పశ్చిమ దేశాల ప్రధాన స్రవంతి మీడియా ప్రభుత్వాల వైఖరిని ప్రచారం చేస్తుంటే- సామాజిక మాధ్యమాలు, స్వతంత్ర విలేకరులు ఈ ప్రచార యుద్ధాన్ని సవాలు చేస్తున్నాయి.
పాఠకులకు చేరే సమాచారంలో ఉన్న అంతరాలను ఊరిస్తున్నాయి.
“యుద్ధంలో తొలి బలి పశువు సత్యమే” అన్నది నానుడి. అయితే సత్యాన్ని బ్రతికించడంలో సాహసోపేతంగా పనిచేసే స్వతంత్ర మీడియా కీలక పాత్ర పోషిస్తుంది.
కానీ, ఆచరణలో యుద్ధం జరుగుతున్న అన్ని సందర్భాలలోనూ ఇది సాధ్యం కాదు.
ఒత్తిళ్ల మూలంగా కానీ, ప్రభుత్వాల అజమాయిషీ కారణాల వల్ల కానీ, యుద్ధ సమయంలో ప్రభుత్వాల ప్రచారాన్ని ఇనుమడింపజేయడంలో ప్రధాన స్రవంతి మీడియా పాలకులకు చేదోడువాదోడుగా ఉంటుంది.
ఏకాభిప్రాయ నిర్మాణ సాధన మరింత కట్టుదిట్టంగా అమలవుతుంది.
ఇటువంటి యుద్ధాలలో ఉభయపక్షాలు చేసుకునే ఆరోపణలు, ప్రత్యారోపణల నడుమ- ఏది వాస్తవం, ఏది అవాస్తవం అన్నది తెలుసుకోవడం సాధ్యం కాకపోవడం దీనికి ఒక కారణం.
ప్రజలకు చేరే సమాచారాన్ని రూపొందించేది, వ్యూహాత్మకంగా విడుదల చేసేది ఇటువంటి సమయాలలో ప్రభుత్వ అంగాలే.
బయటపడుతోన్న ప్రధాన స్రవంతి మీడియా రంగు..
క్రియాశీలక పాత్ర పోషించే జర్నలిస్టులు తర్కబద్ధమైనరీతిలో ప్రభుత్వాలు వాదనలను ఇటువంటి ప్రతికూల పరిస్థితులలో సైతం సవాలు చేస్తారు.
ఇందుకోసం అదే వ్యవస్థలో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా అందుబాటులో ఉన్న సమాచారాన్ని సేకరించడం కీలకం. కానీ, ప్రధాన స్రవంతి మీడియా ఈ పాత్రను, బాధ్యతను విస్మరిస్తుంది.
అంతేకాదు, జాతీయ భద్రత అనే ప్రచార హోరులో ప్రభుత్వంతో భుజంభుజం కలిపి నడుస్తుంది.
ప్రభుత్వాలలోనూ, రాజకీయ శక్తులతోనూ ప్రధాన స్రవంతి మీడియా మమేకమవుతున్న తీరును సోషల్ మీడియా బట్టబయలు చేయడంతో అప్పుడప్పుడు ప్రధాన స్రవంతి మీడియా రంగు బయటపడుతుంది.
ప్రస్తుతం ఇజ్రాయెల్- అమెరికాల ద్వయం ఇరాన్‌పై సాగిస్తోన్న బరితెగింపు దాడి ప్రధాన స్రవంతి మీడియాను మరోసారి అటువంటి సంక్షోభంలోకి నెడుతోంది. పాలకుల వాదనలే వాస్తవాలుగా చెలామణి చేస్తోన్న ప్రధాన స్రవంతి మీడియా ఈ యుద్ధంలో మరోమారు ఖైదీగా మారనున్నది.
దుశ్ప్రచారాలకు వేదికగా మారడమా? లేకా వాస్తవాలపై వెలుగులు ప్రసరింపజేయడమా? మీడియా ప్రాదాన్యత ఏమిటో తెల్చుకోవాల్సిన సందర్భం ఇది.
గాజా ఊచకోత సందర్భంలోనే ఒంటపట్టించుకున్న మీడియా..
విస్తృత సమాచారం అందుబాటులో ఉన్న ప్రస్తుత తరుణంలో ప్రభుత్వాలు కప్పి పెడుతున్న నిజాలను ప్రత్యామ్నాయ మీడియా సాధనాలు, గణాంక విశ్లేషకులు, నిఘా వ్యవహారాల విశ్లేషకులు బయటకు తీసుకురావడం ద్వారా వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతున్నారు.
2023 అక్టోబరులో గాజా మీద ఇజ్రాయెల్ దాడి చేసి అమాయకులను ఊచకోత కోస్తున్నా తరుణంలోనే పశ్చిమ దేశాల ప్రధాన స్రవంతి మీడియా ఈ వైఖరిని(వాస్తవాలను కప్పిపుచ్చే వైఖరిని) ఒంటపట్టిచ్చుకున్నది.
ఈ ప్రయత్నంలో పాలస్తీనాను దోషిగా నిలబెడుతూ కావాల్సినన్ని రాతలు రాసింది, శీర్షికలూ పెట్టింది.
పశ్చిమ దేశాల దురాక్రమణలను ఒక్కసారిగా ప్రస్తావించడమేకాక- ఇటువంటి మారణహోమానికి కారకులైన రూపశిల్పులు, వ్యూహ కర్తల గురించి పల్లెత్తు మాట అనలేదు.
