వెనుకబడిన, బలహీమైన చిన్నదేశాలను; ఆ దేశాల ప్రభుత్వాలను ఆయుధ బలంతో తన చెప్పుచేతల్లో పెట్టుకోవడం, తన మాట వినని ప్రభుత్వాలు కూలిపోయేలా చేయడం; ఇదీ సాధ్యం కాకపోతే దురాక్రమణ యుద్ధం ద్వారా తన కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం- దీంతో ఆ దేశాల సహజవనరులను తరలించుకుపోవడం అమెరికా సామ్రాజ్యవాదం అనుసరిస్తున్న విధానంగా ఉంది. ప్రస్తుతం వెనిజులాపై దాని యుద్ధ సన్నాహాలు ఆ విధానంలో భాగమే.
దక్షిణ అమెరికా దేశమైన వెనిజులాపై దాడి చేయడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కరేబియన్ దీవులకు- 8 వార్‌షిప్‌లు, అతిపెద్ద విమానవాహక నౌక, క్షిపణులతోపాటు ఆయుధ సామాగ్రి, 10 వేలమంది సైనికులను కరేబియన్ సముద్రంలోకి పంపాడు. వీరిలో 22వ మెరైన్ యూనిట్ కమాండోలు 2,200మంది ఉన్నారు.
2025 సెప్టెంబరు 2న వెనిజులా నుంచి వెళ్తున్న పడవలపై అమెరికా దాడి చేసి, 11 మంది ప్రాణాలను బలి తీసుకుంది. పడవల్లో మాదకద్రవ్యాలను వెనిజులా రవాణా చేస్తున్నదని ఈ దాడికి కారణంగా చూపించింది. మాదకద్రవ్యాలకు నిలయంగా ఉన్న వెనిజులా అమెరికా వినాశనానికి కంకణం కట్టుకున్నదని, అందుకే దానిపై దాడి చేస్తామని ట్రంప్ ప్రభుత్వం ప్రచారం చేస్తూ- తన దోపిడీ విధానాలను, యుద్ధోన్మాదాన్ని మరుగుపరుస్తున్నది.
వెనిజులాపై అమెరికా అక్కసు..
వెనిజులా దేశంపై అమెరికా వ్యతిరేకత చాలాకాలంగా కొనసాగుతున్నది.
ఆ దేశ భూగర్భంలో చమురు, సహజవాయువు నిక్షేపాలు, వజ్రాలు, బంగారం మొదలైనవి అపారంగా ఉన్నాయి. తన బహుళజాతి సంస్థల ద్వారా వాటిని తరలించుకుపోతున్న అమెరికాకు 1999లో తొలిసారి ఆటంకం ఎదురైంది.
1999లో హ్యూగో చావెజ్ వెనిజులా అధ్యక్ష బాధ్యతలను చేపట్టాడు. ఒక సంవత్సరం తర్వాత తనను సోషలిస్టుగాను, సామ్రాజ్యవాద వ్యతిరేకిగా ప్రకటించుకున్నాడు. అమెరికా దోపిడీకి అడ్డుకట్టవేశాడు. ప్రభుత్వ సంస్థలను జాతీయం చేయడాన్ని వ్యతిరేకిస్తున్న పెట్టుబడిదారీ అనుకూల ముఠా చావేజ్‌పై తిరుగుబాటు ప్రయత్నాన్ని ఆనాటి జార్జ్‌బుష్ ప్రభుత్వం మద్దతు ఇచ్చిందని వెనిజులా పేర్కొన్నది. ఆ తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి.
బొలీవియా దేశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హింసాత్మక సమూహాలకు ఒక అమెరికా రాయబారి సహకరించినట్టు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆ దేశానికి మద్దతుగా 2008లో అమెరికా రాయబారిని తమ దేశం నుంచి వెనిజులా ప్రభుత్వం బహిష్కరించింది. దీని ద్వారా అమెరికా చర్యలను వెనిజులా వ్యతిరేకించింది.
చావేజ్ మరణం తర్వాత 2013 ఏప్రిల్‌లో జరిగిన ప్రత్యేక ఎన్నికల్లో నికోలస్ మదురో విజయం సాధించి వెనిజులా అధ్యక్షుడు అయ్యాడు. 2024లో జరిగిన ఎన్నికల్లోనూ గెలిచి మూడవసారి అధ్యక్షునిగా కొనసాగుతున్నాడు. ఈయన పాలనలో ప్రభుత్వరంగ సంస్థలు, పెట్రోలియం పరిశ్రమల వంటివి ప్రభుత్వ నిర్వహణలో కొనసాగుతున్నాయి.
