
కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్‌లో రాష్ట్ర హోదా కోసం నిరసనకు దిగిన నిరసనకారులకు పోలీసులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన నిరసనకారులు బీజేపీ కార్యాలయంతో పాటు పలు వాహనాలకు నిప్పంటించారు.
రాష్ట్ర హోదా డిమాండ్ చేస్తూ లేహ్ నగరంలో వేలాది మంది నిరసనకారులు రోడ్డు దిగ్బంధనం చేశారు. ఈ క్రమంలో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. తమ మీద బాష్పవాయువు ప్రయోగించడంతో నిరసనకారులు ఆగ్రహానికి గురైయ్యారు. దీంతో పోలీసులపై రాళ్లు రువ్వారు. బీజేపీ కార్యాలయంతో పాటు పోలీసు వాహనాలకు నిప్పంటించారు.
అగ్నిపర్వతంలా బద్దలైన అసహనం..
జమ్మూకశ్మీర్ ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని విభజించింది.
కశ్మీర్‌కు ప్రత్యేకహోదాను కల్పించే ఆర్టికల్ 370ని 2019 ఆగస్టు 5న ఎన్డీఏ ప్రభుత్వం రద్దు చేసింది. అంతేకాకుండా రాష్ట్రాన్ని జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లుగా విభజించి రెండు భూభాగులుగా మార్చి, రాష్ట్రం నుంచి కేంద్రపాలిత ప్రాంతాలను చేసింది. ఈ రెండు భూభాగాలను కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష పాలనలోకి తీసుకొచ్చింది.
లద్దాఖ్ రాష్ట్ర హోదా కోసం పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ కొన్ని రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. లద్దాఖ్‌ను ఆరవ షెడ్యూల్ కింద చేర్చాలని సోనమ్ డిమాండ్ చేస్తున్నారు.
అయితే రాష్ట్ర హోదా, రాజ్యాంగపరమైన భద్రతలు కల్పించాలని కశ్మీర్- లద్దాఖ్ రెండు ప్రాంతాలలో రాజకీయ నాయకుల నుంచి సాధారణ ప్రజల వరకు చాలా సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నప్పటికీ కేంద్రప్రభుత్వం ప్రజల డిమాండ్లను పట్టించుకోకపోవడం లేదు. దీంతో ప్రజలు నిరసనలకు దిగారు. పోలీసుల రంగప్రవేశంతో వాతావరణం వేడెక్కింది. నిరసనకారులను కట్టడి చేసేందుకు పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. దీంతో నిరసన హింసాత్మకంగా మారింది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.