♦ ప్రపంచ వాణిజ్యంపై దాని ప్రభావం ఎలా ఉంటుంది?
ఇరాన్‌పై ఇజ్రాయెల్- అమెరికా యుద్ధం దాదాపు తగ్గుముఖం పట్టింది. కానీ ఇజ్రాయెల్ మాత్రం లెబనాన్‌పై బాంబులతో దాడులు చేస్తూనే ఉంది.
ఈ నేపథ్యంలో హర్ముజ్ జలసంధితో పాటు చోక్ పాయింట్‌ను మూసివేస్తే, ప్రపంచం పావు వంతు ఇంధనం, ఐరోపాకు భారీ ఎత్తున ఆసియా ఎగుమతులు నిరోధించబడతాయి.
టెహ్రాన్ సమర్థవంతంగా హర్ముజ్ జలసంధితో చేసిన విధంగానే ఇరాన్ మిత్రదేశాలు బాబ్ ఎల్-మాండెబ్‌ను మూసివేస్తాయని సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీకి చెందిన ఒక ఉన్నత సలహాదారుడు హెచ్చరించారు.
బాబ్ ఎల్-మాండెబ్ గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌తో ఎర్ర సముద్రాన్ని కలుపుతుంది. ఇది గ్లోబల్ ఇంధన వ్యాపారానికి కీలక జలమార్గం.
శాంతి సమయాల్లో నౌకల ద్వారా 20% ప్రపంచ ఇంధనం, గ్యాస్‌ను తరలించే హర్ముజ్ జలసంధిని సమర్థవంతంగా ఇరాన్ మూసివేసినప్పటి నుంచి దీని ప్రాముఖ్యత పెరిగింది.
“హర్ముజ్‌ను చేసినట్టుగా బాబ్ ఎల్-మాండెబ్‌ను చేయాలని రెసిస్టెన్స్ ఫ్రంట్‌కు చెందిన ది యూనిఫైడ్ కమాండ్ భావిస్తోంది”అని ప్రభుత్వంలో అంతర్గతంగా ప్రభావితం చేసే వ్యక్తిగా గుర్తింపు పొందిన ఇరాన్ మాజీ విదేశాంగ మంత్రి, ప్రముఖ దౌత్యవేత్త అలీ అక్బర్ విలాయతి ఆదివారం ఎక్స్ ఖాతాలో హెచ్చరించారు.
“ఒకవేళ వైట్ హౌస్ తన మూర్ఖపు తప్పిదాలను పునరావృతం చేయడానికి సాహసిస్తే, ఒక్క కదలికతో గ్లోబల్ ఇంధనం, వాణిజ్య ప్రవాహానికి అంతరాయం ఏర్పడుతుందన్న విషయాన్ని అది త్వరలోనే గ్రహించగలదు”అని విలాయతి రాశారు.
ప్రభుత్వ ప్రెస్ టీవీ ఆ తర్వాత ఆయన హెచ్చరికను నిర్ధారించింది.
హర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి టెహ్రాన్ అంగీకరించకపోతే ఈ వారం బుధవారం నుంచి ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, వంతెనలపై బాంబులు వేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికల తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది.
అమెరికా, ఇజ్రాయిల్‌ను మినహాయించి సురక్షితమైన మార్గం కోసం సంప్రదింపులు జరిపే దేశాల నౌకలకు హర్ముజ్ తెరిచే ఉంటుందని ఇరాన్ పేర్కొంది.
ఉప్పునీటిని శుద్ధి చేసే ప్లాంట్లపై బాంబులు వేస్తామని గతంలో ట్రంప్ హెచ్చరించారు.
అయితే ఒకవేళ బాబ్ ఎల్-మాండెబ్ సంధిని మూసివేస్తే, ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధం కంటే కూడా ఎక్కువ ప్రభావం పడగలదు.
ఈ సంఘర్షణ వల్ల గ్లోబల్ ఇంధన సరఫరా సంక్షోభం మరింత తీవ్రతరం కావడానికి దారి తీస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ స్టేషన్లు, వంట గదులు, పరిశ్రమల్లో తీవ్రమైన ఆర్థిక అలజడి ప్రభావాన్ని చవిచూడగలరు.
బాబ్ ఎల్-మాండెబ్ ఎక్కడ ఉంది?
ఈశాన్య యెమెన్‌కు, ఆఫ్రికా ఖండపు కొమ్ము ప్రాంతంలో నైరుతి దిశగా ఉన్న జిబౌటీ, ఎరిట్రియాలకు మధ్యన ఈ సంధి ఉంది.
ఇది ఎర్ర సముద్రంతో గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌ను కలుపుతుంది, ఆ తర్వాత హిందూ మహాసముద్రానికి విస్తరిస్తుంది. ఇది ఇరుకైన పాయింట్ వద్ద 29 కిలోమీటర్ల(18 మైళ్ల) వెడల్పు ఉంది.
