ఈ వారం రోజుల కాలంలో తెలుగు సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది కుమ్మెర ఘటన. నాగార్ కర్నూల్ జిల్లాలోని ఓ గ్రామం ఇది. ఈ గ్రామానికి ఆనుకుని ఒక గుట్ట ఉంది. దానికి ఆవల భ్రమరాంభ సమేత మల్లికార్జున స్వామి దేవాలయం ఉన్నది. ఈ గుడికి కాస్త ఎడంగా ఆ గుట్టతో పోటీ పడుతూ నిర్మితమైన వట్టెం రిజర్వైయర్ ఉన్నది.
ఈ నెల మూడవ వారం ప్రారంభంలో ఒక అమానవీయ ఘటన భగవత్ సన్నిధి తొలిమెట్టు దగ్గర జరిగింది. అతిశూద్ర, అంటరాని కుల మహిళలపై దాడి. అంతకంటే, గుడ్డెలవిసే మరొక అంశం- రెండు నెలల పసికందు సదరు దాడిలో మృతి చెందినట్టు బాధితుల వేదన.
దీని మీద బహుజన సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు భారీ ఎత్తున నిరసన స్వరాన్ని వినిపించాయి. ఒకానొక దశలో ప్రభుత్వ వైఖరిని చౌరస్తాలో నిలేశాయి.
ఇంతకు కుమ్మెరలో ఏం జరిగింది? బాధితుల వాదన ఏమిటి? అవతల వర్గం వారు చెప్తున్నదేమిటి? ఈ అంశాలను కాస్త లోతుగా చూద్దాం. ఈ కథనం ద్వారా ఒక కుమ్మెరనే కాదు, యావత్ భారతీయ సమాజంలో ఏం జరుగుతున్నదో సులభంగా అర్థం చేసుకోవచ్చు.
కుమ్మెర గ్రామాన్ని ది వైర్ తెలుగు సందర్శించింది. క్షేత్రస్థాయి వాస్తవాలను తెలుసుకునేందుకు ప్రయత్నం చేసింది. ఈ సందర్భంగా ఆశ్చర్యంగొల్పే, విస్తుపోయే అంశాలు కొన్ని ది వైర్ దృష్టికి వచ్చాయి.

జాతర సందర్భంగా జరిగిన ఘటన పూర్వాపరాలు..
ఫిబ్రవరి 18న చంద్రకళ, ఆమె కుమార్తె కీర్తి, చంద్రకళ కోడలు మౌనిక, చంద్రకళ చెల్లెలు- వీరందరూ మధ్యాహ్నం దేవుని దర్శనానికి గుట్టపైకి వెళ్లారు. అక్కడ వీరిని నిర్వాహకులు అడ్డుకున్నారు. వంద రూపాయలు చెల్లించనిదే దైవ దర్శనం సాధ్యం కాదని సదరు పెద్దలు చెప్పారు. తమకు టోకెన్ ఇవ్వాలని వీరు అడిగారు.
ఈ సందర్భంలోనే మాటా మాటా పెరిగి- చంద్రకళ, ఆమె కోడలు తదితరులపై ఆలయ నిర్వాహకులు దాడి చేశారు. అందులో మధు సూధన్ రెడ్డి మిగితా వారున్నారు. ఈ దాడికి మద్దతును ఇచ్చింది ఆ గ్రామ సర్పంచ్ రామిరెడ్డి అని- చంద్రకళ, కీర్తి, నాగర్ కర్నూల్ దీక్షా శిబిరంలో తెలియజేశారు.
గుడిలో దాడి గురించి చంద్రకళ కుమారుడు గణేష్‌కు ఆమె ఆమె కోడలు సమాచారం ఇచ్చారు. దాడి సందర్భంలో రెడ్డి సామాజిక వర్గీయులు తమను పరుష పదజాలంతో దూషించారనే విషయాన్ని గణేష్‌కు చెప్పారు.

