
Reading Time: 5 minutes
28 నెలల పాటు మణిపూర్‌ను నిప్పుల గుండంగా మార్చిన ప్రభుత్వం, నేతలు జవాబుదారీతనం లేకుండా, కనీసం ఇంతమంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమయ్యామన్న భీతి కూడా లేకుండా స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఈ తరుణంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడలేనివారికి రాష్ట్రాన్ని పాలించే హక్కు లేదన్న మోడీ నినాదం డొల్ల నినాదంగానే మారుతుంది.
మే 2023లో మణిపూర్‌లో అల్లర్లు మొదలైన దాదాపు రెండున్నర సంవత్సరాల తర్వాత ప్రధాని మోడీ ఆ రాష్ట్రంలో పర్యటించారు.
రాష్ట్రం పట్ల, రాష్ట్ర ప్రజల పట్ల కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ఆందోళన చెందుతోందని లోకానికి చూపించుకోవడానికి ఈ పర్యటనను బీజేపీ శ్రేణులు ఉపయోగించుకుంటున్నాయి. కానీ వాస్తవాన్ని మార్చలేరు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఘర్షణలు జరిగిన వెంటనే రాష్ట్రానికి వెళ్లి బాధితులను పరామర్శించి మంటల్లో మసైన ప్రాంతాల్లో పర్యటించారు. దీనికి భిన్నంగా రాష్ట్రం మంటల్లో మాడిపోతున్నా మోడీ మాత్రం మౌనందాల్చారు. పల్లెత్తి మాట మాట్లాడలేదు. కనీసం రాష్ట్రంలో పర్యటించటం అలా ఉంచి విస్తరిస్తున్న జ్వాలలు చల్లార్చటానికి వీసమెత్తు ప్రయత్నం కూడా చేయలేదు.
రాష్ట్రం పట్ల బీజేపీ పక్షపాత వైఖరిని ఓటర్లు గమనించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని రెండు సీట్లల్లో బీజేపీ ఓడించి కాంగ్రెస్‌ను గెలిపించారు.
2017లో ఓ సందర్భంలో మణిపూర్‌లో మాట్లాడుతూ ‘‘రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడలేని వారికి రాష్ట్రాన్ని పాలించే హక్కు లేదు’’ అని ఘంటాపథంగా ప్రకటించారు. తర్వాతి కాలంలో ఈ మాటలు బూటకమేనని తేలింది. స్వయంగా కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ తిష్టవేసుకుని కూర్చున్న బీజేపీ ప్రభుత్వమే రాష్ట్రంలో ప్రజల ధనమానప్రాణాలకు రక్షణ కల్పించలేకపోయింది. కనీసం శాంతి భద్రతలకు గ్యారంటీ ఇవ్వలేకపోయింది. రాజకీయంగా తమ తప్పిదాలు కప్పిపుచ్చటం సాధ్యం కాదన్న విషయం తేలిపోయిన తర్వాత మోడీ మణిపూర్ నుండి వానప్రస్తం పుచ్చుకున్నారు. నిట్టనిలువునా చీలిపోయిన రాష్ట్రంలో మోడీ పర్యటన సందర్భంగా అపరిష్కారంగా మిగిలిపోయిన సమస్యలను గుర్తు చేసుకోవాలి.
1. రాష్ట్ర ఆయుధాగారం నుంచి దోచుకున్న ఆయుధాల గురించి..
సాయుధ ఘర్షణలు మొదలు కాగానే రాష్ట్రంలోని మెజారిటీ ఆదివాసీ తెగకు సంబంధించిన దుండగులు రాష్ట్ర ఆయుధాగారం నుంచి దొంగిలించిన ఆయుధాలు ఎక్కడున్నాయి? ఏమయ్యాయన్న ప్రశ్నకు సమాధానాలు రావల్సి ఉంది. మే 2023లో రాష్ట్ర ఆయుధాగారం నుంచి ఏకే 47, మోర్టార్లు వంటి ఆధునిక ఆయుధాలు చోరీకి గురయ్యాయి. ప్రభుత్వాలు ఎంతగా జబ్బలు చర్చుకుంటున్నా చోరికి గురైన ఆయుధాలు అన్నీ ఇంకా ఆయుధాగారానికి చేరలేదు. ఫలితంగా రాష్ట్రంలో పేట్రేగిన హింసాత్మక సంస్కృతి నేపథ్యంలో దొంగిలింపుకు గురైన ఆయుధాల గురించిన ఆందోళనలు పెరుగుతోంది. ఈ హింసా సంస్కృతి మొత్తంగా రాజ్య అధికారాన్నే సవాలు చేస్తోంది.
