
విధాన రూపకల్పన, రాజకీయాలు, ఆర్థిక రంగంలో ప్రపంచాన్ని నడుపుతున్న ధోరణులు, శక్తులు గురించి అవగాహన కల్పించుకునేందుకు ఆసక్తి కలిగిన వారంతా తప్పక చదవవల్సిన గ్రంధం ప్రభాత్ పట్నాయక్ రాసిన ఉదారవాదానికి ఆవల గ్రంథం.
మనం జీవిస్తున్న ప్రపంచాన్ని, విధానాలను రూపొందించే, నియంత్రించే నిబంధనలు, మన ఆలోచనలు, అభిప్రాయాలు అర్థం చేసుకోవాలనుకునేవారందరికీ ప్రభాత్ పట్నాయక్ తాజా రచన ఉదారవాదానికి ఆవల అనివార్యంగా చదవవల్సిన పుస్తకం.
గొప్పగొప్ప ఆర్థిక సిద్ధాంతాల మాటున దాగి ఉన్నది ఏమిటి? మనం అనుసరించే ఆర్థిక నమూనాల వెనక ఉన్న తాత్విక పునాది ఏమిటి? ఈ ఆర్థిక విధానాలు, వాటి వెనక ఉన్న తాత్విక పునాది మన దైనందిన రాజకీయాలను ఎలా ప్రభావితం చేస్తున్నాయి వంటి కొన్ని ప్రశ్నలను ఈ పుస్తకంలో సమాధానాలు దొరుకుతాయి.
ఆర్థిక వ్యవస్థ, రాజకీయాలు, తాత్విక రంగం మధ్య సంబంధాలు సంక్లిష్టమైనవే. అయితే ఈ మూడు ఓ నిర్దిష్ట రాజకీయ తాత్వికత ఆధారంగా ఓ రాజకీయ కార్యాచరణను ఎలా ముందుకు తెస్తున్నాయో రచయిత ఈ పుస్తకంలో వివరించారు. ఈ రాజకీయ కార్యాచరణకు మూలాధారమైన రాజకీయ తాత్వికత కూడా ఆర్థిక సిద్దాంతం నుంచి కావల్సిన సమర్థనను వెతుక్కొంటుందని రచయిత విశ్లేషిస్తారు. ఇక్కడ వ్యక్తిగత సంబంధించిన ప్రశ్న ముందుకొస్తోంది. పెట్టుబడిదారీ విధానమే వ్యక్తిగత స్వేచ్ఛా స్వాతంత్య్రాల సంరక్షకుడని కనీసం సగం ప్రపంచాన్ని నమ్మించటంలో సఫలమైంది. కానీ వాస్తవం ఏమిటి? రచయిత పాఠకుల్ని సాంప్రదాయక ఉదారవాదం, నూతన ఉదారవాదం నాటి చర్చలకు తీసుకెళ్తారు. ఈ చర్చల్లోని బలహీనతలను వెల్లడిస్తారు.
సంక్షిప్తంగా చెప్పాలంటే, స్వేచ్ఛా స్వాతంత్య్రం అంటే చేతినిండా కావల్సినంత డబ్బు, సమయం ఉండటం అనుకుంటే డబ్బు సంపాదించటానికి సమయం వెచ్చించాలి. సమయంతో పాటు మన శ్రమ కూడా. ఇక్కడే కార్మికుడు– యజమాని మధ్య ఉండే సంబంధం చర్చకు వస్తుంది. ఉదారవాదుల అభిప్రాయంలో కార్మికుడు– యజమాని మధ్య సంబంధం సహజంగా ఏర్పడేదే. స్వచ్ఛందంగా ఏర్పడేదే. కానీ ఈ సంబంధాన్ని పెట్టుబడిదారీ నమూనాలో కొనసాగించాలంటే వ్యక్తిగత స్వేఛ్చకు అనుకూలంగా రాజ్యం జోక్యం చేసుకోవాలని ఉదారవాదం ప్రతిపాదిస్తోంది.
