ఎవరి మనసులో ఏముందో ఎవరికి తెలియదు. కానీ, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ఎవరి మనసులో ఏముందో చెప్పేస్తుంది, అది కూడా రహస్య ఓటింగ్ ద్వారా. మన దేశంలో కులవ్యవస్థను, దాని ఆధారంగా నిర్మీతమైన ఆర్థిక- సామాజిక వ్యత్యాసాలను బద్దలుకొట్టింది ఓటే. ఒక మనిషి. ఒక ఓటు. ఒకే విలువ. ఇది అత్యంత ప్రజాస్వామ్యయుతమైన వ్యక్తీకరణ. ఈ ఓటు కారణంగానే భారతీయ సమాజం ఉన్నతిని పొందగలిగింది. అత్యంత సామాన్యులు అక్షరపు గాలి సోకనివారు, తొట్టతొలిసారిగా ఓటు హక్కును ఉపయోగించుకొని చరిత్ర సృష్టించారు. అటవీ ప్రాంతాలు, కొండ ప్రాంతాలు ఈ ఓటు హక్కును ఉపయోగించుకున్నవారిలో ప్రథములని చెప్పవచ్చు.
1952 తొలి సాధారణ ఎన్నికల సందర్భంలో మహాద్భుతమైన ఘటనలు ఆవిష్కృతమైయ్యాయి. నాగరికుల కంటే, నాగరికులమని చెప్పుకునే వారికంటే దానికి దూరంగా ఉన్న ప్రజలు ఓటు హక్కు వినియోగంలో ముందంజలో ఉన్నారు. ఆదివాసీ ప్రాంతాలు, ప్రధాన స్రవంతికి దూరమున్న గ్రామాల ప్రజలు; ఎన్నికలకు ఒకటి రెండు రోజుల ముందే సద్దులు కట్టుకొని పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు, ఇది చరిత్ర. 75 సంవత్సరాలకు పైబడిన భారతీయ గణతంత్ర వ్యవస్థ సాధించిన మహాద్భుత విజయం.
ఇండియన్ డెమోక్రసీ సానుకూల దృక్పథకోణం..
కులవ్యవస్థలో అత్యంత కిందివాడు పరిపాలకుడు ఎవరో తేల్చగలడు. తేల్చాడు, తేల్చుతున్నాడు. ఇదీ భారతీయ ఎన్నికల శక్తి. ఈ సందర్భంలో ఓటు హక్కు, దాని ప్రాధాన్యత చారిత్రాత్మకంగానే తన శక్తిని రుజువు చేసుకున్నది. మన దేశంలో ఎన్నో విప్లవాలు వచ్చాయి. వాటిని ఓటు అధిగమించింది. 1967 నుంచి 1980ల నాటికున్న దక్షిణ భారతదేశపు సామాజిక, రాజకీయ, ఆర్థిక వ్యవస్థల చైతన్యపు స్థితి ఒక్కటి. అనంతరం 80ల తర్వాత ఓటు హక్కుపైన భిన్నమైన చర్చ ప్రారంభమైంది. ఇది సరికొత్త ఆలోచనలకు కారణమైంది. ఓటు వేయ్యొద్దని కొద్దరు చెప్పారు. ఓటే ఆయుధమన్నారు మరికొందరు. అనంతరం నోటా వచ్చింది. దీనికి ముందు ఓట్ల బహిష్కరణ పిలుపూ ఉన్నది. అయినా, ఓటింగ్ శాతం తక్కువున్నప్పటికీ వేల మెజార్టీలతో తాము వద్దనుకున్నవారిని ఓడించారు. మంచి చేస్తారనుకున్న వారిని గెలిపించారు.
ఈ చర్చంతా ఇప్పుడెందుకంటే, తెలంగాణ రాష్ట్రంలోని జూబ్లీహిల్స్ ఉపఎన్నిక భిన్న భావవ్యక్తీకరణలకు, అనేక సవాళ్లకు, ఆక్రోషాలకు, ఆవేదనలకు కేంద్రం కావడమే. ఈ ఉపఎన్నికలో తామంటే తాము బరిలోకి దిగుతున్నామని పలు సంస్థలు, సంఘాలు, వ్యక్తులుగా ఓటే తమకు దారి చూపిస్తుందని ప్రబలంగా నమ్ముతున్నారు. ఫార్మా సిటీ రైతులు, నిరుద్యోగులు ఈ ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నారు. తమ ఆకాంక్షలను ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశాన్ని వ్యక్తీకరిస్తున్నారు.
1960 నుంచి 2000 సంవత్సరం నాటికి ప్రజలు తమ ఆవేదనను వివిధ రూపాలలో వ్యక్తీకరించేవారు. అందులో ఓటు హక్కు ప్రధానమైనది. తక్షణంగా తమ ఆవేశాన్ని ధర్నాలు, రాస్తారోకోలువంటి వాటి ద్వారా వ్యక్తీకరించేవారు. ఆనాడున్న సమాజపు చైతన్యపు స్థితియేమిటో చెప్పే పరిణామాలివి. అనంతరం, పెరిగిన అక్షరాస్యత ఓటు హక్కు పట్ల అవగాహన, విధ్వంసరహిత మార్గాన్ని చూపించాయి. ఒప్పుడు చీటికి మాటికి బంద్‌లు జరిగేవి. రాజకీయ బంద్‌లపై ప్రజలు వ్యంగ్యంగా మాట్లాడుకునేవారు. ప్రస్తుతం అరుదుగా బంద్‌లు జనజీవితంలో కనిపిస్తున్నాయి. తమకు నచ్చని పాలకుల పట్ల ఓటు ద్వారా తమ నిర్ణయాన్ని ప్రజలు స్పష్టం చేస్తున్నారు.
అయితే, మన దగ్గర 1996ల నుంచి ఎన్నికలు చాలా ఖరీదైనవిగా మారిపోయాయి. అనంతర పరిణామాలు. ప్రజా ఆలోచనలు వీటిపై జరిగిన చర్చల గురించి ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. కానీ, ఓట్లకు నోట్లు పంచలేని అభాగ్యులుసైతం తమ ఆకాంక్షను వ్యక్తీకరించే కేంద్రస్థానంగా ఓటును ఎంచుకున్నారు. గత, ప్రస్తుత ప్రభుత్వాలు జన హృదయాల వేదనలను పట్టించుకోలేదు, పట్టించుకోవడం లేదనే విషయం జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నామినేషన్లు మనకు చెపుతున్నాయి.
అత్యంత ప్రజాస్వామ్యపు వ్యక్తీకరణ ఈ ఓటు హక్కు. దీన్ని ఆధారంగా చేసుకొని పాలకులు తమ పాలసీలను మార్చుకునేందుకు ప్రయత్నించాలి. వీలుకానప్పుడు ఎందుకో వారికి వివరించాలి. ఈ రెండింటిలో పాలకులు ఏదో ఒకటి చేయవల్సిందే. భారత రాజ్యాంగం ప్రసాదించిన గౌరవ ప్రదమైన జీవితాన్ని కోరుకునే హక్కు ప్రజలకు ఉన్నది. అట్లాగే ఓటు కూడా. దీన్ని గుర్తించాల్సింది, గౌరవించాల్సింది పాలకులే. భారత ప్రజాస్వామ్యాన్ని మరింత పరిపుష్టం చేయడానికి అందరమూ కృషి చేయాల్సిందే.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
