గతాన్ని అర్థం చేసుకునే విధానమే వర్తమానాన్ని, భవిష్యత్తును చూసే దృక్పథానికి రూపునిస్తుందని ప్రఖ్యాత చరిత్రకారిణి రొమిల్లా థాపర్ తన అద్భుతమైన జీవన స్మృతులలో ప్రతిబింబించారు.
ఆమె జీవితం, ప్రయాణాలు, పాండిత్య ప్రస్థానం ద్వారా ఈ విషయాలను వివరించారు.
1937లో మా కుటుంబం పెషావర్‌కు మారింది. కంటోన్మెంట్లో అదో ప్రత్యేకమైన ఒకే అంతస్తు ఇల్లు.
విశాలమైన స్థలంలో ఒక పక్క తోట, మరోపక్క ఖాళీ స్థలం ఉండేవి. అంతకుముందు మేము థాల్ కోట ఇరుకు ప్రాంతంలో నివసించే వాళ్లము— అక్కడి నుంచే మా జీవితాల్లో మార్పు మొదలైంది.
ఆ రోజుల్లో కంటోన్మెంట్ ఇళ్లకు ఒక ప్రత్యేక శైలి ఉండేది. ఇంట్లోకి ప్రవేశించగానే వరండా నుంచి మధ్య కారిడార్‌లో వెళ్లేలా దారి ఉండేది.
ఈ కారిడార్‌కు ఇరువైపులా సిట్టింగ్, డైనింగ్ గదులతో పాటు పడక గదులు, బయటి వైపు వరండాలు ఉండేవి.
ప్రతి పడక గదికి అనుబంధంగా టాయిలెట్, స్నానాల గది ఉండటమే కాకుండా, బయటకు వెళ్లడానికి మరో తలుపు ఉండేది.
ఆ రోజుల్లో ఫ్లష్ టాయిలెట్లు లేవు, కాబట్టి శుభ్రం చేసే పనిమనుషుల రాకపోకల కోసం ఈ ఏర్పాటు చేసేవారు.
నాటి జీవనశైలి – వంటశాల జ్ఞాపకాలు
ఇంటికి నాలుగవ వైపు చివరన వంటగది, స్టోర్ రూమ్ ఉండేవి. వంటకు కావాల్సిన బొగ్గులను కొంత దూరంలో ఉంచేవారు.
స్టోర్ రూమ్‌లో పిండి, పప్పు, నూనెవంటి నిత్యావసరాలన్నీ ఉండేవి. వంట సామాగ్రిని కొలత ప్రకారం ఇచ్చేవారు.
వంట సామాగ్రిని, ఖర్చులను జాగ్రత్తగా ఇంటి వ్యవహారాలను చూసుకునే మహిళ(యజమానురాలు) పర్యవేక్షించేవారు.
నాటి మా అమ్మ వంట ఖర్చుల పుస్తకాన్ని నేను ఇటీవలే చూశాను. ఆనాటి ధరలు చూసి ఆశ్చర్యపోయాను.
కేవలం ఒక్క రూపాయికే పప్పు, పిండి, బియ్యం వచ్చేవి. కొన్ని ధరలు అణాలలో ఉండేవి. పదహారు అణాలు కలిస్తే ఒక రూపాయి.
కొన్ని ఖరీదైన వస్తువులు ఎనిమిది అణాలకే లభించేవి. ఆ రోజుల్లో పనిమనిషికి నెలకు 30 రూపాయల వేతనం అంటే అది అద్భుతమైన జీతంగా పరిగణించబడేది.
వంటగది దాటి కొన్ని అడుగుల దూరంలో బ్యారక్లాంటి క్వార్టర్లు ఉండేవి, అక్కడ పనిమనుషులు ఉండేవారు.
వారిని పిలవాలంటే గట్టిగా కేక వేయాల్సి వచ్చేది లేదా అక్కడికి నడిచి వెళ్లాల్సి వచ్చేది. ఈ మధ్యలో ఉన్న ఖాళీ స్థలంలో పాముల బెడద ఉండేది. ఆ విశాలమైన బహిరంగ ప్రదేశం నా జ్ఞాపకాల్లో ఇప్పటికీ చెదరకుండా ఉంది.
స్నేహాలు – ఇస్కందర్ మీర్జాతో పరిచయం
నాకు మిస్ బిర్చ్ పాఠశాల గురించి అంతగా గుర్తులేదు కానీ, ఆ రెండేళ్ల కాలంలో తండ్రి స్నేహితులతో గడిపిన క్షణాలు బలంగా నాటుకుపోయాయి.
మా పక్కింట్లో బ్రిటిష్ అధికారుల రాజకీయ ఏజెంట్ ఇస్కందర్ అలీ మీర్జా ఉండేవారు. ఆయన తర్వాత కాలంలో పాకిస్తాన్‌కు అధ్యక్షులయ్యారు.
మా రెండు కుటుంబాల మధ్య త్వరగానే స్నేహం ఏర్పడింది. మీర్జా పిల్లలు, నేను ఒకరి ఇంటికి ఒకరం వెళ్తూ ఆడుకునేవాళ్లం.