పోటీతత్వం, హేతుబద్దత గురించి కూడా రచయిత ప్రశ్నిస్తారు. పెట్టుబడిదారీ వ్యవస్థకు స్వయం వివేచన కలిగిన స్వయం కేంద్రితమైన వ్యక్తి కావాలి. ఈ వ్యక్తి పెట్టుబడిదారీ వ్యవస్థ తర్కాన్ని పాటించి అందులోనే వస్తుగతంగా పని చేయాలి. తనగురించి తాను జాగ్రత్తలు తీసుకోవడానికి (సెల్ఫ్ పొసెసివ్‌నెస్) సిద్ధం కాని వ్యక్తిని పెట్టుబడిదారీ వ్యవస్థ హేతుబద్దత లేనివ్యక్తిగా పరిగణిస్తుంది. అటువంటి వ్యక్తులు పెట్టుబడిదారీ వ్యవస్థలో ఇమడలేరు. నయా సాంప్రదాయక ఆర్థిక విధానాలకు ఇలా పెట్టుబడిదారీ వ్యవస్థ చట్రంలో ఇమిడిపోయే వ్యక్తులే కావాలి. ఈ రకమైన ప్రవర్తనా శైలి పెట్టుబడిదారీ వ్యవస్థ అభివృద్ధితో పాటు తెరమీదకు వచ్చిందని విశ్వసించటానికి బదులుగా పెట్టుబడిదారీ వ్యవస్థ పుట్టుక నుండీ మనిషి ఈ లక్షణాలతో ఉన్నాడని విశ్వసిస్తుంది.
దీనికి భిన్నంగా రచయిత మార్క్సిస్టు దృక్కోణంలో ఉదారవాదం, నూతన ఉదారవాదం, నయా ఉదారవాదాలను విశ్లేషిస్తూ జీవితాంతం నిరుద్యోగిగా మిగిలిపోతామేమో అన్న భయంతో కార్మికుడు చేతికందిన పని చేయటానికి సిద్ధపడతాడని వివరిస్తారు. కార్మికులు చేతికొచ్చిన పనిని చాలీచాలని జీతాలతో చేయటానికి సిద్ధపడేలా పురమాయించటానికే పెట్టుబడిదారీ వ్యవస్థలో నిరుద్యోగులు రిజర్వుడు సైన్యంగా ఉంటారన్న వాస్తవాన్ని రచయిత వక్కాణిస్తారు.
అలా వ్యవహరించకపోతే గెంటివేయబడతారు..
జాన్ లాక్‌తో మొదలు పెట్టి ఆడం స్మిత్, జాన్ మేనార్డ్ కీన్స్ వరకూ ఉదారవాదం సృష్టించిన అనేక అపోహలను రచయిత ఒక్కో అధ్యాయంలో స్పష్టంగా వివరిస్తూ అపోహలను తొలగించేందుకు ప్రయత్నిస్తారు.
వ్యక్తులు, చివరకు పెట్టుబడిదారులు ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ పరిధికి లోబడి వ్యవహరిస్తూనే స్వతంత్రులుగా ఉండగలరా? అన్న ప్రశ్నకు అవకాశమే లేదని సమాధానమిస్తారు రచయిత. రచయిత మాటల్లో ‘‘పెట్టుబడిదారీ వ్యవస్థలో సూత్రప్రాయంగా చూస్తే వ్యక్తే స్వయం చోదకుడిగా కనిపిస్తాడు. కానీ ఆచరణలో వ్యక్తికి ఉండే ఆ సామర్ధ్యాన్ని నిర్వీర్యం చేస్తుంది. వ్యక్తులు తమ ఇష్టానుసారం వ్యవహరించినట్లే కనిపిస్తుంది. కానీ, వారు అలా వ్యవహరించకపోతే వారున్న స్థానాన్ని వెరొకరు ఆక్రమించేస్తారు. ఈ వ్యక్తులు వ్యవస్థ నుంచి గెంటివేయబడతారు.’’
