అడుగులో అడుగేస్తూ
ఆలోచనల్లో పడుతూ లేస్తూ
ఎడతెగని గమ్యం వైపు
నడుస్తూనే ఉన్నా..!
కాలు మెలితిరిగి కింద పడబోయినా..సర్దుకుని,
అప్పటి నుంచి మరింత జాగ్రత్తగా
నడుస్తూనే ఉన్నా..!
ఇన్నేళ్లుగా..
ఎక్కడో సుదూర తీరాల నుంచి లీలగా వినబడుతున్న ఆక్రందనలు వినిపించుకోకుండా,
గాన మాధుర్యం మాత్రం చెవిలో పడేట్లు సంగీతం వింటూ నడుస్తూనే ఉన్నా..!
పక్కనే నడుస్తున్న,
ఎదురుగా వస్తున్న
ఎందరో మహానుభావుల
నవ్వుల చిరు పలకరింపులు కంటబడకుండా
ఆకాశం వైపు, నిటారు చెట్ల చిటారు కొమ్మల వైపు చూస్తూ నడుస్తూనే ఉన్నా..!
నేను రాసుకున్న పద్యంలో నేనే ఒక పాదంగా మారిపోతున్నానని తెలుసుకోకుండా కళాతీత, కాలాతీత రచనలు సాగించే యత్నంలో నడుస్తూనే ఉన్నా..!
హృదయాంతరాళమున పెనుగులాటలంటే
బాహ్య ప్రపంచంలో అనుక్షణం బద్దలవుతూ లావాను వెదజల్లే బ్రహ్మాండ అగ్ని పర్వతాలనే గ్రహింపును విస్మరించి
నడుస్తూనే ఉన్నా..!
నేనే ఒక విశ్వమని, ఈ విశ్వమంతా నాలోనే ఉందని విర్రవీగుతూ..
ప్రతి మదిలోనూ అద్భుత
హృదయ భాండం నిండుగా ఉందని గుర్తించకుండా నడుస్తూనే ఉన్నా..!
చిరు చెమట పట్టిన నుదుటికి చల్లగా తగులుతున్న మెత్తని గాలి ఈ ప్రకృతి ఉచ్ఛ్వాస, నిశ్వాసలలోని కీలక భాగమని గమనించకుండా నడుస్తూనే ఉన్నా..!
ఇప్పుడు…
నా అంతరంగ చీకట్లను తొలగించి, స్థిరత్వపు బాటలో నడిపించే దిశలో అడ్డుగా నిలుస్తున్న దట్టమైన భారీ వృక్షాల కొమ్మలను చీల్చుకొని నేలకు వాలుతున్న ఎర్రబారిన సూరీడి తేజస్సును అవగతం చేసుకుంటూ నడుస్తూనే ఉన్నా..!
ఎన్నెన్ని వేదనలు ఈ తోవలో..?
ఎన్నెన్ని రోదనలు ఈ బాటలో..!?
అన్నింటినీ హృదయమంతా ఆకళింపు చేసుకొని,
కొంతైనా కన్నీటి తడిని తుడిపేసే నిశ్చయ చైతన్యంతో ఎడతెగని గమ్యం వైపు ఇంకా ఇంకా నడుస్తూనే ఉన్నా..!
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
