2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ న్నికల పోలింగ్ డేటాను నిశితంగా పరిశీలిస్తే, సూర్యోదయ రాష్ట్రంలో అధికార కూటమి 175 అసెంబ్లీ స్థానాలకుగాను 164 గెలుచుకోవడానికి దారితీసిన ‘‘అద్భుతం” వెనుక ఉన్న ‘‘దుశ్చర్య” ఏమిటో వెల్లడవుతుంది.
ఇక్కడ ఇచ్చిన అంకెలన్నింటిని భారత ఎన్నికల సంఘం, ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి విడుదల చేసిన డేటా నుంచి- వారి అధికారిక నోటిఫికేషన్లు, పత్రికా ప్రకటనలు, విడుదలల నుంచి తీసుకోవడం జరిగింది.
సాయంత్రం 5 గంట సమయానికి 68.04% ఓట్లు పోలైనట్లు 2024 మే 13న సాయంత్రం ఆంధ్రప్రదేశ్ సీఈఓ మీడియాకు వెల్లడించారు. ‘‘పెద్ద సంఖ్య’’లో ప్రజలు ఓట్లు వేయడానికి వేచి ఉన్నారని, పోలింగ్ శాతం ఇంకా పెరగవచ్చని ఆయన తెలియజేశారు.

భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) 2024 మే 13న విడుదల చేసిన పత్రికా ప్రకటన నెం. ECI/PN/82/2024 ప్రకారం, రాత్రి 8 గంటలకు ఓటింగ్ శాతం 68.12% ఉంది.

ఆ తరువాత ఈసీఐ 2024 మే 13న విడుదల చేసిన పత్రికా ప్రకటన నెం. ECI/PN/84/2024 ప్రకారం, అదే రోజు రాత్రి 11.45 గంటలకు ఓటింగ్ శాతం 76.50% ఉంది.
భారత ఎన్నికల సంఘం 2024 మే 17వ తేదీ విడుదల చేసిన పత్రికా ప్రకటన నెం. ECI/PN/89/2024 ద్వారా ఆంధ్రప్రదేశ్ పోలింగ్ శాతాన్ని 80.66%కు సవరించారు.
ఆంధ్రప్రదేశ్ సీఈఓ ఈ సంఖ్యను 81.86%గా పేర్కొనగా, ఈసీఐ గణాంకాల నివేదిక ఈ సంఖ్యను 81.79%గా పేర్కొంది.
ఈ రెండు సంఖ్యలలోనూ ఈవీఎం ఓట్లు, పోస్టల్ బ్యాలెట్లు రెండూ ఉన్నాయి.
ఈ సంఖ్యలను నిశితంగా పరిశీలిస్తే, ఆంధ్రప్రదేశ్ అద్భుతం వెనుక ఉన్న దుర్మార్గం స్పష్టంగా వెల్లడవుతుంది.
సీఈఓ ప్రకారం పోలింగ్ రోజు సాయంత్రం 5 గంటల వరకు జరిగిన 68.04% పోలింగ్‌ను పరిశీలిస్తే గంటకు సగటున 6.8% ఓటింగ్ జరిగినట్టు తెలియజేస్తుంది.
ఆ తరువాత 10 గంటల పాటు ఓటింగ్ జరిగింది.
పోలింగ్ రాత్రి 8 గంటల సమయానికి 68.12% పెరిగింది. రాత్రి 8 గంటల వరకు, అంటే మూడు గంటలలో 0.08% పెరిగింది.
అయితే, పోలింగ్ రోజైన అదే రోజు రాత్రి 11.45 గంటలకు పోలింగ్ శాతం 76.50%కు ఎగబాకింది.
సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11.45 గంటల మధ్య పెరుగుదల 8.38% ఉంది.
అంతేకాకుండా 3,500 బూతులలో పోలింగ్ ఇంకా జరుగుతోందని సీఈఓ ప్రకటించింది.
అర్థరాత్రి తరువాత ఈ 3,500 బూతులలో పోలైన ఓట్లు భారత ఎన్నికల సంఘం పత్రికా ప్రకటన నెం. ECI/PN/89/2024 ప్రకారం, పోలైన ఓట్లను(Voter Turnout (VTR))ను 4.16% మేర పెంచి, పోలింగ్ శాతాన్ని 80.66%కు తెచ్చింది. ఇందులో పోస్టల్ బ్యాలెట్లను చేర్చలేదు.