ఈ విధంగా ఆయుధాల చోరికి అడ్డుకట్ట వేసి ప్రభుత్వ ఆయుధ సంపత్తిని కాపాడలేని మోడీ ప్రభుత్వం చేసే శాంతి ప్రయత్నాలు ఏ మేరకు సఫలమవుతాయన్న భయాందోళనలు తొలగిపోలేదు. 

2. మెజారిటీ తెగల చేతుల్లో బలైన మైనారిటీ ప్రజలకు న్యాయం జరగటం..
కుకి జో తెగలు నివసించే ప్రాంతంలో ఉన్న బాధితుల దృష్టిలో న్యాయం కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో నిజాయితీ లేదని భావిస్తున్నారు. మైనారిటీ తెగల ప్రజలపై జరిగిన సామూహిక మారణకాండ, లైంగి హింసకు సంబంధించిన బహిరంగ సాక్ష్యాధారాలు, వీడియోలు అందుబాటులో ఉన్నా పరిమితమైన కేసుల్లో మాత్రమే శిక్షలు పడ్డాయి.
ఈ హింసకు పాల్పడిన ముద్దాయిలపై దర్యాప్తు, విచారణ విషయంలో కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు చురుకుగా వ్యవహరించటం లేదు. కొన్ని కేసుల్లో ఓ రకంగానూ, మరికొన్ని కేసుల్లో మరో రకంగానూ వ్యవహరిస్తున్నాయి. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని పార్లమెంట్లో వాగ్దానం చేశారు. అయినప్పటికీ అసలైన ముద్దాయిలు చట్టం గుప్పిట్లో నుండి తప్పించుకుని తిరుగుతున్నారు. దాంతో ఘాతుకాలకు బలైన కుటుంబాలు కనీస న్యాయం కోసం ఎదురు చూస్తున్నాయి.
శాంతి సాధన కోసం సాగాల్సిన ప్రయత్నాలు కేవలం మోడీ ప్రకటించే అభివృద్ధి పథకాల ద్వారా సాధ్యం కాదు.
3. తెగలవారీగా చీలిపోయిన రాష్ట్రం..
నిట్టనిలువునా చీలిపోయిన రాష్ట్రంగా ప్రస్తుతం మణిపూర్ మారింది. ఇంఫాల్ లోయలో మైతీలు ఆధిపత్యం ఉన్న ప్రాంతానికీ, కుకీల ఆధిపత్యం ఉన్న పర్వత ప్రాంతాలకు మధ్య ఉన్న సరిహద్దులను అటు అస్సాం రైఫిల్స్ బలగాలు, ఇటు సీఆర్పీఎఫ్ బలగాలూ కాపలా కాస్తున్నాయి. సాధారణ పరిస్థితులు నెలకొల్పటానికి బదులుగా రాష్ట్ర ప్రజల మధ్య ఏర్పడిన ఈ విభజనను శాశ్వతం చేయటానికి, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు దారితీస్తున్నాయి. ఇరు ప్రాంతాల్లోనూ వేర్వేరు పరిపాలనా విభాగాలు దేనికదే స్వతంత్రంగా పని చేస్తున్నాయి.
మోడీ ప్రభుత్వం ఈ విధమైన వేర్పాటువాద శక్తులముందు మోకరిల్లింది. అన్ని ప్రాంతాలనూ కలిపి ఒకేసారి అందరినీ ఉద్దేశించి మాట్లాడేందుకు బదులుగా మోడీ కూడా రెండు ప్రాంతాల్లోనూ వేర్వేరుగా పర్యటించి వేర్వేరు సందేశాలివ్వటం ద్వారా ఈ విభజనను శాశ్వతం చేస్తున్నారు.
4. ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ మాటలకు సంబంధించిన కేసు ఓ మచ్చుతునక..
