
నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడు గ్రామంలో ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తలపెట్టిన స్వయం సమీకృత సౌర పలకల తయారీ పరిశ్రమ(వెర్టికల్లీ ఇంటిగ్రేటెడ్ సోలార్ ఫోటో వోల్టాయిక్ మాడ్యూల్స్. టూకీగా సౌర పలకల పరిశ్రమ) కోసం ప్రభుత్వం సుమారుగా 8500 ఎకరాలు సేకరించే ప్రయత్నంలో ఉంది. ఇప్పటికే సుమారుగా 4500 ఎకరాల సేకరణకు సంబంధించి, 2013 భూసేకరణ చట్టం ప్రకారం, ప్రాథమిక ప్రకటన కూడా ఇచ్చారు. అయితే స్థానికులు, గ్రామస్తులు ఈ పరిశ్రమ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే గ్రామసభలను అడ్డుకున్నారు. ధర్నాలు, ఆందోళనలు చేశారు. వారి అభ్యంతరాలు, వ్యతిరేకత న్యాయమైనవే. ఎందుకు న్యాయమైనవో చెప్పడానికే ఈ వ్యాసం.
ఈ పరిశ్రమలో తయారు చేసేది సౌర విద్యుత్తు తయారీలో వినియోగించే సౌర పలకలు. వీటి తయారీ ఆరు అంచెల ప్రక్రియ. ఈ పరికరాల తయారీకి మూల ఖనిజం క్వార్ట్జ్. ముఖ్యమైన ముడిపదార్ధం పోలిసిలికాన్. క్వార్ట్జ్ నుంచి పోలిసిలికాన్ తయారుచేసి, దాని నుంచి అంతిమంగా పలకలు(మాడ్యూల్స్) తయారుచేస్తారు. పోలిసిలికాన్లో చైనాది గుత్తాధిపత్యం. ఆ దేశం ఇష్టాయిష్టాలని బట్టి మిగతా దేశాలకు ఈ ముడిపదార్ధం అందుబాటులో ఉంటుంది. అందుకే అనేక దేశాలు ఇప్పుడు సప్లై చైన్ మొత్తం తమ అధీనంలో ఉండేటట్టు ప్రయత్నం చేస్తున్నాయి. అందులో భారతదేశం కూడా ఒకటి. ఇప్పటివరకు ఇక్కడ కూడా ఈ రంగం పలకల అసెంబ్లేజ్ వరకే పరిమితం అయ్యి ఉంది. అంటే పలకలకు అవసరమైన సెల్స్‌ను చైనా నుంచి దిగుమతి చేసుకుని, వాటిని ఇక్కడ పలకలుగా అమరుస్తున్నారు. ఆ తర్వాత వాటిని ఎక్కువగా అమెరికాకి ఎగుమతి చేస్తున్నారు. అయితే మొత్తం తయారీ ప్రక్రియ దేశీయంగా ఉంటే లాభమని కేంద్ర ప్రభుత్వం ఈ పరిశ్రమను ప్రోత్సహిస్తున్నది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం ద్వారా ఆర్థిక మద్దతు కూడా అందిస్తున్నది.
ఈ నేపథ్యంలో ఇండోసోల్ సోలార్ సంస్థ 69,000 కోట్ల పెట్టుబడితో ‘క్వార్ట్జ్ నుంచి మాడ్యూల్’ పద్ధతిలో మొత్తం పలకల తయారీ ఇక్కడే చేస్తామని చెప్పి ముందుకు వచ్చింది. ఇటువంటి పరిశ్రమ ప్రపంచంలోనే ఇదే మొదటిదనే ప్రచారం కూడా జరిగింది. ఇది 2022 నాటి విషయం.