‘‘తమకు ఇష్టం ఉన్నా లేకున్నా పెట్టుబడిదారులు సాధ్యమైనంత ఎక్కువ పెట్టుబడి సమీకరించుకుంటూనే ఉండాలి. ఆయా వ్యక్తులు పోషించే నిర్దిష్టమైన పాత్ర ఆయా వ్యక్తులు వ్యవస్థలో కలిగి ఉండే స్థానాన్ని బట్టి ఉంటుంది. కానీ ఇక్కడ విషయం ఏమిటంటే వ్యక్తులు తమ ఇష్టానుసారం వ్యవహరించలేరు.’’
పెట్టుబడిదారీ వ్యవస్థ మన జీవితంలోని అన్ని పార్శ్వాలను నియంత్రించే సార్వత్రిక వ్యవస్థగా ఎదిగినందున, దాని రోజువారీ పని విధానమే ఓ పురాణంగా కనిపిస్తుంది. ప్రతిరంగమూ మరో దానిపై ఆధారపడి ఉంటుందన్న సూత్రం అనివార్యమైన వాస్తవంగా కనిపిస్తుంది. అయిన్నప్పటికీ ఆచరణలో అది ఓ సామాజిక ఒడంబడికగా మారిపోతుంది. ఈ తరహా వ్యవస్థలో ఎందరినో కొట్టి కొందరికి పెట్టే విధానమే ఆది నుంచి చలామణిలో ఉంటుంది. సామ్రాజ్యవాదం తొలుత వలసవాదం రూపంలోనూ, తర్వాత అంతర్జాతీయ ద్రవ్యపెట్టుబడి సంస్థల రూపంలోనూ దక్షిణార్ధగోళంలోని దేశాలు అనుసరించాల్సిన రీతి రివాజులను నిర్ణయించటం ద్వారా ఈ లొంగుబాటు విధానాన్ని మరింతగా ఉధృతం చేసింది.
స్వతంత్ర ప్రభుత్వాలు కూడా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, ప్రపంచ బ్యాంకు నిర్దేశించే విధానాలను అమలుపర్చక తప్పని పరిస్థితి ఎదురవుతున్న సందర్భాలను ఊహించుకోండి. ఈ విధానాలు అమలు చేసేలా ఆయా ప్రభుత్వాలను పురమాయించేది ఎవరు? నయా ఉదారవాద సిద్ధాంతంలో ఉన్న వాదనే. ‘‘ఎవరూ ఎవరినీ బలవంతం పెట్టరు. ఎవరు ఏ పని చేసినా పరస్పరం సహకారిగానే ఉంటుంది’’ అన్న వాదన.
ఈ పరిణామాల నేపథ్యంలో ప్రజాస్వామ్యం పరిస్థితి ఏమిటి? ఇటువంటి పరిస్థితుల్లో అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామిక వ్యవస్థలతో చెలగాటం ఆడుకోవటం లేదా? ప్రపంచ ప్రజల అవసరాలకంటే పూర్తిగా భిన్నమైనది ప్రపంచ ద్రవ్య పెట్టుబడి అవసరాలు. అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడిపై ఆధారపడినంతకాలం ఏ దేశమూ తన ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించలేదు. సోషల్ డెమొక్రసీ విధానాలకు కట్టుబడిన దేశాలు కూడా తమ దేశంపై పెట్టుబడిదారుల విశ్వాసం సన్నగిల్లే ప్రమాదం ఉందంటే, చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటాయి.
ప్రపంచవ్యాప్తంగా నయా ఉదారవాద విధానాలను అమలు చేస్తున్న దేశాల్లో పేదరికం, ఆర్థిక అసమానతలు పెరగటాన్ని చూస్తున్నాము. ప్రపంచీకరణ పేదలను మరింత దుర్భరదారిద్య్రంలోకి నెట్టేస్తూ తమ జీవన పరిస్థితులను మార్చుకునేందుకు వారి చేతుల్లో మిగిలిన కొద్దిపాటి అవకాశాలను కూడా లాగేసుకుంటుంది.
