తెలంగాణ ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్‌లో ప్రకటించిన ‘విజన్ 2047’ను రాష్ట్ర భవిష్యత్తుకు మార్గదర్శక పత్రంగా అభివర్ణిస్తోంది. ప్రపంచ పెట్టుబడులు, విదేశీ నిధులు, కార్పొరేట్ పరిశ్రమలు, అంతర్జాతీయ స్థాయి నగరంగా హైదరాబాద్ ఎదుగుదల- ఇవన్నీ ఈ విజన్‌లో ప్రధానంగా కనిపించే లక్ష్యాలు.
కానీ ప్రజాస్వామ్యంలో ఏ అభివృద్ధి పథకమైనా ఒక మౌలిక ప్రశ్నకు సమాధానం ఇవ్వాలి: ఈ అభివృద్ధి ఎవరికోసం? ఎవరి మీద ఆధారపడి? ఎవరి నష్టంతో?
విజన్ 2047ను లోతుగా పరిశీలిస్తే, ఇది అభివృద్ధిని సమానంగా పంచే పత్రంగా కాకుండా, ఇప్పటికే బలంగా ఉన్న వర్గాలకు మరింత బలం చేకూర్చే మోడల్‌గా కనిపిస్తుంది. భారతీయ సామాజిక నిర్మాణంలో అభివృద్ధి కేవలం ఆర్థిక ప్రక్రియ కాదు, అది కులం-వర్గం, వ్యవస్థలతో ముడిపడి ఉంటుంది. ఈ వాస్తవాన్ని విస్మరించి రూపొందించిన ప్రతి విజన్ చివరికి అగ్రకుల ఆధిపత్యాన్ని బలపరచడానికే ఉపయోగపడింది.
విజన్ 2047 కూడా ఈ సంప్రదాయానికి భిన్నంగా కనిపించడం లేదు. ప్రభుత్వం ప్రకటిస్తున్న పెట్టుబడులు, ప్రైవేటు రంగ విస్తరణ, విదేశీ నిధుల రాబడి- ఇవన్నీ ఒక స్పష్టమైన నమూనాను చూపిస్తున్నాయి. ఈ అభివృద్ధి మోడల్లో అగ్రకుల కార్పొరేట్ వర్గాలకు నిచ్చెన మెట్లు ఏర్పాటు అవుతున్నాయి. భూమి సులభంగా దక్కుతుంది, పన్ను రాయితీలు లభిస్తాయి, సింగిల్ విండో అనుమతులు వేగంగా వస్తాయి, ప్రభుత్వ రక్షణ ఉంటుంది.
అదే సమయంలో పీడిత కులాల ప్రజలకు జారుడు మెట్లు మాత్రమే మిగులుతున్నాయి.
ఉద్యోగ భద్రత లేని కాంట్రాక్ట్ పనులు, తక్కువ వేతనాలు, శ్రమ ఎక్కువ-హక్కులు తక్కువైన పని పరిస్థితులు. ప్రైవేట్ రంగంలో ఏర్పడుతున్న ఉద్యోగాల స్వభావాన్ని గమనిస్తే ఈ అసమానత మరింత స్పష్టమవుతుంది. అధిక వేతనాలు, నిర్ణయాధికారం, టెక్నాలజీ ఆధారిత ఉద్యోగాలు ‘మెరిట్’ పేరుతో పరిమిత వర్గాల చేతుల్లోకి వెళ్తున్నాయి. కానీ తయారీ, సేవా రంగాల్లో ఎక్కువ శ్రమ అవసరమైన, తక్కువ వేతనం ఇచ్చే ఉద్యోగాలు మాత్రం దళిత-బహుజన-ఆదివాసీ-గిరిజన వర్గాలకు పరిమితం అవుతున్నాయి. ఇది ఆధునిక కార్పొరేట్ ఆర్థిక వ్యవస్థలో కొనసాగుతున్న కులాధారిత శ్రమ విభజనకు మరో రూపం.
