
భారీ వర్షాలకు కోల్‌కతా నగరం జలమయమైంది. గడచిన 24 గంటల్లో 9.9 ఇంచుల వర్షపాతం నమోదైంది. 1988 తర్వాత ఇంతటి భారీ వర్షం కురవడం ఇదే మొదటిసారి అని భారత వాతావరణ శాఖ ప్రాంతీయ అధికారి హెచ్ఆర్ బిశ్వాస్ చెప్పారు. భారీ వర్షాల కారణంతో విద్యుత్‌షాక్‌కు గురై ఇప్పటి వరకు కనీసం 12 మంది మరణించారు. దీనికి కారణం సీఈఎస్సీ నిర్లక్ష్యమేనని ముఖ్యమంత్రి మమతా బెనార్జీ అన్నారు.
కోల్‌కతా మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు చెప్పిన విషయాలను స్థానిక మీడియా వెల్లడించింది. ఆ వార్తా కథనాల ప్రకారం, మళ్లీ వర్షం పడకపోతే, నగరాన్ని తిరిగి సాధారణ పరిస్థితిలోకి తీసుకురావడానికి కనీసం 10 నుంచి 12 గంటలు పడుతోంది.
అయితే వర్షం ఆగిపోయే సూచనలు కనడడం లేదని, కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసిందని మున్సిపల్ అధికారులు చెప్పారు.
స్తంభించిన జనజీవన స్రవంతి..
కోల్‌కతా నగరంలో కురిసిన భారీ వర్షాలకు జనజీవన స్రవంతి స్తంభించిపోయింది. వర్షాల వల్ల విద్యుత్ఘాతానికి కనీసం 12 మంది చనిపోయారు. ఈ పరిస్థితికి విద్యుత్ పంపిణీ సంస్థ సీఈఎస్సీ కారణమని టీవీ18తో మాట్లాడుతూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. వాళ్లు ఇక్కడ వ్యాపారం చెస్తూ, రాజస్తాన్‌లో మౌళిక వసతులను ఆధునీకరిస్తున్నారని, పదేపదే ఈ విషయం చెప్తూ తన నోరు పోతుందని అన్నారు.
కోల్‌కతా నగరంలో పాఠశాలలకు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. మెట్రో రైల్వే సేవలు స్తంభించిపోయాయి. పరీక్షలను వాయిదా వేశారు. ఇతర సేవలపై కూడా భారీ వర్షాలు ప్రభావం చూపించాయి.
వార్షిక దుర్గా పూజ ఉత్సవాలకు వారం రోజులే మిగిలి ఉండగా, వరదల నగరం సాధారణం కంటే, ఎక్కువ ప్రమాదమే తెచ్చిపెడుతోంది. నగరంలోని వివిధ ప్రాంతాలలో మండపాలు నీటమునిగాయి. మండపాలను అలంకరించిన సామాగ్రి, ఫ్లెక్సీ బోర్డులు, వెదురు కర్రలు వరదనీటిని అడ్డుకుంటున్నాయి. దీని వల్ల ఎటుచూసిన ట్రాఫిక్‌జామ్ అవుతోంది.
నగరంలో ఇంతటి భారీ వర్షం కురవడం “అసాధారణం” అని, ప్రత్యేక దుర్గా మండపం కూడా నీటిలో మునిగిపోయిందని, ఆ మండపానికి సమీపాన ఉంటున్న కోల్‌కతా మేయర్ ఫిరాద్ హకీమ్ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.
ప్రస్తుత పరిస్థితిని సమర్థవంతంగా- సమయస్ఫూర్తితో ఎదుర్కోవడానికి, ఎప్పటికప్పడు మున్సిల్ కార్పోరేషన్ సమీక్షిస్తున్నట్టు కోల్‌కతా మేయర్ చెప్పారు. అన్ని అత్యవసర సేవలను అందించడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారని, పౌరులకు అవసరమైన సహకారాన్ని అందించడానికి కేఎంసీలో కంట్రోల్ ఏర్పాటు చేశామని, అది పూర్తి స్థాయిలో పనిచేస్తుందని ఆయన తెలియజేశారు.
“భారీ వర్షాలు తగ్గే వరకు పౌరులు తమ ఇళ్లలోనే ఉండాలి. ఒకవేళ బయటకు వస్తే విద్యుత్ స్తంభాలను తాకవద్దు. వరద నీరు నిలిచి ఉన్న చోట విద్యుత్ ఘాతానికి దారి తీసే ప్రమాదం ఉంటుంది” అని ఆయన తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.
కోల్‌కతా నగరం దాని చుట్టు పక్క జిల్లాలు ఈ నెల 26వ తేదీ వరకు అప్రమత్తంగా ఉండాలని వాతావారణ శాఖ తెలియజేసింది.
“దుర్గా పూజ సమయంలో, ఇంతటి భారీ వర్షాలను నేను ఎప్పుడు చూడలేదు. రోడ్ల మీద మ్యాన్‌హోల్స్ మూతలు బాగానే తెరుచుకుంటున్నాయి. కొన్నింటిని తెరవలేకపోతున్నాము. దీని వల్ల నీరు పోవడానికి కొంత సమయం పడుతుంది” అని నగర మేయర్ కౌన్సిల్ సభ్యులు తారక్ సింగ్ అన్నారు.
దక్షిణ కోల్‌కతాలోని కీలక ప్రాంతాలలో 250 మిల్లిమీటర్లకు పైగా వర్షం కురిసింది. అందులో గార్యాలో 332 ఎంఎం, జోధ్‌పూర్ పార్క్ 285 ఎంఎం, కాలీఘాట్ 22 ఎంఎం , అలీపూర్ 275 మిల్లీమిటీర్ల వర్షం కురవగా, ఉత్తర కోలకతాలో ఇంతకంటే ఎక్కువ వర్షం కురిసి, ఎటు చూసినా వరద నీరు ఏరులై పారుతోంది.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.