ఇరాన్ యుద్ధం అమెరికా అస్తిత్వానికి తక్షణమే ఎదురవుతున్న సవాలును అధిగమించేందుకు సాగుతున్న యుద్ధం కాదు.
ఇజ్రాయెల్‌పై ఇరాన్ ముందస్తు దాడులకు తెగబడకుండా ఆపటానికి జరుగుతున్న యుద్ధం కాదు. ఇరాన్ అణ్వస్త్ర తయారీ సన్నాహాలు నిలువరించడానికి జరుగుతున్న యుద్ధం అంతకంటే కాదు.
ఇరాన్లో ఉన్న ఖండాంతర క్షిపణులు ధ్వంసం చేయటానికి జరుగుతున్న యుద్ధం కూడా కాదు.
ఓ సిద్ధాంతాన్ని రూపు మాపే ప్రయత్నం
ఇరాన్ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ఓ సిద్ధాంతాన్ని నిర్మూలించేందుకు సాగుతున్న యుద్ధం ఇది. దీనికి గాను ఆ దేశంలో పాలకులను మార్చటమే మార్గమని ఇజ్రాయెల్-అమెరికా భావిస్తున్నాయి.
ఈ అవగాహనతో ఇజ్రాయెల్ మొదలుపెట్టిన యుద్ధాన్ని అమెరికా తన యుద్ధంగా మార్చుకున్నది.
పశ్చిమాసియాలో అమెరికా ఆధిపత్య వ్యూహాలకు ఇరాన్ అడ్డుగా నిలుస్తోంది.
ఈ ప్రాంతంలో పలు రాజ్యేతర శక్తులతో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా సాగుతున్న సాయుధ చర్యలు, ఇజ్రాయెల్ అస్తిత్వానికి విఘాతం కలిగిస్తాయని ఆ దేశం భావిస్తోంది.
ఈ రాజ్యేతర శక్తులకు ఇరాన్ అండదండలు ఇస్తుందని కూడా భావిస్తోంది. ఆచరణలో ఇది కూడా పాలకులను మార్చడమే.
సిద్ధాంతం గొంతు పిసకటమే. దానికి వారు ఎంచుకున్న దారి కూడా ప్రభుత్వాన్ని మార్చడమే.
రాజ్యేతర శక్తుల ప్రాబల్యం..
ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా రాజ్యేతర శక్తులను పెంచి పోషించింది ఇరాన్. నిజానికి కొన్ని రాజ్యేతర శక్తులు రాజ్యంలో మరో రాజ్యంగా మారి ఇజ్రాయెల్‌కు సవాలు విసిరాయి.
లెబనాన్‌లో క్రియాశీలకంగా ఉన్న హిజ్బుల్లా శక్తులు లెబనాన్ భూభాగంలో కొంత భాగాన్ని ఆక్రమించుకుని, చివరకు దేశంలో ఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న విషయాన్ని కూడా ప్రభావితం చేసే శక్తిగా ఎదిగింది.
యెమెన్‌లో క్రియాశీలకంగా ఉన్న హౌతీలు ఆ దేశంలో కొంత భూభాగాన్ని తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు.
హౌతీలు 2021లో సౌదీ అరేబియాపై క్షిపణులు ప్రయోగించడంతో, ఇరాన్‌తో తిరిగి సౌదీ 2023లో దౌత్య సంబంధాలను పునరుద్ధరించుకున్నది.
ఇరాక్‌లోని షియా మిలీషియాను కూడా ఇరాన్ వెనకేసుకు వస్తోంది.
2023 అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్‌పై చేసిన భీకర దాడి కారణంగా ఇరాన్‌కు అజ్ఞాత శక్తులతో ఉన్న సమన్వయం గురించి ప్రపంచానికి తొలిసారి వెల్లడయింది.
ఈ దాడుల తర్వాత ఇజ్రాయెల్ ఎదురుదాడి చేసి హమాస్‌ను అంతం చేసింది.
ఇక్కడ ఓ చారిత్రక వాస్తవాన్ని గుర్తు చేసుకోవాలి. యాసర్ అరాఫత్‌ను, పాలస్తీనా విమోచన సంస్థను(పీఎల్ఓ) బలహీనపర్చడానికి హమాస్ అనే ఉగ్రవాద సంస్థను సృష్టించి ప్రాణం పోసిందే ఇజ్రాయెల్.
