ఒక సమాజంలో ప్రజాస్వామ్యం ఏ స్థితిలో ఉందో తెలుసుకోవాలంటే, ఆ సమాజంలోని అత్యున్నత సంస్థలు తమను తాము విమర్శించుకోగలవా లేదా ఆ విమర్శను చూసి బెంబేలెత్తిపోతాయా అన్నది గమనిస్తే సరిపోతుంది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఎన్సీఈఆర్టీ 8వ తరగతి సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకం విషయంలో ఇచ్చిన తాజా ఆదేశాలు చూస్తుంటే- మన న్యాయవ్యవస్థకు వాస్తవమంటే ఎంత భయమో, ఆత్మవిమర్శ అంటే ఎంత అభద్రతా భావమో అర్థమవుతుంది.
ఆ పాఠ్యపుస్తకంలో “న్యాయవ్యవస్థలో అవినీతి” గురించిన ప్రస్తావన ఉందనీ, పెండింగ్‌లో ఉన్న కేసుల గురించి గణాంకాలు ఉన్నాయనీ- అది న్యాయమూర్తుల గౌరవానికి భంగం కలిగిస్తుందనీ కోర్టు ఆగ్రహించింది.
కేవలం ఆగ్రహించడమే కాదు, ఆ పుస్తకాలన్నింటినీ సీజ్ చేయాలని; సాప్ట్ కాపీలను ఇంటర్నెట్ నుంచి తొలగించాలని; ప్రస్తుత పుస్తకం ఆధారంగా పిల్లలకు పాఠాలు చెప్పకూడదని హుకుం జారీ చేసింది.
పైగా, ఇది న్యాయవ్యవస్థపై జరిగిన “తుపాకీ కాల్పుల”వంటిదని, దీనివల్ల న్యాయవ్యవస్థ “రక్తమోడుతోందని” ప్రధాన న్యాయమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు.
వినడానికి ఇవి చాలా ఉద్వేగభరితమైన మాటలే కావచ్చు, కానీ నిశితంగా పరిశీలిస్తే- ఇది ఒక రాజ్యాంగబద్దమైన సంస్థ ప్రదర్శించాల్సిన పరిణతి కాదు.
ఒక ఫ్యూడల్ భూస్వామి తన ఆధిపత్యాన్ని ప్రశ్నించిన కూలీపై చూపించే అసహనంలా ఉంది.
మొదటి ప్రశ్న- ఆ పాఠంలో రాసినది అసత్యమా?
భారత న్యాయవ్యవస్థలో అవినీతి లేదని, సంవత్సరాల తరబడి కేసులు పెండింగ్‌లో ఉండవని, సామాన్యుడికి న్యాయం అందడం ఆలస్యం కావడం లేదని ఏ న్యాయమూర్తి అయినా గుండె మీద చేయి వేసుకుని చెప్పగలరా?
“న్యాయం ఆలస్యం కావడం అంటే న్యాయం నిరాకరించడమే” అన్నది న్యాయశాస్త్రంలో ఉన్న మౌలిక సూత్రం. అది పాఠ్యపుస్తకంలో ఉంటే తప్పేంటి?
కోర్టుల చుట్టూ ఏళ్ల తరబడి చెప్పులు అరిగేలా తిరుగుతున్న తల్లిదండ్రులను చూస్తున్న పిల్లలకు, పాఠ్యపుస్తకంలో “మన కోర్టులు చాలా గొప్పవి, సత్వర న్యాయం అందిస్తాయి” అని రాసి ఉంటే అది వాస్తవానికి దగ్గరగా ఉంటుందా లేక భ్రమలు కల్పించినట్టు అవుతుందా?
నిజం చెప్పడం “వ్యవస్థాగత కుట్ర” ఎలా అవుతుంది? న్యాయవ్యవస్థలో అవినీతి ఉందని గతంలో ఎందరో మాజీ న్యాయమూర్తులే(జస్టిస్ భరంచా, జస్టిస్ మార్కండేయ ఖట్టూ వంటివారు)బహిరంగంగా అన్నారు.
ప్రశాంత్ భూషణ్ వంటి సీనియర్ న్యాయవాదులు కోర్టు ధిక్కార కేసులను ఎదుర్కొని మరీ ఈ విషయాన్ని రుజువులతో సహా చర్చకు పెట్టారు.
ఇప్పుడు 8వ తరగతి పిల్లలకు ఈ చేదు నిజాన్ని తెలియనివ్వకూడదనుకోవడం వెనుక ఉన్న ఉద్దేశం ఒక్కటే “రాజ్య వ్యవస్థలు పవిత్రమైనవి, వాటిని ప్రశ్నించకూడదు, కేవలం ఆరాధించాలి” అనే ఒక విధేయత కలిగిన పౌర సమాజాన్ని తయారు చేయడం.
ఇది విద్యావిధానాన్ని కాషాయీకరించడం కంటే ప్రమాదకరమైనది; ఇది విద్యావిధానాన్ని “స్టెరిలైజ్” చేయడం. అంటే, వ్యవస్థలోని లోపాలను గుర్తించే శక్తిని విద్యార్థి దశలోనే చంపేయడం.
ఇదొక అపవిత్ర కలయిక
ఇక్కడ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందన మరింత ఆందోళనకరం.