మొదట్లో తాము 10 గిగావాట్ల పలకలు తయారు చేస్తామని, అందుకుగాను తమకు 5148 ఎకరాలు కావాలని, వివిధ సబ్సిడీలు, ప్రోత్సాహకాలు కూడా అవసరమని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగింది. ప్రభుత్వం అన్నిటికీ ఒప్పుకుంది. ఆ తరువాత 2023లో తమకు మరో 3200 ఎకరాలు కావాలని కోరింది. ప్రభుత్వం దానికీ ఒప్పుకుంది. నెల్లూరు జిల్లా రామాయపట్నం దగ్గర భూములు కేటాయించింది. ఆ తరువాత ప్రభుత్వం మారాక 2025లో తమకు రామాయపట్నం బదులు కరేడులో భూములు ఇవ్వమని, మరిన్ని సబ్సిడీలు, ప్రోత్సాహకాలు ఇవ్వమని అడిగింది. అలాగే, ఉత్పత్తి సామర్ధ్యం కూడా 10 గిగావాట్ల నుంచి 20 గిగావాట్లకు పెంచుతామని పేర్కొంది. మొత్తం ఏడు దఫాలలో సెప్టెంబర్ 2028 నాటికి పరిశ్రమను నిర్మిస్తామని పేర్కొంది. కూటమి ప్రభుత్వం కూడా అందుకు ఒప్పుకుంది. అడిగిన సబ్సిడీలన్నీ ఇవ్వటానికి కూడా ఆమోదం తెలిపింది. అంతా బానే ఉంది. మరి ఇటువంటి మంచి పరిశ్రమని వ్యతిరేకించడం ఎందుకు?
మొదటిది భూమి, ఈ పరిశ్రమ కోసం నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో 20 గ్రామాలలో భూమి కావాలని ఇండోసోల్ అడిగింది. నెల్లూరులోని ఉలవపాడు మండలం కరేడు పంచాయతీలోను, గుడ్లూరు మండలం చేవూరు గ్రామంలోను 8,462.5 ఎకరాలు; ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ మండలం సింగరాయకొండ, బింగినపల్లి గ్రామాలలో విస్తీర్ణం ఎంతో తెలియని భూమి అడుగుతోంది ఈ సంస్థ. నిజానికి ఇటువంటి పరిశ్రమకి ఇన్ని వేల ఎకరాల భూమి అవసరం లేదు. ఇప్పటివరకు పోలిసిలికాన్ నుంచి పలకల వరకు ఒకే చోట లేదా ఒకే సంస్థ తయారు చేసే విధానం దాదాపుగా లేదు. ఇప్పుడిప్పుడే ఆ ఒరవడి మొదలయ్యింది.
అయితే, ఇండోసోల్ సంస్థ అడిగినంత భూమి అవసరం లేదనేదానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఆ ఉదాహరణలు మన దేశంలోనూ ఉన్నాయి, చైనాలోనూ ఉన్నాయి. మన దేశంలో గుజరాత్లో ఇటువంటి సామర్ధ్యంతోనే, అంటే 20 గిగావాట్ల సామర్ధ్యం గల ఇటువంటి పరిశ్రమనే కేవలం కొన్ని వందల ఎకరాలలోనే ఏర్పాటు చేసి ఉన్నాయి. చైనాలో కూడా అదే పరిస్థితి. 2027 వరకు ఇండోసోల్ కూడా మూడు అంచెల ఉత్పత్తికి మాత్రమే పరిమితం ఉంటుంది. దానికి 500- 600 ఎకరాలు చాలు. ఆరు అంచెల ఉత్పత్తికి మరో ఐదారు వందల భూమి సరిపోతుందని మనకు ఉదాహరణలు చెబుతున్నాయి. అంటే మొత్తంగా 1500- 2000 ఎకరాలు సరిపోతాయి. మరి దాదాపు 8500 ఎకరాలు ఎందుకోసం? ఎవరికోసం? అది కూడా బహుళ పంటలు పండే కరేడులో ఎందుకు?
ఈ భూమి దాహం ఇక్కడితో అయిపోలేదు. వారు తమ పరిశ్రమ విద్యుత్తు అవసరాల కోసం సౌర, పవన, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు కూడా కట్టుకుంటామని, వాటికి కూడా భూమి కేటాయించమని అడిగారు. కర్నూలు, కడప జిల్లాలలో 5 గిగావాట్ల సౌర విద్యుత్తు కేంద్రం; కర్నూలు, నంద్యాల జిల్లాలలో 2.5 గిగావాట్ల పవన విద్యుత్తు కేంద్రం; కడప జిల్లాలో 2.2 గిగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ తమకు అవసరం అని చెప్పారు. దీనికీ ప్రభుత్వం ఒప్పుకుంది. సంవత్సరానికి ఎకరానికి 31,000 రూపాయల లీజుకు ప్రభుత్వం అక్కడ భూములు ఇవ్వడానికి అంగీకారం తెలిపింది. అవసరమైతే ఈ భూములను వాళ్ళకు అమ్ముతామని కూడా తెలిపింది.
