్తింపు పొందినవారే. రక్షణ రంగ నిపుణుడు ప్రవీణ్ సాహ్నీ– దేశ భద్రత, సరిహద్దు పరిస్థితులు, అంతర్జాతీయ సంబంధాలపై తన లోతైన విశ్లేషణతో ప్రజల్లో అవగాహన కలిగించనున్నారు. 
అంతర్జాతీయంగా పేరుపొందిన కమెడియన్ వీర్ దాస్– తన హాస్యంతో కూడిన మాటలతో సమాజంలోని అన్యాయాలపై గొంతు వినిపించడంలో తనకు తనదైన ముద్ర ఉంది. చరిత్రకారుడు, అశోక యూనివర్శిటీ ఛాన్సలర్ రుద్రాంగ్షు ముఖర్జీ– భారత చరిత్రలోని కీలక ఘట్టాలను వర్తమానానికి అన్వయిస్తూ మాట్లాడనున్నారు.
అదే విధంగా ది వైర్ సీనియర్ ఎడిటర్ అర్ఫా ఖానమ్ షెర్వాణీ తన ధైర్యవంతమైన జర్నలిజం అనుభవాలతో పౌరహక్కులు, మీడియా స్వేచ్ఛలపై మాట్లాడనున్నారు. మాలిక్యులర్ బయాలజిస్ట్, నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎల్ఎస్ శశిధర– మన దైనందిన జీవితంలో సైన్స్ ఎంత ముఖ్యమో వివరించనున్నారు.
భారత ఆర్థిక వ్యవస్థ దిశపై ప్రజాహిత ఆర్థికవేత్త రథిన్ రాయ్ విశ్లేషిస్తారు. మానవ హక్కుల న్యాయవాది కొలిన్ గొంజాల్వేస్- రాజ్యాంగం, న్యాయం, సమాన హక్కుల గురించి చర్చించనున్నారు. ఈ ఉపన్యాసకులందరూ విభిన్న రంగాలను ప్రాతినిధ్యం వహిస్తూ, సమాజానికి అవసరమైన విస్తృత చర్చను తెరపైకి తీసుకురానున్నారు.
అందరికీ ఉచితం..
మంథన్ సమ్వాద్ పెద్ద ప్రత్యేకతలలో ఒకటి దాని ఉచిత ప్రవేశం. చాలా కార్యక్రమాలు, కాన్ఫరెన్సులు, మేధో వేదికలను నిర్వహించే సంస్థలు హాజరయ్యే వారి నుంచి భారీ ఫీజులను వసూలు చేస్తాయి. కొన్నిసార్లు ఒక టికెట్ కొనేందుకు వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ ఇటువంటి చర్చలపై ఆసక్తి కలిగినవారికి ఆర్థిక స్థోమత ఆటంకం కాకూడదన్నదే ఈ ఉచిత ప్రవేశ విధానం వెనుకున్న లక్ష్యం. జ్ఞానాన్ని పెంచుకోవాలనుకునే, ప్రముఖుల ఆలోచనలు తెలుసుకోవాలనుకునే– తమ ఆలోచనలను పంచుకోవాలనుకునే ప్రతి ఒక్కరికీ ఈ వేదిక తలుపులు తెరిచింది.
అయితే నిర్వాహణ వేదిక విస్తీర్ణంను దృష్టిలో పెట్టుకొని, హాజరుకాదల్చుకున్నవారు ముందుగానే ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు.
హైదరాబాద్‌లోనే ఎందుకు?
మంథన్ సమ్వాద్ కార్యక్రమం హైదరాబాద్‌లో జరగడం ఒక యాదృచ్ఛికం కాదు. ఈ నగరానికి ఉన్న చరిత్ర, సంస్కృతి, సామాజిక వాతావరణం దీనికి సరైన స్థలమని చెప్పవచ్చు.
హైదరాబాద్ ఎప్పటి నుంచో భిన్న సంస్కృతులు, భిన్న మతాలు, భిన్న ఆలోచనలను కలుపుకునే ప్రదేశంగా పేరు పొందింది. ఒకవైపు చారిత్రక వారసత్వం చార్మినార్, గోల్కొండ కోట, కుతుబ్ షాహీ సంప్రదాయాలు ఈ నగరానికి ఉన్న గొప్పతనాన్ని చూపిస్తే, మరోవైపు సైబరాబాద్, ఐటీ కారిడార్, అంతర్జాతీయ కంపెనీలు ఆధునికతకు ప్రతీకలుగా నిలుస్తాయి.
హైదరాబాద్ ఒకవైపు సంప్రదాయ విలువలను కాపాడుకుంటూనే, మరోవైపు కొత్త ఆలోచనలను స్వీకరించే నగరం. ఇదే మంథన్ స్ఫూర్తి కూడా— పాత, కొత్త ఆలోచనలను కలిపి కొత్త దిశలో ముందుకు తీసుకెళ్లడం. కాబట్టి మంథన్ సమ్వాద్ ఎప్పుడూ హైదరాబాద్‌ను తన వేదికగా ఎంచుకోవడం సహజమే.
మంథన్ సమ్వాద్ సందర్భంగా ప్రతీ సంవత్సరం దేశం నలుమూలల నుంచి విద్యార్థులు, ప్రొఫెసర్లు, ఆలోచనాపరులు, సామాన్య పౌరులు హైదరాబాద్‌కు వస్తారు. వారు ఇక్కడి చర్చలను విని కొత్త విషయాలు నేర్చుకుంటారు, తమ అభిప్రాయాలను పంచుకుంటారు. తిరిగి వెళ్లిన తర్వాత ఆ ఆలోచనలను తమ సమాజంలో పంచుకుంటారు. ఇలా మంథన్ కేవలం ఒక రోజు జరిగే సభ మాత్రమే కాదు, అది ఒక ఆలోచనల విత్తనం. ఆ విత్తనం హైదరాబాద్‌లో నాటబడుతుంది. ఆ విత్తనం వృక్షంగా మారి దాని శాఖలను దేశమంతటా విస్తరిస్తుంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