రెండు ఛానెళ్ల ద్వారా ఒకటి రావడానికి, ఒకటి వెళ్లడానికి నౌకల ట్రాఫిక్‌ను పరిమితం చేస్తుంది. దీన్ని ఇరాన్ మద్దతుదారులు హౌతీలు సమర్థవంతంగా నియంత్రిస్తున్నారు.
ఇరాన్లో పిలువబడే “యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్”లో యెమెన్ ఆధారిత గ్రూపు కేంద్ర బిందువుగా ఉంది. సైద్ధాంతికంగా, వ్యూహాత్మకంగా కొన్ని గ్రూపులు ఇరాన్‌తో కలిసి ఉన్నాయి.
ఈ విషయాన్నే విలాయతి తన ఎక్స్ పోస్టులో ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
ఇంధన వ్యాపారానికి బాబ్ ఎల్-మాండెబ్ ఎందుకంత ముఖ్యమైనది?
ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన నౌకా మార్గాలలో ఇదొకటి. ఈ సంధి చాలా కీలకమైన మార్గం. దీని ద్వారానే సౌదీ అరేబియా ఆసియాకు ఇంధనం పంపిస్తుంది.
హర్ముజ్ జలసంధి తెరిచి ఉన్నప్పుడు గల్ఫ్ దేశాలకు అది కూడా కీలక మార్గమే.
సౌదీ అరేబియాతో పాటు సూయజ్ కెనాల్ లేదా ఈజిప్టు ఎర్ర సముద్రం తీరంపై ఉన్న సుమెద్(సూయజ్-మెడిటరేనియన్) పైప్‌లైన్ ద్వారా ఐరోపాకు ముడి చమురు, గ్యాస్, ఇతర ఇంధనాలను ఎగుమతి చేసే కీలక మార్గం ఇది.
సుమారు 4.1 బిలియన్ బారెల్స్ ముడి చమురు, శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తులు 2024లో ఈ సంధి ద్వారా వెళ్లాయి. అంటే గ్లోబల్ మొత్తంలో ఇది 5 శాతం అన్నమాట.
ఒకవేళ బాబ్ ఎల్-మాండెబ్, హర్ముజ్ జలసంధి రెండింటినీ మూసివేస్తే అది 25% నిరోధిస్తుంది(లేదా ప్రపంచ చమురు, గ్యాస్ సరఫరాలో నాల్గవ వంతు).
చమురు ఒక్కటే కాదు: చైనా, భారత్, ఇతర ఆసియా దేశాల నుంచి ఐరోపాకు నౌకల్లో తీసుకువెళ్లే కంటైనర్లతో సహా బాబ్ ఎల్-మాండెబ్ ద్వారా సుమారు 10% గ్లోబల్ వ్యాపార రవాణా జరుగుతుంది.
హర్ముజ్ జలసంధిని మూసివేయడంతో బాబ్ ఎల్-మాండెబ్కు ప్రాముఖ్యత మరింత పెరిగింది.
సౌదీ అరేబియా తన చమురు ఎగుమతికి ప్రధానంగా, సాంప్రదాయబద్ధంగా హర్ముజ్ సంధిపై ఆధారపడి ఉంది.
బాబ్ ఎల్-మాండెబ్ ద్వారా చమురు నౌకలను పంపించడానికి ఎర్ర సముద్రం నౌకాశ్రయం యాన్బు వైపు చూస్తోంది.
అందుకోసం, గల్ఫ్‌కు దగ్గరగా ఉన్న అబ్కైక్ చమురు శుద్ధి కేంద్రం నుంచి యాన్బుకు వెళ్లే తూర్పు పడమర పైప్‌లైన్ వైపు మొగ్గుచూపింది.
1,200 కిమీ (745 మైళ్ల) పైప్‌లైన్‌ను సౌదీ చమురు దిగ్గజం అరామ్కో సంస్థ నిర్వహిస్తుంది.
ఎనర్జీ ఇంటెలిజెన్స్ సంస్థ కెప్లర్ ప్రకారం- జనవరి, ఫిబ్రవరిలో రోజుకు సగటున 770,000 బారెల్స్‌ను తూర్పు పడమర పైప్‌లైన్ బదిలీ చేసింది.
హర్ముజ్ మూసివేయడంతో సౌదీ అరేబియా మార్చి నుంచి దానిని ఎక్కువగా ఉపయోగిస్తోంది.
గతంలో ఎన్నడూ లేని విధంగా మార్చి చివరి నాటికి ఈ పైప్‌లైన్ గరిష్ట సామర్థ్యంతో రోజుకు 7 మిలియన్ బారెల్స్ చమురు ప్రవహిస్తోంది.
ఇరాన్, దాని మిత్రపక్షాలు దీనిని ఎలా మూసివేస్తాయి?
తాము చేయగలమని ఇప్పటికే హౌతీలు చూపించారు. గాజాపై ఇజ్రాయిల్ జాతి నిర్మూలన యుద్ధానికి పాల్పడినప్పుడు, వారు బాబ్ ఎల్-మాండెబ్‌ను నిరోధించారు.