ఇది అమెరికాకు కోపం తెప్పించింది. 2014లో దేశంలో హింసను ప్రోత్సహించిన ముగ్గురు అమెరికా దౌత్యవేత్తలను దేశం నుంచి మదురో ప్రభుత్వం బహిష్కరించింది. 2019లో వెనిజులా సంక్షోభ సమయంలో నికోలస్ మదురో ప్రభుత్వ వ్యతిరేకి జువాన్ గైడోనూ తాత్కాలిక అధ్యక్షుడిగా గుర్తిస్తున్నట్టుగా ట్రంప్ ప్రభుత్వం ప్రకటించిన తర్వాత, అమెరికాతో తమ సంబంధాలను తెచ్చుకున్నట్టు వెనిజులా ప్రభుత్వం ప్రకటించింది. 2023లో ప్రతిపక్ష జాతీయ అసెంబ్లీ గైడో తాత్కాలిక ప్రభుత్వాన్ని గుర్తించరాదని ఓటు వేసింది. ఈ విషయంలో అమెరికా మౌనం వహించింది.
వెనిజులాపై ఆర్ధిక ఆంక్షలు..
వెనిజులాను ఎలాగైనా తన స్వాధీనంలోకి తెచ్చుకోవాలనే అమెరికా ప్రయత్నాలను నికోలస్ ప్రభుత్వం తిప్పికొట్టింది. తమ చమురు నిల్వలను అమెరికా లక్ష్యంగా చేసుకుంటున్నదని వెనిజులా వెల్లడించడంతో, అమెరికాకు చెందిన డెలావేర్ న్యాయమూర్తి అప్పులు తీర్చడానికి చమురు అమ్మకం గురించి వెనిజులాను ఆదేశించాడు.
బిలియన్ల డాలర్ల అప్పు తీర్చడానికి మోసపూరితంగా చమురు కంపెనీ సిట్గోను విక్రయించడానికి అధికారాలిస్తూ అమెరికా కోర్టు నిర్ణయాన్ని వెనిజులా ఉపాధ్యక్షుడు, ఆ దేశ పెట్రోలియం మంత్రి డెల్సీ రోడ్రిగ్జ్ ఖండించి ఆ తీర్పును తిరష్కరించాడు. ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు సంస్థ వెనిజులా పెట్రోలియోన్డి వెనిజులా(పీడీయూఎస్ఏ) హ్యూస్టన్‌కు చెందిన అనుబంధ సంస్థ సిట్గో, రుణదాతలకు 20 బిలియన్ల అమెరికా డాలర్లకు పైగా బాకీ ఉందనే ప్రచారం చేయబడింది. ఇంతకుముందు ఇది లాభదాయకంగా ఉన్న చమురు పరిశ్రమ. దీన్ని లక్ష్యంగా చేసుకున్న అమెరికా పెట్టిన అనేక ఆంక్షల వల్ల సంక్షోభంలో ఉండి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంది.
కంపెనీల రుణదారుల్లో కెనడియన్ సంస్థ క్రిస్టలిక్స్ కూడా ఉంది. బంగారం, వజ్రాలు, ఇనుము- ఇతర ఖనిజాలతో సమృద్ధిగా ఉన్న క్రిస్టినా స్గనిని 2008లో స్వాధీనం చేసుకుని జాతీయం చేసినందుకు; 2019లో వెనిజులా ప్రభుత్వం క్రిస్టలెక్స్‌కు 1.2 బిలియన్లు డాలర్లు బాకీ ఉందని మరొక అమెరికా కోర్టు పేర్కొంది.
సార్వభౌమాధికారం గల ఒక స్వతంత్రదేశం. తమ దేశానికి సంబంధించిన అన్ని నిర్ణయాలు ఆ దేశ ప్రభుత్వం తీసుకునే హక్కు ఉంటుంది. వెనిజులా అలాంటి దేశం కాబట్టి చమురు పరిశ్రమలను, ఖనిజాల గనులను జాతీయం చేసింది. ఆ దేశ నిర్ణయాలపై అమెరికా కోర్టులు తీర్పులు ఎలా ఇస్తాయి. తీర్పు ఇచ్చే అధికారం కూడా వెనిజులా కోర్టులకే ఉంటుంది.
ప్రపంచ పోలీసు పాత్రను పోషిస్తూ- లేని అధికారాలను అమెరికా హస్తగతం చేసుకుంటుంది. 2023 నాటికి 303 బిలియన్ బ్యారెళ్ల అంచనాతో ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలను వెనిజులా కలిగి ఉంది. అయినా ఆ దేశం 2023లో కేవలం 4.05 బిలియన్ల ముడి చమురును మాత్రమే ఎగుమతి చేసింది. ఇది ఇతర చమురు ఉత్పత్తి దేశాల ఎగుమతి కన్నా చాలా తక్కువ.
ట్రంప్ ప్రభుత్వ మొదటి పాలనా కాలంలో ఇతర దేశాలు వెనిజులా నుంచి చమురు కొనవద్దని చేసిన హెచ్చరికలే దీనికి కారణం. ఈ విధంగా వెనిజులా దేశాన్ని సైనికంగా బెదిరించడమే కాకుండా దాని ఆర్థికవ్యవస్థను విచ్ఛిన్నం చేసే కుట్రలు అమెరికా చేసింది. వెనిజులాపై యుద్ధానికి సిద్ధమై ఆ దేశ గగన స్థలాన్ని మూసివేస్తున్నట్టు ప్రకటించింది.
