
రాజకీయ అధికారాన్ని బలోపేతం చేయటానికి కథన కౌశలం అనివార్యమని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ధూలిపూడి పండిట్ అన్నారు. జూలై 10వ తేదీన జెఎన్యూ, విద్యాశాఖ ఆధ్వర్యంలో పని చేస్తున్న భారతీయ విజ్ఞాన వ్యవస్థల విభాగంతో కలిసి ఏర్పాటు చేసిన సెమినార్‌ను ప్రారంభిస్తూ ధూలిపూడి పండిట్ మాట్లాడారు. ఈ సెమినార్ మూడు రోజుల పాటు జరుగుతుంది. విద్యా విషయక మేధావులు, పరిశోధకులు, ఆచరించేవారికి భారతీయ విజ్ఞాన వ్యవస్థల గురించి వారినకున్న అవగాహనను ప్రదర్శించేందుకు అవకాశాలు కల్పించే ప్రయత్నంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ సెమినార్‌ను ఏర్పాటు చేసింది.
‘తొలిసారిగా జరుగుతున్న ఈ సెమినార్లో భారతీయ విజ్ఞాన వ్యవస్థల గురించి నూతన పథ నిర్దేశానికి అవసరమైన పరిశోధనలు వెలుగు చూస్తాయని ఆశిస్తున్నాను. దేశాన్ని వికసిత్ భారత్‌గా మార్చాలన్న ప్రధాని మోడీ లక్ష్యానికి అనుగుణంగా కావల్సిన కథనాలు రూపొందించేందుకు ఈ సెమినార్ వేదిక అవుతుంది.’ అన్నారు.
ఈ సెమినార్‌ను ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ ప్రారంభించారు.
‘‘అరువుతున్న తెచ్చుకున్న వర్ణనలు, కథనాలు విధించిన సంకెళ్లను తెంచుకునే సమయం ఇది. లోతుగా వేళ్లూనుకున్న వక్రీకరణలను సరిచేయాల్సిన సందర్భం ఇది. మన మేధో సార్వభౌమత్వాన్ని తిరిగి స్వంతం చేసుకోవాల్సిన సమయం. ఇది జరగాలంటే కఠోరమైన మేథో శ్రమ జరగాలి. దానికోసం అనువాదకులు, పరిశోధకులు, మేధావులు, ఫ్రొఫెసర్లు, విశ్లేషకులు, భాషాప్రవీణులు, మోడలర్లు వంటి వారితో కూడిన భారీ సైన్యం కావాలి’’ అన్నారు ఉపరాష్ట్రపతి.
ఈ కార్యక్రమానికి సమాంతరంగా జేఎన్‌యూ విద్యార్ధి సంఘం నివధిక నిరాహారదీక్ష కొనసాగించింది. అన్ని కోర్సుల్లోనూ జేఎన్‌యూ ఇప్పటి వరకూ జరుపుతూ వచ్చిన పరీక్షా విధానాన్ని కొనసాగించాలని విద్యార్ధి సంఘం డిమాండ్ చేస్తోంది. సెమినార్ వేదిక సమీపంలో ఆందోళనకు సిద్ధమైన విద్యార్ధులపై ఢిల్లీ పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారని విద్యార్ధులు ఆరోపిస్తున్నారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.