బద్ధ శత్రువులుగా ఉన్న బీజేపీ- కాంగ్రెస్‌ల ఆలోచన ప్రాంతీయ పార్టీల విషయంలో ఒకటేనా? గడిచిన పదేళ్ల అనుభవం దీన్నే రూఢీ చేస్తున్నదా? ఈ ప్రశ్నల పరంపరకు బహుశా ఇప్పటికిప్పుడే ముగింపు ఉండకపోవచ్చు. 1992 సాధారణ ఎన్నికలు మొదలుకొని నెహ్రూ అనంతర రాజకీయ పరిణామాల వరకు మన దేశ రాజకీయ తీరు ఒకతీరున్నది. 1967 నుంచి 1980ల మధ్య భారతరాజకీయ ముఖచిత్రం మారడం ప్రారంభమైంది.
తెలుగునాట తెలుగుదేశం పార్టీ, అంతకు పూర్వం రెడ్డి కాంగ్రెస్, దానికంటే ముందు మరికొన్ని పార్టీలు వచ్చాయి- పోయాయి. దక్షిణాదిన తమిళనాడులో డీఎంకే, ఏఐడీఎంకే విశేషమైన ప్రభావాన్ని చూపించాయి. ఈ రాష్ట్రంలో పెరియార్, అన్నాదొరై, కరుణానిధి, ఎంజీఆర్ తదనంతర బౌద్ధికమైన ఆచరణాత్మకమైన అంశాలు ఏక రూపంగా కనిపిస్తున్నట్టుగా ఉంటాయి. భారతీయ కులవ్యవస్థ గుణాత్మకతను, దాని ఆచరణాత్మకతను నిలేసి మెలేసిన ఒక ఆలోచనా ధార ఆ రాష్ట్రంలో ఉన్నది. కేరళ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలకంటే, వామపక్ష- కాంగ్రెస్ పార్టీలు ప్రధాన రాజకీయ కేంద్రాలుగా ఉన్నాయి.
2000 సంవత్సరం తర్వాత, 2000 నుంచి 2014 మధ్య తెలుగునాట మరికొన్ని ప్రాంతీయ పార్టీలు వచ్చాయి. అందులో ఇప్పుడు చెప్పుకోదగినది- టీఆర్ఎస్(బీఆర్ఎస్) ఒకటి. తల్లి తెలంగాణ పార్టీ, నవ తెలంగాణ ప్రజాపార్టీ తదితరాలు వచ్చాయి- కాలగర్భంలో కలిసిపోయాయి. 2004 ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీతో టీఆర్ఎస్ పొత్తు కుదిరింది. అసెంబ్లీ బయటా లోపలా తన వాణిని టీఆర్ఎస్ వినిపించగలిగింది. 2009 ఎన్నికల అనంతరం ఇక టీఆర్ఎస్ ఉండదనే ఒక అభిప్రాయం జనంలో ఉన్నది. అనంతర పరిణామాలు అందరికీ తెలిసినవే.
తారుమారవుతోన్న స్థానాలు..
దక్షిణాదిన మరో పెద్ద రాష్ర్టం కర్ణాటక. ఈ రాష్ట్రం నుంచే ఒక ప్రాంతీయ పార్టీ అధినేత దేశ ప్రధాని అయ్యారు. ఆయనే హెచ్డీ దేవగౌడ. ఆయన పార్టీ జేడీఎస్. ఈ పార్టీ జాతీయ పార్టీలతో పొత్తులను పెట్టుకున్నదే. ఇటీవలి(2023) అసెంబ్లీ ఎన్నికల నుంచి ఆ పార్టీ మిణుకుమిణుకుమంటున్నది.
మహారాష్ట్రలో 1966లో వచ్చిన శివసేన విశేషమైన ప్రభావాన్ని ఆ రాష్ట్రంలోనూ, జాతీయ స్థాయిలోనూ చూపించింది. ఏక్నాథ్ షిండే వివాదం తర్వాత ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి ఏంటో అందరికీ తెలిసిందే. శివసేన బీజేపీతో జట్టు కట్టింది. అనంతరం కాంగ్రెస్‌తోనూ. ఇదే రాష్ట్రంలో పురుడు పోసుకున్న మరొక ప్రాంతీయ పార్టీ ఎన్సీపీ దీని వ్యవస్థాపకులు శరద్‌పవర్. ఇప్పుడు ఈ పార్టీ ఏ స్థితిలో ఉందో, దాని భవిష్యత్తు ఏంటో వర్ధమాన భారత రాజకీయ ముఖచిత్రం చూపిస్తున్నది. ఈ ప్రాంతీయ పార్టీలన్నీ ఏదో సందర్భంలో జాతీయ పార్టీలతో పొత్తు పెట్టుకున్నవే. అవసరమో, అనివార్యమో అది చరిత్ర తెలియజేస్తుంది.
