దాదాపు మూడు దశాబ్దాలుగా భారతదేశ సమాచార సాంకేతిక(ఐటీ) రంగం దేశ ఆర్థిక మార్పుకు కేంద్రమై; ఎదుగుదల, ప్రపంచ ప్రాధాన్యం, మధ్యతరగతి ఆశయాల ప్రతీకగా మారి మణిమకుటంగా నిలిచింది. ఐటీ రంగం భారత ఉద్యోగ మార్కెట్లో కేవలం 1% మందిని మాత్రమే నియమించుకున్నప్పటికీ, దేశ జీడీపీలో సుమారుగా 7% వాటాను అందిస్తోంది.
ఒకప్పుడు ఇన్ఫోసిస్ లేదా టీసీఎస్‌లో ఉద్యోగమనేది టైర్–II నగరాల యువ ఇంజనీర్లకు మంచి జీవితానికి పాస్‌పోర్ట్ లాంటిది. కానీ ఈ రోజు ఆ కల మంచులా కరుగుతోంది. తన చరిత్రలోనే అతిపెద్ద తొలగింపుకు టీసీఎస్ నాంది పలికింది. కేవలం ఒకే త్రైమాసికంలో దాదాపు 20,000 ఉద్యోగాల కోతను విధించింది. ఇతర కంపెనీలు కూడా అదే దారిలో సాగుతున్నాయి. ఆశతో ఉన్న టెక్ ప్రొఫెషనల్స్‌కు ఐటీ రంగం ఇకపై ‘బంగారు బాతు’ కాదా? అనే ప్రశ్నను ఈ తొలగింపుల సందర్భం లేవనెత్తుతుంది.
తీవ్ర రూపాంతరం..
భారత ఐటీ రంగం కూలిపోవడం లేదు. కానీ ఇది ఒక తీవ్ర రూపాంతర దశలో ఉంది— తక్షణ శ్రద్ధ, వ్యూహాత్మక పునర్వ్యవస్థీకరణ, భవిష్యత్తు- సిద్ధ నైపుణ్యాలకు కొత్త నిబద్ధతను కోరుతోంది. ఈ “తొలగింపుల అల” పరిశ్రమలో నిర్మాణాత్మక మార్పుల లక్షణం.
అయితే, ఈ తొలగింపు చర్యలు అమెరికాలో కూడా సాగుతున్నాయి. తమ సంస్థలో ఏఐ వినియోగం పెరగడం వల్ల 14,000 మంది కార్పొరేట్ ఉద్యోగులను తగ్గించనున్నట్టుగా అమెజాన్ ప్రకటించింది. మెటా 8,000 మందిని తొలగిస్తోంది.
భారతదేశంలో టీసీఎస్ 3.2% ఉద్యోగులను— ముఖ్యంగా మధ్య, సీనియర్ స్థాయి ఉద్యోగులను తగ్గించడం ఒంటరి చర్య కాదు; ఇతర ఐటీ దిగ్గజాలు కూడా ఇదే ధోరణిని అనుసరిస్తున్నాయి.
పరిశ్రమ అంచనాల ప్రకారం, ఈ ఆర్థిక సంవత్సరాఖరులోగా 50,000 కంటే ఎక్కువ ఐటీ ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది. ఇవి సాధారణంగా కనిపించే పెద్ద ఎత్తున తొలగింపులు కాకుండా, ‘సైలెంట్ లేయాఫ్స్’— పనితీరు పేరుతో చేయడం, స్వచ్ఛంద రాజీనామాలు, ప్రమోషన్ల ఆలస్యం వంటి పద్ధతుల ద్వారా ఉద్యోగులను తగ్గిస్తున్నాయని ఐటీ పరిశ్రమ అంతర్గత వర్గాలు చెబుతున్నాయి.