తర్వాత హమాస్‌కు ఖతార్ అండదండలిచ్చింది. పాలస్తీనాను చీల్చి పాలస్తీనా ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేయటం హమాస్‌కు అప్పగించబడిన కర్తవ్యం.
1997లో ఈ రచయిత గాజాలో ఉన్న సమయంలో, హమాస్‌కు ధార్మిక గురువుగా చెప్పబడే షేక్ అహ్మద్ యాసిన్‌ను ఇజ్రాయెల్ జైలు నుంచి విడుదల చేసి ఈ లక్ష్యాన్ని నెరవేర్చే పని అప్పగించి గాజాకు పంపింది.
పశ్చిమాసియాలో రాజకీయ సుస్థిరత లక్ష్యం
ఈ ప్రాంతంలోని దేశాలను అస్థిరపర్చాలన్న ఇరాన్ వ్యూహంతో అనేక దేశాల్లో ఇబ్బందులు తలెత్తాయి. ప్రత్యేకించి ప్రజాభిప్రాయానికి తావులేని గల్ఫ్ నియంతృత్వ దేశాలకు ఇరాన్ వ్యూహం కంటకప్రాయంగా మారింది.
దీంతో అమెరికా ప్రోద్బలంతో ఈ ప్రాంతంలోని అరబ్ దేశాలు పాలస్తీనాను ఫణంగా పెట్టి ఇజ్రాయెల్‌తో శాంతి ఒప్పందాలు చేసుకోవడం ద్వారా పశ్చిమాసియాలో రాజకీయ సుస్థిరత కోసం పావులు కదిపాయి.
ఇక్కడ రాజకీయ సుస్థిరత అంటే ఈ ప్రాంతంలోని నియంతృత్వ ప్రభుత్వాలు అలాగే కొనసాగే ఏర్పాటు మాత్రమే.
2025 జూన్‌లో అమెరికా, ఇజ్రాయెల్‌లు నిర్వహించిన సంయుక్త దాడిలో ఇరాన్ నిర్మించదల్చుకున్న అణ్వస్త్ర సామర్థ్యాన్ని ధ్వంసం చేసిన తర్వాత కూడా ఇప్పుడు ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తున్నాయి అంటే, అమెరికా-ఇజ్రాయెల్ ద్వయానికి ఉన్న లక్ష్యం మరింత విస్తృతమైనదని అర్థం.
ఇరాన్ పాలకవర్గ సిద్ధాంతంగా ఉన్న రాడికల్ ఇస్లాంను తుడిచిపెట్టడమే వారి లక్ష్యం. ప్రభుత్వాన్ని మార్చడమే.
ఇరాన్‌పై తాజాగా జరుగుతున్న దాడులు సైనిక భద్రతా వ్యవస్థలతో పాటు చమురు పరిశ్రమకు సంబంధించిన మౌలిక వసతులను పెద్ద ఎత్తున ధ్వంసం చేశాయి.
తద్వారా పరిపాలనా వ్యవస్థను కకావికలం చేయటానికి పూనుకున్నాయి.
దాంతో పాటు ప్రజల్లో తిరుగుబాటు రెచ్చగొట్టడం ద్వారా తమ అడుగులకు మడుగులొత్తే ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని తెర మీదకు తేవడం అమెరికా, ఇజ్రాయెల్‌ల లక్ష్యం.
చివరకు ఇరాన్‌ను అగ్రరాజ్యంగా మారుస్తామని కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాగ్దానం చేశాడు.
కేవలం సైనిక సామర్థ్యం మీద వైమానిక దాడులు చేస్తే ప్రభుత్వాన్ని కూల్చడం సాధ్యం అవుతుందా? ఇప్పటి వరకూ ఇలా జరగలేదు. కానీ అమెరికా, ఇజ్రాయెల్‌లు సొంత సైన్యాలను ఇరాన్ భూభాగంలోకి దించడానికి సిద్ధంగా లేవు.

రాజకీయ ఘర్షణగా మారిన సైనిక యుద్ధం
2025 జూన్‌లో భారీ నష్టాన్ని చవిచూసిన ఇరాన్ ఇక తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధం అయింది.
ఇరాన్ అధినేత అయతొల్లా అలీ ఖమేనీ ఎన్నడూ అజ్ఞాతంలోకి వెళ్లడానికి సిద్ధం కాలేదు. పైగా అమరత్వాన్ని ఆహ్వానించాడు.