ఈ శాతాన్ని వాస్తవ సంఖ్యలలోకి మారిస్తే- 3,500 బూతులలో అర్థరాత్రి తరువాత జరిగిన పోలింగ్‌లో ఆశ్చర్యకరంగా 17,19,482 ఓట్లు పోలయ్యాయి.
అంటే దీనర్థం, అర్థరాత్రి తరువాత ఒక్కొక్క బూతులో సగటున 491 కంటె కొంచెం ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. అంటే దీనర్థం ప్రతి బూతులో 491 ఓట్లు పోలయ్యాయని కాదు.
కొన్ని బూతులలో ఈ సంఖ్య 491 కంటే తక్కువ ఉంటే, ఇతర బూతులలో 491 కంటే ఎక్కువగా ఉండవచ్చు.
సగటున ఒక్కొక్క బూతుకు 491 ఓట్లు పోలయ్యాయి.
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 46,389 బూతులలో పోలింగ్ రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య గంటకు సగటున 60.7 ఓట్లు పోలయ్యాయి.
ప్రతి ఓటరు ఒకటి లోక్ సభకు, రెండవది అసెంబ్లీ రెండు ఓట్లు వేయవలసి ఉన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఇది కూడా చాలా వేగవంతమైన ఓటింగ్గానే చెప్పవచ్చు.
ఈ 3,500 బూతులలో చాలా మంది ఓటర్లు రాత్రి 11.45 తరువాత కూడా ఓటు వేయవలసి ఉన్నందున, ఈ బూతులలో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11.45 గంటల మధ్య పోలింగ్ అసాధారణమైన రీతిలో చాలా నెమ్మదిగా జరిగి ఉండాలి.
గంటకు 24 ఓట్ల కంటే ఎక్కువ పోలై ఉండకూడదు.
ఈ అసాధారణమైన నెమ్మదిగా జరిగిన ఓటింగ్‌ను కాకుండా రాష్ట్ర సగటు ఓటింగ్ వేగాన్ని పరిగణనలోకి తీసుకుంటే- ఈ 3,500 బూతులలో పోలింగ్ మరుసటి రోజు ఉదయం 7 గంటల వరకు లేదా 8 గంటల వరకు కొనసాగి ఉండాలి. 491 కంటే ఎక్కువ ఓట్లు పోలైన పెద్ద సంఖ్యలోని బూతులలో మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకు లేదా 11 గంటల వరకు కొనసాగి ఉండాలి.
కానీ అలా జరిగిందా? జరగలేదు.
ఆంధ్రప్రదేశ్ సీఈఓ 2024 మే 14న జరిపిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మే 14 తెల్లవారక ముందు 2 గంటల సమయంలో చివరి ఓటు పోలైందని స్పష్టంగా చెప్పారు.
2024 మే 13న రాత్రి 11.45 గంటల అప్డేట్ తరువాత 2 గంటల 15 నిమిషాలకు పోలింగ్ ముగిసిందని దీని ద్వారా స్పష్టమవుతోంది.
ఈ 2 గంటల 15 నిమిషాలలో 17,19,482 ఓట్లు పోలాయ్యాయని దీనర్థం.

మాన్యువల్‌గా ఒక ఓటు వేయడానికి సగటున ఒక నిమిషం మాత్రమే తీసుకుంటే, ఒక బూతులో 491 ఓట్లు వేయడానికి 491 నిమిషాలు పట్టేది.
అంటే కనీసం 8 గంటలు అవుతుంది. ఒక్కో ఓటుకు 2 నిమిషాలు పట్టినట్లయితే, దాదాపు 16 గంటలు అవుతుంది.
ఈ 17,19,482 ఓట్లు అన్ని బూతులలో ఒకే విధంగా పడకపోవడానికే ఎక్కువ అవకాశం ఉంది.
కొన్ని బూతులలో 491 కంటే చాలా తక్కువగా ఉంటే, ఇతర బూతులలో 491 కంటే చాలా ఎక్కువగా ఉండాలి.
491 లేదా అంతకంటే ఎక్కువ మంది ఓటర్లు ఓటు వేయడానికి వేచి ఉన్న బూతులలో, పోలింగ్ మరింత సమయం పట్టి ఉండాలి.