“నేను స్వయంగా ఆ పాఠాన్ని వెట్ చేస్తాను” అని ఆయన అనడం కార్యనిర్వాహక వర్గం, న్యాయవ్యవస్థ మధ్య ఉండాల్సిన “అధికార విభజన” అనే సిద్ధాంతం ఎలా నీరుగారిపోయిందో చెప్పకనే చెబుతోంది.
ప్రభుత్వం చెప్పినట్టు కోర్టు నడుచుకోవడం, కోర్టుకు కోపం రాకుండా ప్రభుత్వం పాఠాలు రాయడం-ఇదొక అపవిత్ర కలయిక.
కపిల్ సిబల్ వంటి సీనియర్ న్యాయవాదులు, బార్ అసోసియేషన్ పెద్దలు కూడా కోర్టు చర్యను సమర్థించడం చూస్తుంటే న్యాయవాద వృత్తిలోని “ఎలైట్” వర్గం తమ కుల, వర్గ ప్రయోజనాలను కాపాడుకోవడానికి భావ ప్రకటనా స్వేచ్ఛను ఎంత సులభంగా తాకట్టు పెడుతుందో అర్థమవుతుంది.
“హెడ్స్ మస్ట్ రోల్” (Heads must roll – తలలు తెగాల్సిందే) అని ప్రధాన న్యాయమూర్తి అనడం, ఎన్సీఈఆర్టీ డైరెక్టర్‌పై క్రిమినల్ కంటెంప్ట్ ప్రయోగిస్తామనడం- ఒక భయానక వాతావరణాన్ని సృష్టిస్తోంది.
సుప్రీంకోర్టుకు ఉన్న “ధిక్కార అధికారం” అనేది న్యాయమూర్తుల వ్యక్తిగత అహంకారాన్ని కాపాడడానికి ఇచ్చిన ఆయుధం కాదు. అది న్యాయస్థానపు తీర్పులను అమలు చేయడానికి ఇచ్చిన అధికారం.
కానీ దాన్ని విమర్శలను అణచివేయడానికి, పుస్తకాలను బ్యాన్ చేయడానికి వాడడం ప్రజాస్వామ్యానికే మచ్చ. పుస్తకాలను సీజ్ చేయమని పోలీసులకు, అధికారులకు ఆదేశాలివ్వడం ద్వారా కోర్టు ఏం సాధించాలనుకుంటోంది?
చీకటియుగ ఆరంభం..!
భౌతికంగా పుస్తకాలను మాయం చేయవచ్చు, కానీ ప్రజల అనుభవంలో ఉన్న న్యాయవ్యవస్థ డొల్లతన్నాని మాయం చేయగలరా?
ఒక రైతు తన భూమిని కాపాడుకోవడానికి సివిల్ కోర్టులో వేసిన దావా తీర్పు రావడానికి ఇరవై ఏళ్లు పడుతుంటే, ఆ రైతు కొడుకు పాఠ్యపుస్తకంలో “కోర్టులు గొప్పవి” అని చదివితే ఆ వ్యవస్థ పట్ల గౌరవం పెరుగుతుందా? లేక ఆ చదువు పట్ల అసహ్యం కలుగుతుందా?
“పిల్లల లేత మనసులపై చెడు ప్రభావం పడుతుంది” అనే వాదన ఎప్పుడూ పాలకవర్గాలకు ఒక సాకు మాత్రమే. నిజానికి వారికి భయం ఏమిటంటే పిల్లలు నిజాలు తెలుసుకుని పెరిగితే, రేపు పౌరులుగా మారినప్పుడు వారు ఈ కుళ్ళిన వ్యవస్థను ప్రశ్నిస్తారేమోనని.
న్యాయవ్యవస్థ తనను తాను గౌరవించుకోవాలంటే, తన లోపాలను ఎత్తిచూపిన పుస్తకాలను నిషేధించడం ద్వారా కాదు; ఆ లోపాలను సరిదిద్దుకుని, సామాన్యుడికి నిజమైన న్యాయం అందించడం ద్వారా ఆ గౌరవాన్ని సంపాదించుకోవాలి.
“జుడిషియరీ ఈజ్ బ్లీడింగ్” అని ప్రధాన న్యాయమూర్తి అన్నారు. నిజమే, న్యాయవ్యవస్థ రక్తమోడుతోంది. కానీ అది ఒక పాఠ్యపుస్తకం వల్ల కాదు. పేదలకు న్యాయం అందక, ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గుతున్న విచారణ ఖైదీల నిస్సహాయత వల్ల, రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడలేక రాజీపడుతున్న తీర్పుల వల్ల, కొలీజియం వ్యవస్థలోని పారదర్శకత లేమి వల్ల- న్యాయవ్యవస్థ రక్తమోడుతోంది.
ఆ గాయానికి మందు వేయకుండా, అద్దంలో ఆ గాయం కనిపించిందని అద్దాన్ని పగులగొట్టడం అవివేకం మాత్రమే కాదు, అత్యంత అప్రజాస్వామికం కూడా.
ఈ దేశంలో పుస్తకాలను నిషేధించే సంస్కృతిని న్యాయస్థానమే ప్రోత్సహించడం- రేపటి చీకటి రోజులకు సంకేతం.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