ఒక గిగావాట్ సౌర విద్యుత్తు కేంద్రానికి 4000- 5000 ఎకరాలు కావాలి. అంటే 5 గిగావాట్ల సౌర కేంద్రానికి 20,000- 25,000 ఎకరాలు. అలాగే ఒక గిగావాట్ పవన విద్యుత్తు కేంద్రానికి 2000 ఎకరాలు కావాలి. అంటే 2.5 గిగావాట్ల పవన విద్యుత్ కేంద్రానికి 5000 ఎకరాలు. ఒక గిగావాట్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుకు 600 ఎకరాల వరకు కావాలి. రెండు గిగావాట్లకు అంటే 1200 ఎకరాలు. అంటే వీటన్నిటికీ కలిపి 26 వేల నుంచి 31 వేల ఎకరాల దాకా కావాలి. ఇది కాక ఈ సంస్థకు కావాల్సిన క్వార్ట్జ్ గనుల కోసం గనుల చట్టంలో సవరణ తీసుకువచ్చి కర్నూలు, నంద్యాల, ప్రకాశం జిల్లాలలో 200 ఎకరాలు కేటాయించారు. వారం పది రోజుల ముందు వాటికి అనుమతులు కూడా వచ్చేశాయి. చట్టరీత్యా అనుమతులు ఇవ్వడానికి వీలు లేదని అభ్యంతరాలు తెలిపినా వాటిని కాదని అనుమతులు ఇచ్చేశారు. ఇప్పుడు ఈ మొత్తాన్ని లెక్కేస్తే ఈ ఇండోసోల్ సౌరపలకల పరిశ్రమ కోసం అవసరమైన భూమి 35,000 నుంచి 40,000 ఎకరాల పైమాటే. ఐదు జిల్లాలలో 30 గ్రామాలలో విస్తరించి ఉన్న భూమి ఇది. ప్రపంచంలో ఇంత విస్తీర్ణంలో ఏర్పడబోయే సౌర పలకల పరిశ్రమ ఇదే మొదటిది అవుతుంది. విజయవాడ నగర విస్తీర్ణానికి రెండింతల కన్నా ఎక్కువ భూమి ఇది.
ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌లో సౌర విద్యుత్తు సామర్ధ్యం 4.6 గిగావాట్లు. అంటే ఇప్పుడున్న రాష్ట్ర మొత్తం సామర్ధ్యం కన్నా కూడా ఈ ఒక్క పరిశ్రమ చేయబోయేదే ఎక్కువ. పవన విద్యుత్తుతో కూడా అదే పరిస్థితి. అంతేకాక ఈ కేంద్రాలలో ఉత్పత్తి చేసే విద్యుత్తును బహిరంగ మార్కెట్లో అమ్ముకోవచ్చు. క్వార్ట్జ్ గనులకు కూడా ఇది వర్తిస్తుంది. ఎక్కువ విద్యుత్తును ఉత్పత్తి చేయడం ఒక్కటే ప్రజాప్రయోజనమా, ఇంత పెద్దఎత్తున ప్రజలు కోల్పోతున్న భూమి సంగతేమిటి? ‘అభివృద్ధి’ కలలకి కాస్తంతైనా వాస్తవిక అంచనా ఉండొద్దా?
