న్యూఢిల్లీ: భారత ఎన్నికల సంఘం ప్రస్తుతం చేపట్టిన ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) ప్రక్రియపై రాజకీయ వర్గాల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.
ఈ ప్రక్రియ రాజ్యాంగ విరుద్ధంగా, పౌరులను ఇబ్బందులకు గురిచేసేలా ఉందంటూ సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యుడు, జనరల్ సెక్రటరీ ఎంఏ బేబీ కేంద్ర ఎన్నికల కమిషనర్‌కు లేఖ రాశారు.
ఈ ‘ఎస్ఐఆర్’ విధానం పారదర్శకంగా లేకపోగా, ఓటర్ల ప్రాథమిక హక్కులను కాలరాసేలా ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్య ప్రక్రియేనా లేక ప్రజలపై యుద్ధమా?
ఎన్నికలకు కేవలం కొన్ని నెలల ముందు అవాస్తవిక కాలపరిమితితో ఈ సవరణలు చేపట్టడం వల్ల క్షేత్రస్థాయిలో గందరగోళం నెలకొందని లేఖలో పేర్కొన్నారు.
ఈ పని ఒత్తిడి భరించలేక బూత్ లెవల్ ఆఫీసర్లు(బీఎల్ఓలు), అలాగే ఓట్లు తొలగిస్తారనే భయంతో పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో సామాన్య ప్రజలు ఆత్మహత్యలకు పాల్పడటం అత్యంత దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రాల వారీగా వెలుగుచూసిన ఘటనలు..
వివిధ రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ అమలు తీరును లేఖలో ఎంఏ బేబీ ఎండగట్టారు.
అస్సాం: దొంగిలించబడిన ఐడీ కార్డులు, మొబైల్ నంబర్ల ద్వారా మూడవ పక్షం వ్యక్తులు వేల సంఖ్యలో ‘ఫారమ్ 7′(తొలగింపు దరఖాస్తులు) దాఖలు చేస్తున్నారని, ఇది ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని జరుగుతోందని ఆరోపించారు.
“శ్రీభూమి(కరీంగంజ్) వంటి జిల్లాల్లో ఒకే వ్యక్తి వందలాది అభ్యంతరాలు దాఖలు చేశారు. బెంగాలీ మాట్లాడే ముస్లిం ఓటర్లను వేధించడం, రాజకీయ నాయకులు బీఎల్ఓలపై ఒత్తిడి తెస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి”అని పేర్కొన్నారు.
తమిళనాడు: ఏకంగా 97 లక్షల మంది ఓటర్లను జాబితా నుండి తొలగించారని, ఇది జనాభా లెక్కలకు విరుద్ధమని పేర్కొన్నారు.
“బేస్ లిస్ట్ నుంచి 97 లక్షల మందికి పైగా ఓటర్లను తొలగించారు. వీరిలో అధిక సంఖ్యలో “మరణించినవారు” లేదా “గుర్తించలేనివారు” అని పేర్కొన్నారు, ఇది జనాభా ధోరణులకు భిన్నంగా ఉంది. వివాహిత మహిళలు, అద్దెదారులు, వలస వచ్చిన వారు ఎక్కువగా ప్రభావితమవుతున్నారు”అని లేఖలో వాపోయారు.
పశ్చిమ బెంగాల్: పారదర్శకత లేని సాఫ్ట్వేర్ ద్వారా 1.5 కోట్ల మందికి ఆటోమేటెడ్ నోటీసులు జారీ చేయడం ప్రజలను పీడకలల పాలు చేస్తోందని విమర్శించారు.
అంతేకాకుండా, “ఇక్కడ మైక్రో అబ్జర్వర్ల నియామకంతో సమాంతర వ్యవస్థను ఏర్పాటు చేసి సాధారణ మార్గాలను దెబ్బతీస్తున్నారు. ఇక్కడ ప్రజలు ఈ ప్రక్రియ వల్ల కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు” అని తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు.
కేరళ & బీహార్: పాత ఓటర్లను కొత్తగా దరఖాస్తు చేసుకోమని బలవంతం చేయడం, డిజిటల్ సౌకర్యాలు లేని గ్రామీణ మహిళలు, అణగారిన వర్గాల ఓట్లను తొలగించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
చట్టపరమైన పరిధి దాటుతున్న ఈసీ?
ఓటరు నమోదుకు పౌరసత్వం ప్రాతిపదిక అయినప్పటికీ, పౌరసత్వాన్ని నిర్ణయించే అధికారం ఎన్నికల సంఘానికి లేదని ఎంఏ బేబీ గుర్తుచేశారు.
ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రతిపాదిత ఎన్ఆర్సీ(ఎన్ఆర్సీ)ని పోలి ఉందన్న అనుమానాలు నిజమవుతున్నాయని ఆయన అన్నారు. వృద్ధులు, వికలాంగులను విచారణ పేరుతో కార్యాలయాల చుట్టూ తిప్పడం అమానవీయమని పేర్కొన్నారు.
“ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది. ప్రజలపై యుద్ధంలా మారుతున్న ఈ అస్తవ్యస్త ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలి” అని ఆయన డిమాండ్ చేశారు.
రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరపకుండా ఏకపక్షంగా తీసుకున్న ఈ నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