తమ మహిళలను అవమానించినట్టుగానే రెడ్డి సామాజిక వర్గాన్ని అంటే ఊరుకుంటారాని గణేష్ ఆ ఊరి వాట్సప్ గ్రూప్‌లో పోస్ట్ చేశారు. ఈ విషయం మీద తమనే ప్రశ్నిస్తారా? తమ ఆడవారి గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారా? అంటూ సదరు సామాజిక వర్గీయులు గణేష్‌పై దాడికి దిగారు. ఈ దాడి దేవుని దగ్గరకు వెళ్లే తొలిమెట్టు వద్దే జరిగింది. ఈ సందర్భంలో తన భర్తను కొట్టవద్దని నెలల చంటి బిడ్డను ఎత్తుకొని సదరు పెత్తందార్లను మౌనిక వేడుకున్నది. వినకపోవడంతో పసిబిడ్డను వాళ్ల కాళ్ల దగ్గర పెట్టి కనికరించాలని వేడుకున్నా వారు కనికరించలేదు. పైగా వీరిపైనా కూడా దాడికి దిగారు- అందువల్లే పాప ప్రాణం కోల్పోయిందని చంద్రకళ కుటుంబం చెప్తున్న మాట.
అమానవీయంగా పెత్తందార్లు దాడికి చేసిన గది వీడియోనే సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమైంది. పైన పేర్కొన్న అంశాలన్నీ బాధితుల వ్యక్తీకరణ అంశాలు. ఈ ఘటన యావత్ తెలుగు సమాజాన్ని చలింపజేసింది.

ఈ అమానవీయ దుర్ఘటనను వెలుగులోకి తీసుకువచ్చింది ధర్మసమాజ్ పార్టీ అధ్యక్షులు విశారదన్ మహారాజ్. ఆయన ఆందోళన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ తర్వాత సమాజం వేగంగా స్పందించింది.
ది వైర్‌కు గ్రామస్తులు ఏం చెప్పారు?
కుమ్మెర గ్రామాన్ని సందర్శించి- పలువురు గ్రామస్తులు, వివిధ సంఘాలు, సంస్థలు, సామాజిక కార్యకర్తలు, మేధావులు తదితరులతో ది వైర్ మాట్లాడింది.
ఈ సందర్భంగా ఆ గ్రామం, అక్కడి సామాజిక స్థితిగతి ప్రత్యక్ష, పరోక్ష అంశాల ప్రభావం- ఎట్లా ఉందో తేటతెల్లమైయ్యింది.
మల్లికార్జున స్వామి దేవస్థానం నుంచి కుమ్మెరలోకి అడుగుపెట్టిన వెంటనే కొందరు దళిత మహిళలు తారసపడ్డారు. జాతరలో జరిగిన దుస్సంఘటన గురించి వీరితో చర్చ చేసింది ది వైర్ తెలుగు.
అందులో తొలుత భాగ్యమ్మ వైర్‌తో మాట్లాడారు- ఆమెతో మాట్లాడుతుండగానే అటువైపు నుంచి మల్లారెడ్డితో పాటు అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి బైక్ మీద వచ్చారు. వారిని చూడగానే దొర మంచివారని భాగ్యమ్మ చెప్పారు. జాతరలో ఏం జరిగిందో తమకు తెలియదని అన్నారు.
ఈ సందర్భంలోనే మల్లారెడ్డి అనే వ్యక్తి మాట్లాడుతూ దాడి జరిగిన మాట వాస్తవమేనని ఒప్పుకున్నారు. పాప మరణం గురించి అస్పష్టమైన అభిప్రాయాన్ని చెప్పారు.
ఘటనకు సంబంధించిన మరిన్ని విషయాలు..
అక్కడి నుంచి ది వైర్ గ్రామంలోకి ప్రవేశించగానే పానుగంటి నిరంజన్ అనే కాంగ్రెస్ సీనియర్ కార్యకర్త తారసపడ్డారు. గుడి వద్ద జరిగిన దాడి ఘటనను ఖండించారు. గ్రామ సర్పంచ్ రామిరెడ్డి చాలా మంచి వాడని చెప్పారు. తమిద్దరం కాంగ్రెస్ వారమేనని వివరించారు. పాప మృతి ఘటన గురించి జరుగుతున్న చర్చ సరైంది కాదని చెప్పారు.
