దేశీయ పౌర విమానయాన రంగాన్ని అతలాకుతలం చేసి, ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది పెట్టిన ఇండిగో సంక్షోభం సమసినట్టేనా? ప్రతి విమాన ప్రయాణికుని నోట ఇండిగో అనే స్థాయికి ఎదిగి గుత్తాధిపత్యాన్ని చెలాయిస్తున్న ఈ ప్రధాన దేశీయ విమానయాన సంస్థలో ఒక్కసారిగా ఇంతటి సంక్షోభం ఏర్పడటానికి కారకులెవరు?
పూర్తిగా కార్పొరేట్ రంగానికి పరిమితమైన దేశీయ పౌర విమానయాన రంగాన్ని కనీసం పర్యవేక్షించడంలో ప్రభుత్వం విఫలం చెందడం సంక్షోభానికి మొదటి కారణం. ప్రస్తుతం దేశంలోనే రెండవ అతి పెద్ద సంస్థగా ఉన్నటువంటి ఇండిగో సంస్థ యాజమాన్యం ఇటు పైలెట్ల స్థాయి నుంచి అటు కింది స్థాయి సిబ్బంది వరకు చాలీచాలని వేతనాలను చెల్లిస్తూ వెట్టి చాకిరి చేయించుకోవడం సంక్షోభానికి రెండవ కారణం.
ఒక ఉద్యోగి వచ్చి తన షిఫ్టులో చేరిన వెంటనే అతనికి విరామం ఇవ్వకుండా వెట్టిచాకిరి చేయించుకుంటున్న దాఖలాలు కోకొల్లలుగా ఉన్నాయి. సంస్థలో పైలెట్ల నుంచి కింది స్థాయి ఉద్యోగి వరకు ఇదే వెట్టి చాకిరిని ఎదుర్కొంటున్నారు.
ప్రభుత్వ వైఫల్యం, యజమాన్య వెట్టి చాకిరి ఈ రెండే సంక్షోభానికి ప్రధాన కారణాలు. ఇవే లక్షలాది మంది ప్రయాణికులను ఇబ్బందికి గురి చేశాయి.
పట్టించుకోని ప్రభుత్వం
గత ఏడాది “పైలెట్లకు డ్యూటీ టైమ్ లిమిటేషన్స్”(పీడీటీఎల్)అనే కొత్త నిబంధనలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ నిబంధన ప్రకారం, ప్రతి పైలెట్‌కు వారానికి రెండు రోజుల పాటు ఖచ్చితంగా సెలవు ఇవ్వాలి. ప్రయాణికుల భద్రత దృష్ట్ర్యా ప్రవేశపెట్టిన ఇలాంటి అనేక నిబంధనలను సంస్థలు అమలు చేస్తున్నాయా లేదాన్నది చూసుకునే బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
నిబంధనలకు వ్యతిరేకంగా, టిక్కెట్ ధరలను పెంచడం- చివరికి సీటుపై కూడా అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టింపులేనట్టుగా వ్యవహరిస్తుంది.
విమాన ప్రమాదాలు, విమానాల్లో సాంకేతిక సమస్యలు ఏర్పడి అత్యవసరంగా విమానాలను ల్యాండ్ చేసినప్పుడు మాత్రమే డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియెషన్(డీజీసీఏ) స్పందిస్తుంది.
ప్రస్తుతం దేశంలో రెండు ప్రధాన ఎయిర్‌లైన్స్ పని చేస్తున్నాయి. ఒకటి టాటాగ్రూప్ ఎయిర్ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్; రెండవది ఇండిగో. ఆ తర్వాత చిన్న ఎయిర్‌లైన్స్ ఆకాశ, స్పైస్‌జెట్‌లు ప్రస్తుతం రంగంలో ఉన్నాయి.
నాటి నుంచి నేటి వరకు
దేశంలో 1994 నుంచి ఈ ఏడాది 2025 జులై వరకు దాదాపు 20 ఎయిర్‌లైన్స్ సంస్థలు ఆర్ధిక సమస్యలతో పాటు అనేక ఇతర కారణాల వల్ల మూతపడ్డాయి. అందులో జెట్, కింగ్‌ఫిషర్, పారామౌంట్, ఎయిర్ కోస్తా, విస్తారా, వీఐఎఫ్ విజయ్, జూమ్, ఎయిర్ కార్నివల్, ఎయిర్‌డెక్కన్, ఎయిర్ ద్రావిడ్, గోఎయిర్‌లు ఉన్నాయి.
ఇక ఇండిగో విషయానికి వస్తే, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి లిఖిత పూర్వక సమాధానం ప్రకారం- ప్రధాన ఎయిర్‌లైన్స్‌లలో 2005లో ప్రారంభమైన ఈ ఎయిర్‌లైన్స్ ఇండిగో ఒక్కటే 2024- 2025 ఆర్ధిక సంవత్సరంలో రూ 7,253 కోట్ల లాభాన్ని అర్జించిందని చెప్పారు.
మిగితా సంస్థలన్నినష్టాలలో కూరుకుపోయాయని అందులో పరివర్తన దశలో ఉన్న ఎయిర్ ఇండియా రూ 3,976 కోట్లు, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ రూ 5832, ఆకాశ రూ 1986, ఎయిర్ అలయన్స్ రూ 691, స్పైస్‌జెట్ రూ 56 కోట్ల నష్టాలతో పని చేస్తున్నట్టుగా మంత్రి చెప్పారు.
దేశీయ పౌరవిమానయాన రంగంలో లాభాలతో పని చేస్తున్న ఏకైక ఎయిర్‌లైన్స్ ఇండిగో ప్రస్తుతం 400 విమానాలు 5,032 మంది పైలెట్లు, 9000-11,000 మంది క్యాబిన్ క్రూలను కలుపుకొని మొత్తం 41 వేల మందితో పని చేస్తూ 138 గమ్యస్థానాలకు విమానాలను నడుపుతుంది. అయినా సంస్థలో వేతనాల పెంపుదల, ప్రమోషన్లు, సిబ్బంది నియమకాలు వంటి విషయాలను యాజమాన్యం పూర్తిగా మర్చిపోయింది. చాలీచాలని వేతనాలతో గంటల తరబడి ఇటు పైలెట్లతో అటు సిబ్బందితో చాకిరి చేయించుకుంటుంది.
మరో ప్రధాన ఎయిర్‌లైన్స్ ఎయిర్ ఇండియా ప్రస్తుతం పరివర్తన దశలో ఉంది. 417 విమానాలు; 6,350 మంది పైలెట్లు, 5000 మంది క్యాబిన్ క్రూతో కలిపి మొత్తం 18వేల మంది సిబ్బందితో 131 గమ్యస్థానాలకు విమానాలను నడుపుతుంది.
టిక్కెట్ల ధరల విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోలేదని పార్లమెంటులో పౌర విమానయాన శాఖ మంత్రి కే రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. విమాన ధరలు పండగలు, సీజన్‌పై ఆధారపడి ఉంటాయని, వాటి ప్రకారం యజమాన్యాలు డిమాండ్ మేరకు టిక్కెట్ల ధరలను నిర్ణయిస్తాయని అన్నారు. అంతే తప్పా సంవత్సరం పొడువున ఒకే టిక్కెట్ ధర ఖరారు చేయాలని సంస్థలకు ప్రభుత్వం ఆదేశించలేదని మంత్రి చెప్పారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