బీరెన్ సింగ్ ఆడియో వాయిస్‌కు సంబంధించిన కేసును సుప్రీంకోర్టు నవంబరులో తదుపరి విచారణను చేపట్టనున్నది. మైతీ తెగకు చెందిన వారు ఆయుధాగారంపై దాడి చేసి ఆయుధాలు చోరీ చేసి దాడులకు పాల్పడేలా ప్రోత్సహిస్తూ ముఖ్యమంత్రి మాట్లాడారన్నది ఆరోపణ. ఆయన ఎవరితోనో ఫోన్లో మాట్లాడిన విషయం రికార్డు అయ్యింది. ఈ ఆడియో క్లిప్‌ను ఫోరెన్సిక్ లేబరేటరీ పరిశీలిస్తోంది. దీర్ఘకాలంగా ఫోరెన్సిక్ లేబరేటరీ తన నివేదికను ఇవ్వకుండా తాత్సారం చేయటం వెనుక అసలైన నిందితులను రక్షించేందుకు కేంద్రం ప్రభుత్వం ఎంతవరకు తెగించటానికి సిద్ధపడిందో వెల్లడవుతోంది. ఈ వైఖరిపై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేదు.
నిట్టనిలువునా చీలిపోయిన రాష్ట్రంలో శాంతి భద్రతలు సాధించేందుకు అర్థవంతమైన చర్యలు చేపట్టకపోవటం పెద్ద అవరోధంగా మారింది.
5. స్వేచ్ఛా ప్రయాణాలు- కంచెలతో నిండిన సరిహద్దులు..
మయన్మార్ సరిహద్దు ప్రాంతంలో నివసించే తెగల మధ్య సుహృధ్భావ సంబంధాలు నెలకొల్పేందుకు వలస ప్రభుత్వం సరిహద్దు వెంబడి స్వేచ్ఛా ప్రయాణాన్ని కొన్ని ప్రాంతాలకు పరిమితం చేస్తూ ఆంక్షలు విధించింది. ఈ ప్రాంతాలు కూడా మెజారిటీ తెగల దాడులకు లక్ష్యంగా మారుతున్నాయి. నాగాలాండ్, మిజోరాం ప్రభుత్వాలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ సరిహద్దు ప్రాంతాలను కంచెలతో కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది. జాతీయ భద్రత పేరుతో స్థానిక తెగల నివాస ప్రాంతాల మధ్య రాకపోకలు కట్టడిచేస్తోంది.
స్థానిక తెగల విశ్వాసాన్ని పొందేందుకు ప్రయత్నించటానికి బదులు బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కృత్రిమ సరిహద్దులను తిరిగి రంగంలోకి తెస్తోంది.
6. నాగా ఒప్పందం అమలు..
మణిపూర్‌లో నాగాలు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. ఈ మధ్యకాలంలో తమ డిమాండ్ల కోసం గొంతెత్తుతున్నారు. 2015లో ఆర్భాటంగా కేంద్ర హోంశాఖ ప్రకటించిన నాగా శాంతి ఒప్పందం భారీ వైఫల్యంగా మారింది. నాగా వేర్పాటువాద సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని ఈ ప్రాంతంలో శాంతి సాధనకు పెద్ద పీట వేస్తున్నామని మోడీ ప్రభుత్వం ఎంత గొప్పగా జబ్బలు చరుచుకున్నా ఆచరణ మాత్రం శూన్యం. ఇంకా చర్చోపచర్చలు అర్థంలేని రీతిలో సాగుతున్నాయి. దాంతో నాగా తెగ ప్రజల్లో అసంతృప్తి ప్రబలుతోంది. మోడీ మాటలు నమ్మినందుకు తమను తాము నిందించుకుంటున్నారు.
7. పాపీ సేద్యం సంక్షోభం..
ఈ కాలంలో అంతర్జాతీయ మాదకద్రవ్య రవాణా వ్యవస్థలో రాష్ట్రం మరింతగా కూరుకుపోయింది. పాపీ సేద్యంపై ఆధారపడ్డ కుటుంబాలకు ప్రత్యామ్నాయ జీవనోపాధి అవకాశాలు కల్పించకుండా ప్రభుత్వం పబ్బం గడుపుకునే చర్యలకు దిగుతోంది. దీంతో ఈ కుటుంబాలను అక్రమ చొరబాటుదారులుగా ప్రకటించి పేదరికాన్ని నేరపూరితంగా మారుస్తోంది.
ఇటువంటి సమస్యల నుంచి ప్రజలకు ఊరట కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవడానికి బదులుగా ఆయా జీవనోపాధులపై ఆధారపడే వారిని నేరస్తులుగా ముద్రవేస్తోంది. ఫలితంగా గత రెండున్నరేళ్లుగా కొనసాగుతూ వచ్చిన హింసలాంటి పరిణామాలకు దారితీస్తోంది.