ఇదే గ్రామానికి సంబంధించిన మరికొంతమందితో ఈ విషయం మీద మాట్లాడినప్పుడు మరిన్ని విషయాలు తెలిశాయి. కొందరి పేరు చెప్పేందుకు ఇష్టపడలేదు. కానీ తమ అభిప్రాయాలను మాత్రం పంచుకున్నారు.
తామూ రెడ్లమేనని, గతంలో కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చామని గోవర్థన్ రెడ్డి చెప్పారు. గుడి వద్ద జరిగిన దాడి తప్పని అన్నారు. అంతకు మించి రాజకీయ అంశాలు, సామాజిక అంశాలపై ఆయన పెద్దగా స్పందించలేదు. కాంగ్రెస్‌కు ఓటు వేయనందుకు ఈ దాడి జరిగిందని ఒకరిద్దరు అన్నారు.
ప్రశ్నించినందుకేనా..!
ఈ గ్రామంలో చంద్రకళ, ఆమె కుటుంబం ఎవరికి తలవంచకుండా బతుకుతున్నారు. పైగా కులాంతర వివాహాలు చేసుకున్నారు. వీరి చైతన్యాన్ని, వీరి తెగింపును- ఆ గ్రామ దళిత, శూద్ర సమూహాలు సరిగా అర్థం చేసుకోలేదు.
అంతేకాదు, తమనే ఎదిరిస్తారా అనే అహం భావం పెత్తదార్లకు వచ్చిందని, వారి అహంకారమే బడుగు జీవులపై దాడికి కారణమని పాలమూరు అధ్యయన వేదిక వ్యవస్థాపక కన్వీనర్ ఎం రాఘవాచారి చెప్పారు.
దీంతోపాటు, నాగర్ కర్నూలు సమీప గ్రామాలలో తొలి ఉన్నత పాఠశాల ఈ గ్రామంలోనే ఏర్పడిందని గుర్తు చేశారు. ఎంతో మంది ఉన్నత విద్యావంతులు ఉన్న ఈ గ్రామంలో అంటరాని అభాగ్యులపై దాడనేది కులదాష్టికపు దుశ్చర్యగా అభివర్ణించారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వలసలు, దళితుల దాడుల దుస్సంఘటనలపై దశాబ్దాలుగా పని చేస్తున్న అనుభవం వీరికి ఉన్నది. కుమ్మెర గ్రామాన్ని తాము సందర్శించినప్పుడు వ్యక్తమైన జనాభిప్రాయాలు, మనుధర్మ మానసిక స్థితికి ప్రతిబింబాలుగా ఉన్నాయని ఆవేదనా వ్యక్తం చేశారు.
ప్రాంతంలో వచ్చిన సామాజిక మార్పులు..
నాగర్ కర్నూలు ప్రాంతంలో అక్షరాస్యత, బహుజనుల చైతన్యం మిగితా ప్రాంతాలకంటే ఎక్కువగా ఉంటుంది. సాగునీటి వసతి లభ్యం కావడం వల్ల దిగువ మధ్య తరగతి, అంతకంటే దిగువనున్న బీసీలు, ఎస్సీలు వ్యవసాయ- దీని అనుబంధ వృత్తుల ద్వారా గతం కంటే మెరుగైన జీవితాన్ని అనుభవిస్తున్నారు.
సామాజిక కుల చట్రంలో తాము కింద ఉన్న ఆత్మగౌరవంలో ఎవరికి తక్కువ కాదని- వారు నిలబడుతున్నందుకే అగ్రవర్ణాలకు అహం దెబ్బతిన్నదని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్, తెలంగాణ వికాస సమితి అధ్యక్షులు వనపట్ల సుబ్బయ్య, చరిత్ర పరిశోధకులు హెచ్ రమేశ్ బాబు, ఆశన్న తదితరులు చెప్పారు.

