ఇండోర్‌లోని చోయిత్రమ్ ఆసుపత్రి సమీపంలో ఈ సంఘటన జరిగింది. మురుగునీటి కాలువను శుభ్రం చేస్తున్నప్పుడు విషపూరిత వాయువు పీల్చి ఇద్దరు మున్సిపల్ ఉద్యోగులు ఊపిరాడక మరణించారు.
పారిశుధ్య కార్మికులు ఎటువంటి రక్షణా పరికరాలు లేకుండా మురుగునీటి ఛాంబర్లోకి ప్రవేశించారని, అధికారుల నుంచి సహాయం అందడం ఆలస్యమైందని ప్రత్యక్ష సాక్షులు ఆరోపిస్తున్నారు.
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో మార్చి 2న మురుగు కాలువను శుభ్రం చేస్తుండగా విష వాయువు పీల్చి ఇద్దరు మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులు ఊపిరాడక మరణించారు.
హిందూస్తాన్ టైమ్స్ కథనం ప్రకారం, ఇద్దరు కార్మికులు ఎటువంటి రక్షణా పరికరాలు లేకుండా మురుగు కాలువలోకి ప్రవేశించారని, సంఘటన జరిగిన రెండు గంటల తర్వాతే అంబులెన్స్ ఘటనా స్థలానికి చేరుకుందని ఒక ప్రత్యక్ష సాక్షి ఆరోపించారు.
ఈ ఘటనపై స్పందించిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, బాధిత రెండు కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ 30 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.
ప్రమాదం ఎలా జరిగిందంటే..
ఈ విషయానికి సంబంధించి, అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సుమిత్ కెర్కట్టా మాట్లాడుతూ– ఈ సంఘటన సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో చోయిత్రమ్ హాస్పిటల్ గేటు సమీపంలోని దేవి అహల్యాబాయి హోల్కర్ పండ్లు, కూరగాయల మార్కెట్ ముందు జరిగిందని తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, శుభ్రపరిచే పనిలో ఉన్నప్పుడు మురుగునీటి సక్షన్ మెషిన్ నుంచి పైపు విరిగి ఛాంబర్లోకి పడిపోయింది.
పైపును బయటకు తీయడానికి కిందకు దిగిన ఒక ఉద్యోగి విషపూరిత వాయువు పీల్చి స్పృహ కోల్పోయాడు.
అతన్ని రక్షించడానికి కిందకు దిగిన మరో మున్సిపల్ ఉద్యోగి కూడా స్పృహ కోల్పోయాడు. మురుగునీటిలో వెలువడిన విషపూరిత వాయువు కారణంగా ఊపిరాడక ఆ ఇద్దరు ఉద్యోగులు మరణించినట్లు ప్రకటించారు.
రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం(ఎస్డీఆర్ఎఫ్) సహాయంతో వారి మృతదేహాలను వెలికితీసినట్లు సుమిత్ కెర్కట్టా తెలిపారు.
డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీకృష్ణ లాల్చందాని ఆ కార్మికులను కరణ్ యాదవ్, అజయ్ దోడిగా గుర్తించారు.
ప్రత్యక్ష సాక్షుల ఆరోపణలు
మరోవైపు, ప్రత్యక్ష సాక్షి ఒకరు హిందూస్తాన్ టైమ్స్‌తో మాట్లాడుతూ, కార్మికులు కనీస రక్షణా పరికరాలు లేకుండా ఛాంబర్లోకి ప్రవేశించారని చెప్పారు.
సంఘటన జరిగిన రెండు గంటల తర్వాత కూడా పోలీసులు, మున్సిపల్ సిబ్బంది, అంబులెన్స్‌లు ఘటనా స్థలానికి చేరుకోలేదని ఆయన ఆరోపించారు.
పారిశుధ్య కార్మికులిద్దరినీ ఛాంబర్ నుంచి బయటకు లాగి కాపాడటానికి బాటసారులు ప్రయత్నించారని ఆయన అన్నారు.
సీఎం పరిహారం ప్రకటన.. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు
ఒక ఉన్నతాధికారి తెలిపిన వివరాల ప్రకారం, ఈ సంఘటన పట్ల ముఖ్యమంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
మురుగునీటి పారిశుధ్య సంబంధిత మరణాలకు పరిహారం చెల్లింపుపై సుప్రీంకోర్టు 2023లో ఇచ్చిన ఆదేశాల ప్రకారం, మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ 30 లక్షలు విడుదల చేయాలని ఆదేశించారు.
గత ఏడాది అక్టోబర్ 29న, సుప్రీంకోర్టు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
మాన్యువల్ స్కావెంజింగ్ (మనుషులతో మురుగునీటిని శుభ్రం చేయించడం) కారణంగా ఎవరైనా మరణిస్తే, సంఘటన జరిగిన మూడు వారాల్లోగా బాధిత కుటుంబాలకు పరిహారం పంపిణీ చేయాలని స్పష్టం చేసింది.
అంతకుముందు, 2023లో ఇచ్చిన తీర్పులోనూ- మాన్యువల్ స్కావెంజింగ్ అనే అమానవీయ ఆచారాన్ని రూపుమాపడానికి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సాధ్యమైన అన్ని చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు తప్పనిసరి చేసింది.
మురుగు కాలువలు శుభ్రం చేస్తున్నప్పుడు మరణించిన వారి కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని కూడా కోర్టు రూ 10 లక్షల నుంచి రూ 30 లక్షలకు పెంచింది.
చట్టాలున్నా ఆగని ప్రాణనష్టం
ఇదిలా ఉండగా, ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ అర్థరాత్రి ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. సెప్టిక్ ట్యాంక్‌ను ఖాళీ చేసిన తర్వాత మున్సిపల్ వాహనం నుంచి డ్రైనేజీ లైన్ ఛాంబర్లోకి నీటిని విడుదల చేస్తుండగా ఈ పారిశుధ్య కార్మికులు ఇద్దరూ మరణించారని అందులో పేర్కొంది.
గమనించాల్సిందేంటే, దేశంలో మొదటిసారిగా 1993లో మాన్యువల్ స్కావెంజింగ్ పద్ధతిని నిషేధించారు. దీని తర్వాత, 2013లో పూర్తిగా నిషేధిస్తూ ఒక కఠినమైన చట్టం ఆమోదించబడింది. అయితే, నేటికీ సమాజంలో మాన్యువల్ స్కావెంజింగ్ పద్ధతి కొనసాగుతూనే ఉంది.
2013 మాన్యువల్ స్కావెంజింగ్ చట్టం ప్రకారం, ఎవరినైనా మురుగు కాలువల్లోకి పంపడం ఖచ్చితంగా నిషేధించబడింది. తప్పనిసరి పరిస్థితుల్లో ఒక పారిశుధ్య కార్మికుడిని మురుగు కాలువలోకి పంపాల్సి వస్తే, సంబంధిత అధికారులు కచ్చితంగా 27 నిబంధనలను పాటించాలి.
అయితే, ఈ నియమాలను తరచుగా ఉల్లంఘించడం వల్లే మురుగు కాలువలను శుభ్రం చేసే సమయంలో కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