8. పద్ధతి ప్రకారం ఇంటర్నెట్ సేవలకు అవరోధం కల్పించటం..
దేశంలో ఏ రాష్ట్రమూ చవిచూడనంత కాలం మణిపూర్‌లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. దాంతో రాష్ట్రం డిజిటల్ రంగంలో అంటరానిదిగా మిగిలిపోయింది. విచ్చలవిడిగా విస్తృత స్థాయిలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేయటంతో మౌలిక సమాచార వ్యవస్థలు కుదేలయ్యాయి. జర్నలిస్టుల కలాలకు కళ్లేలు పడ్డాయి. దీంతో మానవ హక్కుల హననం లోకానికి తెలీకుండానే సాగుతోంది.
ఇవన్నీ అణచివేతకు సంబంధించిన వ్యవహారాలే తప్ప రాష్ట్రంలో శాంతి భద్రతల సాధనతో ముడిపడినవి కాదు. వలసవాద ప్రభుత్వం రూపొందించిన అణచివేత సాధనాలను 21వ శతాబ్దిలో కూడా ప్రభుత్వాలు ఎంతో శక్తివంతంగా చాకచక్యంగా ఉపయోగించుకుంటున్న వైనం మణిపూర్‌లో కనిపిస్తోంది. ఇటువంటి నియంత్రణలు, అడ్డగోలు ఆంక్షలు రాష్ట్రంలో విద్యా వైద్య రంగాలనేకాక ప్రభుత్వ సాధారణ సేవలను కూడా ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. రాష్ట్ర ప్రజానీకాన్ని కమ్ముకుంటున్న క్షోభ, దాన్నుండి మొదలవుతున్న మానసిక సమస్యలను ఈ పరిస్థితులు మరింత ఉధృతం చేస్తున్నాయి.
9. పునరావాస సంక్షోభం..
ఇప్పటికే 60వేల మంది శరణార్ధి శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. సొంతగూటికి ఎప్పుడు ఎలా చేరాలో తెలీని అయోమయస్థితిలో ఉన్నారు. గ్రామాలకు గ్రామాలే ఛిన్నాభిన్నమయ్యాయి. గుర్తుపట్టలేనంతగా రూపురేఖలు మార్చుకున్నాయి. హద్దులు చెరుపుకున్నాయి. వందలాది చర్చిలు ధ్వంసమయ్యాయి. కాలిపోయాయి. ఇంతటి ఘోరకలికి ప్రభుత్వం ఇస్తున్న స్పందన మొక్కుబడిగా ఉంది. విశాలమై విస్తారమైన పునారావాస చర్యలు చేపట్టేందుకు అవసరమమైన విధానాలు రూపొందించే దిశగా కానీ, నిట్టనిలువునా చీలిపోయి ఉన్న ప్రజల మధ్య సుహృద్భావ సంబంధాలు ఏర్పాటు చేసేందుక అవసరమైన చర్యలు కానీ రూపొందించటం లేదు. రూపొందించాలన్న ఆలోచన లేదు.
ముగింపుగా చెప్పాలంటే ఇంతకాలంలో ఘర్షణలు, రక్తపాతం, మంటల్లో మాడిపోతున్న మణిపూర్‌లో ప్రధాని పర్యటన కేవలం రాజకీయ ప్రచారం కోసమే తప్ప, సమస్య పరిష్కారం దిశగా చూపిస్తున్న చొరవ కాదు. మానవ విపత్తు నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడటానికి కాదు. వెల్లువెత్తుతున్న అంతర్జాతీయ విమర్శలు, ఎన్నికల్లో పరాభవం తర్వాత నోరు మెదపకపోతే ఉపయోగం లేదన్న విషయం మోడీకి తేటతెల్లమైంది.
ప్రజలను రాజకీయ చదరంగంలో పావులుగా చూసే నాయకత్వం స్థానంలో, ప్రజలను ప్రజలుగా చూసే నాయకత్వం కావాలి. ఉబుసు పోని కబుర్లు, కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య సాగే పర్యటనలతో పైన ప్రస్తావించిన సమస్యలు తీరవు. ఈ సమస్యలు తీర్చాలంటే పాలకుల్లో జవాబుదారీతనం కావాలి. అర్థవంతమైన చర్యలు కావాలి. నేటి వరకూ ఈ రెండు లక్షణాలూ తమకున్నాయని నిరూపించుకోవటంలో మోడీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.