ఐదు రాష్ట్రాలకు ప్రస్తుతం జరగనున్న ఎన్నికలలో భాగంగా ఏప్రిల్ 9న అస్సాం, పుదుచ్చేరి, కేరళం రాష్ట్రాల శాసనసభల ఎన్నికల పోలింగ్ జరిగింది.
అయితే మిగిలిన నాలుగు రాష్ట్రాల ఎన్నికలకు, కేరళం ఎన్నికలకు స్పష్టమైన తేడా ఉంది.
దేశంలో అమలు జరుగుతున్న ప్రజా వ్యతిరేక విధానాలకు భిన్నంగా ప్రజాభ్యున్నతి లక్ష్యంగా కేరళంలో అధికార వామపక్ష ప్రజాతంత్ర సంఘటన(ఎల్డీఎఫ్) ప్రభుత్వం పనిచేస్తున్నది.
కేంద్రం ఆంక్షలు – రాష్ట్ర ప్రభుత్వ పోరాటం..
“భారత దేశ ప్రజలమైన మేము ఓటు ద్వారా ఇచ్చిన తీర్పు ఆ ప్రజల ప్రయోజనం కోసమే వినియోగించాలి”అనే రాజ్యాంగ నిర్దేశిత లక్ష్యాన్ని కేరళం వామపక్ష ప్రజాతంత్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది.
కేంద్రంలో అధికారం చలాయిస్తున్న ఆర్ఎస్ఎస్ నడిపిస్తున్న బీజేపీ ప్రభుత్వం కేరళం ప్రభుత్వం పట్ల కక్షగట్టి, చట్ట ప్రకారం రాష్ట్రానికి రావలసిన నిధులను విడుదల చేయకుండా అడ్డుకుంటున్నది.
చివరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే అప్పుల పైన కూడా ఆంక్షలు విధించి రాష్ట్రాన్ని ఆర్థికంగా దిగ్బంధనం చేస్తున్నది.
ఆ విధంగా రాష్ట్రాలు తన అడుగులకు మడుగులొత్తే విధంగా చేసుకోవాలని కేంద్రం తపన.
కానీ కేరళం వామపక్ష ప్రజాతంత్ర ప్రభుత్వం కేంద్రం అడ్డంకులను ప్రజల సహకారంతో తిప్పికొట్టి ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్నది.
కరోనా మహమ్మారి మన దేశంతో సహా ప్రపంచం మొత్తాన్ని గజగజలాడించింది.
సంక్షోభాల నిర్వహణ – అభివృద్ధి సూచికల్లో అగ్రస్థానం..
ఆ కోవిడ్ మహమ్మారి నుంచి ప్రజల ప్రాణాలను కాపాడి అంతర్జాతీయంగా కీర్తి గడించిన ఏకైక రాష్ట్ర ప్రభుత్వం కేరళం.
అలాగే కనివినీ ఎరుగని వరద బీభత్సం వయనాడ్‌ను అతలాకుతలం చేసింది. కేంద్రం తగిన సహాయాన్ని అందజేయడానికి నిరాకరించింది.
అయినా కేరళం రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా వయనాడ్‌ను పునర్నిర్మించింది.
దేశంలో వలస కార్మికుల దుర్భర జీవన పరిస్థితులను కోవిడ్ కాలంలో ప్రపంచమంతా చూసింది.
అలాంటి వలస కార్మికులను తమ రాష్ట్ర “అతిథి కార్మికులు”గా గుర్తించింది కేరళం రాష్ట్ర ప్రభుత్వం.
వారికి నివాస వసతులతో సహా అన్ని రకాలైన హక్కులను కల్పించిన ఏకైక రాష్ట్ర ప్రభుత్వం భారతదేశంలో కేరళం మాత్రమే.
కార్మికులకు ఉరితాళ్ల లాంటి లేబర్ కోడ్లను కేరళం రాష్ట్రంలో అమలు జరిపేది లేదని కేరళ ప్రభుత్వం నిర్ద్వంద్వంగా ప్రకటించింది. వృద్ధుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఒక కమిషన్‌ను ఏర్పాటు చేసింది.
గత పది సంవత్సరాల కాలంలో కేరళం పాఠశాల స్థాయి నుంచి కళాశాల స్థాయి దాకా విద్యాలయాలను అంతర్జాతీయ స్థాయికి అభివృద్ధి చేసి గౌరవప్రదమైన, నాణ్యమైన, నైపుణ్యమైన విద్యను అందిస్తున్నది.
గ్రామస్థాయి దాకా మెరుగైన ఉచిత వైద్య సదుపాయాలను కేరళం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది.
మౌలిక సదుపాయాలను అనూహ్యంగా అభివృద్ధి చేసింది. అంగన్వాడి టీచర్లు, హెల్పర్ల వేతనాలు దేశంలోనే అత్యధికంగా ఉన్నది కేరళం రాష్ట్రంలోనే.
అసంఘటిత రంగ కార్మికుల కనీస వేతనాలు దేశంలోనే అత్యధికంగా ఉన్న రాష్ట్రం కేరళం. అనేక మానవ అభివృద్ధి సూచికలలో కేరళం అగ్రస్థానంలో ఉంది.
అందుకే కేరళం రాష్ట్ర శాసనసభ ఎన్నికలు ఇతర రాష్ట్రాల శాసనసభ ఎన్నికల కంటే భిన్నంగా నిలిచాయి.
2021లో జరిగిన ఎన్నికలలో అప్పటివరకు ఉన్న చరిత్రను తిరగరాసి రెండవ దఫా ఎల్డీఎఫ్ అధికారంలోకి వచ్చింది.
ఇప్పుడు మూడోసారి విజయం సాధించి దేశానికి మరొకమారు రోల్ మోడల్‌గా నిలవాల్సిన అవసరం ఉంది.
ఇది కేవలం కేరళం రాష్ట్ర ప్రజలకు మాత్రమే కాదు, మొత్తం దేశ ప్రజానీకానికి అవసరం. ప్రభుత్వాల లక్ష్యం ప్రజా అనుకూల విధానాలా లేక ప్రజా వ్యతిరేక విధానాలా తేల్చే ఎన్నికలు ఇవి.
ప్రజా సంక్షేమం కోరే వారంతా కేరళం రాష్ట్రంలో వామపక్ష ప్రజాతంత్ర సంఘటన ప్రభుత్వం తిరిగి మూడోసారి అధికారంలోకి రావాలని, ప్రజలే చరిత్ర నిర్మాతలని రుజువు చేయాలని అందరూ ఆకాంక్షిద్దాం.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