అలాంటప్పుడు ఆయన్ను గుర్తించి హతమార్చడానికి పెద్దగా నిఘా వర్గాలు కృషి చేయాల్సిన అవసరం లేదు.
ఈ ప్రమాదాన్ని గ్రహించిన ఇరాన్ రాజకీయ నాయకత్వం యావత్ అధికార కేంద్రాన్ని వివిధ విభాగాల మధ్య విభజించింది. 2025 జూన్ నుంచి పాటిస్తున్న వ్యూహాత్మక నియంత్రణకు స్వస్తి చెప్పింది.
ఇరాన్ వద్ద ఉన్న సాయుధ శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకుని పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలను దాడికి లక్ష్యాలుగా ఎంచుకోవడంతో ఈ యుద్ధం కేవలం సైనిక ఘర్షణ పరిధి దాటి రాజకీయ ఘర్షణ స్థాయికి చేరుకున్నది.
గల్ఫ్ రాజ్యాలకు రక్షణగా అమెరికా ఏర్పాటు చేసిన రక్షణ వలయంలోని బలహీనతలు ఇరాన్ దాడుల్లో బట్టబయలయ్యాయి. ఎంతగా అమెరికా సహాయ సహకారాలు ఉన్నా గల్ఫ్ దేశాల భద్రతకు ఎదురయ్యే ముప్పును అధిగమించలేవని ఈ దాడులు నిరూపించాయి.
అంతేకాక ఆయా దేశాలకు కీలకమైన చమురు వనరుల భద్రత ప్రమాదకరంగా మారింది. ఈ పరిస్థితుల్లో యుద్ధాన్ని త్వరగా ముగించాల్సిన అవసరం ఇరాన్ కంటే అమెరికాకే ఎక్కువగా ఉండే పరిస్థితి ఏర్పడింది.
ఈ యుద్ధాన్ని ముగించే విషయంలో అమెరికా, ఇజ్రాయెల్‌లు ఒకే మాట మీద లేవు. యుద్ధ పరిణామాలు, ఈ ప్రాంత దేశాల అంతర్గత, ప్రాంతీయ, రాజకీయ పర్యవసానాలు ఎలా ఉన్నా తన సైనిక వ్యూహాన్ని అమలు చేయటానికి ఇజ్రాయెల్‌కు ఎటువంటి ఆటంకాలు, పరిమితులు లేవు. కానీ అమెరికా పరిస్థితి అలాంటిది కాదు.
ఇరాన్లో శాశ్వత రాజకీయ పరిష్కారం సాధించకుండా ఎల్లకాలం ఇలా ఇరాన్‌ను సంక్షోభంలో వదిలివేయటానికి అమెరికా సుముఖంగా లేదు. ఈ నేపథ్యంలో ఇరాన్‌పై సాగుతున్న దాడి త్వరలోనే ముగింపుకు వస్తుందన్న ఆశాభావం వ్యక్తం కావడానికి అవకాశాలు ఉన్నాయి.
అమెరికా మిశ్రమ స్పందన
దీర్ఘకాలిక పోరాటాల్లో ట్రంప్ ఓటమిని అంగీకరించలేడు. వెనిజులాలో అధ్యక్షుడిని అపహరించిన తర్వాత పరిస్థితి అదుపులోకి తెచ్చుకున్నాడు. అంతవరకూ అదే ప్రభుత్వంతో కలిసి పని చేశాడు. సిరియాలో అంత విధ్వంసం సృష్టించిన తర్వాత మాజీ ఐసిస్ అధినేతనే దేశాధ్యక్షుడిగా అంగీకరించాడు.
ఇప్పటికిప్పుడు ఉన్నఫళంగా క్యూబాలో ప్రభుత్వాన్ని మార్చాలని కంకణం కట్టుకున్నాడు. గత ఏడాది హౌతీలతో ఒప్పందం కుదుర్చుకుని అమెరికా నౌకలపై దాడులు జరపకుండా చూసుకున్నాడు. ఇప్పుడు హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే అమెరికా నౌకలపై ఇరాన్ దాడికి తెగబడటంతో పశ్చిమాసియా లాటిన్ అమెరికా కాదనీ, ఇరాన్- వెనిజులా కాదనీ ట్రంప్ ఆలస్యంగా తెలుసుకుంటున్నాడు.
ట్రంప్ కోరుకున్నంత త్వరగా యుద్ధం ముగియబోవడం లేదు. అందుకే యుద్ధాన్ని ఆపేసి గెలిచానని ప్రకటించాలా, లేక గెలిచేదాకా యుద్ధం కొనసాగించాలా అన్న విషయంలో అమెరికా డోలాయమానంలో పడింది.