కీలక వాటే మోడల్ అసలు స్వరూపం
ప్రపంచ పెట్టుబడిదారులు తెలంగాణకు రావడంలో అసలు కారణం ఏమిటన్న ప్రశ్నకు నిజాయితీగా సమాధానం చెప్పాలి. ఇది రాష్ట్ర అభివృద్ధిపట్ల ఉన్న మమకారం కాదు. ఇక్కడ కోట్లాది నిరుద్యోగులు ఉండటం, తక్కువ వేతనంతో పనిచేయాల్సిన బలవంతపు పరిస్థితులు ఉండటం, ప్రశ్నించే శక్తి లేని శ్రమజీవులు ఎక్కువగా ఉండటమే ప్రధాన కారణం. భారత కార్మికుడికి గంటకు లభించే వేతనం పాశ్చాత్య దేశాలతో పోలిస్తే అనేక రెట్లు తక్కువ. ఈ వేతన తేడానే పెట్టుబడిదారులకు భారీ లాభాలుగా మారుతోంది.
ఈ లాభాల చక్రంలో దేశీయ బ్రాహ్మణీయ అగ్రకుల కార్పొరేట్ వర్గాలకు కీలక వాటా లభిస్తోంది. అదే ఈ అభివృద్ధి మోడల్ అసలు స్వరూపం. ఈ పరిస్థితి కొత్తది కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రకటించిన విజన్ 2020 ఇదే మోడల్‌ను అనుసరించింది. భారీ పరిశ్రమలు ఎదిగాయి, ఐటీ రంగం విస్తరించింది.
కానీ వ్యవసాయం సంక్షోభంలో పడింది. రైతాంగం నష్టపోయింది. చేతివృత్తులు కూలిపోయాయి. ఉపాధి కోసం వలసలు పెరిగాయి. ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించిన ఉద్యమాలపై అణచివేత జరిగింది. ఈ అనుభవాలున్నప్పటికీ, అదే అభివృద్ధి మార్గాన్ని కొత్త పేరుతో పునరావృతం చేయడం ప్రజల్లో అనుమానాలను కలిగించడం సహజమే.
అభివృద్ధికి నిర్వచనం
అభివృద్ధి అంటే కేవలం పెట్టుబడులు కాదు. అభివృద్ధి అంటే కేవలం గ్లోబల్ ర్యాంకింగ్స్ కాదు. అభివృద్ధి అంటే ప్రజల జీవన ప్రమాణంలో నిజమైన మార్పు. కానీ విజన్ 2047లో భూమిలేని పేదలకు భూమి, గ్రామీణ ఉపాధి, వ్యవసాయం, చేతివృత్తులు, దళిత-బహుజన ఆర్థిక స్వావలంబన వంటి అంశాలకు స్పష్టమైన స్థానం కనిపించడం లేదు. ఈ విజన్ రాష్ట్రాన్ని ఒక కార్పొరేట్ మార్కెట్‌గా మార్చే దిశలో సాగుతుందే తప్ప, ఒక సామాజిక న్యాయ సమాజంగా తీర్చిదిద్దే లక్ష్యాన్ని చూపడం లేదు.
అంటే, తెలంగాణకు అవసరమైనది అగ్రకుల మూలధనానికి నిచ్చెనలు వేసే అభివృద్ధి కాదు. పీడిత కులాల ప్రజలకు జారుడు మెట్లు వేసే విధానాలు అంతకంటే కారాదు.
తెలంగాణకు అవసరమైనది సామాజిక న్యాయ ప్రత్యామ్నాయ విజన్ అవసరం. అది భూమి, ఉపాధి, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, చేతివృత్తులపై దళిత-బహుజన-ఆదివాసీ-గిరిజన వర్గాలకు నిజమైన హక్కులు కల్పించాలి.
ప్రైవేటు రంగంలో ఉద్యోగాల నాణ్యతను మెరుగుపరచాలి. ప్రభుత్వ విధానాలన్ని రంగాలను క్రమంగా ప్రైవేటు రంగం వైపు నెట్టుతున్నప్పుడు, ఒక మౌలిక ప్రశ్నను తప్పించుకోవడం సాధ్యం కాదు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు లేకుండా సామాజిక న్యాయం సాధ్యమా? అంటే సాధ్యం కాదనేదే సమాధానంగా వస్తుంది.