మీర్జాను ‘సికిందర్’ అని పిలిచేవారు. మా నాన్నకు, ఆయనకు మధ్య మంచి చమత్కారభరితమైన స్నేహం ఉండేది.
ఆయన ఆరుగురు పిల్లల్లో జీనత్ నాకు ప్రాణస్నేహితురాలైంది. మేమిద్దరం కొత్త ఆటలను కనిపెట్టడం, మాకు ఇష్టమైన కథల్లోని పాత్రల్లా అభినయించడం చేస్తూ కాలం గడిపేవాళ్లం.
ఇప్పటి పిల్లలకు దొరికినట్టు- మౌస్ క్లిక్‌తో మాకు సమాచారం దొరికేది కాదు, అందుకే మా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసి మేమే సృజనాత్మకంగా ఆలోచించేవాళ్లం.
ఊహా ప్రపంచం – కథలు
మా ఊహా ప్రపంచానికి పురాణాలు, అద్భుతమైన కథలు పునాదులు వేసేవి. రామాయణ, మహాభారత గాథలతో పాటు రాబిన్ హుడ్, రాబిన్సన్ క్రూసో, గుల్లివర్స్ ట్రావెల్స్ వంటి ఆంగ్ల కథలు మమ్మల్ని అలరించేవి.
వీటన్నింటిలోనూ నాకు ‘గుల్-ఏ-బకావలి’ అనే యువరాజు సాహస గాథ అంటే చాలా ఇష్టం. కొన్ని దశాబ్దాల తర్వాత 1960లో చరిత్రకారుడు సైమన్ డిగ్బీ ద్వారా ఈ కథలోని పర్షియన్, ఉర్దూ సాహిత్యపు లోతులను తెలుసుకున్నప్పుడు నేను మంత్రముగ్ధురాలినయ్యాను.
రాజకీయ మార్పులు – దేశ విభజన
పెషావర్‌లో మా సంతోషకరమైన రోజులు పాకిస్తాన్ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్న సమయంలో మారాయి. “బ్రిటిషర్లు వెళ్లిపోతే మైనారిటీలకు రక్షణ ఉండదు” అనే వాదనను సికిందర్ మీర్జా గట్టిగా నమ్మేవారు. దేశ విభజన విషయంలో ఆయన దృఢ నిశ్చయంతో ఉండేవారు. మా నాన్న తనకు నచ్చజెప్పడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ప్రాణస్నేహితుడి ఆలోచనల్లో వచ్చిన ఈ మార్పు మా నాన్నను ఎంతో బాధించింది.
అయినప్పటికీ వారి స్నేహం అలాగే కొనసాగింది. చాలా ఏళ్ల తర్వాత నేను పారిస్‌లో ఒక యునెస్కో సదస్సుకు వెళ్లినప్పుడు, మీర్జా లండన్‌లో నివసిస్తున్నారని తెలిసి తనను కలిశాను. వయస్సు రీత్యా ఆయన జ్ఞాపకశక్తి తగ్గినప్పటికీ, పాత రోజులను ఎంతో ఆప్యాయంగా గుర్తుచేసుకున్నారు. తాను తీసుకున్న రాజకీయ నిర్ణయాల పరిణామాల పట్ల తన మనసులో ఏదో మూల చింత ఉందేమోనని నాకు అనిపించింది.
బాద్షా ఖాన్‌తో అనుబంధం
మా నాన్నకు మరో ఆత్మీయ మిత్రుడు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్(బాద్షా ఖాన్). తన సోదరుడు డాక్టర్ ఖాన్ సాహిబ్‌తో కలిసి మా నాన్న మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ప్రయాణించారు. బాద్షా ఖాన్ మా ఇంటికి వచ్చినప్పుడు నన్ను పక్కన కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్పేవారు. తను నన్ను ఒక చిన్న పిల్లలా కాకుండా, పెద్దదానిలా గౌరవిస్తూ మాట్లాడటం నాకు చాలా నచ్చేది. 1931 కాంగ్రెస్ సదస్సు జెండాలను ఆయన మాకు బహుకరించారు, అవి ఇప్పటికీ మా కుటుంబం వద్ద ఉన్నాయి.
వ్యక్తుల మధ్య ఉండే స్నేహం, నమ్మకం అనేవి రాజకీయాలకు అతీతమైనవి. దశాబ్దాల తర్వాత కూడా ఆ పాత పరిచయాలు కొత్త రూపంలో ఎదురవుతూనే ఉన్నాయి. 1990లలో నా ఇంటి ముందు అద్దెకు దిగిన వ్యక్తి డాక్టర్ ఖాన్ సాహిబ్ మనవడే అని తెలిసి ఆశ్చర్యపోయాను. తన తాతగారి ఫోటోను ఆయన గదిలో చూసినప్పుడు కాలం ఎంతటి వింతైన మలుపులు తిరుగుతుందోనని అర్థమైంది.
అనువాదం: గంట రాజు,సీనియర్ జర్నలిస్టు.
Outlookindia వెబ్సైట్ సౌజన్యంతో ది వైర్ తెలుగు పాఠకులకు ఈ వ్యాసాన్ని అందిస్తున్నాము.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
