హర్యానాలో ఎంఎన్ఆర్ఈజీఏ కింద నమోదైన 8 లక్షల కంటే ఎక్కువ మంది క్రియాశీల కార్మికులలో, కొన్ని వేల కుటుంబాలకు మాత్రమే వంద రోజుల ఉపాధి లభించిందని ప్రభుత్వం లోక్సభలో అంగీకరించింది. అంతేకాకుండా, ఎంఎన్ఆర్ఈజీఏ కోసం కేంద్ర ప్రభుత్వ నిధులు క్రమంగా తగ్గుతూ వచ్చాయి.
న్యూఢిల్లీ: హర్యానాలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంఎన్ఆర్ఈజీఏ) కింద గత రెండేళ్లలో 8 లక్షలకు పైగా క్రియాశీల కార్మికులు నమోదు చేసుకున్నారు. అయితే, కొన్ని వేల కుటుంబాలు మాత్రమే వంద రోజుల ఉపాధి హామీ పథకాన్ని పొందగలిగాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
ది ట్రిబ్యూన్ నివేదిక ప్రకారం, అంబాలాకు చెందిన కాంగ్రెస్ ఎంపీ వరుణ్ చౌధరి లోక్సభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా, గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో హర్యానాలో నిరుద్యోగ భృతి చెల్లించలేదని కేంద్ర ప్రభుత్వం కూడా తెలిపింది.
2022-23, 2023-24లో హర్యానాలో 8,06,439 మంది క్రియాశీల కార్మికులు ఎంఎన్ఆర్ఈజీఏ కింద నమోదు చేసుకున్నారని, అయితే ఈ సంవత్సరాల్లో వరుసగా 3,447- 2,555 కుటుంబాలకు మాత్రమే వంద రోజుల పని లభించిందని గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కమలేష్ పాశ్వాన్ పార్లమెంటులో పేర్కొన్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25లో, హర్యానాలో 8,06,422 మంది క్రియాశీల కార్మికులు ఉన్నారు. కానీ ఇప్పటివరకు 2,191 కుటుంబాలకు మాత్రమే పూర్తి వంద రోజులు పని లభించింది.
“ఎంఎన్ఆర్ఈజీఏ అనేది డిమాండ్ ఆధారిత వేతన ఉపాధి కార్యక్రమం. చట్టంలోని నిబంధనల ప్రకారం, అర్హత కలిగిన ప్రతి గ్రామీణ కుటుంబం నైపుణ్యం లేని శారీరక శ్రమ చేయడానికి సిద్ధంగా ఉంటే ప్రతి ఆర్థిక సంవత్సరంలో కనీసం వంద రోజుల వేతన ఉపాధికి అర్హులు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణీత సమయంలోపు ఉపాధి కల్పించడంలో విఫలమైన సందర్భాల్లో, చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం నిరుద్యోగ భృతి చెల్లించబడుతుంది” అని పాశ్వాన్ అన్నారు.
గత కొన్ని సంవత్సరాలుగా హర్యానాకు కేంద్ర ప్రభుత్వం ఎంఎన్ఆర్ఈజీఏ కింద నిధుల కేటాయింపు తగ్గిందని పాశ్వాన్ ఎత్తి చూపారు. 2020-21లో కేంద్ర ప్రభుత్వం రూ 764.55 కోట్లు కేటాయించగా, 2024-25లో ఈ కేటాయింపు రూ 590.19 కోట్లకు పడిపోయింది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
