
భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కుమార్తె, శాసనమండలి సభ్యురాలు(ఎమ్మెల్సీ)కే కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ క్రమంలో బుధవారంనాడు బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి కవిత రాజీనామా చేశారు.
న్యూఢిల్లీ: పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కుమార్తె– శాసనమండలి సభ్యురాలు(ఎమ్మెల్సీ) కల్వకుంట్ల కవితను బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది. సస్పెన్షన్ ఒక రోజు తర్వాత బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కవిత రాజీనామా చేశారు.
హిందూస్తాన్ టైమ్స్ నివేదిక ప్రకారం, తన సోదరుడు కేటీ రామారావును, బంధువులైన టీ హరీష్ రావు, జే సంతోష్ రావులను కవిత హెచ్చరించారు. అంతేకాకుండా, చుట్టూ ఉన్నవారి అసలైన ఉద్దేశాల పట్ల జాగ్రత్తగా ఉండాలని తన తండ్రి కే చంద్రశేఖర్ రావును కోరారు.
శాసన మండలి సభ్యురాలు కే కవిత క్రమశిక్షణా కారణాల వల్ల పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. దీనికంటే ఒక రోజు క్రితం, కాళేశ్వరం ప్రాజెక్టు కుంభకోణంలో తన తండ్రిని బలిపశువును చేసి, తన బంధువులైన మాజీ నీటిపారుదల మంత్రి టీ హరీష్ రావు, మాజీ ఎంపీ జే సంతోష్ రావులు భారీ సంపదను కూడబెట్టారని ఆమె ఆరోపించారు.
తన బంధువుల అవినీతి కారణంగానే తన తండ్రి కే చంద్రశేఖర్‌ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) దర్యాప్తు చేస్తోందని కవిత అన్నారు. తమ బంధువులను నమ్మవద్దని కేటీఆర్‌కు హితవు పలికారు.
“కేసీఆర్ గారు, కేటీఆర్ గారు నా కుటుంబం. మేము రక్త సంబంధీకులం, పార్టీ నుంచి సస్పెన్షన్ లేదా పదవి కోల్పోవడం వంటి కారణాల వల్ల ఈ సంబంధం తెగిపోకూడదు. కానీ కొంతమంది తమ వ్యక్తిగత, రాజకీయ ఎదుగుదల కోసం మా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలనుకుంటున్నారు” అని కవిత అన్నారు.
కొంతమంది స్వార్థపూరిత బీఆర్ఎస్ నాయకులు తనను సస్పెండ్ చేయాలని తన తండ్రిపై ఒత్తిడి తెచ్చారని కవిత ఆరోపించారు.
“తన చుట్టూ ఉన్న నాయకుల అసలైన ఉద్దేశాలను గుర్తించమని మా నాన్నను నేను అభ్యర్థిస్తున్నాను. వారు తమ స్వార్థ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేశారు” అని కవిత వాపోయారు.
రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ తిరుగుబాటుదారులతో కుమ్మక్కయ్యాడు..
మరో పెద్ద ఆరోపణ చేస్తూ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడానికి బీఆర్ఎస్ “తిరుగుబాటుదారులతో కుట్ర” పన్నుతున్నారని కవిత బీఆర్ఎస్ నుంచి సస్పెండైన తర్వాత ఆరోపించారు.
బీఆర్ఎస్ కుటుంబాన్ని అంతం చేయడానికి కాంగ్రెస్ నాయకుడు, తన బంధువు టీ హరీష్ రావుతో కలిసి కుట్ర పన్నారని చెప్పుకొచ్చారు.
తన బంధువుతో కలిసి రేవంత్ విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు ఈ పథకం రచించారని కవిత ఆరోపించారు. ఈ కుట్రలో భాగంగా, బీఆర్ఎస్ నాయకులపై రేవంత్ కేసులు పెట్టారని, హరీష్ రావును తప్పించారని వ్యాఖ్యానించారు.
“కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభమైనప్పుడు హరీష్ రావు నీటిపారుదల మంత్రిగా ఉన్నారు, రేవంత్ రెడ్డి ఆయనకు వ్యతిరేకంగా ఏమీ అనలేదు‘‘ అని కవిత చెప్పినట్లు సమాచారం.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తన తండ్రినీ, సోదరుడు కేటీఆర్‌నూ ఓడించడానికి హరీష్ రావుకు నిధులు సమకూర్చినట్టుగా కూడా చెప్పారు.
అన్నా, నువ్వు ఏదైనా చర్య తీసుకున్నావా?
ఆమె తన సోదరుడు కేటీ రామారావును బంధువులు, బీఆర్ఎస్ నాయకుల గురించి హెచ్చరించింది. పార్టీలోనే తనపై కుట్ర జరుగుతోందని తాను ఆందోళనలు చేసినప్పుడు, కేటీఆర్ “పట్టించుకోలేదు” అని కవిత ఆవేదన వ్యక్తం చేశారు.
కవిత మాట్లాడుతూ, “నాపై జరుగుతున్న కుట్రలు, తప్పుడు ప్రచారాల గురించి నేను తనికి చెప్పాను. ఒక సోదరిగా మాత్రమే కాకుండా పార్టీ ఎమ్మెల్సీగా కూడా నేను తనిని అభ్యర్థించాను. కానీ, తను అస్సలు పట్టించుకోలేదు. తను నాకు ఫోన్ కూడా చేయలేదు. ఇది చాలా కాలం క్రితం జరిగింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పార్టీ ఎమ్మెల్సీగా, నేను ఈ కుట్రల గురించి ఫిర్యాదు చేశాను. దీనిపై మీరు ఏదైనా చర్య తీసుకున్నారా అన్నా? మీరు దాని గురించి ఒక్క మాటైనా చెప్పారా?’‘ అని మీడియా ముఖంగా ఆవేదన వ్యక్తం చేస్తూ కేటీఆర్‌ను ప్రశ్నించారు.
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో జరిగిన కుంభకోణంలో తన తండ్రి కేసీఆర్‌ను ఇరికించారని హరీష్ రావు, సంతోష్ రావులపై కవిత ప్రధాన ఆరోపణలు చేశారు. ఆరోపణలు చేసిన కొన్ని గంటలకే ఆమెపై బీఆర్ఎస్ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది.
తన సస్పెన్షన్‌కు ముందు కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు, సంతోష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రధాన పర్యవేక్షకులుగా ఉన్నారని గుర్తుచేశారు. వీరిని విశ్వాసపాత్రులుగా పరిగణించి కేసీఆర్ కళ్ళు మూసుకున్నారని, దాంతో ఇదే అదనుగా వీరిద్దరూ అంతులేని సంపదను కూడబెట్టారని ఆరోపించారు. వీరు అవినీతి అనకొండలని ఘాటుగా విమర్శించారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో కవితను సీబీఐ అరెస్టు చేసి, మార్చి 16 నుంచి 2024 ఆగస్టు 24 వరకు, దాదాపు ఆరు నెలల పాటు జైలులో ఉంచారు. అప్పటి నుంచి ఆమె పార్టీలో విమర్శలు ఎదుర్కొవటం గమనించాల్సిన విషయం.
అనువాదం: కృష్ణనాయుడు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.