ఒకప్పుడు బయట నుంచి ఇంటికి రాగానే ముందుగా చేతులు, కాళ్లు కడుక్కొని ఆ తర్వాత ఇంట్లోకి వెళ్లేవాళ్లం. ఇప్పుడు అదంతా ఏం లేదు.
చెప్పులతోనే లోపలికి వెళ్తున్నాం. చల్లటి మట్టికుండ నీళ్లను ఒకప్పుడు తాగేవాళ్లం. ఇప్పుడు ఎక్కడెక్కడో తిరిగి వచ్చి, మన ఇంట్లోనో లేకపోతే మరొకరి ఇంటికో వెళ్లి నీళ్లు తాగేస్తున్నాం.
ఇంతకు ముందు గ్లాసును నోటికి తగిలించకుండా పైకి ఎత్తి నీళ్లు తాగడం తెలుసు. వేడివేడి కాఫీని కూడా గ్లాసు పైకెత్తి తాగేవాళ్లం.
దాన్ని మడి చాదస్తం అంటారు. కానీ ఇప్పుడేంటో గ్లాసును నోటికి తగిలించి ఎంగిలి చేసేస్తున్నాం.
కాళ్లు కడుక్కోవాల్సిన అవసరం లేదు. చెప్పులు, బూట్లతోనే ఇంట్లో కూర్చుని మాట్లాడుకుంటున్నాం. నోట్లో పెట్టుకుని నీళ్లు తాగుతున్నాం.
దుకాణాల్లో ప్లాస్టిక్ బాటిల్‌ను చేతికి ఇస్తారు. అందులోని నీళ్లను సగం తాగి బాటిల్‌ను పక్కకు పారేస్తారు.
ప్లాస్టిక్‌తో పాటు నీళ్లను కూడా చెత్తకుండలో నింపుతూ వెళ్తున్నాం. కొందరు మూత పెట్టరు. అక్కడ పడిపోయి నీళ్లు కారుతుంటాయి.
ప్లాస్టిక్ బాటిల్ ఇప్పుడు మన నాగరికతలో భాగంగా మారిపోయింది.
ప్రతి ఇంట్లో ఉండే బావి ఇప్పుడు లేదు. కాలనీ, అపార్ట్మెంట్లలో బావి అవసరం లేదనుకుంటున్నారు. నీళ్ల కనెక్షన్ ఎక్కడ నుంచి వస్తుందో అపార్ట్మెంట్ కొనుగోలు చేసే వ్యక్తి అడగడం లేదు. “వాటర్ బబుల్ కొనుక్కోండి” అంటారు. అందులో లేదా ప్లాస్టిక్ బాటిల్లో—బిస్లరీ అంటున్నారు. అవి మంచి నీళ్లా? మామూలు నీళ్లా? ఏదో తెలియదు. ‘మంచి నీళ్లు’ అడగడమనే మాటే ఇప్పుడు తెలియదు.
ఇప్పుడిదే సంస్కృతి, నాగరికత, సంస్కారం.
ఒకప్పుడు చెరువు ఉండేది. దానికి కట్ట ఉండేది. ఆ కట్టను కాపాడుకునే దేవత ఉండేది, ఉంటుంది. మైసమ్మ కట్టని, గండి కట్ట మైసమ్మని, పోచమ్మని ప్రజలు పిలుచుకుంటుంటారు.
ప్రస్తుతం చాలా చోట్ల చెరువు లేదు. కట్ట కూడా లేదు. కట్టమైసమ్మ మాత్రం ఉంది. దానికి పెద్ద గుడి కడుతున్నారు. పెద్ద పెద్ద కొత్త కార్లు కొనుక్కొని దానికి నిమ్మకాయలు మొదలైనవి కట్టి, గుమ్మడికాయలు పెట్టి, పూలహారాలతో అలంకరించి పూజారి పూజ చేస్తారు. దానికి టికెట్ ఉంటుంది. వాహన టికెట్ వేరే ఉంటుంది. అష్టోత్తర స్తోత్రం చేస్తారు—దానికి ఇంకో టికెట్.
వాటర్ బబుల్ కొనుక్కుని అందులోని మంచినీటితో చిలకరిస్తే పూజ అయిపోతుంది. కొత్త కారు సంగతి సరేసరి. అంతరిక్షానికి పంపే రాకెట్లు, ఉపగ్రహాలకు కూడా నిమ్మకాయలు, చింతకాయలు వగైరా కడతారు (ఇంకా వివరాలు నాకు తెలియదు). ఎవరి నమ్మకాలు వారివి. తప్పేమీ లేదు.

కానీ చెరువు మాయమైంది. ఉంటే మురికి అయింది, మురికి మూసి అయింది. ప్రతి చెరువు ప్రాంతంలో కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రులు, పెద్ద పెద్ద మాల్- గోమాల్లు వచ్చాయి. ప్రభుత్వ కార్యాలయాలు కూడా కట్టేశారు.
