ఓటర్లను బెదిరించే విధంగా తన వ్యాఖ్యలు ఉన్నాయన్న విమర్శలను అజిత్ పవార్ విలేకరులతో మాట్లాడుతూ తోసిపుచ్చారు.
న్యూఢిల్లీ: మాలేగావ్ నగర పంచాయతీ ఎన్నికల్లో తన పార్టీ అభ్యర్థిని ఓడించినట్లయితే; మున్సిపల్ కౌన్సిల్‌కు నిధులను ఉపసంహరించుకుంటామని ఉపముఖ్యమంత్రి, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) చీఫ్ అజిత్ పవార్ అన్నారు. మహరాష్ట్రలోని ప్రతిపక్ష పార్టీలు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాయి.
నవంబరు 21న మాలేగావ్ నగర పంచాయతీ ఎన్నికల ప్రచారం జరిగింది. ఆ ప్రచారంలో పాల్గొన్న పవార్ ఈ మాటలను అన్నారు.
“మాలేగావ్ మున్సిపల్ కౌన్సిల్ బడ్జెట్ రూ 15 కోట్లు మాత్రమే. అభివృధ్ది కోసం ఎక్కువ నిధులు అవసరమౌతాయి. బారామతికి తాను ఎక్కువ నిధులిచ్చాను, అందుకే ఈ రోజు అది బాగా అభివృధ్ది చెందింది. మా అభ్యర్ధులను ఎన్నుకుంటే, నేనిచ్చే హామీలన్నింటిని చిత్తశుద్ధితో అమలు చేస్తాను. కానీ మీరు తిరస్కరిస్తే, నేను కూడా తిరస్కరిస్తాను. మీ దగ్గర ఓట్లు ఉన్నాయి, నా దగ్గర నిధులున్నాయి”అని పవార్ ఓటర్లతో బేరమాడినట్టుగా హిందుస్తాన్ టైమ్స్ కథనం పేర్కొన్నది.
పవార్ వ్యాఖ్యలను శివసేన(ఉద్ధవ్ బాలాసాహెబ్ థాక్రే) నేత అంబదాస్ దాన్వే ఖండించారు. తన మాటలతో ఓటర్లను పవార్ బెదిరిస్తున్నారని అన్నారు.
“ఈ మాటలు ఓటర్లను బెదిరించేలా ఉన్నాయి. అజిత్ పవార్ వ్యక్తిగత డబ్బుల్లోంచి ఆ నిధులు రావడంలేదు. అది పన్ను చెల్లింపుదారుల డబ్బు. ఈ అంశం పై ఎన్నికల సంఘం ఎందుకు మౌనం వహిస్తుంది?” అని దాన్వే ప్రశ్నించారు.
తోసిపుచ్చిన అజిత్ పవార్..
అజిత్ పవార్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(శరద్చంద్ర పవార్) అధికార ప్రతినిధి మహేశ్ తాప్సే డిమాండ్ చేశారు.
ఓటర్లను బెదిరించే విధంగా తన వ్యాఖ్యలు ఉన్నాయన్న విమర్శలను అజిత్ పవార్ విలేకరులతో మాట్లాడుతూ తోసిపుచ్చారు.
“నేను ఎక్కడ బెదిరించాను? మీరు బీహారులో కూడా చూశారు. తాము గెలిస్తే, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం వస్తుందని తేజస్వీ చెప్పారు. తాము చెప్పాలనుకున్నది చెప్పే హక్కు ప్రతి ఓక్కరికి ఉంది. ఎవరికి ఓటు వేయాలో ఓటర్లు నిర్ణయించుకుంటారు. ఓటర్లు చాలా తెలివైన వారు, వాళ్లు నిర్ణయిస్తారు” అని నవంబరు 23న పవార్ విలేకరులకు చెప్పినట్టుగా ది హిందు కథనం తెలియజేసింది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