ఇవే కాకుండా మరిన్ని కారణాలు కూడా ఉన్నాయి. అందులో మొదటిది, ఏఐ ఆధారిత ఆటోమేషన్ ఐటీ పనితీరు స్వరూపాన్ని సమూలంగా మార్చుతోంది. రొటీన్ పనులు— రిపోర్టింగ్, కోఆర్డినేషన్, బేసిక్ కోడింగ్— ఆల్గోరిథమ్స్ చేతిలోకి వెళ్లుతున్నాయి. ఓపెన్ ఏఐ, ఆంత్రోపిక్ వంటి కంపెనీల మోడల్స్‌తో పాటు, బహుళ దశల పనులను స్వయంగా నిర్వహించగల ఏజెంటిక్ ఏఐ ఎదుగుదల భారత ఐటీ సేవల రంగాన్ని కుదిపేస్తోంది. ఇది డెవలపర్ ఉత్పాదకతను పెంచుతోంది. రొటీన్ పనులను ఆటోమేట్ చేస్తోంది, అంతేకాకుండా పరిశ్రమను అధిక విలువైన, ఏఐ ఆధారిత డిజిటల్ పరివర్తన వైపు నడుపుతోంది.
రెండవది, అమెరికా వలస విధానాలు కఠినతరమయ్యాయి. H-1B ఫీజుల పెంపు, టారిఫ్ బెదిరింపులతో, భారత కంపెనీలు విదేశీ కార్యకలాపాల్లో స్థానిక నియామకాలపై దృష్టి పెడుతున్నాయి. లాభం ఎక్కువ రాని పనులకు భారత కంపెనీలు $100,000 ఖర్చు చేసి మధ్యస్థాయి ఇంజనీర్‌ను అమెరికాకు పంపడం సాధ్యం కాదు.
మూడవది, అమెరికా- యూరప్‌లో ఆర్థిక అనిశ్చితి కారణంగా కస్టమర్ బడ్జెట్లు తగ్గుతున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే; గతంలో స్కేలు, తక్కువ ఖర్చు ఆధారంగా నడిచిన ఔట్సోర్సింగ్ మోడల్ ఇప్పుడు ప్రత్యేక నైపుణ్యం, చిన్న బృందాలు, ఏఐ నైపుణ్యం వంటి వాటిని ప్రధానంగా కోరుతోంది.
ముగిసిన అసెంబ్లీ లైన్ యుగం..
ఒక సరళ వాగ్దానం మీద తన మనుగడను భారత ఐటీ రంగం మొదలుపెట్టింది. వేలాది ఇంజనీర్లను నియమించాలి, వారికి ప్రాథమిక కోడింగ్ నేర్పాలి, గ్లోబల్ క్లయింట్లకు సేవ చేయించాలి. ఇది ఒక డిజిటల్ అసెంబ్లీ లైన్— సమర్థవంతం, భారీ స్కేల్లో పనిచేస్తుంది, లాభదాయకం. కానీ ఇప్పుడది పాతబడిపోయింది.
ఇప్పటి క్లయింట్లు కోడర్లు చేసే సైన్యాన్ని కాదు; పరిష్కారాలను కోరుతున్నారు. క్లౌడ్-నేటివ్ ఆర్కిటెక్చర్లు, సైబర్‌సెక్యూరిటీ ఫ్రేమ్వర్కులు, జనరేటివ్ ఏఐ ఇంటిగ్రేషన్లు కావాలి. తక్కువ మందితో ఎక్కువ పనిని, త్వరగా చేయగలవారిని కోరుతున్నారు. ఈ మార్పు భారత ఐటీ వర్క్‌ఫోర్స్‌లో నైపుణ్య అసమానతను స్పష్టంగా బయటపెట్టింది.