కట్టలు, గుళ్లు మిగిలాయి. కానీ చెరువు లేదు. అసలు ఇది వరకున్న చెరువే లేదు. కొత్త చెరువులు నిర్మిస్తారో లేదో తెలియదు.
మన ఊరి చెరువులో నీళ్లు తాగం. తాగకూడదు. బావిలోని నీళ్లు మంచివి కాదంటున్నారు.
మనకు మంచి నీళ్లూ లేవు. మంచి వాళ్లూ లేరు. రాజ్యాంగం మాత్రం మంచిదే. రాజ్యాంగాన్ని అమలు చేసే ముఖ్యమంత్రులు, ప్రధానులు కూడా మంచి వాళ్లే అంటారు. కానీ రాజ్యం ఏది? ప్రజాస్వామ్యం ఏది? ఓట్లు వేసే జనమేరి? దొంగ ఓట్లను ప్రశ్నించే వారెవరు?
మంచి నీళ్లు, గాలి, మన పర్యావరణం — ప్రాథమిక హక్కులు
పర్యావరణ విధులు: ఆర్టికల్ 48ఏ ప్రకారం, పర్యావరణాన్ని రక్షించడం ప్రభుత్వ బాధ్యత. అలాగే ఆర్టికల్ 51ఏ(జీ) ప్రకారం, సహజ వనరులను కాపాడటం ప్రతి పౌరుడి ప్రాథమిక విధి.
ఆర్టికల్ 21 (జీవించే హక్కు): గౌరవప్రదమైన జీవితం అంటే కేవలం బ్రతకడం మాత్రమే కాదు; పరిశుభ్రమైన గాలి, నీరు, ఆరోగ్యకరమైన పర్యావరణం లేకుండా అది సాధ్యం కాదు.
ముఖ్యమైన న్యాయపరమైన తీర్పులు
సుభాష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ (1991) — కాలుష్యరహిత నీరు, గాలిని ఆస్వాదించడం ‘జీవించే హక్కు’లో భాగమని ఈ కేసులో దృవీకరించారు.
వెల్లూరు సిటిజన్స్ వెల్ఫేర్ ఫోరమ్ కేసు— పర్యావరణానికి నష్టం కలిగించే వారే పరిహారం చెల్లించాలనే “పొల్యూటర్ పేస్” సూత్రం; ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలనే “ప్రికాషనరీ ప్రిన్సిపల్స్”ను ఈ తీర్పు ప్రవేశపెట్టింది.
ప్రజా విశ్వాస సిద్ధాంతం: నదులు, అడవులు వంటి సహజ వనరులకు ప్రభుత్వం ఒక ట్రస్టీ(రక్షకుడు)గా వ్యవహరించాలి. వీటిని ప్రజల ఉపయోగం కోసం కాపాడాలి.
అంతర్జాతీయ గుర్తింపు: 1972 నాటి స్టాక్‌హోమ్ కాన్ఫరెన్స్, గౌరవప్రదమైన జీవితం గడపడానికి నాణ్యమైన పర్యావరణం ఒక ప్రాథమిక హక్కని గుర్తించింది.
గ్రీన్ అమెండ్మెంట్స్ (హరిత సవరణలు): ప్రస్తుత, భవిష్యత్ తరాల కోసం పరిశుభ్రమైన గాలి, నీరు, స్థిరమైన వాతావరణాన్ని నిర్ధారించడానికి కొన్ని దేశాలు ప్రత్యేక రాజ్యాంగ సవరణలను అమలు చేస్తున్నాయి.
పరిష్కార మార్గాలు: ఈ హక్కులకు భంగం కలిగినప్పుడు పౌరులు న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు. పర్యావరణానికి జరిగే నష్టాన్ని ‘జీవించే హక్కు’ ఉల్లంఘనగా పరిగణించి కోర్టులు చర్యలు తీసుకుంటాయి.
రాజ్యాంగం మంచిదే. రాజ్యాంగాన్ని అమలు చేసే ముఖ్యమంత్రులు, ప్రధానులు కూడా మంచివాళ్లే అంటారు. కానీ మనకు మంచి నీళ్లూ లేవు. సమాజంలో ఎక్కువగా మంచి వాళ్లూ లేరు. అయితే సురాజ్యం ఏది? స్వరాజ్యం ఏది? ప్రజాస్వామ్యం ఏది? నిజంగా ఓట్లు వేసుకునే అసలైన జనం ఎవరు? దొంగ ఓట్లను ప్రశ్నించే వారెవరు?
స్వచ్ఛమైన గాలి, నీటి హక్కుపై మీడియా ప్రచార కార్యక్రమంలో భాగంగా 2026 జనవరి 25న ఒకరోజు సదస్సు జరుగుతుంది. ఈ సందర్భంగా రాజ్యాంగ సమస్యలు, కష్టాలపై రాసిన వ్యాసం ఇది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
