
M – C దశను M – LP, M – MP, శ్రమ శక్తి కొరకు– ఉత్పత్తి సాధనాల కొరకు వరుసగా జరిగిన డబ్బు మార్పిడులుగా విడగొట్టవచ్చు. విలువ కోణంలో ఈ లావాదేవీలలో ప్రతిదీ ‘సమానమైనదే’, విలువ మార్పు(M’– M) మూలాన్ని కొనుగోలు చేయబడిన సరుకుల వినియోగ విలువలో తప్పక వెతకాలి. ఆ సరుకు వినియోగం వలన దాని విలువకంటే ఎక్కువ విలువను ఉత్పత్తి చేయగల సరుకును కనుగొనడంలోనే ఉంది ప్రారంభ విలువ Mను విస్తరించే యుక్తి.
ఈ సందర్భంలో ఎవరైనా సమానమైన మార్పిడిని(సామాన విలువల మార్పిడి)కలిగి ఉండగలరు. ఇంకా ఈ సరుకును సముచిత రీతిలో ఉపయోగించి కొత్త సరుకు C’లో నిక్షిప్తం చేయబడిన ఎక్కువ విలువను పొందవచ్చు. ఈ ప్రత్యేక స్వభావం కలిగిన సరుకు శ్రమ శక్తి అన్నది మార్క్స్ వాదన. ఒక నిర్దిష్ట సమయంలో ఉపయోగించిన శ్రమ శక్తి దానిని పునరుత్పత్తి చేయడానికి అవసరమైన విలువ కంటే ఎక్కువ పరిమాణంలో విలువను ఇస్తుంది.
ఈ విషయాన్ని అనుసరిద్దాం. ఇక్కడ అతి ముఖ్యమైనది ‘శ్రమకూ’ ‘శ్రమ శక్తికీ’ మధ్య ఉన్న వ్యత్యాసం. వేతన కార్మికుడు పెట్టుబదిదారుడికి నేరుగా అమ్మేది శ్రమను కాదు, ‘శ్రమ సామర్ధ్యాన్ని’. కార్మికుడు వేతన ఒప్పందం ద్వారా పేర్కొన్న ఒక నిర్దిష్ట కాలానికి తన ‘శ్రమ సామర్ధ్యాన్ని’ పెట్టుబడిదారుడి ఆధీనంలో ఉంచుతాడు. అసలు పని లేదా శ్రమ సమయంలో ఈ ‘శ్రమ సామర్ధ్యాన్ని’ వాడుతారు. దానిని ప్రతి రోజూ పునరుత్పత్తి చేయవలసి ఉంటుంది. కార్మికునికి ఆహారం, ఇతర ప్రాథమిక అవసరాలను తగిన విధంగా అందించడం ద్వారా ఇది పునరుత్పత్తి అవుతుంది. ఈ ‘శ్రమ సామర్ధ్యాన్నే’ మార్క్స్ శ్రమ శక్తి అని పిలుస్తాడు. మరొక మాటలో శ్రమ శక్తి అంటే కార్మికుడు కలిగి ఉన్న మానసిక, శారీరక శక్తుల మొత్తం తప్ప మరొకటి కాదు.
పెట్టుబడిదారుడు ఒక నిర్దిష్ట కాలానికి కార్మికుడిని పనిలో పెట్టుకున్నప్పుడు(ఉదాహారణకు దినసరి కూలీకి ఒక రోజులో 10 గంటలు) అతని (పెట్టుబడిదారుని) అవసరానికి తగినట్లుగా ఈ కార్మిక శక్తిని వినియోగించుకునే హక్కును పొందుతాడు.
తప్పకుండా ఉండాల్సిన వినియోగ విలువ..
ఈ శ్రమ శక్తి ఒక సరుకు. CMP కింద ఉన్న వేతన కార్మికుడు ఈ శ్రమ శక్తిని తన వ్యక్తిగత ఆస్తిగా కలిగి ఉంటాడు. అంతేకాకుండా, దానిని అమ్ముకునే స్వేచ్ఛను కలిగి ఉంటాడు. అతను ఈ శ్రమ శక్తిని(ఆహరం తినడం ద్వారా, బట్టలు వేసుకోవడం ద్వారా, పంచ భూతాల నుండి తనను రక్షించుకోవడం ఇంకా ఇతర విధాలుగా) తన స్వంత ఖాతాలో పెట్టుబదిదారుడికి అమ్మే ఉద్దేశ్యంతో ఉత్పత్తి చేస్తాడు.