ఇక ఉత్తరాదిన ఉద్భవించిన ప్రముఖ శూద్ర నాయకత్వ పార్టీలు ఆర్జేడీ, సమాజ్‌వాదీ, జేడీయూ; ఈ పార్టీలు ఏదో సందర్భంలో జాతీయ పార్టీలతో పొత్తు కుదుర్చుకుంటూ ఉన్నవే.
ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్‌వాదీ పార్టీ ఇప్పుడు ఆయోమయ గందరగోళ స్థితిలో ఉన్నాయి. రాజకీయంగా తమ పట్టు నిలుపుకొనే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ రెండు పార్టీలు 1990- 2004 మధ్య భారతరాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేశాయి.
ప్రాంతీయ పార్టీల గడ్డు పరిస్థితి..
బీహార్‌కు చెందిన లాలూ యాదవ్ పార్ట ఆర్జేడీ జంగిల్ రాజ్ పేరును మూటకట్టుకొని లేవలేకుండా అయ్యింది. ఈ పార్టీలన్నీ కాంగ్రెస్ లేదా బీజేపీ నేతృత్వంలోని కూటమితో అంటకాగినవే. పశ్చిమ బెంగాల్‌కు చెందిన టీఎంసీ మినహాయిస్తే, ఇతర ఈశాన్య రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల ఉనికి అంతంతమాత్రమే. దీంతో పాటుగా పంజాబ్, హర్యాణాలకు చెందిన ప్రాంతీయ పార్టీలు కూడా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఒడిస్సా ప్రాంతీయ పార్టీ బీజూ జనతాదళ్ సుదీర్ఘ విజయానంతరం అపజయం పాలై అలా ఉన్నది.
ప్రాంతీయ పార్టీల పుట్టుక జాతీయ పార్టీల విశాల దృక్పథ లోపానికి కారణం.
తొలి రెండు సాధారణ ఎన్నికల తర్వాత ప్రాంతీయ పార్టీల పుట్టుక అనివార్యమైంది. ఆనాటికి మనదేశంలో వివిధ సంస్థానాల ప్రజల ఆలోచన, అక్షరజ్ఞానం, ఆర్ధిక, సామాజిక స్థితిగతులు భిన్నంగా ఉన్నాయి. తమతమ ప్రాంతీయ అవసరాలను జాతీయ స్థాయిలో బలంగా వినిపించేందుకు ప్రాంతీయ పార్టీలు వచ్చాయి. ఆ మేరకు భారత ప్రజాస్వామ్య వ్యవస్థను బలపరిచాయి. ప్రజాకాంక్షలను చట్టసభలలో బలంగా వినిపించాయి. ఆ మేరకు ప్రాంతీయ పార్టీల నాయకత్వ పటిమ, దూరదృష్టి కారణంగానే ఏపీ, తెలంగాణ, తమిళనాడు తదితర దక్షిణాది రాష్ట్రాలు సకల రంగాలలో అద్భుతమైన ప్రగతిని సాధించాయని రాజకీయ విశ్లేషకుల భావన.
గడిచిన దశాబ్దకాలంగా ప్రాంతీయ పార్టీలు క్రమంగా తమ ఉనికిని కోల్పోతున్నాయానే చర్చ జనబాహుళ్యంలో ప్రబలంగా ఉన్నది. ఇదే వరుసలో తెలంగాణలో బీఆర్ఎస్ ఉండబోతున్నదానే సందేహాలు వస్తున్నట్టుగా ఉన్నాయి. కేటీఆర్‌పై విచారణకు గవర్నర్ అనుమతించడం ఒక అంశమైతే. గడిచిన రెండేళ్లుగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్పై కేసులంటూ చేస్తున్న హడావుడి మరో అంశం. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్- బీజేపీలు కలిసి తమను ఇబ్బందిల్లోకి నెడుతున్నారని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. గతానుభావాలను దృష్టిలో ఉంచుకొని బీఆర్ఎస్ నేతలు ఇలా అంటున్నారని తెలంగాణలో జోరుగా చర్చ సాగుతున్నది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
