ఎన్సీపీ నాయకుడు అమోల్ మిట్కారీని కించపరిచారనే ఆరోపణలపై నలుగురు జర్నలిస్టులకు ఐదు రోజుల జైలు శిక్ష విధించాలని మహారాష్ట్ర శాసన మండలి ప్రివిలేజెస్ కమిటీ సిఫార్సు చేసింది. క్షమాపణ చెప్పిన తర్వాత ఒక ఎడిటర్‌కు ఉపశమనం లభించింది. అయితే ఈ కేసు యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేసిన తప్పుడు వార్తలకు సంబంధించినది.
న్యూఢిల్లీ: మహారాష్ట్ర శాసన మండలి ప్రివిలేజెస్ కమిటీ నలుగురు జర్నలిస్టులకు ఐదు రోజుల జైలు శిక్ష విధించాలని సిఫార్సు చేసింది. ఎమ్మెల్సీ అమోల్ మిట్కారీని లక్ష్యంగా చేసుకోని “తప్పుడు, కల్పిత” వార్తలను ప్రచురించడం ద్వారా తన ప్రతిష్టను దెబ్బతీశారని కమిటీ ఆరోపించింది. అయితే, ఒక ఎడిటర్ క్షమాపణ చెప్పడంతో తనకు ఉమశమనం లభించింది.
మీడియా నివేదికల ప్రకారం, ఈ విషయంపై 2025 డిసెంబర్ 13న కౌన్సిల్లో తన నివేదికను సమర్పిస్తూ కమిటీ చైర్మన్ ప్రసాద్ లాడ్ మాట్లాడారు. “నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అమోల్ మిట్కారీపై సత్య లాడ అనే యూట్యూబ్ ఛానెల్‌తో సంబంధమున్న జర్నలిస్టులు అసత్య వార్తలను ప్రసారం చేశారు”అని లాడ్ అన్నారు.
అకోలా జర్నలిస్టులు గణేష్ సోనావానే, హర్షద సోనావానే, అమోల్ నందూర్కర్, అంకుష్ గవాండే, ఎడిటర్ సతీష్ దేశ్‌ముఖ్ తప్పుడు వార్తలను వ్యాప్తి చేసి అమోల్ మిట్కారి సామాజికంగా- రాజకీయంగా ప్రతిష్టను దెబ్బతీశారని ప్రసాద్ లాడ్ సభకు తెలియజేశారు. దీంతో ఈ ఐదుగురు మీడియా సిబ్బందికి ఐదు రోజుల జైలు శిక్ష విధించాలని కమిటీ సిఫార్సు చేసింది. ఈ విషయంపై మొత్తం ఆరు సమావేశాలు జరిగాయని కూడా ఆయన పేర్కొన్నారు.
అయితే దర్యాప్తు తర్వాత, ఎడిటర్ సతీష్ దేశ్‌ముఖ్ అమోల్ మిట్కారికి లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పారు. దీనిని కమిటీ అంగీకరించింది. దీంతో తనపై ఎటువంటి చర్య తీసుకోకూడదని ప్రతిపాదించినట్లు ప్రసాద్ లాడ్ తెలియజేశారు.
రాష్ట్ర అసెంబ్లీ ప్రస్తుత శీతాకాల సమావేశాల్లో మిగిలిన నలుగురు జర్నలిస్టులకు ఐదు రోజుల జైలు శిక్ష విధించాలని కమిటీ సిఫార్సు చేసింది. ప్రస్తుత సమావేశాల్లో ఇది సాధ్యం కాకపోతే, తదుపరి సమావేశాల్లో ఈ నిర్ణయాన్ని అమలు చేస్తారు.
ఈ ఐదుగురు జర్నలిస్టులపై హక్కుల ఉల్లంఘన మోషన్‌ను అమోల్ మిట్కారి దాఖలు చేసిన తర్వాత ఈ నివేదిక సమర్పించబడింది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