రెండవది సంస్థ నేపథ్యం, ఈ ఇండోసోల్ సోలార్ కంపెనీ షిర్డి సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్‌కు అనుబంధ సంస్థ. షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ కడప ప్రధాన కేంద్రంగా డిస్కంలకు ట్రాన్స్ఫార్మర్లు ఉత్పత్తి చేసి, సరఫరా చేసే సంస్థ. మూడు నాలుగు సంవత్సరాల క్రితం వరకు ఈ సంస్థ పేరు దాదాపుగా ఎవరికీ తెలీదు. అయితే గత ప్రభుత్వం హయాంలో ఆంధ్రప్రదేశ్ డిస్కంలకు ట్రాన్స్ఫార్మర్లు, స్మార్ట్ మీటర్లు అధికంగా సరఫరా చేసి పేరు గడించింది. ఎంతలా అంటే ఈ సంస్థ ఆదాయంలో 80 శాతం ఆంధ్రరాష్ట్ర డిస్కంల నుంచే పొందేంతగా.
ఈ సంస్థ ఆదాయాన్ని చూస్తే మరికొన్ని విషయాలు అర్థమవుతాయి. 2014లో ఈ సంస్థ పన్ను అనంతర లాభం 7.59 కోట్లు. 2019 నాటికి అది 113.61 కోట్లకు చేరుకుంది. ఐదేళ్ళలో, అంటే 2024 నాటికి ఏకంగా 608.05 కోట్లకు చేరుకుంది. దాదాపుగా తన ఆదాయం మొత్తం 3 డిస్కంల నుంచి సంపాదించిన సంస్థ ఇప్పుడు 69,000 కోట్లతో పరిశ్రమ ఏర్పాటు చేస్తుంది అంటే నమ్మటానికి కష్టంగానే ఉంటుంది. అంతే కాదు, ఆంధ్రప్రదేశ్‌లో తప్ప బయట పెద్దగా వ్యాపారం లేని ఈ సంస్థకు ప్రపంచంలోనే మొట్టమొదటి ‘క్వార్ట్జ్ నుంచి మాడ్యూల్స్’ పరిశ్రమకు అవసరమైన సాంకేతికత ఉందా?
సౌర పలకలు తయారుచేయడానికి వివిధ టెక్నాలజీలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటివరకు మనం చెప్పుకున్నది సిలికాన్ ఆధారిత టెక్నాలజీ. కరేడు పరిశ్రమ కూడా అదే టెక్నాలజీ ఆధారంగా ఉంటుంది అని ఈ సంస్థ పేర్కొంది. పలకల తయారీ ఆరెంచెల ప్రక్రియ అని చెప్పుకున్నాము. ప్రతి అంచెకి ఒక రకమైన టెక్నాలజీ వాడాలి. ఈ రంగంలో ఉన్న ఇతర సంస్థలయితే తమ స్వంత టెక్నాలజీని అభివృద్ధి చేసుకున్నాయి. లేదా అప్పటికే ఆ టెక్నాలజీని అభివృద్ధి చేసిన సంస్థల నుంచి దానికి లైసెన్స్ తీసుకోవడమో లేదా ఆ సంస్థలనే కొనుగోలు చేయడమో చేశాయి. ఇక్కడ ఇండోసోల్ ఏ టెక్నాలజీ వాడుతుందనే విషయమే తెలియదు. ఏ టెక్నాలజీ వాడుతున్నారనే దాని మీదే నీటి అవసరం, కాలుష్యం, ఇతర విషయాలు ప్రధానంగా ఆధారపడి ఉంటాయి. అటువంటి సమాచారం ప్రజలకు తెలియడం చాలా అవసరం. ఎందుకంటే వారి మనుగడకు, ఆరోగ్యానికి అవి చాలా ముఖ్యమైన విషయాలు. ప్రజాస్వామిక పారదర్శకత రీత్యా కూడా ఆ విషయాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అసలు ఈ సమాచారం ప్రభుత్వం దగ్గరైన ఉందా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు షిర్డి సాయి ఎలక్ట్రికల్స్ జగన్ బినామీ కంపెనీ అని, దానికి ఈ స్థాయిలో పరిశ్రమలు ఏర్పాటు చేసే సాంకేతిక, ఆర్థిక సామర్థ్యాలు లేవని తెలుగుదేశం పార్టీ జాతీయ కన్వీనర్ నారా లోకేష్ ప్రకటించారు. ఆ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఏకపక్షంగా ఆ కంపెనీకి భూపందేరం చేయడానికి సిద్ధమయింది. ఈ కంపెనీ తెలుగుదేశం పార్టీకి 40 కోట్లు ఎలక్ట్రికల్ బాండ్స్ ద్వారా నిధులు ఇచ్చిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఈ వ్యవహారం గురించి ప్రతిపక్ష వైసీపీ పార్టీ, ఆ పార్టీ అధినేత పూర్తి మౌనం వహిస్తున్నారు. ఈ సంస్థ యాజమాన్యానికి, జగన్ మోహన్ రెడ్డికి మధ్య ఉన్న సాన్నిహిత్యం దీనికి కారణం అనుకోవాలా? ఈ మొత్తం విషయానికి తెరలేపిందే వైసీపీ అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి.