ఈ రెండిటిలో అమెరికా దేన్నీ ఎంచుకుంటుంది అన్నదానిపైనే అమెరికాకు ఎంత నష్టం జరుగుతుంది, ఈ ప్రాంతంలో అమెరికా మిత్రులకు ఎంత నష్టం జరుగుతుంది, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఎంత నష్టం కలుగుతుంది, అమెరికా పార్లమెంట్లో ఎటువంటి ప్రతిఘటన ఎదురవుతుంది అన్న అంశాలు ఆధారపడి ఉంటాయి.
ధరలు స్థిరీకరించడానికి భారతదేశం రష్యా నుంచి చమురు కొనుగోలు చేయాలని అమెరికా ఈ మధ్యనే విజ్ఞప్తి చేసింది.
రష్యా, చైనాలకు ప్రయోజనం..
పశ్చిమాసియా సంక్షోభంలో అమెరికా కూరుకుపోవడం అటు రష్యాకు, ఇటు చైనాకు లాభదాయకం. ఎందుకంటే రష్యా, చైనాల గురించి ఆలోచించి వారిని కట్టడి చేసేందుకు నియంత్రణ వ్యూహాలు రూపొందించే అంత వెసులుబాటు, వనరులు అమెరికాకు తగ్గుతాయి.
నిరంతరం జరుగుతున్న దాడుల నేపథ్యంలో తైవాన్ జలసంధిని స్వాధీనం చేసుకోవాలన్న చైనా డిమాండ్ బలం పుంజుకుంటుంది. ఉక్రెయిన్‌పై దాడి సమర్థనీయమే అన్న రష్యా వాదన కూడా బలం పుంజుకుంటుంది.
చమురు ధరలు పెరగటం రష్యాకు ప్రయోజనకరమే కానీ చైనాకు కాదు.
అయితే పలు చికాకులలో చిక్కుకున్న అమెరికా, భారతదేశానికి ఏమంత ప్రయోజనకరం కాదు. వాణిజ్య సుంకాల సంక్షోభం నేపథ్యంలో భారతదేశం ఈ సంక్షోభం నుంచి బయటపడాలంటే అమెరికాతో ఎక్కువకాలం చర్చలు జరపడానికి వెచ్చించాలి. కానీ అమెరికా పశ్చిమాసియాలో ఎంత లోతుగా కూరుకుపోతే అంత సమయం భారతదేశానికి వాణిజ్య సుంకాల విషయంలో అనిశ్చితి కొనసాగుతుంది.

భారతదేశం – దాని ప్రాంతీయ వ్యూహం
గాజా విషయంలో ట్రంప్ ఏర్పాటుచేసిన శాంతి కమిటీలో పరిశీలకులుగా ఉండటానికి భారతదేశం అంగీకరించడం ద్వారా ఈ ప్రాంతంలో మరింత విస్తృతమైన పాత్ర పోషించడానికి భారతదేశం సిద్ధంగా ఉన్నట్లు అర్థమవుతుంది.
గల్ఫ్ ప్రాంతంలో ఉన్న భారతీయులను ఆదుకోవడానికి భారతదేశం తక్షణమే పావులు కదిపినా, ఖమేనీని హత్య చేసినప్పుడు మాత్రం భారతదేశం మౌనం వహించింది.
అదేవిధంగా ఇరాన్‌కు చెందిన నౌక భారత దేశ సరిహద్దు జలాల గుండా ప్రయాణిస్తున్నప్పుడే అమెరికాకు చెందిన సబ్‌మెరైన్ ఆ నౌకను పేల్చివేసినపుడు కూడా భారత్ నోరు మెదపలేదు.
భారతదేశానికి గల్ఫ్ దేశాలతో అద్భుతమైన ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలోని ఇజ్రాయెల్, ఇరాన్‌లతో సహా మరికొన్ని దేశాలతో కూడా అటువంటి సంబంధాలే ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో వర్తమాన పరిణామాలపై భారతదేశం తనదైన సూత్రబద్ధ స్వతంత్ర వైఖరి తీసుకొని ఉండాల్సింది.