491 కంటే తక్కువ ఓటర్ల ఉన్న బూతులలో ఓటింగ్ చాలా ముందుగా ముగిసి ఉండాలి.
కానీ, ‘‘చివరి ఓటు మే 14న తెల్లవారుజాముకు ముందు 2.00 గంటలకు పోలైనట్లు’’ సీఈఓ ఆన్ రికార్డుగా చెప్పడం జరిగింది.
491 లేదా అంతకంటే ఎక్కువ మంది ఓటర్లు వేచి ఉన్న బూతులలో ఓటింగ్ తెల్లవారు 2.00 గంటలకు ముగిసే అవకాశం లేదు.
నిజంగా మే 14 తెల్లవారు 2 గంటలకే పోలింగ్ ముగిసి ఉన్నట్లయితే, పోలింగ్ అధికారికంగా ముగిసిన సమయం తరువాత పోలింగ్ బూతుల వద్ద వేచి ఉన్న ఓటర్ల సంఖ్య 491 కంటే చాలా తక్కువ ఉండి తీరాలి.
ఏ బూతులోనైనా వేచి ఉన్న ఓటర్ల సంఖ్య 100 నుంచి 135 కంటే ఎక్కువ ఉండరాదు.
అయితే, ఎపీసీఈఓ ప్రకటించిన తెల్లవారు జాము 2 గంటల టైంలైన్ ప్రకారం, 2024 మే 13 రాత్రి 11:45 గంటల నుంచి 2024 మే 14 తెల్లవారుజామున 2 గంటల మధ్య ఓటు వేసినట్లు చెప్పబడుతున్న 17,19,482 మంది సంఖ్యతో ఎలా సరిపోతుంది?
సాధ్యాసాధ్యాలు..
ఆంధ్రప్రదేశ్ సీఈఓ ప్రకటించిన తెల్లవారుజామున 2 గంటల సమయాన్ని పరిగణనలోకి తీసుకుంటే, 491 మంది ఓటర్లు ఉన్న బూతులో అసాధారణమైన అధిక పోలింగ్ రేటు ఉండేది: నిమిషానికి దాదాపు 3.6 మంది ఓటర్లు. అంటే ప్రతి 20 సెకన్లకు కనీసం ఒక ఓటరు నిరంతరం ఓటు వేసినట్లు తెలుస్తుంది.
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు జరిగిన విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి.
అంటే ప్రతి ఓటరు తన పేరును తనిఖీ చేయించుకుని, సంతకం చేయడం లేదా వేలిముద్ర వేయడం చేసి, తన వేలిపై ఇంకు రాయించుకుని, ఒక కంపార్టుమెంటులో ఒక ఓటు వేసి, మరొక కంపార్టులోకి వెళ్లి మరొక ఓటు వేసి, బయటకు రావడం– మొత్తం 20 సెకన్లలోనే పూర్తి చేశారని అర్థమవుతుంది.
ఈ 20 సెకన్ల వ్యవధిలోనే 14 సెకన్ల అనివార్యమైన డెడ్ టైం ఉంటుంది– ప్రతి ఓటు పోలైన తరువాత, ప్రతి కంపార్ట్ మెంట్లో వీవీప్యాట్ స్లిప్ బయటకు రావడానికి 7 సెకన్లు పడుతుంది.
ఆ విధంగా 14 సెకన్ల సమయం తీసుకుంటుంది.
ఈ విధంగా చూస్తే ఓటరు ఓటర్ల జాబితాలో పేరును తనిఖీ చేయించుకోవడానికి, సంతకం చేయడం లేదా వేలిముద్ర వేయడానికి, వేలు మీద ఇంకు వేయించుకోవడానికి, ఒక ఓటు వేసిన తరువాత మరొక కంపార్టమెంట్లోకి వెళ్లి మరొక ఓటు వేసి, బయటకు రావడానికి కేవలం 6 సెకన్ల సమయం మాత్రమే మిగిలి ఉంది.
ఈ పూర్తి ప్రక్రియ ద్వారా మే 14న తెల్లవారుజామున 2.00 గంటల లోపు కేవలం 2 గంటల 15 నిమిషాలలో 17,19,482 ఓట్లు పోలు కావడం అనే అసాధారణ విన్యాసం భౌతికంగా అసాధ్యం.