ఈ గ్రామంలో 2000 వరకు ఓటర్లు ఉంటారు. అందులో ఎస్సీలు, రెడ్లు ఇతర బీసీ సామాజిక వర్గాల వాళ్లున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో విద్యా గంధాన్ని అందుకున్న తొలితరం వారు ఈ గ్రామంలోనే ఉన్నారు.
పైకి కనబడని కుల పీడన..
దీనికి తోడు ప్రస్తుతం మారుతోన్న కాలమాన పరిస్థితుల ప్రభావం వలన నేరుగా కుల పీడన ప్రత్యక్షంగా కనిపించడం లేదు. లేదా కనబడకుండా పై తరగతుల వాళ్లు జాగ్రత్తలు తీసుకుంటున్నారని అనవచ్చు. వయసులో తనకంటే చిన్నవాడైన రెడ్డీ సామాజిక వర్గ యువకుడిని- ఇతను ఆలయ కమిటీ సభ్యుడు కూడా- దళిత భాగ్యమ్య దొరాని పిలవడం దీనికి సజీవ ఉదాహరణ.
అంతేకాదు, మునుపటిలాగా అంటూముంటు లేదు. కానీ, దొరవారిపైన తాము ఆధారపడి బతుకుతున్నామని అక్కడి దళితులు చెప్పడం మరో ఉదాహరణ. ఇప్పటికీ ఆ గ్రామంలో పెత్తదార్ల వద్ద దళితులు జీతగాళ్లుగా ఉన్నారు.
జాతర ఘటన గురించి వివరాళ్లోకి వెళ్లినప్పుడు కొందరు స్పందించేందుకు నిరాకరించారు. మరికొందరు తమకు ఏం తెలియదన్నారు. ఇంకొందరు పెద్దవారితో గొడవెందుకని పరోక్షంగా అన్నారు.
చైతన్యాన్ని సహించని అహం..
గ్రామీణ సంబంధాలలో మార్పులు వస్తున్న మాట వాస్తవమే. మునుపటి కంటే కుల ప్రభావం తగ్గినమాటా వాస్తవమే. కానీ, కులాధారమైన సామాజిక హోదా దానికికి ఆధారభూతమైన భూమి, ఇతర వనరులు పెత్తందార్ల అహాన్ని అడ్డుకోలేక పోతున్నది. కుమ్మెర గ్రామంలో జరిగింది- సరిగా ఇదే.
మునుపటి మాదిరి అంటరాని వారిని దూషించడం లేదు. నేరుగా అంటూముట్టని ఆవలకు వెళ్లండనీ చెప్పడం లేదు. కానీ శూద్ర, అతిశూద్ర వర్గాలలో వచ్చిన చైతన్యాన్ని పెత్తందారి ఆధిపత్య ఆలోచన సహించడం లేదు. అందువల్లనే కుమ్మెర జాతరలో ఘటన జరిగిందనే ఒక అభిప్రాయానికి రావాల్సి ఉంటుందేమో..!
దక్షిణ భారతదేశంలో వీర శైవం ప్రాభల్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ పరమేశ్వరుడు బడుగు జీవుల ప్రతినిధి. శివతత్త్వం, సర్వమానవ సమానత్వం బసవేశ్వరుల వారి బోధనా సారమే అక్కమాంబ దేవి కీర్తనల సారాన్ని ఒంపుకున్న నేల తెలంగాణ.
సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి చెంత బడుగు మహిళలపై దాడి ఆ పరమేశ్వరుడు క్షమిస్తాడా? వీర శైవం అందించిన చైతన్యం ఊరుకుంటుందా? ఈ ప్రశ్నలకు సమాధానం గత కాలపు కులస్వామ్యపు ఆలోచనా తీరును మార్చుకోవడమే తప్పా మరో మార్గం లేదు. సృష్టి లయాకారపు శివుడు అందరూ సమానమని చెప్పిన అర్థనారీశ్వరుడి గుడి వద్ద జరిగిన ఘటనను ఏం అనాలో సమాజమే నిర్వచించాలి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