ప్రత్యేకించి మిత్ర దేశాల మధ్య తలెత్తిన పరస్పర వైరుధ్యాల నేపథ్యంలో భారతదేశం మరికాస్త అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంది. ప్రాంతీయ వ్యూహం అంటే ఆ ప్రాంతంలోని వివిధ దేశాలతో భారతదేశానికి ఉన్న ద్వైపాక్షిక సంబంధాల సమిష్టి సారాంశమే.
అమెరికా పునర్నిర్మాణ ప్రయత్నాలు
ఇదంతా పశ్చిమాసియా పునర్నిర్మానానికి అమెరికా చేస్తున్న ప్రయత్నం. ఈ ప్రయత్నంలో తన మిత్ర దేశాలైన గల్ఫ్ దేశాలను రక్షించడంలో అమెరికా వైఫల్యమే బయటపడింది.
తాను లేవనెత్తిన అన్ని డిమాండ్లను యూరోపియన్ దేశాలు అంగీకరించిన తరువాత యూరప్‌తో అమెరికా సంబంధాలను పునర్నిర్మించాడు.
రష్యాతో ఉన్న సంబంధాలను కూడా పునర్నిర్మాణ ప్రయత్నంలో ట్రంప్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్ నుంచి చుక్కెదురు అయింది.
త్వరలో ట్రంప్ చైనా పర్యటన నేపథ్యంలో అమెరికా-చైనా సంబంధాలు కూడా పునర్నిర్మితమయ్యే అవకాశం ఉంది.
ఈ సమావేశం గురించి భారత్, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.
అమెరికాను అగ్రరాజ్యంగా చేస్తామని హామీ ఇచ్చిన విధంగానే, ఈ పర్యటనలో చైనాను కూడా అగ్రరాజ్యంగా చేస్తామని హామీ ఇస్తారా అని ప్రపంచం ఎదురుచూస్తోంది.
భారతదేశంపై ప్రభావం..
ఈ ప్రాంతానికి సంబంధించి రక్షణ వ్యూహాత్మక అవగాహనలను అన్ని దేశాలు తాజాపరుచుకోవాల్సిన అవసరం ఉన్నది.
మరో కోణంలో చూస్తే ఇరాన్ స్పందనతో ఈ ప్రాంతంలో దేశాలు అంతకంతకు అమెరికా గుప్పెట్లోకి నెట్టబడుతున్నాయి అని నిర్ధారించవచ్చు.
ఈ దేశాలకు చైనా గానీ, రష్యా గానీ ప్రత్యేకమైన రక్షణ కవచాన్ని అందించగలవా అన్నది వివాదాస్పదమే. యుద్ధానంతరం పశ్చిమాసియా ప్రాంతంలో ఇజ్రాయెల్ ప్రబలమైన శక్తిగా కొనసాగుతుంది.
అంతేకాక టర్కీ, సౌదీ అరేబియా, చివరకు పాకిస్థాన్లతో సహా అనేక దేశాలు ఈ సంక్షోభం వలన లబ్ధి పొందనున్నాయి.
ఈ యుద్ధం నుంచి ఇరాన్ బయటపడిన తర్వాత కూడా ఒక శక్తిగా కొనసాగగలిగితే ఈ ప్రాంతంలో దాని పలుకుబడి, ప్రభావం పెరుగుతుంది.
ఈ పరిణామాలు ఏమైనా భారతదేశానికి లాభసాటి కావు. ఓవైపు అమెరికా, మరోవైపు చైనాలతో భారతదేశపు వ్యూహాత్మక చొరవకు ఉన్న అవకాశాలు కుదించుకుపోతున్నాయి.
భారతదేశం ఊహించిన దానికంటే ఎక్కువగా ఈ యుద్ధం భారత దేశ ఆర్థిక, రాజకీయ, వ్యూహాత్మక పరిస్థితులపై ప్రభావం చూపనున్నది.
ఇదే సమయంలో ఇరుగుపొరుగు దేశాలు కూడా భారతదేశంతో సంప్రదింపులు జరపలేని స్థితికి చేరుకుంటున్నాయి.
(వ్యాస రచయిత మాజీ భారత రాయబారి, ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి, ప్రస్తుతం చెన్నై కేంద్రంగా ఉన్న డెక్కన్ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ స్టీరింగ్ కమిటీ అధ్యక్షుడిగా పని చేస్తున్నారు.)
అనువాదం: కొండూరి వీరయ్య
ది హిందూ సౌజన్యంతో ఈ వ్యాసాన్ని ది వైర్ పాఠకులకు అందిస్తున్నాము.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