ఈ అసాధారణ విన్యాసం భౌతికంగా ఎలా సాధ్యమయిందో భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) మాత్రమే వివరించగలదు.
ఎన్నికల సమయంలో చేయాల్సినవి..
ఓటింగ్ ముగింపునకు నిర్దేశించిన సమయంలోపు క్యూలో ఉన్న ఓటర్లందరికీ ఓటు హక్కును ఉపయోగించుకునే హక్కు ఉందని భారత ఎన్నికల సంఘం హ్యాండ్ బుక్ ఫర్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ 2023(సెక్షన్ 7.1.1) నిర్దేశిస్తుంది.
అయితే, పోలింగ్ అధికారులు క్రింది చర్యలను తీసుకోవాలి: పోలింగ్ కేంద్రం ప్రాంగణ గేటును పోలీసు అధికారి లేదా పోలింగ్ సిబ్బందిలో ఒకరు మూసివేయాలి.
వేచి ఉన్న ఓటర్లకు టోకెన్ ఇవ్వాలి. లైను చివర ఉన్న ఓటరుకు 1వ నంబరు ఉన్న టోకెన్, క్యూకు ముందులో ఉన్న ఓటరుకు చివరి సంఖ్యతో టోకెన్ ఇవ్వాలి.
ఓటర్లు ఓటు వేయడానికి వచ్చినప్పుడు టోకెన్లను సేకరించి, భవిష్యత్‌లో తనిఖీ కోసం భద్రపరచాలి.
‘‘వీడియోగ్రఫీ ఆఫ్ క్రిటికల్ ఈవెంట్స్ అండ్ ఇన్ పోలింగ్ స్టేషన్స్‘‘పై ఇచ్చిన మార్గదర్శకాలలో, ఓటింగ్ కంపార్ట్మెంట్ స్థానం, పోలింగ్ ఏజెంట్ల ఉనికి వంటి ఇతర విషయాలతో పాటు, “పోలింగ్ షెడ్యూల్ చేసిన గంట ముగిసే సమయానికి బయట వేచి ఉన్న ఓటర్లు- క్యూలో ఉన్న చివరి ఓటరు” వీడియోను రూపొందించాలని స్పష్టంగా నిర్దేశించబడింది.
వేచి ఉన్న ఓటర్ల ముఖాలను స్పష్టంగా “గుర్తించే” విధంగా మొత్తం క్యూను వీడియో-గ్రాఫ్ చేయాలి. భవిష్యత్‌లో ధృవీకరణ కోసం ఈ రికార్డులన్నింటినీ భద్రపరచాలి.
పోలింగ్ స్టేషన్ ప్రిసైడింగ్ అధికారి ఈ ప్రక్రియ మొత్తాన్ని ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీలో నమోదు చేయడం కూడా అంతే ముఖ్యం.
డైరీని కూడా ధృవీకరణ కోసం అందుబాటులో ఉంచాలి.
ఈ లెక్కలుపై సవాలుకు సమాధానం చెప్పడానికి, రికార్డులను తనిఖీ చేయించడానికి ఈసీఐ సిద్ధమా? రహస్యమేమి లేకపోతే, ఎటువంటి దుర్మార్గం లేకుంటే ఇందుకు ఈసీఐ సిద్ధంగా ఉండాలి.
సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య మూడు గంటల్లో పోలింగ్ పెరుగుదల కేవలం 0.08% మాత్రమే అన్న విషయాన్ని గమనిస్తే ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఈ అద్భుతం గురించి స్పష్టమవుతుంది.
కానీ పోలింగ్ రోజు రాత్రి 8 గంటల నుంచి 11.45 గంటల మధ్య రాత్రి 11.45 గంటల నాటికి, అంటే తదుపరి 3 గంటల 45 నిమిషాల్లో అసాధారణంగా 8.38% పెరిగింది.
కానీ ఈ అసాధారణ అద్భుతమైన పెరుగుదల అక్కడితో ఆగిపోలేదు.
2024 మే 17న అంటే, పోలింగ్ జరిగిన నాలుగు రోజుల తరువాత, ఓటింగ్ శాతాన్ని మరొక 4.16% పెంచుతూ ఈసీఐ ఒక కొత్త సంఖ్యను విడుదల చేసింది.