ఆ విధంగా నిర్వచనం ద్వారా శ్రమ శక్తి ఒక సరుకు. దీనికి వినియోగ విలువ తప్పకుండా ఉండాలి. శ్రమ శక్తి వినియోగ విలువ లేదా ‘ఉపయోగకరమైన ఆస్తి’ ఇతర ఏ సరుకు విలువ లాగానే దానిని ఉత్పత్తి చేయడానికి సామాజికంగా అవసరమైన శ్రమ సమయం. కానీ దీని అర్ధం ఏమిటి శ్రమ శక్తి విలువ పూర్తిగా జీవశాస్త్ర పరంగా లేదా శారీరకంగా నిర్ణయించబడుతుందా?
ఈ పై ప్రశ్నకు మార్క్స్ దృఢమైన జవాబు ‘లేదు’ అని. అయితే చాలా తక్కువ శ్రమ శక్తి పునరుత్పత్తికి జీవనోపాదికి అవసరమైన సాధనాలను ఉత్పత్తి చేయడం అవసరం. శ్రమ శక్తి పునరుత్పత్తిలో సంత్రుప్తిపరచవలసిన కోర్కెలు అవి ఎంత సహజమైనవో అంతే సామాజికమైనవి. వాటిని మార్క్స్ మాటలలో చెప్పాలంటే, అవసరమైనవని పిలవబడుతున్న కోర్కెల సంఖ్యా– పరిధి, వాటిని సంతృప్తిపరిచే రీతులు వాటికి అవే చారిత్రక అభివృద్ధి పరిణామ ఉత్పత్తి, అందువలన ఒక దేశ నాగరికత స్థాయిపై మరింత ముఖ్యంగా ఏ పరిస్థితులలో, స్వేచ్ఛాయుత కార్మికవర్గం ఏర్పడిందో అనే దానిపై చాలా వరకు ఆధారపడి ఉంటాయి. అప్పుడు, దీనిని అనుసరించి ‘శ్రమ శక్తి విలువను నిర్ధారించడంలో చారిత్రక, నైతిక అంశం ప్రవేశిస్తుంది’.
ఏమైనప్పటికే ఒక నిర్దిష్ట సమాజంలో ఒక నిర్దిష్ట సమయంలో సగటు కార్మికుడి పునరుత్పత్తికి అవసరమైన వివిధ రకాల సరుకుల, సేవల మొత్తం ఆచరణాత్మకంగా తెలుస్తుంది.
అదనపు విలువ – మూలధన స్వీయ విస్తరణ విలువ – రహస్యం శ్రమ శక్తి రోజువారీ ఉత్పత్తిలో ఖర్చు చేసిన విలువ(శ్రమ సమయం) , కార్మికుడు పనిచేసిన సమయం కన్నా తక్కువగా ఉండడంలో ఉంది. పనిదినం 10గంటలు అనుకుందాము. కార్మికుడి సగటు రోజువారీ అవసరాలు వివిధ వస్తువులు, సేవల పరంగా తెలుసని అనుకుందాము. ఉపయోగంలో ఉన్న ఉత్పత్తి పద్ధతులను బట్టి కార్మికునికి సగటు రోజువారీ అవసరాల నిమిత్తం కావలసిన వస్తువులు, సేవల మొత్తం ఉత్పత్తికి సామాజికంగా అవసరమైన శ్రమ సమయాన్ని ఎవరైనా లెక్కించగలరు. ఇది శ్రమ శక్తి రోజువారీ విలువ, ఇది 6 గంటలు అనుకుందాము.
పెట్టుబడిదారుడు సరుకును, శ్రమ శక్తిని కార్మికుడి నుంచి దాని విలువ వద్ద– అంటే, 6 గంటల శ్రమ వద్ద కొంటున్నందున, ఇంకా కార్మికుడు 10 గంటలు పని చేస్తున్నందున అక్కడ 4 గంటల అదనపు శ్రమ నిర్దిష్ట ఉత్పత్తిగా కార్యరూపం దాల్చి పెట్టుబదిదారుడికి చేరుతుంది. శ్రమ శక్తిని దాని విలువ కంటే తక్కువకు కొన్నడనే అర్ధంలో పెట్టుబడిదారుడు కార్మికుడిని మోసం చెయ్యలేదన్నది ముఖ్యంగా గుర్తించవలసిన విషయం.
సంపూర్ణ సమాన మార్పిడి జరిగిందని ఊహించుకున్నా– పెట్టుబడిదారుడు కార్మికుడికి శ్రమ శక్తి పూర్తి విలువను చెల్లిస్తున్నా కూడా, పరిమాణంలో శ్రమ శక్తి విలువకు మించిన శ్రమ శక్తి సమయాన్ని పెట్టుబడిదారుడు ఉపయోగించుకుంటున్నంత వరకూ అదనపు విలువ సాధ్యమే. పనిదినం నిడివి శ్రమ శక్తి విలువను మించి ఉన్నంత వరకూ పెట్టుబడిదారుడూ, కార్మికుడూ ఉన్నంత వరకూ, సమాన మార్పిడి పరిస్థితులలో కూడా, ఉత్పత్తిలో అదనపు విలువ పెట్టుబడిదారుడికి చేరుతూనే ఉంటుంది.
