ఏప్రిల్‌లో(2025) జరిగిన ఎన్నికల్లో నాలుగు పోస్టులలో నుంచి ఒక పోస్టును ఏబీవీపీ కైవసం చేసుకుంది. కానీ ఈ సారి కేంద్ర ప్యానల్‌కు ఒక్క ప్రతినిధిని కూడా పంపించలేకపోయింది.
న్యూఢిల్లీ: జవహార్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ) విద్యార్థి సంఘానికి 2025 నవంబరు 6న జరిగిన ఎన్నికల్లో మొత్తం నాలుగు కేంద్ర ప్యానల్ పోస్టులను “వామపక్ష ఐక్యత” కూటమి కైవసం చేసుకుంది. విద్యార్ధి రాజకీయాలలో తన ఆధిపత్యాన్ని చాటిచెపుతూ నలుగురు సభ్యుల ప్యానల్లో మితవాద ఉనికిని వామపక్షం హరించివేసింది.
అధ్యక్షులుగా అదితి మిశ్రా, ఉపాధ్యక్షులు కే గోపికా బాబు, ప్రధాన కార్యదర్శి సునీల్ యాదవ్, సంయుక్త కార్యదర్శిగా డానిష్ అలీ ఎన్నికయ్యారు.
విద్యార్ధి సంఘం కేంద్ర ప్యానల్‌కు, కౌన్సిలర్ల పోస్టులకు బుధవారంనాడు ఎన్నికలను నిర్వహించారు. అర్హులైన 9,043 విద్యార్థుల్లోంచి సుమారు 67% మంది విద్యార్థులు ఓటు వేసినట్టుగా పీటీఐ కథనం తెలియజేసింది.
ఏప్రిల్‌లో జరిగిన విద్యార్థి సంఘం ఎన్నికల్లో వామపక్ష గ్రూపుల మధ్య చీలికలు కనబడ్డాయి. ఈసారి అలాకాకుండా ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్, స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఫ్రంట్లతో “వామపక్ష ఐక్యత” కూటమి ఏర్పడింది.
ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల్లో సంయుక్త కార్యదర్శి పోస్టును హిందుత్వ భావజాల రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌తో సంబంధమున్న అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) గెలుచుకుంది.
నవంబర్ ఎన్నికల్లో మితవాద విద్యార్థి సంఘం అభ్యర్ధులు వామపక్షం చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు. దీంతో కేంద్ర ప్యానల్‌కు ఒక్క విద్యార్థి నాయకున్ని కూడా పంపించలేకపోయారు.
వామపక్ష కూటమి అభ్యర్థి యాదవ్ 1,915 ఓట్లతో గెలువగా, కేవలం 74 ఓట్ల తేడాతో ఏబీవీపీ రాజేశ్వర్ దూబే ఓడిపోయాడు. ఏబీవీపీ అంజు దమారా కంటే కూడా 1,991 ఓట్లు కైవసం చేసుకున్న అలీ; ఆమెను 229 ఓట్ల తేడాతో ఓడించినట్లు డెక్కన్ హెరాల్డ్ కథనం పేర్కొన్నది.అధ్యక్షులుగా ఎన్నికైన మిశ్రా సాధించిన 1,861 ఓట్లతో పోలిస్తే; తన సమీప ఏబీవీపీ ప్రత్యర్ధి వికాస్ పటెల్‌కు 1,447 ఓట్లు వచ్చాయి. తన ప్రత్యర్ధి మితవాద విద్యార్ధి సంఘానికి చెందిన తాన్యా కుమారిని 1,236 ఓట్ల తేడాతో బాబు ఒడించారు. బాబుకు వచ్చిన 2,966 ఓట్లతో పోలిస్తే– కుమారికి 1,730 ఓట్లు వచ్చినట్టుగా ఆ పత్రిక తెలియజేసింది.
ఇదిలా ఉండగా కాంగ్రెస్ అనుబంధ నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా ఈ ఎన్నికల్లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది.
“ఈ ఎన్నికల ఫలితం కేవలం సంఖ్యాపరమైన విజయం మాత్రమే కాదని, ద్వేషించే రాజకీయాలకు, కాషాయీకరణకు, మతపరమైన స్థిరత్వానికి వ్యతిరేకంగా ఒక రాజకీయ సందేశం” అని గురువారం ఒక ప్రకటనలో ఎస్ఎఫ్ఐ పేర్కొన్నది.
“క్యాంపస్‌లో అతి పెద్ద అంశం నిధుల కోత”అని డీఎస్‌ఎఫ్‌కు చెందిన యాదవ్ పీటీఐకు చెప్పారు.
“క్యాంపస్‌పై నిధుల కొరత అతి పెద్ద సమస్య. జాతీయ విద్యా విధానాన్ని బీజేపీ తీసుకొచ్చినప్పటి నుంచి, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను ప్రైవేటీకరించే దిశగా తీసుకెళ్తున్నది. దీంతో ప్రతి సంవత్సరం నిధులను తగ్గించడం జరుగుతోంది. కాబట్టి ప్రభుత్వం నుంచి క్యాంపస్‌కు నిధులను తీసుకొరావడమే మా తొలి పోరాటం” అని యాదవ్ అన్నారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
