కబీర్ కళా మంచ్‌తో సంబంధమున్న కార్యకర్త జ్యోతి జగ్తాప్కు ఎల్గార్ పరిషత్ కేసులో సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. ఈ కేసులో అరెస్టయిన ముగ్గురు మహిళల్లో ఒకరైన జగ్తాప్; ఐదు సంవత్సరాల ఆరు నెలలు జైలు జీవితాన్ని గడిపారు. అంతేకాకుండా ప్రస్తుతం జైలులో ఉన్న ఏకైక మహిళా నిందితురాలు. ఈ కేసులో మొత్తం 16 మంది మానవ హక్కుల కార్యకర్తలు, విద్యావేత్తలను అరెస్టు చేశారు.
ముంబై: ఎల్గార్ పరిషత్ కేసులో ఐదు సంవత్సరాల ఆరు నెలలు జైలు జీవితాన్ని గడిపిన సాంస్కృతిక కార్యకర్త జ్యోతి జగ్తాప్కు, నవంబర్ 19న సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది.
తదుపరి విచారణ 2026 ఫిబ్రవరిలో జరిగే వరకు తన మధ్యంతర బెయిల్ కొనసాగుతుంది. రెగ్యులర్ బెయిల్ పొందడానికి తను సుదీర్ఘ పోరాటాన్ని చేసింది. ట్రయల్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వివిధ ధర్మాసనాల ముందు ఈ పోరాటానికి సంబంధించిన అనేక పిటిషన్లు ఉన్నాయి.
ఈ కేసులో అరెస్టయిన ముగ్గురు మహిళల్లో సుదీర్ఘకాలంగా ఇంకా జైలులోనే ఉన్న ఏకైక మహిళ జగ్తాప్కు; న్యాయమూర్తులు ఎంఎం సుందరేష్, సతీష్ చంద్ర శర్మలతో కూడిన డివిజన్ బెంచ్ మధ్యంతర ఉపశమనాన్ని కలిగించింది.
ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో ఇద్దరు మహిళలు- న్యాయవాది సుధా భరద్వాజ్, రిటైర్డ్ ప్రొఫెసర్ షోమా సేన్ ఇప్పటికే బెయిల్‌పై ఉన్నారు.2018 జూన్‌లో మొదటి దశ అరెస్టులు ప్రారంభమైనప్పటి నుంచి ఈ కేసులో మొత్తం 16 మంది మానవ హక్కుల కార్యకర్తలు, విద్యావేత్తలను అరెస్టు చేయడం గమనించదగ్గ విషయం. వీరిలో జగ్తాప్‌తో సహా ఐదుగురు జైలులోనే ఉన్నారు. మిగిలిన వారు పూర్తి లేదా మధ్యంతర బెయిల్‌పై బయటకు వచ్చారు.
జైలులో ఉన్న ఇతర మానవ హక్కుల కార్యకర్తలలో న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్, ఢిల్లీ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ హెని బాబు, సాంస్కృతిక కార్యకర్త- కార్యకర్త సాగర్ గోర్ఖే, రమేష్ గైచోర్ ఉన్నారు. ఈ కేసులో అరెస్టయిన వారిలో ఒకరైన- 84 ఏళ్ల పాస్టర్, గిరిజన హక్కుల కార్యకర్త స్టాన్ స్వామి 2021 జూలై 5న కోవిడ్-19 సమయంలో సకాలంలో, సరైన వైద్యం అందకపోవడంతో కస్టడీలోనే మరణించారు.
జగ్తాప్ ఐదున్నర సంవత్సరాలకు పైగా జైలు శిక్ష అనుభవించారని తన న్యాయవాది, సీనియర్ న్యాయవాది అపర్ణ భట్ కోర్టులో పేర్కొన్నారు. దీని తర్వాత జగ్తాప్ మధ్యంతర బెయిల్‌పై నిర్ణయం వెలువడింది. జగ్తాప్ తరపున న్యాయవాది కరిష్మా మారియా కూడా హాజరయ్యారు.
కబీర్ కళా మంచ్(కేకేఎం)తో సంబంధమున్న జగ్తాప్ను 2020 సెప్టెంబర్ 8న అరెస్టు చేశారు. తరువాత కేకేఎంను యూఏపీఏ కింద నిషేధించారు.
2017 డిసెంబర్ 31న పూణేలోని శనివార్వాడ ప్రాంతంలో ఎల్గార్ పరిషత్ సెమినార్ నిర్వహించిన బృందంలో జగ్తాప్ ఒకరని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) పేర్కొంది.
మొదట పూణే పోలీసులు ఈ కేసును నిర్వహించగా, తరువాత ఎన్ఐఏ దానిని స్వాధీనం చేసుకుంది. 2018 జనవరి 1న పూణే నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న భీమా కోరెగావ్‌లో జరిగిన హింసను ఎల్గార్ పరిషత్ ప్రేరేపించిందని రెండు సంస్థలు ఆరోపించాయి.
జగ్తాప్కు ముందు, అదే బెంచ్ అతని సహ నిందితుడు మహేష్ రౌత్‌కు వైద్య కారణాలపై మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. గతంలో 2023 సెప్టెంబర్ 21న బాంబే హైకోర్టు రౌత్‌కు బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్ ఉత్తర్వులను ఎన్ఐఏ సుప్రీంకోర్టులో సవాలు చేయడంతో, రెండు నెలల క్రితం వరకు రౌత్ జైలులోనే ఉన్నారు.
మహారాష్ట్రలోని గడ్చిరోలికి చెందిన గిరిజన హక్కుల కార్యకర్త, పండితుడు రౌత్ చాలా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అంతేకాకుండా తక్షణ వైద్య సహాయం అవసరం. సుప్రీంకోర్టు అతనికి నవంబర్ 26 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. బుధవారంనాడు(నవంబర్ 19) కోర్టు తదుపరి విచారణ వరకు అతని మధ్యంతర బెయిల్‌ను పొడిగించింది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