మేనేజీరియల్ నైపుణ్యాల ఆధారంగా పదోన్నతులు పొందిన అనేక మంది మధ్య-కెరీర్ ప్రొఫెషనల్స్, నేటి అవసరాలకు తగడం లేదు. ఎస్ఏపీ ఈసీసీ, మెయిన్‌ఫ్రేమ్స్, నాన్-క్లౌడ్ ప్లాట్ఫార్మ్స్ వంటి లెగసీ నైపుణ్యాలు ఇప్పుడు ప్రాముఖ్యత కోల్పోతున్నాయి. ఎస్ఏపీ ఈసీసీవంటి సాంకేతికతను నడపడం కూడా ఇప్పుడు ఏఐ చేయగలుగుతోంది. ఈ నేపథ్యంలో “సరే, మీరు ఇంకేమి చేయగలరు?” అనే ప్రశ్న ఎదురవుతోంది.
ఫలితం: అనుభవజ్ఞులైన ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఫ్రెష్ గ్రాడ్యుయేట్లు ప్రవేశ అవకాశాల కోసం ఇబ్బంది పడుతున్నారు. కంపెనీలు రీ-స్కిలింగ్ కోసం పరుగులు పెడుతున్నాయి. ఈ వేగవంతమైన సాంకేతిక మార్పుల నేపథ్యంలో, భారీ తొలగింపులు చేపట్టే ఐటీ కంపెనీలు ఉద్యోగులకు 6- 9 నెలల వేతనం తప్పనిసరిగా చెల్లించాలని ప్రభుత్వం పరిగణించాలి— కొత్త నైపుణ్యాలు అలవరచుకునేంతవరకు భద్రతా వలయంగా ఇది కీలకం.
ఏదిఏమైనప్పటికీ, ఐటీ రంగానికి నష్టం పూర్తిగా జరగలేదు. ప్రపంచం ఇప్పటికీ భారత టెక్ నైపుణ్యాన్ని గౌరవిస్తుంది. ఇది $280 బిలియన్ కంటే ఎక్కువ విలువను సృష్టిస్తోంది, దాదాపు 60 లక్షల మందిని ఉద్యోగుల్లో ఉంచుతోంది. అనేక రంగాల్లో డిజిటల్ మార్పును నడుపుతోంది. కానీ “ఐటీ అంటే గ్యారంటీ ఉద్యోగం” అనే నమ్మకం మాత్ర సన్నగిల్లుతోంది.
యువతకు మార్గం ఇక సులభం కాదు. కేవలం కంప్యూటర్ సైన్స్ డిగ్రీ సరిపోదు. ఏఐ, డేటా సైన్స్, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీలాంటివన్నీ నేర్చుకోవాలి. నిరంతరం అప్డేట్ కావాలి. బేసిక్ జావా లేదా ఎన్ఈటీ(లేదా ఎస్ఏపీ ఈసీసీ కూడా) ఆధారంగా కెరీర్ సాగించే రోజులు ముగిశాయి.
తొలగింపుల నుంచి పునర్నిర్మాణం వరకు..
ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏమి చేయాలి? భారతదేశం ఐటీ ఆధిక్యాన్ని నిలుపుకోవాలంటే పలు రంగాల్లో చర్యలు అవసరం. పాలసీ మేకర్లకు సవాలు స్కిలింగ్ను పునఃకల్పన చేయడమే. ఇంజినీరింగ్ కాలేజీలు తమ సిలబస్‌ను మార్చాలి. ప్రభుత్వ కార్యక్రమాలు కేవలం డిజిటల్ లిటరసీ కాదు; ఏఐ లిటరసీకి ప్రాధాన్యత ఇవ్వాలి. పరిశ్రమ రిక్రూట్మెంట్ మాత్రమే కాదు— రీ-స్కిలింగ్‌లో పెట్టుబడి పెట్టాలి.
మొదటి పని: పెద్ద ఎత్తున ఏఐ అప్స్కిలింగ్. టీసీఎస్ ఇప్పటికే 5.5 లక్షల మందికి ప్రాథమిక ఏఐ నైపుణ్యాలు, 1 లక్ష మందికి అడ్వాన్స్డ్ ఏఐ నైపుణ్యాలు నేర్పింది. ఇది మినహాయింపు కాకుండా, సాధారణం కావాలి. పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యాలు దీన్ని వేగవంతం చేయవచ్చు.