మూడవది కాలుష్యం, సౌర విద్యుత్తు ఉత్పత్తి కాలుష్య రహితమే కానీ ఆ విద్యుత్తు ఉత్పత్తికి అవసరమైన పలకల ఉత్పత్తి మాత్రం కాలుష్యరహితం కాదు. ముఖ్యంగా సిలికాన్ ఆధారిత పలకల ఉత్పత్తి. సిలికాన్ శుద్ధి అనేది చాలా కాలుష్యకారక ప్రక్రియ. దేశవ్యాప్తంగా లేదా ప్రపంచవ్యాప్తంగా చూసినా కూడా క్వార్ట్జ్, సిలికాన్ శుద్ధి అనేవి ఎంత కాలుష్యకారకాలో అనేకానేక పరిశోధనలు ఇప్పటికే తెలిపాయి. కాబట్టి ఇది చాలా కాలుష్య నివారణ చర్యలు తీసుకుంటూ చేయవలసిన పని. సౌర విద్యుత్తు వాడకం ద్వారా తగ్గే కర్బన ఉద్గారాలు ఈ పలకల ఉత్పత్తి ద్వారా తిరిగి పెరుగుతాయి. శాస్త్రీయ కాలుష్య నియంత్రణ చర్యలు తీసుకుంటూ ఇటువంటి పరిశ్రమ నడిపితే కాలుష్య రీత్యా ఎవరికీ అభ్యంతరం ఉండకపోవచ్చు కాని పరిశ్రమలతో మనకున్న అనుభవం దృష్ట్యా అది దాదాపు అసాధ్యం. పైగా బంగాళాఖాతం తీరంలో నీటి వనరులు పుష్కలంగా ఉన్న, బహుళ పంటలు పండే కరేడు లాంటి ప్రాంతంలో దీన్ని స్థాపించడం ఏ విధంగా సబబు? 2013 భూసేకరణ చట్టం ప్రకారమైతే నీటి వసతి ఉన్న బహుళ పంటల భూములను సేకరించనే కూడదు.
నాలుగవది వ్యవసాయం- పర్యావరణం, 17 గ్రామాలున్న కరేడు పంచాయతీ పుష్కలమైన పంటలు పండే ప్రదేశమని ఇదివరకే చెప్పాను. ఇక్కడ వేసవి కాలంలో కూడా 15 అడుగుల లోపలే నీరు లభిస్తుంది. ప్రధానంగా మత్స్యకారులు, రైతులు, రైతు కూలీలు నివసించే గ్రామాలు ఇవి. పదహారో నెంబరు జాతీయ రహదారికి, బంగాళాఖాతానికి మధ్య ఉన్న ప్రాంతం ఇది. ఒక వైపు బంగాళాఖాతం, మరొక వైపు మన్నేరు వాగు. అలాగే కరేడు, చేవూరు, చెన్నాయపాలెంలలో పెద్ద చెరువులు. వరి, వేరుశనగ, పప్పు ధాన్యాలు, కూరగాయలు మొదలైన పంటలెన్నో పండుతాయి. మత్య్సకారులకు బంగాళాఖాతం ఎలాగూ ఉంది. ప్రసిద్ధిగాంచిన ఉలవపాడు మామిడిని కూడా ఈ గ్రామాలలో సాగు చేస్తారు. ఈ పరిశ్రమకు సంగం బరాజ్ ద్వారా సోమశిల రిజర్వాయర్ నుంచి రోజుకు ఒక కోటి 15 లక్షల లీటర్ల నీరు, చేవూరు, చెన్నాయపాలెం చెరువుల నుంచి రోజుకు 70 లక్షల లీటర్ల నీరు కేటాయించారు. మన్నేరు వాగును కూడా తమ అవసరాలకు ఉపయోగించుకునే విధంగా అనుమతించారు. వీటి అన్నిటి ప్రభావం ప్రజల మీద, వ్యవసాయం మీద, వారి ఆర్థిక-సామాజిక జీవితం మీద, పర్యావరణం మీద ఎంతగా ఉంటుందో ఎవరైనా అంచనా వేశారా? లేదు. పైగా వేయమని కూడా చెప్పారు.