విజన్ 2047లో ప్రభుత్వ రంగ ఉపాధి క్రమంగా తగ్గిపోతున్నది. విద్య, ఆరోగ్యం, పరిశ్రమలు, సేవారంగరాలన్నీ ప్రైవేటు చేతుల్లోకి వెళ్తున్నాయి. కానీ ఈ ప్రైవేటు రంగం ఎవరి కోసం తెరుచుకుంటున్నదన్నది చూస్తే అసమానత స్పష్టంగా కనిపిస్తుంది.
సామాజిక బహిష్కరణకు ఆధునిక రూపం
తెలుగు మీడియం నేపథ్యం కలిగిన దళిత-బహుజన-ఆదివాసీ-గిరిజన యువతను ప్రైవేటు రంగం వ్యవస్థాత్మకంగా పక్కకు నెట్టేస్తోంది. ఇంగ్లిష్ రాకపోవడాన్ని అనర్హతగా చిత్రీకరించడం, ‘సాఫ్ట్ స్కిల్స్ లేవు’, ‘కల్చర్ ఫిట్ కాదు’, ‘లెర్నింగ్ కెపాసిటీ లేదు’ వంటి పదజాలంతో వారిని అవమానించడం సాధారణమైపోయింది. ఇది విద్యా లోపం కాదు, సామాజిక బహిష్కరణకు ఆధునిక రూపం.
ప్రైవేటు రంగ నియామకాల్లో రిజర్వేషన్లు లేకపోవడం వల్ల, నియామక ప్రక్రియలు పూర్తిగా బ్రాహ్మణీయ అగ్రకుల పెట్టుబడిదారుల చేతుల్లోనే నిలిచిపోయాయి. భాష, విద్యా నేపథ్యం, ‘మెరిట్’ అనే పేరుతో వారు తమ వర్గానికే అవకాశాలు కేటాయించుకుంటున్నారు. ఫలితంగా, ప్రభుత్వ రంగం కుదించబడుతున్న కొద్దీ, పీడిత వర్గాలకు ఉన్న ఏకైక అవకాశ ద్వారం కూడా మూసుకుపోతున్నది. ఇది యాదృచ్ఛిక పరిణామం కాదు. ఇది ఒక స్పష్టమైన విధానం.
ప్రజలను తెలుగు మీడియం ప్రభుత్వ పాఠశాలల్లో చదివించి, తర్వాత అదే భాషను అవమానంగా మార్చి, ప్రైవేటు ఉపాధి నుంచి తూర్పారబట్టడం- ఇది బ్రాహ్మణీయ అగ్రకుల ఆధిపత్యాన్ని కొనసాగించే ఆర్థిక వ్యూహం. ఈ నేపథ్యంలో ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు లేకుండా విజన్ 2047 మాట్లాడటం అంటే, బ్రాహ్మణీయ అగ్రకులాలకు నిచ్చెన మెట్లుగా బలపరచడం అయితే, పీడిత కులాలకు జారుడు మెట్లు మరింత సున్నితంగా చేయడమే.
కనుకా విజన్ 2047లో కనీస వేతనాలు, కార్మిక హక్కులు, యూనియన్ స్వేచ్ఛకు హామీ ఇవ్వాలి. విదేశీ పెట్టుబడుల లాభాలు కొద్దిమందికి కాకుండా- రాష్ట్రంలోని అన్ని ప్రాంతలకు, కులాలకు – వర్గాలకు పంచే విధానాలు రూపొందించాలి. విజన్ 2047 నిజంగా ప్రజల విజన్ కావాలంటే, అది బ్రాహ్మణీయ అగ్రకుల ఆర్థిక ఆధిపత్యాన్ని ప్రశ్నించాలి.
శ్రమకు గౌరవం, సమానత్వానికి ప్రాధాన్యం, సామాజిక న్యాయానికి కేంద్రస్థానం ఇవ్వాలి. లేకపోతే ఇది కూడా చరిత్రలో మరోసారి అగ్రకులాలకు నిచ్చెన మెట్లు, పీడిత కులాలకు జారుడు మెట్లు వేసిన అభివృద్ధి ప్రయోగంగా మాత్రమే మిగిలిపోతుంది.
పాపని నాగరాజు
(సత్యశోధక మహాసభ)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