ఆ విధంగా పోలింగ్ శాతం 68.04%(సీఈఓ ప్రకారం) లేదా 68.12% (ఈసీఐ ప్రకారం) నుంచి 81.86% (ఏపీ సీఈఓ ప్రకారం) లేదా 2024 మే 17న ఈసీఐ విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం, 80.66% లేదా ఈసీఐ గణాంకాల ముఖ్యాంశాల ప్రకారం 81.79%కు వ్యత్యాసం మారింది.
ఓటింగ్ శాతంలో అద్భుతమైన పెరుగుదలల సారాంశం:
2024 మే 13 సాయంత్రం 5 గంటలకు ఏపీ సీఈఓ ప్రకారం పోలైన ఓట్ల శాతం 68.04%
2024 మే 13 సాయంత్రం 8 గంటలకు ఈసీఐ ప్రకారం పోలైన ఓట్ల శాతం 68.12%
2024 మే 13 రాత్రి 11.45 గంటలకు ఈసీఐ ప్రకారం పోలైన ఓట్ల శాతం 76.50%
2024 మే 17, ఏపీ సీఈఓ ప్రకారం పోలైన ఓట్ల శాతం 81.86%, ఇందులో 1.20% పోస్టల్ బ్యాలెట్లు కూడా ఉన్నాయి.
2024 మే 17, ఈసీఐ ప్రకారం పోలైన ఓట్ల శాతం 80.66%.
ఈవీఎం ఓట్లు, అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్ రెండింటి విషయంలో కూడా ఏపీ సీఈఓ విడుదలు చేసిన అంకెలు, ఈసీఐ విడుదల చేసిన అంకెలకు మధ్య వైరుధ్యాలు ఉన్నాయి.
విచిత్రంగా, ఇసిఐ విడుదల చేసిన గణాంకాల ముఖ్యాంశాలలోని వివరాలు పూర్తిగా వేరుగా ఉన్నాయి.
ఈ గణాంకాలు మొత్తం ఓటింగ్‌ను 81.79%గా పేర్కొంది. ఎపి సిఇఓ పోస్టల్ బ్యాలెట్లను 1.2%గా తెలుపగా, గణాంకాలు 1.23%గా పేర్కొనడం జరిగింది.
ఏపీ సీఈఓ, ఈసీఐలు ప్రకటించిన డేటా మధ్య వైరుధ్యాలు పూర్తిగా చర్చించుకోవలసిన మరొక పెద్ద గాథ.

టైమ్లైన్లు, పెరుగుదల తీరును పరిశీలిద్దాం
2024 మే 13న సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల మధ్య పెరుగుదల 68.04% నుంచి 68.12% అంటే 0.08%. సంఖ్యల్లోకి మారిస్తే 33,064 ఓట్లు.
అదే రోజు రాత్రి 8 గంటల నుంచి 11.45 గంటల మధ్య 3 గంటల 45 నిమిషాల వ్యవధిలో 68.12% నుంచి 76.50%కు అనగా 8.38%కు పెరిగింది.
నమోదైన ఓట్లు భారీగా 34,63,767 పెరిగాయి. ఈ వ్యవధిలో ప్రతి పోలింగ్ స్టేషన్లో 74 నుంచి 75 ఓట్లు పోలయ్యాయి.
అయితే, అన్ని పోలింగ్ కేంద్రాలలో ఒకే విధంగా ఓట్లు పోలై ఉండకపోవచ్చు. కానీ, ప్రతి ఓటరు ఒకటి అసెంబ్లీకి, మరొకటి లోక్‌సభకు చొప్ప్పున రెండు ఓట్లు వేయవలసి ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
పోలింగ్ ముగిసిన నాలుగు రోజుల తరువాత 2024 మే 17 నాటికి ఏపీ సీఈఓ అందించిన వివరాలు లేదా ఈసీఐ ఇచ్చిన సంఖ్యలలో ఏదో ఒక దాని ప్రకారం పోలింగ్ శాతం మరో 5.16% లేదా 4.16% పెరిగింది.
ఏపీ సీఈఓ ప్రకారం 76.50% నుంచి 81.66%కు, ఈసీఐ ప్రకారమైతే 80.66%కు చేరింది. ఈ రెండింటిలోనూ పోస్టల్ బ్యాలెట్లు మినహాయించబడ్డాయి.