అమెరికా లేదా ఇజ్రాయిల్‌కు సంబంధించిన నౌకలను లక్ష్యంగా చేసుకున్నట్టు వారు చెప్పారు.
నౌకలపై తరచుగా దాడులు జరుగుతున్న కారణంగా, ట్రాఫిక్‌కు భీమా కల్పించడాన్ని బీమా సంస్థలు తిరస్కరించాయి.
2025 మేలో అమెరికా, హౌతీలు కాల్పుల విరమణకు అంగీకరించడంతో యెమెనీ గ్రూపు అప్పటి నుంచి మళ్లీ బాబ్ ఎల్-మాండెబ్‌ను తెరిచింది.
గాజా యుద్ధం సమయంలో చేసినట్టుగా, ఈ అంతరాయాన్ని తిరిగి పునరావృతం చేయడం హౌతీలకు ఎంత సులభమో ఇటీవలి రోజులు చూపించాయి.
యుద్ధంలో సమర్థవంతంగా ప్రవేశించామని తెలియజేస్తూ మార్చి చివరిలో హౌతీలు ఇజ్రాయిల్‌పై క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించారు – ప్రస్తుతానికి అమెరికాపై కాదని, ఇజ్రాయిల్‌కు వ్యతిరేకమని చెప్పారు.
అయితే, ఇజ్రాయిల్‌పై హౌతీలు చేపట్టిన క్షిపణి దాడులు కేవలం “లాంఛనంగా పాల్గొనడమే తప్ప పూర్తి స్థాయిలో పాల్గొనడం కాదని” అమెరికా మాజీ దౌత్యవేత్త నబిల్ ఖౌరీ అల్ జజీరాకు చెప్పారు.
“యుద్ధం తీవ్రత పెరుగుతుందన్న వాదనల కారణంగా వారు హెచ్చరిస్తూ కొన్ని క్షిపణులను మాత్రమే ప్రయోగించారు. అక్కడి నుంచే అమెరికా దళాలు ఆ ప్రాంతానికి వెళ్తున్నాయి. ఒకవేళ ఒప్పందం కుదరకపోయి ఉంటే, ఇంతవరకు ఎవరూ చూడని విధంగా ఇరాన్‌పై పూర్తి స్థాయి దాడి జరగవచ్చునన్న చర్చ జరుగుతోంది” అని యెమెన్‌లో అమెరికా మిషన్ మాజీ డెప్యూటీ చీఫ్ అల్ జజీరాకు చెప్పారు.
హౌతీలు నిజంగా యుద్ధంలో ప్రవేశించాలని అనుకుంటే బాబ్ ఎల్-మాండెబ్‌ను నిరోధించడమే వారికి ప్రధాన ఆయుధంగా మారవచ్చు.
“ఆ మార్గాన వస్తున్న కొన్ని నౌకలపై వారు దాడి చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఎర్ర సముద్రం ద్వారా వాణిజ్య నౌకలన్నీ నిలిచిపోవడానికి అవకాశం ఏర్పడుతుంది”అని ఆయన అన్నారు.
అప్పుడు అది ఎరుపు గీత కాగలదు. ఆ తర్వాత యెమెన్‌కు వ్యతిరేకంగా అమెరికా, ఇజ్రాయిల్ నుంచి త్వరితగతిన దాడులను మీరు చూడవచ్చు.
బాబ్ ఎల్-మాండెబ్‌ను మూసివేస్తే ప్రపంచానికి దాని అర్థం ఏమిటి?
ఒకవేళ ఎర్ర సముద్రం సంధిని నిరోధించినట్లయితే, అది “పీడకల దృశ్యాన్ని” సృష్టించగలదని మధ్యప్రాచ్య నిపుణురాలు, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో గిర్టన్ కళాశాల అధ్యక్షురాలు ఎలిసబెత్ కెండాల్ అల్ జజీరాకు తెలియజేశారు.
“హర్ముజ్ జలసంధిపై పరిమితులు ఉన్న కారణంగా, అదే సమయంలో బాబ్ ఎల్-మాండెబ్‌లో కూడా ఉద్రిక్తతలు పెరిగితే, అప్పుడు ఐరోపా వైపు వెళ్లే వ్యాపారానికి తీవ్ర నష్టం జరగవచ్చు, వాస్తవానికి అంతరాయం ఏర్పడుతుంది. కాబట్టి ఇది కత్తి అంచు మీద సాము లాంటిది. వాస్తవంగా తదుపరి ఏమి జరుగుతుందన్న దానిపై ఆధారపడి ఉంటుంది” అని ఆమె అల్ జజీరాకు చెప్పారు.
అయితే, హౌతీలకు ఇది ఒక “అనుకూలమైన ప్రదేశం” అయినప్పటికీ, సౌదీని రెచ్చగొట్టడం లేదా ఇంకా విస్తృతంగా స్పందించాల్సిన అవసరాన్ని యెమెన్ గ్రూపు కోరుకోవడం లేదని కెండాల్ అన్నారు.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