పెట్టుబడిదారీ ఉత్పత్తి విధాన చారిత్రక సిద్ధాంతం(ఆధారాంశం). పై చివరి వాక్యం CMP చారిత్రక ప్రత్యేక(ఆ విధంగా తాత్కాలిక) లక్షణ విశిష్టతని చురుకుగా తెలుపుతుంది. సరుకుల ఉత్పత్తి వ్యవస్థలో అదనపు విలువ తలెత్తడానికి నిర్దిష్ట చారిత్రక పరిస్థితులు అవసరం. మానవ చరిత్రలో అన్ని యుగాలకీ సరుకుల ఉత్పత్తి దానంతకి అదే సాధారణం కాదని ఇప్పటికే మనం గుర్తించాము. కానీ ఇతర విషయాలలో ఒకదానికొకటి చాలా భిన్నంగా ఉన్న, వాస్తవానికి వివిధ చారిత్రక యుగాలకు చెందినవైన, అనేక సామాజిక నిర్మాణాలకి కొంత మేరకు సరుకుల ఉత్పత్తి సాధారణమే. ఏమైనప్పటికీ మూలధనం ఉనికికి (ఆవిధంగా CMP ఉనికికి) అవసరమైన చారిత్రక పరిస్థితులు’ ఏవిధంగానూ కేవలం డబ్బులు– సరుకుల చలామణితో ఇవ్వబడలేదు.’
అప్పుడు CMPకి చారిత్రక ఆధారాంశం ఏమిటి డబ్బులు మూలధనంగా మారడం – M – C – M’ ప్రాతినిధ్యం వహించే విలువ స్వీయ విస్తరణ – కార్మికుడిచే స్వేచ్ఛగా అమ్మబడుతున్న, పెట్టుబడిదారుడు కొంటున్న శ్రమ శక్తి సరుకుగా అందుబాటులో ఉన్నప్పుడే సామాజిక స్థాయిలో సాధ్యమని మనం చూశాము. కార్మికుడికి సంబంధించి ఇది రెండు షరతులను సూచిస్తున్నది. మొదటిది కార్మికుడు తన శ్రమ సామర్ధ్యానికి ఇబ్బందులు లేని యజమాని అయి ఉండాలి. అతను తన ఇచ్ఛానుసారం అమ్ముకోవడానికి వీలుగా తన శ్రమ శక్తిని తన స్వంత వ్యక్తిగత ఆస్తిగా కలిగి ఉండాలి. దీనర్ధం దాస్యం, వెట్టి చాకిరి భూస్వామ్య– పెట్టుబడిదారీ పూర్వ పరిమితులు లేకపోవడం. కార్మికుడు ఒక నిర్దిష్ట కాలానికి మాత్రమే పరిమితంగా తన శ్రమ శక్తిని అమ్ముకోవడాన్ని ఇది సూచిస్తుంది, లేకపోతే అతను దాసుడి గానో లేదా బానిసగానో మారతాడు.
రెండవది తన స్వంత ఉత్పత్తి సాధనాలు, శ్రమ శక్తితో స్వతంత్రంగా కొన్ని సరుకులను ఉత్పత్తి చేయగల స్థితిలో కార్మికుడు ఉండకూడదు. మరొక మాటలో చెప్పాలంటే, జీవనం సాగించడానికి ఆటను తన శ్రమ శక్తిని అమ్ముకునేలా నిర్భందించబడాలి.
మార్క్స్ చెప్పినట్లు– అందువలన, తన డబ్బులు మూలధనంగా మారడానికి డబ్బుల యజమాని మార్కెట్లో స్వేచ్ఛాయుత స్వతంత్ర కార్మికుడిని కలవాలి. స్వేచ్ఛ అన్న దానికి శ్లేష కోణం ఉంది. స్వేచ్ఛా మానవుడిగా శ్రమ శక్తిని తన స్వంత సరకుగా అమ్ముకోగలడు. మరొక వైపున అమ్ముకోడానికి మరే సరుకూ అతని వద్ద లేదు. తన శ్రమ శక్తి ఫలితాన్ని పొందడానికి అవసరమైనది ఏదీ అతనివద్ద లేదు.
అనువాదం: యార్లగడ్డ వెంకట్రావు
(వెంకటేష్ ఆత్రేయ రచించిన “మార్క్సిస్టు రాజకీయ అర్ధశాస్త్రం పెట్టుబడి మొదటి సంపుటి పరిచయం” పుస్తకాన్ని ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది పదమూడవ భాగం, పన్నెండవ భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.