ఈసీఐ అత్యున్నత అధీకృత సంస్థ కాబట్టి, ఏపీ సీఈఓ గణాంకాలకు బదులు, ఈసీఐ ఇచ్చిన అంకెల ప్రకారం తక్కువ సంఖ్య అయిన 80.66%ను తీసుకుంటే 17,19,482 ఓట్లు భారీగా పెరిగాయి.
పోలింగ్ తేదీ రోజు 2024 మే 13న సాయంత్రం 5 గంటలకు ప్రకటించిన ఓటింగ్ శాతానికి, తుది పోలింగ్ శాతం ప్రకటించిన 2024 మే 17కు మధ్య ఓటింగ్‌లో అసాధారణమైన మొత్తం ఓటింగ్ పెరుగుదల 12.54%. దీని ప్రకారం పోలైన మొత్తం ఓట్లు 51,83,249 పెరిగాయి.
అందువల్ల మొత్తం ఓట్లలో వచ్చిన పెరుగుదల: 51,83,249 ఓట్లు. అక్షరాల యాభై ఒక్కల లక్షల ఎనభై మూడు వేల రెండు వందల నలబై తొమ్మిది.
ఈ సంఖ్యను రాష్ట్రంలోని మొత్తం 175 నియోజకవర్గాలకు సమానంగా పంచితే, ఒక్కొక్క స్థానానికి 29,618 ఓట్లు వస్తాయి.
ఈ పెరుగుదల రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విధంగా ఉందనడం అసంభవం. దీనిని తోసిపుచ్చవచ్చు. కాని, లక్ష్యంగా పెట్టుకున్న నియోజకవర్గాలలో ఎంపిక చేయబడిన బూతులలో జరిగినట్లయితే, కొందరు అభ్యర్థులు/పార్టీలకు అనూహ్య విజయాన్ని, ఇతర అభ్యర్థులకు/పార్టీలకు శరాఘాతమైన పరాజయాన్ని మిగులుస్తాయి.
అందువల్ల 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలల్లో కొంత మంది అభ్యర్థులు/ పార్టీల అద్భుత విజయాలు, ఇతరుల ఘోరా పరాభవాల వెనుక ఈ పెరుగుదల పాత్ర ఉంది.
ఈ అసాధారణ విన్యాసం ఈసీఐ/ఏపీ సీఈఓ డేటాలో లేదా వారి పత్రికా ప్రకటనలలో కనిపించకపోవడం ఆసక్తికరంగా ఉంది.
ఇప్పుడు తలెత్తుతున్న పెద్ద ప్రశ్నలు ఏమిటంటే..
(1) ఆంధ్రప్రదేశ్‌లో విజేతలు తమకు తెలియకుండానే ఈ అద్భుత వరాన్ని పొందారా?
(2) రాష్ట్రంలోని పరాజితులు తమ ఓటమికి దారితీసిన ఈ అసాధారణ పెరుగుదలకు అమాయకంగా బలైపోయారా?
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రక్రియ సమగ్రత విషయంలో బాగా రాజీపడినట్లు స్పష్టమవుతోంది. కానీ, ఇందుకు కారణమైన వారెవరూ స్పష్టం కావడం లేదు.
దీనివల్ల ఆంద్రప్రదేశ్ ఎన్నికల తీర్పు పెద్ద ప్రశ్నార్ధకంగా మారింది. పైన పేర్కొన్న వైరుధ్యాలు 2024 లోక్‌సభ ఎన్నికల సందేహాస్పద తీర్పు తరహాలోనే ఇది కూడా తస్కరించబడిన తీర్పేనా అనే అనుమానానికి తావిస్తున్నాయి.
ఈ సందేహాలకు ఇచ్చే సరైన, విశ్వసనీయమైన సమాధానాలు మాత్రమే మిగిలిన సందేహాలను తీర్చగలవు. అప్పటి వరకు అనుమానాలు అలాగే ఉంటాయి.
(వ్యాస రచయిత డాక్టర్ పరకాల ప్రభావకర్, రాజకీయ ఆర్థిక వేత్త, ది క్రూక్డ్ టింబర్ ఆఫ్ న్యూ ఇండియా పుస్తక రచయిత.)
అనువాదం: పీ నరసింహారావు, సీనియర్ జర్నలిస్టు, పోటీపరీక్షల నిపుణులు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.