ఇకపోతే, ఇంజినీరింగ్ సిలబస్‌ను మార్చడం అత్యవసరం. రెగ్యులర్ కోడింగ్‌ను దాటి వెళ్లాలి. మెషిన్ లెర్నింగ్, ఏఐ నైతికత, ప్రొడక్ట్ థింకింగ్ వంటి కోర్సులు ప్రధాన ప్రవాహంలోకి రావాలి. సాఫ్ట్ స్కిల్స్ — కమ్యూనికేషన్, సహకారం, క్రిటికల్ థింకింగ్ — కూడా కీలకమే.
స్టార్టప్ ఎకో సిస్టమ్‌కు ప్రభుత్వం, వెంచర్ క్యాపిటలిస్టులు మరింత మద్దతు ఇవ్వాలి. భారత భవిష్యత్తు కేవలం సేవలలో కాదు ఉత్పత్తుల్లో ఉంది. ఏఐ స్టార్టప్స్, డీప్-టెక్ వెంచర్స్, ఇన్నొవేషన్ హబ్‌లను ప్రోత్సహించడం కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుంది. ప్రభుత్వం ప్రపంచ భాగస్వామ్యాలతో కలిసి వీసా యాక్సెస్, డేటా సార్వభౌమత్వం, ట్రేడ్ స్థిరత్వం అంశాలపై పని చేయాలి.
ఇప్పుడు ఉద్యోగాలు కోల్పోయినవారికి కేవలం సెవరెన్స్ పే సరిపోదు. కెరీర్ మార్పు సహాయం, మానసిక ఆరోగ్య వనరులు, రీ-స్కిలింగ్ సబ్సిడీలు అవసరం. భారత ఐటీ రంగం ఇప్పటి వరకు సామాజిక భద్రతా వలయాల అవసరాన్ని అనుభవించలేదు; కానీ ఇప్పుడు ఆ సమయం వచ్చింది.
భారత ఐటీ కథ ముగియడం లేదు— ఇది మారుతోంది. మానవ వనరుల నుంచి మైండ్పవర్కి, ఔట్సోర్సింగ్ నుంచి ఇన్నొవేషన్‌కి, పరిమాణం నుంచి నాణ్యత వైపు — ఈ మార్పు అనివార్యం. ఇది బాధాకరమైనదే, కానీ ప్రయోజనకరమైనదిగా మారవచ్చు.
మన విజయం ఇక హెడ్‌కౌంట్‌తో కొలవబడదు. ఐటీలో ఎంత మంది పనిచేస్తున్నారన్నదిని కాదు; మనం సృష్టిస్తున్న సొల్యూషన్లు ఎంత ప్రభావవంతంగా ఉన్నాయన్నదని అడగాలి.
ఏఐ యుగంలో మనం ఉద్యోగులను అభివృద్ధి పరుస్తున్నామా? మన కథనం, పునర్నిర్మాణం, ప్రాసంగికతతో నిండిందా?
“భారత ఐటీ రంగం కాంతి మసలిపోయిందా?” అని నాకు తెలిసిన నిపుణులను నేను అడిగాను. వారి సమాధానాలు ఎలా ఉన్నాయంటే, కొన్ని రేకులు రాలిపోయినా వేర్లు దృఢంగా ఉన్నాయి. సరైన జాగ్రత్త, విజన్, నైపుణ్యం, ధైర్యం ఉంటే మళ్లీ వికసించగలదని. దీనికి పాలసీ నాయకత్వం అవసరం — కానీ ఆశ కోల్పోవాల్సిన అవసరం లేదు.
అనుసరణ: ఆంజనేయ రాజు
(ఈ వ్యాసం ది హిందూ సౌజన్యంతో ది వైర్ తెలుగు పాఠకులకు అందిస్తున్నాము.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