అధ్యక్షుడు నికోలస్ మదురో దేశం విడిచిపెట్టి పోవాలని, అతని మంత్రి వర్గ ముఖ్య సహచరులను కాపాడుకోమని ట్రంప్ బెదిరించినట్టు హెరాల్డ్ అనే అంతర్జాతీయ పత్రిక పేర్కొంది.
ఖండన- నిలిపివేత..
ట్రంప్ ప్రభుత్వ ప్రకటనను వెనిజులా తీవ్రంగా ఖండించింది. ఇది ఏకపక్ష చర్యని పేర్కొన్నది. డ్రగ్ మాఫియాపై పోరాటం పేరుతో అమెరికా హద్దులు దాటుతోందని, తమ దేశసార్వభౌమాధికారాన్ని ప్రశ్నించేలా ప్రవర్తన ఉందని మండిపడింది. వెనిజులా ప్రభుత్వాన్ని కూల్చి వేయడమే లక్ష్యంగా ట్రంప్ చర్యలు ఉన్నాయని పేర్కొన్నది.
ట్రంప్ ప్రకటన నేపథ్యంలో విమాన సర్వీసులను నిలిపివేసిన స్పెయిన్, పోర్చుగల్, కొలంబియా, చిలీ, బ్రెజిల్, తుర్కియే దేశాలపై వెనిజులా ఆగ్రహంవ్యక్తం చేసి- ఆ దేశాలకు సంబంధించిన విమాన సంస్థలపై శాశ్వత నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది.
సార్వభౌమాధికారం గల ఒక దేశ గగన స్థలాన్ని మరొక దేశం మూసి వేస్తున్నట్టు ప్రకటించడం అంతర్జాతీయ ఒడంబడికలకు విరుద్ధమైనది. అమెరికా అంతర్జాతీయ ఒప్పందాలను గౌరవించకుండా ఎప్పుడూ ఉల్లంఘిస్తూనే ఉంది.
దాడుల పరంపర..
వాస్తవంకాని సాకులతో ఇరాక్‌పై దాడిచేసింది. కొద్ది నెలల క్రితం ఇరాన్‌పై దాడి చేసింది. ఇప్పుడు వెనిజులాపై దాడికి సిద్దమైంది.
తమ దేశంలోకి వెనిజులా నుంచి మాదకద్రవ్యాలు రావడం వల్లే, ఆ దేశంపై దాడి చేశామని ట్రంప్ ప్రభుత్వం చెప్పడం దాని అసమర్ధతకు నిదర్శనం.
అమెరికాలోకి మాదక ద్రవ్యాలు రాకుండా నిరోధించుకోవాల్సింది అమెరికా ప్రభుత్వమే. ఆ పనిచేయలేని ట్రంప్ ప్రభుత్వం వెనిజులాపై నిందవేస్తూ ఆ దేశాన్ని లొంగతీసుకునే ప్రయత్నం చేస్తున్నది.
ఒక స్వతంత్ర దేశమైన వెనిజులా అధ్యక్షుణ్ణి పట్టి అప్పగించమని అమెరికా కోరడం, నికోలస్ మదురో సమాచారం ఇస్తే ఏకంగా 50 మిలియన్ల డాలర్లు(430 కోట్లరూపాయలు) బహుమతి ప్రకటించడం దాని హంతక మనస్తత్త్వానికి నిదర్శనం. ఇలాంటి బెదిరింపుల ద్వారా వెనుకబడిన దేశాలన్నీ తమ చెప్పు చేతల్లో పెట్టుకోవాలన్నదే అమెరికా విధానం.
వెనిజులాపై సైనిక చర్యను 70% మంది అమెరికన్లు వ్యతిరేకిస్తున్నారని సీబీఎన్ సర్వే వెల్లడించింది. సైనిక జోక్యాలతో ఇప్పటికే అమెరికా ఆర్థికవ్యవస్థ గుల్లయ్యిందని; వెనిజులాపై సైనిక జోక్యం చేసుకోవద్దని అమెరికన్లు కోరుతున్నారు.
వెనిజులాపై అమెరికా ఆంక్షలను, దాడి చేసే ప్రయత్నాలను తక్షణమే విడనాడాలని, ఒక స్వతంత్ర దేశ అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకోరాదని, వెనుకబడిన దేశాలను బెదిరించే విధానాలను మానుకోవాలని ప్రపంచ ప్రజలు అమెరికాకు వ్యతిరేకంగా ఉద్యమించాలి.
బొల్లిముంత సాంబశివ రావు
రాష్ట్ర కార్యవర్గ సభ్యులు
రైతుకూలీ సంఘం(ఆంప్ర)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