వివిధ దేశాల్లో పేట్రేగుతున్న జాతీయోన్మాదం, వేళ్లూనుకుంటున్న ఫాసిజం ధోరణులను గుర్తిస్తే కలిగే ఆందోళనలకు రచయిత పన్నెండో అధ్యాయంలో సమాధానాలు ఇస్తారు. ‘‘ ప్రపంచీకరణ దశలో స్వేచ్ఛ’’ అన్నది ఆ అధ్యాయం శీర్షిక. వివిధ దేశాల్లో ఫాసిస్టు శక్తులు తలెత్తటం వెనుక అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి పాత్రను, ఆయా ఫాసిస్టు శక్తులు ద్రవ్య పెట్టుబడి కబంధ హస్తాల నుంచి విముక్తి పొందటానికి సిద్ధం కాకుండా జాతీయోన్మాద వాగాడంబరంతో ప్రజలను దారితప్పించటానికి చేస్తున్న ప్రయత్నాలను విడమర్చి చెప్తారు రచయిత. నిజం చెప్పాలంటే వర్తమాన ఫాసిజం ప్రపంచీకరణకు అంతిమ దశ.
అంతర్జాతీయంగా ద్రవ్య పెట్టుబడి వడివడిగా అడుగులు వేస్తుంటే, ప్రపంచంలోని పేదలు మాత్రం బతుకులీడ్చటానికి దొరికే అరకొర అవకాశాల కోసం అర్రులు చాస్తున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్నది కేవలం రాజకీయ ఆర్థిక సమస్యలేకాదు. తమ జీవితాలను దుంపనాశనం చేస్తున్న పర్యావరణ సమస్యలుకూడా కారుమేఘాల్లా కమ్ముకుంటున్నాయి. అకాశంలో సగంగా ఉన్న మహిళలు చివరకు పూర్తిగా కార్మికుల హోదా పొందని నేటి పరిస్థితుల్లో స్త్రీవాద దృక్ఫథంతో ఈ పుస్తకాన్ని చదివినప్పుడు పరిస్థితులను మార్చాల్సిన అత్యవసర ఆవశ్యకత కళ్లముందు ఆవిష్కృతమవుతుంది.
ఈ పరిస్థితుల్లో రచయిత పట్నాయక్ ప్రతిపాదించినట్లు వర్తమాన ప్రపంచం ఎదుర్కొంటున్న ఈతిబాధలను అధిగమించటానికి సోషలిజమే మధ్యంతర ప్రత్యామ్నాయం. ఉదారవాద సిద్ధాంతాలు, పెట్టుబడిదారీ వ్యవస్థలను సమూలంగా మార్చే రాజకీయ ఆర్థిక సిద్ధాంతాలు, విధానాల ద్వారానే ప్రజలు తమంతట తాము తమ గురించి నిర్ణయం తీసుకునే సామర్ధ్యాన్ని పునఃప్రతిష్టుకోవాలన్నా, ఉమ్మడి భవిష్యత్తు గురించి ఉమ్మడిగా నిర్ణయించే సామర్ధ్యాన్ని సమకూర్చుకోగలరు.
తులిక పబ్లిషర్స్ ప్రచురించిన ఈ పుస్తకం 200 పైచిలుకు పేజీల్లో పధ్నాలుగు అధ్యాయాలుగా విభజించబడి ఉంది. నిక్కచ్చితనం, జాగ్రత్తలతో పాటు రచయిత మనసు కూడా ఈ పుస్తకంలో కనిపిస్తుంది.
విధాన రూపకల్పన, రాజకీయాలు, ఆర్థిక రంగంలో ప్రపంచాన్ని నడుపుతున్న ధోరణులు, శక్తులు గురించి అవగాహన కల్పించుకునేందుకు ఆసక్తి కలిగిన వారంతా ముఖ్యంగా రాజకీయ అర్థశాస్త్ర విద్యార్థులు అందరూ తప్పక చదవవల్సిన గ్రంధం ప్రభాత్ పట్నాయక్ రాసిన ఉదారవాదానికి ఆవల గ్రంథం.
అనువాదం: కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.