సమాచార ప్రసార వ్యవస్థలను కబ్జాలో పెట్టుకున్న పాలక వర్గాల గురించి వివరించకుండా రోజువారి జరిగే చిన్నా చితక ఘటనలపై దృష్టి సారించడం పశ్చిమ దేశాల ప్రధాన స్రవంతి మీడియా పెంచుకున్న ఒక సాధనం.
బాహాటంగా మడుగులొత్తుతున్న వైనం..
ఇరాక్ మానవజాతి నిర్మూలనా అస్త్రాలను సిద్ధం చేసుకుంటోందన్న ఆరోపణలు ఇటువంటి లోతైన ప్రచార వ్యవస్థ నిర్మాణంలో అంతర్భాగం. ప్రపంచాన్ని నిరంతర అబద్ధాల నడుమ, యుద్ధాల నడుమ, బంధించే ప్రయత్నాలలో అసత్యాల యుద్ధం ఒకటి.
కానీ విస్తృతంగా వినియోగంలో ఉన్న సోషల్ మీడియా, ప్రధాన స్రవంతి మీడియా బాహాటంగా అమెరికా అడుగులకు మడుగులొత్తుతున్న వైనాన్ని బట్టబయలు చేస్తోంది.
ఉదాహరణకు, ప్రధాన స్రవంతి వెల్లడించడానికి నిరాకరించిన అనేక విషయాలను పరిశోధక పాత్రికేయులు టక్కర్ కార్ల్సన్ వెలుగులోకి తెచ్చారు.
2024లో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తోనూ, 2025లో ఇరాన్ అధ్యక్షుడుతోనూ ఇంటర్వ్యూ చేసిన ఇంటర్వ్యూలలో అప్పటి వరకు అమెరికా పౌరుల దృష్టికి రాని అనేక విషయాలను వెలుగులోకి తెచ్చారు.
ఈ ఇంటర్వ్యూలను కోట్ల మంది పదేపదే చూశారు. అమెరికాలోని ప్రధాన స్రవంతి మీడియాకు ఇటువంటి మెచ్చుకోలు పాఠకుల నుంచి ఎప్పుడూ రాలేదు. ఇటువంటి ప్రత్యామ్నాయ వనరుల ద్వారా అందుకున్న సమాచారంతో ప్రజాభిప్రాయం మారిపోతే తాము యుద్ధం మొదలుపెట్టడం కష్టమని ఇజ్రాయెల్- అమెరికా సేనలు ఇరాన్‌పై సత్వర దాడులకు ఒడిగట్టాయి.
నిజాలను బయటకు రాకుండా చేయడమే..
పరిస్థితుల ప్రలోభానికి గురై అమెరికా ప్రధాన స్రవంతి మీడియా యుద్ధం గురించి సాగిస్తోన్న ప్రచారంపై అనేక ప్రశ్నలు లేవనెత్తబడుతున్నాయి.
అయినప్పటికీ, ఈ మీడియా ప్రధానంగా అమెరికా రక్షణా వ్యవస్థ నిర్దేశించిన మార్గంలోనే ప్రయాణిస్తోంది. ఎడ్వర్డ్ స్నోడెన్ వంటి వాస్తవాలను ప్రపంచం ముందు ఉంటే స్వతంత్ర జర్నలిస్టులను శిక్షించాలని వాషింగ్టౌన్ పోస్ట్ పిలుపునివ్వడం వెనుక నిఘా వర్గాల చర్యలను ప్రశ్నార్థకం చేయడమే కారణం.
మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, స్నోడెన్ వెల్లడించిన వివరాల ఆధారంగా ది వాషింగ్టౌన్ పోస్ట్ పత్రిక ప్రచురించిన కథనాలకు పులిట్జర్ బహుమానం గెలుచుకున్న తర్వాత, ఈ పత్రిక స్నోడెన్‌ను శిక్షించాలంటూ పిలుపునిచ్చింది.
ప్రపంచంలో ఏ వార్తా పత్రిక తమకు సమాచారమిచ్చినవారిపై జరుగుతున్న విచారణను ఆమోదించలేదు. కానీ, వాషింగ్టౌన్ పోస్టు ఆ పనికి పాల్పడ్డ మొదటి పత్రికగా ప్రపంచ మీడియా చరిత్రలో నిలిచిపోతుంది.
ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్లలో అమెరికా సాగించిన ఆకృత్యాలను, నరమేధాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన జూలియన్ అస్సాంజేను దశాబ్దానికి పైగా ప్రపంచమంతా తరిమితరిమి విచారించాయి.
ఒక దేశం తన శత్రువులపై యుద్ధం చేయడంతోపాటు, సత్యాన్ని కూడా వధిస్తూ ఉంటుంది. ఇటువంటి యుద్ధంలో దీర్ఘకాలంగా పశ్చిమ దేశాల ప్రధాన స్రవంతి మీడియా ఇష్టపూర్వకంగానే భాగస్వామిగా మారింది.
వాస్తవాలను వెలుగులోకి తెచ్చే సాధనంగా పశ్చిమ దేశాల ప్రధాన స్రవంతి మీడియా మారుతుందా? లేకా పాలక వర్గాల మోసపూరిత మాటల మూటలు మోసుకుంటూ తిరుగుతుందా? అన్నది పరిశీలించడానికి తాజాగా అమెరికా- ఇజ్రాయెల్ ఇరాన్‌పై సాగిస్తున్న యుద్ధం మరో సందర్భంకానున్నది.
అనువాదం: కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