2018లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2013 నాటి భూసేకరణ చట్టాన్ని సవరించింది. అది చాలా ప్రమాదకరమైన, అప్రజాస్వామికమైన సవరణ. ఆ సవరణ ప్రకారం కొన్ని రకాల ప్రాజెక్టులను ప్రజల సమ్మతి, సామాజిక ప్రభావ అంచనా నుంచి మినహాయించారు. అందులో ఒకటి పారిశ్రామిక వాడలు. ఇప్పుడు ఈ భూసేకరణని పారిశ్రామిక వాడ పేరు మీద చేస్తున్నారు. కేవలం ఒక పరిశ్రమ కోసం చేస్తున్న భూసేకరణను పారిశ్రామిక వాడ కోసం చేస్తున్నామనేది ఎంత వరకు చట్టబద్ధమనే విషయాన్ని పక్కనబెడితే, ఆ సవరించిన చట్టంలో కూడా ‘ప్రజా శ్రేయస్సు’ కోసమే ఈ మినహాయింపని ఉంది. ఇప్పుడు ఈ పరిశ్రమ ఏ విధంగా ప్రజా శ్రేయస్సు కిందికి వస్తుంది? ఇందులో లాభపడేది ఎవరు, వారి లాభం కోసం నష్టపోయేది ఎవరు? ఆ నష్టాలు ఎలా ఉంటాయి?లాంటి విషయాలు తెలిసేది సామాజిక ప్రభావ అంచనా ద్వారానే. అన్నిటికన్నా మూలమైన, ప్రధానమైన దానినే తొలగిస్తే దానికి ఏ పాటి విశ్వసనీయత, నమ్మకం, ప్రజామోదం ఉంటాయి? చేతిలో దండం ఉంటే ఆమోదం ఎందుకు అని కాబోలు!
ఇక్కడ ప్రజామోదం ఆర్థిక కారణాల రీత్యా కూడా చాలా అవసరం. ఈ పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకంగా 5175 కోట్లని కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్ని రకాల సబ్సిడీలు, ప్రోత్సాహకాలు కలిపి 41,254.50 కోట్లు కేటాయించింది. అంటే మొత్తం 46,429.5 కోట్లు. ఇదంతా ఎవరి డబ్బు? ప్రజల ఆస్తి, ప్రజల డబ్బు. ప్రజల డబ్బు ప్రైవేటు సంస్థల లాభం కోసం ఇస్తూ, దానికి ప్రజామోదం అక్కర్లేదు అనటం ఏం ప్రజాస్వామ్యం?
వీటన్నిటినీ గమనిస్తే కనుక ఇది మరొక అనంతపురం లేపాక్షి, కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి, ఎస్ కోట జిందాల్ లాంటి పరిశ్రమల జాబితాలోకే వచ్చేటట్టు ఉంది. ప్రజలకు, దేశానికి, పర్యావరణానికి మేలు చేసే పరిశ్రమలా కాకుండా భారీ భూపందేరం అనే అనుమానాలు తీవ్రంగా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ఇండోసోల్ సంస్థ పరిశ్రమను ఈ ప్రాంతంలో నిర్మించుకునే ఆలోచన విరమించుకుని, తగిన చోట తక్కువ విస్తీర్ణంలో నిర్మించుకునే ఆలోచన చేయడం మంచిది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.